Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 29

    దట్టంగా  పెరిగిన  వెదురుచెట్లు, ఆ తరువాత యూకలిప్టస్ తోటదాటి మరోగంట తరువాత సింధూర చెట్లున్న  ఆ ప్రాంతాన్ని  చేరుకున్నారంతా. అందర్నీ తోట బయటే  ఓ మైదానంలో  నిలబడమని  చెప్పి చైతన్య మాత్రం ఒక్కడూ సింధూర చెట్లున్న అడవిలోకి  ప్రవేశించాడు.

    ఒకచోట బాగా  ఏపుగా  పెరిగిన  గడ్డి దుబ్బులు  చెల్లాచెదరయి  పడివున్నాయి.

    అక్కడ  సమీపంలో మేనీటర్  అడుగుజాడలు  కనిపించాయి చాలా స్పష్టంగా__

    ఊపిరి బిగపట్టుకుని  పరిసరాలను  ఓ కంట  కనిపెడుతూ  మరికాస్త ముందుకు నడిచాడు. ఓ ముళ్ళకంచెపై రక్తసిక్తమయిన తుండుగుడ్డ.

    అదే లక్ష్యంలో  సింధూర  చెట్లను దాటి నడిచాడు.

    అడవికి  దక్షిణ భాగంలో  ఇసుకలో పులి  అడుగుజాడలు.

    ఆగిపోయాడు  సాలోచనగా....సరిగ్గా  ఆ తరువాత మొదలయ్యే అడవంతా విప్పచెట్లతో  నిండి ఉంది. పగలే చీకటిని  నింపుకున్నంత  దట్టంగా  పెరిగిన  విప్పచెట్ల దగ్గర  క్రూరమృగాలు  ఎక్కువగా  సంచరించే అవకాశముంది. విప్పపువ్వుని  తిని  ఆ మత్తులో  పవళించడం  క్రూరమృగాల అలవాట్లలో  ఒకటి.

    అయినా  ధైర్యంచేసి  తోట మధ్యకు  వచ్చాడు.

    మరో ఏభై అడుగుల  తరవాత  ఓ పొదమాటున  కనిపించింది చివికిన శవం. కేవలం కడుపులో కొంతభాగం మాత్రం  తినేసినట్టు  పక్కకు  ఒరిగిన  శవం  ఆ ప్రాంతాన్ని  దుర్గంధంతో  నింపుతూ వుంది.

    కేవలం ఓ వినోదం  కోసం  వేటాడినట్టుంది  తప్ప  ఆకలితో అతడ్ని  హతమార్చినట్టులేదు.

    చినబగతా  కొడుకు  శవం  గుర్తుకొచ్చింది. నిజానికి మెడని వేరు చేసింది తప్ప శవాన్ని  ముట్టుకోలేదు.
    "కిల్డ్ మియర్లీ ఫర్ స్పోర్టాఫ్ కిల్లింగ్!"

    అదీ అడవికి మరో కోనలో పదిహేనుమైళ్ళదూరంలో....

    సాధారణమయిన  పులి మాదిరిగా మేనీటర్ ఓ నిర్దిష్టమయినపద్దతిని పాటించకపోయినా. అనుభవజ్ఞులయిన  వేటగాళ్ళు  మళ్ళీ అదే ప్రాంతంలో  ప్రత్యక్షమయ్యేదీ  ఊహించగలరు. కానీ మేనీటర్ ఊహించరాని  చోట దర్శనమిచ్చి, ఇంతస్వల్పవ్యవధిలో  ఊహించని రీతిలో  మనిషిని చంపి కొద్దిపాటి ఆహారంతో  సంతృప్తి చెందింది.

    చుట్టూ  చూశాడు, మాటు వేయడానికి, మంచె ఏర్పాటు చేసుకోడానికి  అనుకూలంగా సమీపంలో  ఓ విప్పచెట్టు.

    ఆలస్యం చేయకుండా  యువకులనుచేరి  వారి సహాయంతో కొన్ని వెదురు చెట్లను నరికించి  ప్లాట్ ఫారంలా  విప్పచెట్టుపై  మంచే ఏర్పాటు చేశాడు.

    అది జరుగుతుండగా  ఒకవేళ  మేనీటర్ తానుమంచెను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని  గమనించకుండా  కొందరు యువకుల్ని  దూరంగా మరో చెట్టును గట్టిగా  ఊపుతూ  నిలబడమన్నాడు. అలా చేస్తే వేటగాడు మాటు వేస్తున్నది ఆ చెట్టుపైనే అన్న ఆలోచన మేనీటర్ కు కలగాలని.

    ఈ తతంగమంతా  పూర్తయ్యేసరికి  మధ్యాహ్నం మూడుగంటలయింది. వీలయితే సూర్యాస్తమయంలోగా  మంచెపై  కూర్చోవాలి  అన్న ఊహతో  రెస్టుహౌస్ కి బయలుదేరాడు.

    వంజరు గ్రామానికి  చెందిన  యువకుల్ని  జాగ్రత్తగా  ఊరు వరకూ పంపి ,రెస్టుఅవుస్ ని చేరుకున్నాడు. ప్రయాణం చేయాల్సింది. చాలాదూరంకాబట్టి  భోంచేసే  వ్యవధికూడా  లేకపోవడంతో  జీప్ ను రెస్టు అవుస్ లోనే  ఉంచి  తనతోపాటు తవిటయ్యను కూడా  రమ్మన్నాడు.

    తవిటయ్య  ముందు  ఆశ్చర్యపోయాడు. తరువాత  చైతన్య ఆజ్ఞ ప్రకారం రైఫిల్ పట్టుకుని  వెంట నడిచాడు.

    శీతాకాలం కావడంతో తొందరగానే  సూర్యుడు  అస్తమించాడు. మునిమాపువేళ  తవిటయ్యతోపాటు  మంచెపై  కూర్చున్నాడు చైతన్య.

    చీకటి క్రమంగా  దట్టమౌతోంది. ముప్పయి గజాల దూరంలో వున్న  శవంపైన తెల్లనిగా పంచె అస్పష్టంగా కనిపిస్తోంది.   

    అడవిలో క్రమంగా  సద్దుమణిగింది, తవిటయ్యకి టార్చి అందించి రైఫిల్ పక్కనుంచి  కళ్ళు  చిట్లించి  శవంవేపే చూస్తున్నాడు.

    కృష్ణపక్షం  మూలంగా  వెన్నెల  లేక అడవిపై  నల్లనిరగ్గు కప్పినంత  గాఢాంధకారం!

    చీమ చిటుక్కుమంటే  వినబడేటంత  నిశ్శబ్దం....దూరంగా అప్పుడప్పుడు  వినిపించే  కీచురాళ్ళ  రొద తప్ప.

    గంటలు గడుస్తున్నాయి. చెక్కుచెదరని  ఏకాగ్రతతో చైతన్య కిందికి  చూస్తున్నాడు.

    ఇంతలో  నిశ్శబ్దాన్ని  చీల్చుతూ  దూరంగా  కణుసు ఆక్రందన చేసింది. సామాన్యంగా  పులి  గమనాన్ని  చూసి  హెచ్చరికగా  కణుసు ఒక్కోమారు  మనిషిని  చూసి కూడా  అరుస్తుంది.

    మరికొన్ని  క్షణాలలో  చాలా  సమీపంగా  ఎండుటాకులు  విరుగుతున్న  చప్పుడు.
    చైతన్య చేతులు  నెమ్మదిగా  రైఫిల్ ను అందుకునే  ప్రయత్నం  చేస్తుండగా  ఓ భారీ జంతువు శవాన్ని  చేరింది.

    చైతన్య ఎటువంటి సంకేతాన్నీ  ఇవ్వకుండానే  తవిటయ్య టార్చివెలిగించాడు. శవాన్ని  చేరి చుట్టను  లాక్కు తినబోయినదుమ్ముల గొండి టార్చి  వెలుగును  చూసో, మరో  జంతువు  అలికిడిని గమనించో  వెనుక పొదల్లోకి  పరుగెత్తింది  భారంగా.

    కోపాన్ని  అదుపు  చేసుకోలేని  చైతన్య  తవిటయ్య  చేతిపై  విదిలించి  కొట్టడంతో టార్చి నేలపైకి  జారిపడింది.

    "యూ బాస్టర్డ్...." బిగుసుకున్న  పిడికిళ్ళతో  మొహంపై గుద్దాలన్నంత ఆవేశం  వచ్చింది కాని, తమాయించుకున్నాడు.

    ఇప్పుడేం  చేయాలి....ఫోకస్ తో క్షణంపాటు  క్రూరమృగానిఖా బిత్తరపోయేటట్టుచేసి  ఘాట్ చేయడమన్నది  వేటలో  టార్చిగ్గలమ్న్యువసరం. అదీగాక  కళ్ళు  పొడుచుకున్నా, కనిపించనంత  ఆ చీకటిలో  ప్రమాదాన్ని  పసిగట్టడానికి, విషపురుగుల  కదలికల్ని  గుర్తించటానికి  టార్చి అవసరమే!

    రైఫిల్ తవిటయ్య  చేతికిచ్చి  కిందికి  దిగాడు  చైతన్య సాధ్యమయినంత  త్వరలో  అందుకోవాలని.

    దుమ్మలగొండి  భయంతో  వెనక్కి మరలేది రెండే సమయాల్లో  ఒకటి_మనిషిని గుర్తించినప్పుడు.
రెండోది_పులి  ఆగమనాన్ని  తెలుసుకున్నప్పుడు. దుమ్మలగొండి  వెనక్కి  మరలటానికి  కారణం  రెండోది అని తెలుసుకోలేక  పెద్ద పొరపాటు చేశాడు చైతన్య.

    టార్చి అందుకునేటంతలో పొదల్లో  నుంచి  మృత్యువులా ముందుకొచ్చి  నిలబడింది మేనీటర్.

    అతడిప్పుడు  నిరాయుధుడై  మేనీటర్ కు కొన్ని  గజాల  దూరంలో  నిలబడి  వున్నాడు.

    గుండెలోని  రక్తం  గొంతులోకి  ఎగజిమ్మినట్టు  ఒణికిపోయాడు  క్షణంపాటు.

    మెరుస్తున్న కళ్ళతో  పులి  అతడ్నే  గమనిస్తుంటే...."ఫైర్" అన్నాడు నెమ్మదిగా.

    తవిటయ్య  పక్కనుంచి  రెస్పాన్సు రాకపోవటంతో  భయకంపితుడౌతూ  మరోమారు "ఫైర్" అంటూ గొణిగాడు  నిస్సత్తువగా!

    "రైఫిల్ పేల్డం లేదండీ."

    అదే తవిటయ్య  నుంచి  విన్న  జవాబు.

    మరుక్షణం  ఎందర్నో  సునాయాసంగా  మట్టుబెట్టి  అరణ్యాన్ని  వో మృత్యుగృహ్వరంగా  మార్చిన  మేనీటర్ చైతన్య పైకి చార్జి చేసింది.

    పులి గాండ్రింపుతో  అడవితోపాటు  చైతన్య గుండె  దద్ధరిల్లింది.

    అదే  తన చివరిక్షణమనుకున్నాడు. అనుకున్నది  సాధించకుండానే నికృష్టంగా అంతమౌతున్న  లిప్తల్ని  లెక్కపెట్టుకుంటూ  ఆ సమయానికి మరేమీ  తోచని చైతన్య హఠాత్తుగా చెట్టు వెనక్కి  తప్పుకున్నాడు. 

 Previous Page Next Page