ఎందుకో అతని ప్రవర్తన అనుకున్న దానికంటే ఎక్కువ కృతకంగా తోచింది. నరసింహ పడాలుకి కృతజ్ఞతలు చెప్పి, అతని మనుషులు తోడురాగా కుందనిపల్లి పొలిమేరల్లోకి నడిచాడు.
దూరంగా సెర్చి పార్టీలా వెళ్ళిన వ్యక్తులు శవాన్ని కనుక్కునే ప్రయత్నంతో ఇంకా వెదుకుతుంటే వారించాడు చైతన్య. చైతన్యతో వచ్చిన గిరిజనులు చినబగతా ఆజ్ఞను వారికి తెలియబరచి వెనక్కి వెళ్ళి పొమ్మన్నారు.
వారు వెళ్ళాక 'అసలు పులి ఎక్కడ ఎటాకయిందీ చెప్పగలరా' అనగానే దూరంగా పొలాల అంచున వున్న వరకలవేపు చూపించాడో యువకుడు.
వేగంగా అటు నడిచిన చైతన్య డొంకల్ని చేరుకుని చుట్టూ పరిశీలనగా చూశాడు. బురదలా వున్న వరకల్లో చాలా స్పష్టంగా పగ్ మార్క్స్ (పులి పాదాల అడుగు జాడలు) కనిపించాయి. నెమ్మదిగా వంగి వాటి కొలతల్ని తీసుకున్నాడు.
'అనుమానం లేదు. తన రెస్టుహౌస్ చుట్టూ సంచరించిన మేనీటర్ అడుగుజాదల్లాగే వున్నాయి. మేల్ టైగర్' అనుకుని, ఒంటరిగానే ఎవర్నీ తనకుతోడు రావద్దని చెప్పి తుప్పల్లోంచి ముందుకు నడిచాడు. సరిగ్గా అక్కడే తన పొలం అంచున నిలబడి పనివాళ్ళకి ఉరుపుల గురించి పురమాయిస్తున్న చినబగతా కొడుకుని పులి చార్జిచేసి చంపింది.
తుప్పలు చెల్లాచెదురై ఉండడంతోపాటు ఎర్రటి ఎండిన రక్తపు మరకలూ కనిపించాయి. అక్కడి పరిసరాల్ని బట్టి పులి అతడ్ని ఏ పక్క కీడ్చుకు వెళ్ళి ఉంటుందీ సునాయాసంగానే గ్రహించిన చైతన్య సుమారు రెండు ఫర్లాంగుల దూరం నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్ళాడు. శవం మాయమవటమన్నది జరగని పని. ఒకవేళ మేనీటర్ శవాన్ని చాలా రహస్య స్థావరాల్లో దాచి వుండొచ్చు. లేదా మనుష్యుల అలికిడి గ్రహిస్తే కళేబరాన్ని ముందుంచినచోటు నుంచి మరో చోటుకి తరలించొచ్చు.
అతడీ ఛాన్సుని విడిచి పెట్టదలచుకోలేదు అందుకే ధైర్యంగా కీకారణ్యంలో చాలా దూరం నడిచాడు.
పట్టపగలు అడవంతా సందడిగా వుండాలి. కాని, కొన్ని ఘడియల క్రిందటే అక్కడ మేనీటర్ సంచరించి ఉండటంతో పక్షులు, చిన్న చిన్న జంతువులు తమ నెలవుల్లో కిక్కురుమనకుండా పడివున్నాయి.
హఠాత్తుగా అతని దృష్టి ఓ తుప్పల్లో పీలికలైన ధోవతిపై పడింది. ఓ చిన్న క్లూ దొరకడంతో డొంకల్ని దాటుకుంటూ మరికొంత ముందుకు నడిచాడు. మరో వంద గంజాల దూరంలో రెండు భాగాలుగా చీలిన, గుట్ట నడుమనున్న ఏగిశ చెట్ల మధ్యగా శవం స్పష్టంగా కనిపించింది.
ఇక ముందుకు నడవలేదు. ఒకవేళ క్రిందికి దిగి వెళ్ళాలన్నా చాలా రిస్కుతో కూడిన పని. పైగా అది పట్టపగటి వేళయినా, బాగా దట్టంగా పెరిగిన చెట్లమూలంగా చెట్ల గుబుర్లద్వారా నేలపై పొడల్లా అలుముకున్న నీడలు ప్రమాదకరమయినవి. ఒక్కోమారు పులి శరీరంపై నున్న మచ్చలు అందులో కలిసిపోయి అది ఎక్కడుందీ వెంటనే గ్రహించడం సాధ్యం కాదు.
చీలిన గుట్ట అందుకు చేరి, శవానికి, ఓ పెద్ద బండరాయికీ, మధ్యనున్న దూరాన్ని అంచనా వేసుకున్నాడు....వందగజాలకు మించి ఉండదు చుట్టూ కలియచూస్తే పొదలు తప్ప మాటువేయడానికి అనుకూలమయిన చెట్లు లేవు.
బండరాయి అడుగునే కూచోవాలి శవానికి పైభాగంలో. భారీగా వున్న బండరాయికి ముందు భాగంలో కూచోవడం వలన వెనుక నుంచి పులి మూలంగా ప్రమాదం ఏర్పడే అవకాశం లేదు.
సాయంకాలానికి తవిటయ్య ఇంకా తిరిగి రాలేదు. 0.375 ఎక్స్ ప్రెస్ మేగ్నమ్ రైఫిల్ ని, ఎలక్ట్రిక్ టార్చిని తీసుకుని సూర్యాస్తమయ్యే వేళకి అక్కడికి చేరుకున్నాడు. వాతావరణం క్రమంగా సద్దుమణుగుతుంటే తను ముందే నిర్ణయించుకున్న స్థలంలో కూచుని క్రిందికి చూశాడు.
ఆశ్చర్యం అక్కడ శవం లేదు!
చినబగతా మాటలు గుర్తుకొచ్చాయి. పట్టపగటివేళ ఆ ప్రదేశాన్ని చేరుకోవటానికి సంశయించిన చైతన్య ప్రమాదమని తెలిసి నెమ్మదిగా ఏ గిశ చెట్లమధ్యకు వెళ్ళాడు.
చెట్లు గుబురుగా పెరిగి ఉండటంతో అప్పటికే చీకటి ఆవరించినట్టుగా వుంది. శవం వున్న ప్రదేశాన్ని గుర్తుచేసుకుంటూ పరిసరాలను ఓ కంట కనిపెడుతూనే నెమ్మదిగా నేలపైకి వంగి ఏదీ స్పష్టంగా కనిపించక పోవటంతో టార్చి వెలిగించాడు. నేలపై రక్తం ఓడి వుంది__అదే శవాన్ని మేనీటర్ ఈడ్చుకువచ్చిన ప్రదేశంగా స్పష్టం చేస్తూ.
చుట్టూ చూశాడు. మేనీటర్ అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే కొంత దూరం ఈడ్చుకు వెళ్ళినట్టు నేలపై జాడ. అంటే మేనీటర్ తన ఆహారాన్ని మరో చోటకి తరలించిందా!
మరికాస్త ముందుకు వెళ్ళిన చైతన్య ఉలికిపాటుతో ఆగిపోయాడు. అక్కడ చాలా స్పష్టంగా మనిషి అడుగుజాడలు కనిపించాయి. అవి కనిపించడం మాత్రం కాదు. ఇసుకలోని పులి అడుగుజాడల్ని చెరిపేసే ప్రయత్నం చేసినట్టు స్పష్టమవుతుంటే నొసలు చిట్లించి సాలోచనగా చుట్టూ చూశాడు.
అడుగడుగునా విభ్రమం గొలిపే పరిస్థితులు.
ఒకవేళ తనమాట నిలబెట్టుకోవాలని చినబగతాయే సాయంకాలంలోగా శవాన్ని తరలించేశాడా?
అదే నిజమయితే మేనీటర్ పగ్ మార్క్స్ కావాలని చెరిపేసి తనను తప్పుదోవ పట్టించే అవసరం ఎవరికుంటుంది?
చాలా సమీపంలో బుస్ మంటూ వెనుక చప్పుడు కావటంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు.
మీదికి దూసుకువస్తున్న నల్లత్రాచును చూడగానే అతడికి ఆలోచించుకునే వ్యవధి సైతం లేకపోయింది.
* * *
సరిగ్గా ఇదే సమయంలో....
కుంతెర్ల గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి చీకట్లు ముసురుకోవడంతో పల్లెకి పశువుల్ని తరలించే ప్రయత్నంగా మందను అదిలిస్తూ అడవిలో వాటి వెంట నడుస్తున్నాడు.
మామూలుగా అయితే ఆవేళకి అడవిని దాటి పల్లెని ఆనుకుని వున్న మైదానంలోకి వచ్చేసేవాడే.
కాని, పులి భయానికి ఏ మూడురోజులకో ఒకసారి పశువుల్ని మేతకి తీసుకు వస్తుండటంతో ఏపుగా ఎదిగిన సింధూరపు చెట్ల కొమ్మల ఆకులతో పశువుల కడుపు నింపుకుంటూంటే మరో రెండు, మూడురోజుల వరకూ వాటికి మేత ఉండదన్న ఆలోచనతో జాప్యం చేశాడు.
సింధూరచెట్ల మధ్య నుంచి అదిలిస్తూ నడుస్తున్న ఆ కాపరి హఠాత్తుగా ఓ ఎద్దు మందనుంచి తప్పించుకుని మళ్ళీ అడవిలోకి ప్రవేశించింది ఇంకా ఆకలి తీరలేదన్నట్టు.
దాన్ని మళ్ళించాలని వెంటపడ్డాడా యువకుడు.
అదే ఆ యువకుడు చేసిన పొరపాటు.
ఎద్దు వెంటపడి పరుగెత్తుతున్న ఆ పశువుల కాపరికి తెలీదు. అక్కడే ఆకలిగొన్న ఓ మేనీటర్ వెదురు పొదలమాటున నక్కి ఉందని, మరోక్షణంలో అతనిపైకి దుమకబోతుందని.
* * *
క్షణం ఆలస్యమయితే పెద్దత్రాచుపాము కోరలు చైతన్య శరీరంలోకి చొచ్చుకు పోయేవే!
ఒడుపుగా తుపాకీ బేరల్ తో దాని గమనాన్ని నిరోధించాడు.
క్షణం ఆగిన త్రాచు మరింత పైకి లేచింది. కసిగా కోరల్ని చూపుతూ. ఉక్రోషాన్ని ప్రకటిస్తూ ముందుకు జరుగుతుంటే సహనాన్ని కోల్పోయిన చైతన్య బేరల్ విసిరేసరికి అది కాస్తా కిందికి వంగింది.
దెబ్బ తప్పించుకోవాలనే కాదు__కాటు వేయాలని చరాచరా ముందుకు పాకింది.