Previous Page Next Page 
జనపదం పేజి 27

"థాంక్సండీ . మీకు చాల శ్రమ కలిగించిన" అన్నాడు వీరభద్రం.
    "అదేమిటండి. అది మా డ్యూటీ" అంటుండగానే కాఫీ వచ్చింది.
    "మీరు చాల అలసిపోయారు. కాస్త కాఫీ తీసుకోండి" అని అందించిన లేడీ డాక్టరు రాజకీయాలను చర్చించసాగింది. తనకు రావలసిన ప్రమోషను  గురించి, అడ్డు తగులుతున్న వారి గురించి , తన సిన్సియారిటీని గురించి సుదీర్ఘంగా మాట్లాడి మంత్రి గారితో ఒక్కమాట చెప్పవలసిందని వీరభద్రాన్ని కోరింది.
    వీరభద్రం జవాబు చెప్పకముండు మంగమ్మ కళ్ళు తెరిచి , అటూ ఇటూ చూడ్డం గమనించాడు. వెంటనే ఆమె ముఖం ముందుకు వంగి "ఏం కావాలె?" అని అడిగాడు.
    మంగమ్మ రెండు పక్కలూ తడివి చూసుకుంది. ఆమె చేతులకు ఏమీ అందలేదు. నిరాశగా అడిగింది.
    "పాప ఏడీ" కళ్ళల్లో నీరు చేరింది. "పోయిందా?" అన్నది. స్వరం నీరసంగా ఉంది. దుఃఖం పొంగివస్తున్నది.
    "ఇంకా కాన్పు కాలేదమ్మా . పాపా ఎలా వస్తాడు? పాపా క్షేమంగా ఉన్నాడు కడుపులో." ఊరడింపుగా చెప్పింది లేడీ డాక్టరు తల నిమురుతూ.
    మంగమ్మ పొట్ట చూసుకుంది.
    చిరునవ్వు నవ్వింది.
    "ధైర్యంగా ఉండాలే" వీరభద్రం స్థిరత్వంతో అన్నాడు.
    డాక్టర్ను ఎవరో పిలవడంతో వెళ్ళిపోయింది.
    మంగమ్మ కోలుకుంటున్నది. నీరసం తగ్గింది. కొద్దిగా బలం పుంజుకుంటుంది. వాతావరణం బాగుంది. మనసుకు వ్యధలు లేవు. ఎమ్మెల్యే భార్యగా మాత్రమే ఆమె పరిచయం అందరికి. మంగమ్మ ఆమె పూర్వ చరిత్ర అక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. మనసుతో మందులకు దగ్గిర సంబంధం . మందులు బాగా పనిచేస్తున్నాయి. పుష్టికరమైన ఆహారం లభిస్తుంది. పరిచర్యలు బాగా జరుగుతున్నాయి. కానుపు దాకా ఇక్కడే ఉంచమంది డాక్టరు. అన్నట్లు చెప్పడం మరచాను. లేడీ డాక్టరుకు నిలిచిపోయిన ప్రమోషను వచ్చింది. ఆమెను ఆ ఆస్పత్రికే పోస్టు చేశారు. అందుకే ఆ కేసు విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటున్నదేమే. డాక్టరు మాటకు అభ్యంతరం చెప్పలేదు వీరభద్రం . ఇంతకంటే భద్రమైన చోటు లేదనుకున్నాడతను.
    తీరిక ఉన్నప్పుడల్లా - వచ్చి పోతున్నాడు వీరభద్రం. ఆనాటి సాయంకాలం పళ్ళూ అవీ తీసుకుని వెళ్తున్నాడు - జనరల్ వార్డులోంచి అతడు అలా చూస్తూ పోతున్నాడు రోగుల్ను. మంచంలో పడివున్న ఒక రోగిని చూశాడు. పరిచయం ఉన్న మనిషిలా కనిపించింది. అయినా నాలుగడుగులు వేశాడు. మళ్ళీ వెనక్కు వచ్చాడు. మంచం దగ్గరకెళ్ళి పరీక్షగా చూశాడు.
    విమలమ్మ.
    విమలమ్మ దొరసాని!!
    వరవరరావు భార్య!!
    "ఎంత మారిపోయింది?"
    "ఎందుకు వచ్చిందిక్కడికి?" తనను తానె ప్రశ్నించుకున్నాడు వీరభద్రం. అసలు ఆమేనా? ఆ పోలికలున్న మరో మనిషా? ఏవో ఆలోచనలు అనుమానాలు గిరగిరా తిరిగాయి మెదడులో.
    ఆమె నిద్రలో ఉంది.
    మళ్ళీ వచ్చేటప్పుడు చూతాం'. అని బయలుదేరి వెళ్తున్నాడు. నర్సు కనిపించి ఒక చిరునవ్వు నవ్వి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేసి అడిగాడు.
    "ఎవరు?"
    "బెడ్ నెం. తర్టీనా?"
    "అవును"
    "చూసి చెపుతా" అని కేస్ షీట్ తెచ్చి చూసింది. విమలమ్మే వరవరరావు భార్యే!
    "ఏమిటి జబ్బు!"
    "చాలా వున్నాయ్. ముఖ్యంగా హార్ట్ - మీకేమైనా బంధువా!"
    "కాదు. నిద్రపోతుందా?"
    "పెతిడిన్ ఇచ్చాం. మెళకువ వస్తే భరించలేదు. అందుకు"
    "కాస్త జాగ్రత్తగా చూస్తారా ప్లీజ్. అమెది మా ఊరు. ఒకప్పుడు బాగా ఉన్న వాళ్ళు."
    "మంచిదండీ, నమస్కారం' అని నర్స్ వెళ్ళిపోయింది.
    ఆ ఆలోచనతోనే మంగమ్మ గదిలోనికి వెళ్ళాడు. ఆ విషయమే వారూ చర్చించారు. ఆవిడ భూములన్నీ చేసుకుంటున్నాడు. కరణీకం సైతం చేతబట్టాడు రాముడు. అమెకీమీ ఇవ్వడం లేదా? లేక అకస్మాత్తుగా యిలా జరిగిందా? అనే సంగతులు చర్చించుకున్నారు. ఎందుకో అగాధమైన సానుభూతి ఏర్పడింది. ఇద్దరికీ ఆవిడ విషయంలో.
    తిరిగి వెళ్ళేప్పుడు విమలమ్మ మంచం దగ్గరకు వెళ్ళాడు వీరభద్రం. స్టూలు మీద మంచం ప్రక్కన కూర్చున్నాడు. విమలమ్మ మెళకువగానే ఉన్నట్లుంది. స్టూలు లాగిన చప్పుడు విని పక్కకు చూచింది.
    మనిషి కూర్చున్నాడు.
    ఎవరు?
    బాగా చూచింది. గుర్తుపట్టలేకపోయింది.
    "ఎవరు నయినా?"
    "విమలమ్మగారూ ! నేను --నన్ను గుర్తుపట్టలేదా?"
    "నాయనా చూపు తగ్గింది. కనపడదు. మాట ఎక్కడో విన్నట్లుంది. పేరేమిటి నాయనా?"
    వీరభద్రానికి దుఃఖం క్రమంగా మంచులా ఆవరిస్తుంది.
    "నేను వీరభద్రాన్ని . మన ఊరే. గుర్తు పట్టిన్రా?"
    "ఎవరు వీరభద్రమా. నువ్వా నాయనా? ఎన్నాండ్లకు కండ్లబడ్తివి! ఏది నాయనా నీ చెయ్యి యిటివ్వు" చేయి అందుకొని తన చేత్తో రాస్తూ "బాగున్నావా? ఊరు బాగున్నదా? ఇగో ఇట్లయింది నాగతి" గొంతు పూడుకుపోయింది. మాటల్లో సైతం తడి కనిపించింది. కను కొలకుల్లో నీళ్ళు నిండాయి. 'అంతా రాత నాయనా! పెండ్లి చేసుకున్నావా? పిల్లలేందరు?"
    వీరభద్రం గుండె కలుక్కుమంది.
    "ఏమైంది దొర్సాని?"
    "ఇంకెక్కడి దొర్సాని. పిట్ల దొర్సాని. దొరల్లెకుండ చేసిన్రు కద నాయనా! నువ్వే నయమనిపించినావ్ వీరభద్రం - ఎందరిని చంపినా నీకోసం చంపలేదు. ఆస్తులు భూములు అందరికి కావలెనన్నవు. మంచివానివి వీరభద్రం మంచివానివి. నాకు నచ్చినవ్ వాడున్నడు చూడు - ఆ రాముడు - కొత్త దొర...."
    గుండె నొప్పి వచ్చింది విమలమ్మకు.
    విలవిలలాడింది.
    వీరభద్రం పరిగెత్తాడు డాక్టరు దగ్గరకి.
    డాక్టర్ లేడు.
    గది తలుపులు వేసి ఉన్నాయి.
    దబదబ బాదాడు.
    గట్టిగా అరిచాడు.
    డాక్టరు బొత్తాములు పెట్టుకుంటూ తలుపులు తీశాడు.
    లోపల ఒక నర్సు మూలకి నక్కి వుంది. అలా ఒకసారి లోపలకు చూచి డాక్టరును చూశాడు వీరభద్రం. గ్రహించాడు అయినా మాట్లాడలేదు.
    ఇది ధర్మాసుపత్రి!
    "బెడ్ నెంబర్ తర్టీన్ సీరియస్" అన్నాడు వీరభద్రం.
    "జెస్ట్ యే మినిట్" అని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు డాక్టరు.
    సూది గుచ్చాడు డాక్టరు విమలమ్మకు. నిమిషాల్లో ఆమెకు మంచులా మత్తు రాసాగింది. పలవరిస్తున్నట్లు "వీరభద్రం ఇక్కడనే ఉండు. దిక్కులేని ...." నిద్రలోకి పోయింది.
    డాక్టరు తల వంచుకొని వెళ్ళిపోయాడు.
    కాసేపు చూస్తూ కూర్చున్నాడు వీరభద్రం. అలా ఆమెను చూస్తుంటే ఎన్నెన్నో ఆలోచనలు ముసిరాయి. ఎంత బాగా మాట్లాడింది. దొరలు పోయారు. నిజమే . కొత్త దొర రామయ్య! కొత్త దొరలు ! రామయ్యలు! ఆ మాటలే గిరగిరా తిరిగాయి. అవి తననే వెక్కిరిస్తున్నట్లనిపించాయి. ఏవేవో ఆలోచల చీకట్లు ముసురుతున్నాయి. మధనపడ్డాడు. అన్నీ ప్రశ్నలే. ఒక్కదానికి సమాధానం రాలేదు. అలసి పోయాడు. సొలసి పోయాడు. విమలమ్మకు రగ్గు తీసి కాళ్ళు సరిగా సర్దాడు. లేచాడు. మంగమ్మ గదికి వెళ్ళాడు. మంగమ్మను తీసుకువోచ్చి చూపించాడు.
    "ఈమె విమలమ్మ దోర్సానా!" ఆశ్చర్యంగా అడిగింది మంగమ్మ.
    "అవును, తెలుసుకొన్నా. నువ్వు ఆలోచించకు ఆరోగ్యం చెడుతుంది పద" అని గదిలో వదిలి వెళ్ళిపోయాడు వీరభద్రం.
    ఆ రాత్రికి వీరభద్రానికి నిద్రపట్టలేదు. విమలమ్మ అన్న మాటలు మననం చేసుకున్నాడు. మధనపడ్డాడు. దొరలు పోయారు. కొత్త దొరలు వచ్చారు" అనేది తలచుకొని "దొరలు పోలేదు. కొత్త దొరలు వచ్చారు" అనుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఈ కొత్త దొరలు అసలు దొరలు కంటే ప్రమాదకరంగా పరిణమించారు అనుకున్నాడు. తెల్లావారి శాసనసభలో ఆ విషయమే మాట్లాడాడు.
    "కొత్తదొరలు ఊరూరా వెలిశారు. సారాయి, గుండాలు వారి రాజకీయాలైనాయి. ఈ కొత్త దొరలకు నడమంత్రపు సిరి అబ్బింది. డబ్బుకోసం వారు తలలు తీయటానికి సైతం వెనుకాడటం లేదు. గుండెలు తీసిన బంట్లయినారు. ప్రభుత్వ యంత్రాంగం వారికి అన్ని విధాల సహకరిస్తుంది. అసలు ప్రభుత్వం చేస్తున్నది కొత్త దొరలా? ఎన్నికైన శాసనసభ్యులా అనే విషయం అర్ధం కాకుండా ఉంది. ప్రజలు విసిగిపోయారు. న్యాయం అనేది మందులోకి సైతం దొరకడం లేదు. ప్రభుత్వం ఇందు విషయంలో గట్టి చర్యలు తీసుకోకుంటే పరిస్థితులు విషమించే సూచనలున్నాయి."

 Previous Page Next Page