Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 29

    కేవలం తనపై శారీరకమైన గెలుపు ఆశించి వుంటే ఇలాంటి మార్గంలో ఇంత రిస్క్ తీసుకోవాల్సిన ఆగత్యం లేదు.    
    మరో ఐదు నిముషాల్లో గ్రాండ్ పా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు.    
    విస్సు ఇప్పుడు ఆమెకు అభిముఖంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చోవటానికి అర్ధం నన్ను ఇక కదిలించలేరని ఛాలెంజ్ చేయడమా....    
    ఓడిపోతున్నానన్న ఆందోళనతో నలిగిపోతున్న ఆమెకి ఇక తన గెలుపుకి తిరుగులేదనే ధీమాని ప్రదర్శించే విస్సుతో బాటు ఆ హాల్లో వుండటం కష్టంగా వుంది.    
    "నీ సువిశాల సామ్రాజ్య వృత్తానికి కేంద్రంగా మారాలని అంచెలంచెలుగా నీ మీద గెలుపు సాధించుకుపోతున్నాను కృషీ. నేనేమిటో అర్ధమైందిగా"
    క్రోధారుణనేత్రలతో చూసింది. "ఎందుకు ఈ ఇంట్లో అడుగు పెట్టావ్....అసలు ఏం కావాలి నీకు"        
    "కావాల్సింది నువ్వివ్వవని తెలిసిపోయింది కృషీ. ఇప్పుడు నేను కోరుకుంటున్నది నిన్ను కాదు - నువ్వీ దేశం వదిలి వెళ్ళిపోవడాన్ని"    
    నిశ్చేష్టంగా చూసింది.....ఇదో కొత్త ప్రపోజల్.    
    "నేనెందుకు వెళ్ళాలి"    
    "వెళ్ళకపోతే ఆడదానిగా నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి "మరింత స్పష్టంగా చెప్పాడు. "ఔను మిస్ కృషి! ఒకప్పుడు పందెంలో గెలిచిన నేను కోరింది నీతో ఓ రాత్రి గడపటాన్ని. కాని తెలివిగా తప్పించుకున్నావు....అందుకే ఇప్పుడు ఈ దేశం వదిలి వెళ్ళమంటున్నది. వెళ్ళనూ అని నువ్వు మొండిగా కూర్చుంటే -"    
    "చెప్పు" ఉక్రోషాన్ని అదిమి పెట్టుకుంటూ అడిగింది. "నేను వెళ్ళనంటే ఏం చెయ్యబోతున్నావ్?"    
    "నువ్వు అపురూపంగా కాపాడుకుంటున్న నీ ఆడతనాన్ని తెలివిగా కొల్లగొడతాను - 'అది నీ వల్ల కాదు' అనకు - ఇంత చేసిన వాడ్ని అది సాధించడం నాకు కష్టం కాదు....అందుకే కనీసం ఆ నష్టం జరక్కుండా ఈ దేశం విడిచి వెళ్ళిపోమంటున్నాను".    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.    
    "అగు" పిలిచింది గది దాటి వెళ్ళబోతున్న విస్సుని చూస్తూ.    
    "చెప్పు"    
    "ఇప్పుడు స్పష్టంగా అర్ధమైంది"    
    "ఏమిటి"    
    "నువ్విక్కడ కెందుకొచ్చావు అన్న విషయం. ఎస్ మిస్టర్ విశ్వనాథ్ - చౌదరి అనబడే నీ ఆత్మీయుడు నన్ను ఎదుర్కొనలేక పోతున్నాడు. కాబట్టి నేను ఈ దేశం వదిలి వెళ్లేట్టు చేయమని నిన్నిక్కడకు పంపేడు అలా మా గ్రాండ్ ఫాని ఒంటరివాడ్ని చేసి తన ప్రతాపాన్ని నీ ద్వారా చూపించడం అతని ధ్యేయం కావచ్చు.....నువ్వీ ఒప్పందానికి సిద్దపడటానికి తిరిగి చెల్లించలేని ఐదు లక్షలు కారణం కావచ్చు. అలా చూడకు విస్సు.... ఇవి తెలుసుకోవాటానికి పెద్ద ఐక్యూ అవసరం లేదు.... డబ్బుకోసం ఏదన్నా చెయ్యటానికి దిగజారేవాడికి...దిగజారడు తనాన్ని జీవితంగా మార్చుకున్న వాడికి ఇంతకుమించి ఆలోచించగలగడం చేతకాదుగా...అయితే ఇక్కడ నీకో విషయం నేను స్పష్టం చేయాలి. మా గ్రాండ్ పా దగ్గర గుడ్ విల్ సంపాదించడానికి టెండరు వివరాలు సేకరించి చెప్పిన నువ్వు ఈ ఇంట వుండటానికి స్థానం సంపాదించుకో గలిగావేమోకాని ఈ ఇంటి నుంచి నన్ను పంపగలిగేటంత స్థాయిని మాత్రం కాదు... అసలు ఇలాంటి ఆలోచనలు గల నీ అమాయకత్వానికి జాలిపడుతున్నాను...నిన్న మొన్నటిదాక ఈ దేశం వదిలి వెళ్ళాలన్న ఆలోచన ఏదన్నా వుంటే అది ఈ క్షణం నుంచీ చెరిపేసుకుని నీ సంగతి తేల్చబోతున్నాను...గెట్ రెడీ..."    
    ఓ హెచ్చరికలా చెప్పిన కృషి ఆ తర్వాత అక్కడ నిలబడలేదు. అపారమైన తెలివితేటలు, అసాధారణమైన సునిశిత బుద్దిగల కృషి తన గదిలోకి వెళుతూనే 'కోలా' కంపెనీకి ఫోన్ చేసింది. తొలిసారి విస్సు పార్టిసిపేట్ చేసిన కోలా కంపెనీ నుంచి విశ్వనాథ్ రెసిడెన్షియల్ అడ్రస్ తెలుసుకోగలిగింది. ఓ అనాధగా తాతయ్యకి తనను తాను పరిచయం చేసుకున్న విస్సు తల్లి వుండేదెక్కడో ఆరా తీయడం ఆమె లక్ష్యమైతే దాన్ని ఆమె సునాయాసంగా సాధించగలిగింది.    
    ఆ సాయంకాలమే చైతన్యనంద ఆశ్రమానికి వెళ్ళింది కృషి...
                                    *    *    *    *    
    "తెర తొలిగింది. పాత్రలు పలికాయి.... కథ నడిచింది. గాధ ముగిసింది. ఇది నాటకం..... జన్మ మొదలయింది.... బ్రతుకు కదిలింది యాత్ర ముగిసింది. చితి రగిలింది. ఇది జీవితం....కాలమనే ఎడారిలో చరిత్ర ఇసుక తిన్నెలపై కొందరివే అడుగుజాడలు కనిపిస్తాయి. ఎందరివో మాసిపోతాయి..."    
    అసుర సంధ్యా సమయాన చైతన్యానంద కంఠం నుంచి జాలువారుతున్న వేదాంత సారం ఆశ్రమంలో అసదృస్యమైన ప్రశాంతత నింపుతూంది.    
    ఆయనకి అభిముఖంగా కూర్చున్న సుమారు ఏభైమంది ఆశ్రమవాసుల్లో స్త్రీలూ, పురుషులూ మాత్రమే కాక పసి పిల్లలు వున్నారు.... అందరూ తాదాత్మ్యంగా ఆయన చెబుతున్నది వింటుంటే నిశ్శబ్దంగా వచ్చి ఓ మూల కూర్చుంది కృషి-    
    "బ్రతకటం వ్యక్తిగతం.  జీవించడం సాంఘికం....తన కోసం మాత్రమే ఆలోచించే మనిషి మిగిల్చిన అడుగుజాడలు గాలి అలలకి చెరిగిపోతుంటాయి. సంఘం కోసం జీవించే మనిషి అడుగు జాడలు మరో మనిషికి మార్గదర్శకాలౌతాయి. అందుకే బ్రతకడం కన్నా జీవించడం గొప్ప అలా జీవించడమే చరిత్ర ఐతే "క్షణం ఆగేడాయన" బ్రతకడానికి జీవించడానికీ మూలం ఒకటే....అది ప్రేమ....తనను తను ప్రేమించుకోవడం బ్రతకడం అనిపించుకుంటే అందర్నీ ప్రేమిస్తూ ముందుకు సాగిపోవడం జీవించడమౌతుంది. ఇక్కడ నేను ఉదహరించిన ప్రేమ అరిషడ్వర్గాలకి అతీతమైనది భక్తిరస ప్రధానమైంది....అలాంటి ప్రేమలకి ఆశలు లేవు....అందించడమే గానీ అందుకోవాలనే ఆసక్తి వుండదు.....అది భౌతికం కాదు.....సకల జీవులకి జీవనాన్ని ప్రసాదించి కాపాడే సూర్యభగవానుడ్ని మనోల్లాసం కలిగించే చంద్రతారక వసంతాల్నీ గుర్తుచేసే ప్రతిఫలా పేక్ష లేని నిస్వార్ధ ప్రక్రియ ఆ ప్రేమ...."    
    మహర్షిలా చెప్పుకుపోతున్న చైతన్యానంద వాక్కులు కృషిని ఎంతగా ఆకట్టుకున్నాయి అంటే అలసిపోయిన మనసుకి సేద తీర్చే అవకాశం ఇంతకాలానికి దక్కినట్టనిపించింది. అది ఉపదేశం కాదు... అమృత రసవాహిని లాంటి జీవిత సత్యాలతో గుండె గాయాల్ని మరపింపచేసే దివ్యౌషధంలాంటి ఆధ్యాత్మికానుభూతి.    
    మరో పది నిముషాలలో వేదాంత ప్రసంగం ముగిసింది. ఆశ్రమ వాసులంతా కుటీరాలకు వెళ్ళిపోయిన రెండు నిముషాలకి చైతన్యానందని సమీపించింది కృషి...    
    ఆమె వచ్చింది ఎందుకయినా గానీ ఆ క్షణంలో రుష్యత్వం సిద్ధించుకున్న ఓ మహోన్నతుడ్ని కలుసుకోగలిగిన సంతృప్తి ఆమె కళ్ళల్లో...చేతులు జోడించి నమస్కరించింది. వేలట్ లో నుంచి ఓ లక్ష రూపాయల చెక్ తీసి అతడికి అందించింది.    
    ఆయన నేత్రాలు విస్ఫారితాలయ్యాయి...    
    "ఎందరో అభాగ్యులకి అనాధలకి నిలయమైన ఈ ఆశ్రమానికి మా కుటుంబం తరపున ఇస్తున్న ఓ నూలుపోగు" వినమ్రంగా అంది.    
    "ఎవరమ్మా నువ్వు" నేత్రాంచలాలలో మెరిసే కాంతుల్ని ఆయన దాచుకోలేక పోయారు...." నిన్ను చూడటం తొలిసారి"    
    "నేను" తనెందుకొచ్చింది అప్పుడు గుర్తుకొచ్చినట్టుగా అంది "విస్సు స్నేహితురాల్ని" అది అబద్దం కావటం మూలంగా ఆమె గొంతు వణికింది.    
    చైతన్యానంద భ్రుకుటి ముడివడింది...    
    ఆయన చూపులు ఏ గుండె పొరల్నో తాకినట్టయి తల వంచుకుంది కృషి. "అర్ధం కావడం లేదు బాబా...ఇంతటి ఆధ్యాత్మిక చింతనని ఉపదేశించగల మీ సన్నిధిలో వుంటూ విస్సు అంత అశాంతిగా ఎందుకు బ్రతుకుతున్నదీ నా ఊహకందడం లేదు..."    
    ఆయన నేత్రాలు అరమోడ్పులయ్యాయి.        
    "తనవారైన యాదవులు ధర్మచ్యుతులై ముసలం పట్టి పరస్పరం బాధించుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే చూస్తూ వుండిపోవటానికి గాని తన కళ్ళముందే తన వంశమంతా నాశనమౌతున్నా నిబ్బరంగా నిలబడటానికిగాని విస్సు బ్రహ్మజ్ఞాని అయిన శ్రీకృష్ణుడు కాదమ్మా...ఇంకా బ్రతుకు మైకం వదలని పసికందు -"    
    చైతన్యానంద క్లుప్తంగా వివరించాడు విస్సు తండ్రి హత్య గురించి తల్లి మతిస్థిమితం కోల్పోవడంతో అతడు అర్దాంతరంగా చదువుని ఆపి వెనక్కి వచ్చిన తీరు గురించి...    
    కృషి అవాక్కయిపోయింది...    
    విస్సు కొద్దో గొప్పో చదువుకున్నవాడేమో అనుకుంది గాని రీసెర్చిని అసంపూర్తిగా వదిలిన స్కాలర్ గా ఇప్పుడే తెలుసుకుంది. అదికాదు ఆమెను అంత ఆందోళన పరిచింది.... విస్సు తండ్రి మోహన్ గాంధీ పనిచేసింది తన ఫ్యాక్టరీలోనే....ఓ కార్మిక నాయకుడిగా ప్రాణాలను కోల్పోయింది తమ ఫ్యాక్టరీ సమ్మెలో...    
    కృషి నుదుటపట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ తనకు తెలీని మోహన్ గాంధి హత్య గురించి ఆలోచిస్తూనే చైతన్యానందంతో బాటు ఆశ్రమం అంతా తిరిగింది...    
    అయితే ఆమెను అమితంగా కదిలించింది విస్సు తల్లి పార్వతమ్మ పరిస్థితి... ప్రపంచంతో సంబంధంలేనట్టు పిచ్చి చూపులు చూస్తూ నిలబడి వుందామె....    
    మరో అరగంట తర్వాత ఆశ్రమం నుంచి బయలుదేరిన కృషికి బోధపడిపోయింది.    
    విస్సు తన ఇంట అడుగుపెట్టింది పగ సాధించాలని మాత్రమే....దానికోసం తనకంటూ బలమైన ఓ వలయాన్ని నిర్మించుకుంటున్నాడు.    
    విస్సు తండ్రి మోహన్ గాంధీ హత్య చేయబడటానికి కారణం ఏదన్నా కాని వెంటనే ఈ విషయం గ్రాండ్ పాకి తెలియచేయకపోతే విస్సు ఉనికి చాలా అనర్ధాలకి దారితీస్తుంది.    
    విస్సుకి ఇంటి నుంచి ఉద్వాసన చెప్పటానికి ఈ మాత్రం చాలు. ఓ తిరుగులేని అస్త్రాన్ని సంధించబోతున్న ఉద్వేగంతో ఇంట అడుగుపెట్టిన కృషి ఉపాధ్యాయగారి ఛాంబర్ కేసి చూసింది...  
    ఆయన వున్న సూచనగా గదిలో లైటు వెలుగుతూంది...    
    మరో పది సెకెండ్ల వ్యవధిలో ఆ గదిలో అడుగుపెట్టేదే...    
    అప్పుడు వినిపించింది విస్సు కంఠం.    
    "మిస్ కృషి"    
    "ఎస్" సాలోచనగా చూసింది క్షణం ఆగి...    
    సరాసరి ఆశ్రమం నుంచే వస్తున్నారనుకుంటాను."    
    "అభినందిస్తున్నాను"
    "దేనికి"    
    "నేను వెళ్ళిన విషయం తెలుసుకున్నందుకు"
    "ఆమె రాక గురించి సూరి తెలియచేసిన విషయం చెప్పలేదు విస్సు."
    "మీరు మీ గ్రాండ్ పా దగ్గరికి వెళ్తున్నారనుకుంటాను."
    "కరెక్టుగానే గెస్ చేశావు..." నవ్వింది భావ గర్భితంగా "వెళ్ళడమే కాదు విస్సు- నీ తండ్రి మరణానికి కారణం ఉపాధ్యాయగారే అన్న ఆలోచనలో పగ సాధించాలని ఈ ఇంట అడుగుపెట్టానని కూడా చెప్పబోతున్నాను"

 Previous Page Next Page