అభినందనగా చూశారు ఉపాధ్యాయగారు. విస్సు ఒఇ వ్యక్తిగా కాక ఓ నిఘంటువులా "అలాగే బారన మార్సిల్ బిక్ కూడా తొలిసారి బాల్ పాయింట్ పెన్నుని తయారుచేసి అతడు మార్కెట్ లో విడుదల చేసినప్పుడు ఒక్కో పెన్ను మీద అతడి లాభం 00666 సెంట్సు మాత్రమే. అయినా యంత్రాలతో ఫ్యాక్టరీని ఆధునీకరించాడు. సాలీనా కోటి డాలర్ల లాభాన్ని సంపాదిస్తున్నాడు. సో - ఎక్కువలాభాలు కావాలీ అంటే నాణ్యతగల ఉత్పత్తి ఎక్కువ కావాలి. ఆ నాణ్యతకీ ఉత్పాదకతకీ కొత్త యంత్రాలూ వుండాలి."
తెలిసిన స్టేటిస్టిక్స్ ని మాటల గారడితో మిశ్రమం చేసి అద్బుతంగా స్కోర్ చేస్తున్న విస్సుని ఓడించాలనుకుంది కృషి. "అంటే కార్మికుల మోటివేషన్ తో జరిగే ఉత్పాదకత కన్నా కొత్త యంత్రాలు మోడర్ నైజేషన్ తోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమంటారు."
"మీరు నా మాటల్ని సరిగా అర్ధం చేసుకోలేదనుకుంటాను మిస్ కృషీ....మీకు యింకా స్పష్టంగా అర్ధం కావాలీ అంటే..." ఆమెది తనను అర్ధం చేసుకోగలిగే స్థాయికాదన్న భావాన్ని ఒడుపుగా వ్యక్తం చేశాడు విస్సు. "ఫుట్ పాత్ మీద పళ్ళమ్ముకునే వ్యాపారి కొడుకూ పళ్ళమ్ముకునే బ్రతకటానికి కారణం వ్యాపారంలో మెళకువ తెలీక అనే అంటే మీరు అంగీకరించాలి...పళ్ళను చూసి ధర ఎక్కువగా వుందని మనం అంటే నీ మొహానికి పళ్ళెప్పుడైనా కొన్నావా అని ఎద్దేవా చేస్తాడు. అందుకే ఆ స్థాయిని దాటి ఎదగడు. కాని ఓ అంగడిలో చిన్న టీ కొట్టు నడిపిన కృష్ణమూర్తి ఆ తర్వాత దేశ విదేశాలలో ఫుడ్ లేండ్స్ హోటళ్ళను ప్రారంభించాడు....అతడి వ్యాపారంలో ఎదుగుదలకి కారణమైంది యంత్రం కాదు...యంత్రంలా పనిచేయగల సహనం. ఆధునికంగా ఆలోచించగల మేధస్సు....అంచేత ప్రతి వ్యాపారానికి కార్మికుడు కావాలి.....ఆ కార్మికుడికి మోటివేషనూ వుండాలి."
"ఇంత తెలిసిన మీరు చౌదరి దగ్గరే ఎందుకు వుండలేకపోయారు...." అసంకల్పితంగా అనేసింది కృషి.
ఒడిలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు విస్సు....కృషి యింత సూటిగా యిలాంటి సమయంలో చౌదరి రిఫరెన్స్ తీసుకు వస్తుందని వూహించలేక పోయాడు.
ఉపాధ్యాయగారు అప్పటికే ఓ బద్ద శత్రువుని చూస్తున్నట్టు విస్మయంగా అడిగారు "నువ్వు చౌదరి మనిషివా"
విస్సు జవాబు చెప్పలేకపోయాడు.
"యస్ గ్రాండ్ పా..... విశ్వనాథ్ ముందునుంచీ రామనాథచౌదరికి చాలా చాలా ఆత్మీయుడు."
అక్కడ గాలిగడ్డ కట్టుకుపోయింది.
"చాలా శ్రమపడి నేను చౌదరి మనిషినని తెలుసుకున్న మీ పరిశోధనకి నా జోహార్లు మిస్ కృషి "సీరియస్ గా అన్నాడు విస్సు కృషిని చూస్తూ. "ఇంతకన్నా మీ మనుషులు కానిదెవరో తెలుసుకోటానికి మీ శక్తిని వినియోగించివుంటే మరింత ఆనందించేవాడ్ని."
రోజుల వ్యవధిలో నీపై పెంచుకున్న నమ్మకానికి ఏర్పడిన విఘాతంతో ఉపాధ్యాయ ఉద్రేకాన్ని నిభాయించుకోటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది.
"నేను వెళ్ళడమే మీరు కోరే విషయమైతే వెళ్ళిపోతాను. కాని వెళ్ళేముందు..."
"చెప్పు" అర్దోక్తిగా అన్నారు ఉపాధ్యాయ.
"నిన్న భారత రక్షణశాఖకి మీరో టెండర్ పంపే ఏర్పాట్లు చేసారు కదూ"
ఉపాధ్యాయ మొహంలో రంగులు మారేయి.
"చాలా రహస్యంగా జరిగిన సమావేశంలో మీరు సప్లై చేయాల్సిన మెషిన్ రేట్సుని" ఫైనలైజ్ చేశారు...."
కృషి సైతం అవాక్కయి చూస్తూంది.
"అందులో మీరు స్పెషల్ పర్సన్ మెషిన్ కి కోట్ చేసిన ధర డెబ్బై లక్షల ముఫ్ఫై రెండు వేల రూపాయలు....మౌంటింగ్ కి అరవై ఏడు వేలు - ట్రాన్స్ పోర్టేషన్ కి లక్షా రెండు వేల ఏడు రూపాయలు విడి విడిగా కోట్ చేశారు - అవునా-"
ఉపాధ్యాయ నిశ్చేష్టుడై చూస్తున్నారు కోట్ల ఖరీదు చేసే కొటేషన్ కి సంబంధించి చాలా గోప్యంగా ప్రిపేర్ చేసిన వివరాల్ని తెలియచేస్తున్నాడు విస్సు ఒక్క అంకె కూడా తప్పుకాకుండా-
"ఒకవేళ నేను చౌదరి మనిషినే అయి వుంటే మీ పరిధి నుంచి బయటికి వెళ్ళిన ఈ రహస్యం గురించి యిప్పుడు మీకు చెప్పాల్సిన ఆగత్యం నాకు లేదు చెబితే నాకు ఒరిగేది వుండదు."
ఉపాధ్యాయగారిపై తాత్కాలికమైన అస్త్రాన్ని సంధిస్తున్నాడు విస్సు. అతడి జేబులో వున్న జిరాక్స్ కాపీ చూపించకుండా కొటేషన్ అంతా చెప్పేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో.
"నిజానికి ఈ ఇన్ ఫర్మేషన్ తో నేను లక్షలు సంపాదించగలను కాని నా లక్ష్యం లక్షలు కాదు - మీ విజిలెన్స్ లోని లోపం వలన మీకెంత నష్టం జరుగుతున్నదీ మీకు తెలియచెప్పడం. "ఒకవేళ మీరు - "కృషి ఇంకా షాక్ లోనే వుండటాన్ని గమనిస్తూ చెప్పాడు విస్సు "అందరు ఆడపిల్లల్లా మనసుతో కాక మెదడుతో ఆలోచించి వుంటే నేను చౌదరి అనే మీ ప్రత్యర్ధితో కొద్దిపాటి సాహచర్యాన్ని మెయిన్ టెయిన్ చేయడంలో ఉద్దేశం మీకు అర్ధమై వుండేది. ఎనీహౌ - నేనేమిటీ అన్నది మీరు ఇప్పటికైనా తెలుసుకుంటే చాలు సంతోషంగా వెళ్ళిపోతాను."
ఇక బయలుదేరేవాడే - అప్పుడు జోక్యం చేసుకున్నారు ఉపాధ్యాయ.... "ఆగు"
అనడమే కాదు ఆప్యాయంగా విస్సు భుజం పై చేయి చేశారు....అది అనితరసాధ్యమైన పరిశోధనే అనిపించిందో లేక తన సామ్రాజ్యాన్ని కాపాడటానికి విస్సు అనే ఓ యువకుడు నిస్వార్ధంగా తీసుకున్న శ్రద్దగా కనిపించిందో మరి ఉద్విగ్నంగా అన్నారాయన "నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు విశ్వనాథ్ ఫ్యాక్టరీ విజిలెన్స్ సెల్ తెలుసుకోలేని ఓ నిజాన్ని నాకు తెలియచేసి నాకు కనువిప్పు కలిగించడమేగాక నా అడ్మినిస్ట్రేషన్ లోపాల్ని ఎత్తి చూపించి నీ నిజాయితీని కూడా నిరూపించుకున్నావ్ చెప్పు ఈ విషయాన్ని ఎలా తెలుసుకోగలిగావు"
"క్షమించండి ఉపాధ్యాయగారూ అది నేను చెప్పలేను."
"ఈ వివరాలు బయటికి ఎలా వెళ్ళాయి" కంపించి పోతున్నారాయన.
"అది తెలుసుకోవాల్సింది కూడా మీరే" మరింత రెచ్చగొడుతున్నట్టుగా అన్నాడు విస్సు.
కృషి ఆవేశంగా అంది "ఇంత చెప్పిన మీరు అది కూడా తెలియచేయొచ్చుగా."
"నన్ను నిలదీసేకన్నా ఛాన్సెస్ గురించి మీరు ఆలోచిస్తే బెటర్. నిన్న మీ సమావేశంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు. అందులో ఎవరికీ లీక్ చేసే అవసరం ఉందీ లాంటి ప్రోబబులిటీస్."
"మిస్టర్ విశ్వనాథ్" విస్సు గొంతులోని ఎగతాళిని భరించలేనట్టుగా అంది కృషి. "మీరెలా తెలుసుకున్నారో అది చెబితే ఈ రహస్యం బయటికెలా వెళ్ళిందో మేం ఇన్వెస్టిగేట్ చేస్తాం"
"మీ అమాయకత్వానికి బాధపడుతున్నాను మిస్ కృషి" మరింత వ్యంగ్యంగా అన్నాడు. "క్షణం పాటు ఆ వివరాలున్న డాక్యుమెంట్ ని దొంగతనం చేసింది నేనే అనుకుందాం... అప్పుడు ఎలా దొంగతనం చేశావని నన్నడగడం కాదు మీరు చేయాల్సింది....నాకు అలాంటి ఛాన్సిచ్చిన మీ సెక్యూరిటీ లోపాల గురించి ఆలోచించాలి - మీ వాళ్ళూ అనుకుంటున్న మీ మనుషుల్లోని నిజాయితీ గురించి ఆలోచించాలి."
అర నిముషం మౌనం తర్వాత అన్నారు ఉపాధ్యాయ "నిన్న టెండర్ కి సంబంధించిన చర్చలో పార్టిసిపేట్ చేసింది ముగ్గురం. నేను, కృషి, ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారాయుడు - చర్చ తర్వాత ఫైనల్ స్టేట్ మెంట్ ని జియం కిచ్చాను పంపే ఏర్పాట్లు చేయమని -" ఈ విషయం చెబుతూ సైతం చాలా అసహనంతో నలిగిపోయారాయన. తన స్థాయి వ్యక్తికి సంజాయిషీలా మాట్లాడటం అనూహ్యమైన విషయం. "ఎలా - " గొణుగుతున్నట్టుగా అన్నారాయన "ఎలా తెలిసింది నీకీ విషయం"
"మీరు నమ్మే వ్యక్తులు అంతా మీరు నమ్మదగ్గవాళ్ళు కారు ఉపాధ్యాయగారు...." కృషి వేపు చూశాడు విస్సు. ఆమెకు చురుక్కుమనిపించేట్టుగా - "పైగా ఫ్యాక్టరీ విజిలెన్స్ అన్నది ఎంత ముఖ్యమిన విభాగమో మీకు చెప్పేటంత మేధావిని కాను నేను-"
తను మాత్రం నమ్మదగ్గ వ్యక్తినంటూ పరోక్షంగా విస్సు వ్యక్తం చేస్తుంటే తను పడుతున్న శ్రమని ఎగతాళి చేస్తున్నట్టుగా వుంది కృషికి.
"మీ అనుభవం అపారమైంది. మీ దీక్ష అనితర సాధ్యమైనది - కాని...." ఉపాధ్యాయగారి అహాన్ని ఒడుపుగా రెచ్చగొడుతూ చెప్పుకుపోయాడు విస్సు. "మీరు అనారోగ్యంతో వున్న వ్యక్తి - ఆ విషయం మీరు అంగీకరించరు. అంగీకరించక పోయినా ఇది నిజం. కాబట్టే కృషిలాంటి సమర్దురాలైన వ్యక్తికి మీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇలా అంటున్నందుకు నన్ను మీరు కోపగించుకున్నా నేను బాధపడను సర్. కాని ఆడపిల్లలకి కొన్ని పరిధులుంటాయని మీరు ఒప్పుకోవాలి. అదే నిజం కాని వాడు నాకు బదులు కృషి మీ జనరల్ మేనేజర్ బయటికి చేరేసిన విషయాన్ని లాఘవంగా తెలుసుకోగలిగేది."
"వ్వాట్" అదిరిపడినట్టుగా చూశాడు...."ఇది చేసింది సుబ్బారాయుడా" ఓ దశాబ్దం కాలం నుంచి అతడిపై పెంచుకున్న నమ్మకం సడలిపోతుంటే ఆందోళనగా అన్నారు "ఐ కాంట్ ఇమేజినిట్...."
"ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలుంటాయి....ఆ బలహీనత డబ్బు కావచ్చు....ఆడది కావచ్చు....అధికారం కావచ్చు..."
"సుబ్బారాయుడికి డబ్బుతోనూ అవసరం లేదు"
"కాని అతడికున్న బలహీనత ఆడది - ఆ ఆడదానికి వున్న బలహీనత డబ్బు - అందుకే డబ్బు తీసుకున్న ఓ ఆడది మీ టెండరు వ్యవహారాన్ని తెలుసుకుంటానని మీ ప్రత్యర్దులకి హామీ ఇచ్చింది. మీ జనరల్ మేనేజర్ని తన దగ్గరకు రప్పించుకుని ఈ వివరాలన్నీ సంపాదించగలిగింది."
విస్సు చెప్పింది పూర్తికాక ముందే అంది కృషి "మీరు ఇదంతా అలాంటి ఆడదానినుంచి తెలుసుకోగలిగారన్నమాట"
"ఎస్" వెంటనే అన్నాడు విస్సు "మీరు కరెక్టుగా గెస్ చేశారు ఐతే నా బలహీనత ఆడది కాదు. అలాంటి వ్యవహారాలు సహించలేకపోవడం-"
"మిమ్మల్ని నమ్మేట్టు చేసుకోగలగడం కూడా అనుకుంటాను "ఉక్రోషంగా అంది కృషి.
కృషీ సాధికారంగా నిలదీశారు ఉపాధ్యాయ. "ఇక్కడ నువ్వు ప్రశ్నించాల్సింది విశ్వనాథ్ ని కాదు - మన అడ్మినిస్ట్రేటివ్ లాప్సెస్ ని"
కృషిని విస్సు విషయంలో ఇలా మందలించడం తొలిసారి..... ఇక్కడ కూడా తను ఓడిపోయినందుకు ఆమె బాధపడుతుందో లేక గ్రాండ్ పాకి మరింత దగ్గరకావాలని విస్సు ప్రదర్శించిన తెలివికే ఆశ్చర్యపోతుందో ఆమెకి తెలీదు.
"థేంక్స్ సర్..." వినయంగా అన్నాడు విస్సు. "నేనేమిటీ అన్నది మీరైనా తెలుసుకోగలిగారు....అందుకు కృతజ్ఞుడ్ని."
మరింత నిజాయితీని ప్రదర్శించిన విస్సుని చూస్తూ అర నిముషం తర్వాత అన్నారు ఉపాధ్యాయ.
"ఇక నువ్వు నువ్వేమిటీ అన్నది నిరూపించుకోవాల్సిన అగత్యం లేదు విస్సు...." తన నమ్మకాన్ని ఇంకెవరూ సడలించలేరన్నంత దృఢంగా చెప్పుకుపోయారాయన. "ఈ రోజు నుంచీ నువ్వు మాకు మరింత ఆత్మీయుడవైన వ్యక్తివి.....యస్ విశ్వనాథ్.....నిస్వార్ధంగా నన్ను కాపాడిన నువ్వు ఇప్పుడు నా సామ్రాజ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశావు. అందుకు అభినందిస్తున్నాను....ఇక ముందూ నీ సహకారం కావాలని కోరుకుంటున్నాను."
తన పథకంలో మొదటి అంకం పూర్తయినట్టుగా విస్సు పెదవులు ఆనందంగా విచ్చుకున్నాయి.
కృషి నివ్వెరపోతూంది విస్సుని చూస్తూ...
అసాధారణంగా విస్తరించిపోతూన్న విస్సు తను అంత సులభంగా కదిలించలేని స్థాయికి చేరుకుంటున్నాడు.
ఆ తర్వాత జనరల్ మేనేజర్ పై గ్రాండ్ పా ఎలాంటి చర్య తీసుకుంటాడూ అన్నది కాదు ఆమె ఆలోచిస్తున్నది. ఇంత లోతుగా పాతుకుపోతున్న విస్సు మూలంగా రేపేం జరగబోతుంది అన్న విషయం గురించి.