ఆంజనేయులు శకుంతలను గమనించాడు. ఆమె తల కొద్దిగా వంచి నిశ్శబ్దంగా నవ్వుతోంది.
"ఎనీ హౌ! ఐయామ్ లక్కీ గై ఎందుకంటే శకుంతలగారు నాకు వడ్డిస్తారు గనుక" అన్నాడు నవ్వుతూ వినయ్.
ఆమె చివుక్కున తల పైకెత్తి వినయ్ వైపు చూసింది.
ఆ చూపుల్లోని భావాలను క్రీగంట గమనించిన ఆంజనేయులకు దిగులేసింది.
మళ్ళీ మహాలింగం ఆంజనేయులి చెవిలో రన్నింగ్ కామెంట్రీ విన్పిస్తున్నాడు.
"అవును నువ్వెప్పుడూ లక్కీ గైవే. బెనారస్ లో అడ్డమైన బూతుపుస్తకాలు చదివి ఎం.ఏ. పాసైన నువ్వు లక్కీ గైవే. కాలక్షేపనికి ఉద్యోగం చేస్తూ ఆడపిల్లలను మాయచేసి బుట్టలో వేసుకునే నువ్వు లక్కీ గైవే. తిరగడానికి మోటార్ బైక్, మాట్లాడడానికి కాసిన్ని ఇంగ్లీషు మాటలు వచ్చిన నువ్వు లక్కీ గైవే. తాము ఏ రొంపిలో దిగుతున్నామో తెలీని ఆడపిల్లలుండే ఈ దేశంలో పుట్టిన నువ్వు లక్కీగైవే. అయ్యా వినయ్ బాబూ! నిస్సందేహంగా ఒప్పేసుకుంటున్నాం నువ్వు అదృష్టవంతుడివే."
"మరో పందెంలో మాత్రం మేం ఓడిపోము. నీ ప్రజ్ఞ చూపుకో" అన్నాడు మేనేజర్. పట్టుదలను సూచించడానికి బాసింపట్టు వేసుకున్నాడు. ఆయనకు ఆ విషయాలు వింటుంటే కుర్రవాడైపోయి నట్లనిపిస్తోంది.
"నేను రడీ."
"మరి పందెం ఏమిటి?"
"మీరు పార్టీ అయిపోయేవరకు సిగరెట్లు కాల్చకూడదు"
శకుంతల నిరుత్సాహపడ్డట్లనిపించింది ఆంజనేయులుకు. ఎందుకో అతనికి ఆమెంటే ఇష్టం కలుగుతోంది. ఆమె తనతోనే మాట్లాడితే బావుండనిపిస్తుంది.
వినయ్ మరో సమస్యని చెప్పడానికి ప్రారంభించాడు.
"ఓ అమ్మాయికి పెళ్లైంది"
"ఎవరితో?"
"ఓ అబ్బాయితో, పెళ్ళికాగానే ఇదద్రూ హనీమూన్ కు వెళ్ళారు. నెలరోజులపాటు అటూ ఇటూ తిరిగొచ్చారు. ఓ రోజు అతను బజారుకి వెళ్ళాడు. అతను వెళ్ళిన ఓ అరగంటకు ఆమెకూ పనిపడి బజారుకు బయల్దేరింది."
"ఒంటరిగానా?"
"ఆఁ. ఆమె బజారులో నడుస్తోంది. భర్త పని ముగుంచుకుని ఇంటికి వస్తున్నాడు. రోడ్డుకు అటువైపు అతను ఇటువైపు ఈమె. భర్తను చూసింది. కానీ ఆ క్షణంలో అతను తన భర్త అన్న విషయం మరిచిపోయింది. క్యాజువల్ గా చూసి ఒకడుగు ముందుకు వేసింది. అప్పుడు గుర్తొచ్చింది అతను తన భర్త అన్న విషయం. ఠక్కున ఆగి, పిలిచింది. అంతవరకు ఆమెను చూడని అతను ఆగాడు. ఇద్దరూ కలుసుకున్నారు."
"ఇందులో ఏం వుంది?" ప్రియంవద అడిగింది.
"చాలా వుంది బజారులో మీఅమ్మ కనిపించదనుకోండి. ఆమె మీ అమ్మని గుర్తు రాకుండా వుంటుందా?"
"మంచి పాయింటే" మేనేజర్ అన్నాడు.
"ఇది అసాధారణమైన విషయం కనుక ఎందుకలా ఆమె తన భర్తను ఆ క్షణంలో మరిచిపోయిందో వివరించమని ఫ్రాయిడ్ ని అడిగారు కొందరు శిష్యులు"
"ఆయనెవరు?"
"సైకో ఎనాలసిస్ కు పితామహుడు. గొప్ప మానసిక శాస్త్రవేత్త."
"తరువాత."
"ఫ్రాయిడ్ విషయమంతా విని వాళ్ళిద్దరూ నెల రోజుల్లో విడాకులు తీసుకుంటారని చెప్పాడట. ఖచ్చితంగా అలానే జరిగింది. వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మీరు చెప్పవలసిందల్లా విడాకులు తీసుకోవడానికీ, ఆమె తన భర్తను ఓ క్షణమైనా మరిచిపోవడానికి గల సబంధం ఏమిటి?"
"గొప్ప చిక్కు ప్రశ్నే వేశావయ్యా" మేనేజర్ రెండు చేతులతోనూ ముఖం తుడుచుకుంటూ అన్నాడు.
"మరి మీరు ఓటమిని అంగీకరిస్తే నేనే చెబుతాను. పందెం గుర్తుంది కదా. మీరు సిగరెట్లు కాల్చకూడదు."
"సరే" నంటూ మేనేజర్ సిగరెట్ పెట్టెను టేబుల్ మీద పెట్టాడు.
"అతను ఆమెను హనీమూన్ లో ఇంప్రస్ చేయలేకపోయాడు.?" రాహుల్ అడిగాడు.
"హనీమూన్ లో ఏ విషయం వుంటుందయ్యా! పెళ్ళయితే తెలుస్తుందిలే" మేనేజర్ కొంటెగా కన్ను గీటాడు.
అందరికీ అర్ధమైంది.
"మరి మీరు సిగరెట్లు..."
"కాల్చనయ్యా పందెమంటే పందెమే" సిగరెట్ పెట్టెను అవతలకి గిరవాటేశాడు మేనేజర్.
అందరూ మెచ్చుకోలుగా మేనేజర్ వైపు చూశారు.
"దీనికి ఓ కొసమెరుపు చెప్పనా? ఆ ప్యాకెట్ లో సిగరెట్లు అయిపోయాయి" ఆయన బిగ్గరగా నవ్వాడు.
అంతలో ఓ దంపతుల జంట రూఫ్ గార్డెన్ కి వచ్చింది. వాళ్ళవెంట బాబు, పాప.
తండ్రి పక్కన కూర్చోవడానికి పాపా వెళ్ళింది. కానీ అప్పటికే బాబు తండ్రి పక్కన కూర్చున్నాడు. దాంతో పాప మారాం చేయటం మొదలుపెట్టింది. తండ్రి పక్కనే కూర్చోవాలని ఏడుపు అందుకుంది.
ఇక తప్పదని తండ్రి బాబు లేపి కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పాప సంతోషానికి అవధుల్లేవు.
దీన్నంతా మేనేజర్ గమనించాడు. ఆయనకు ఓ సందేహం కలిగింది.
"వినయ్ నాకు ఎప్పట్నుంచో ఓ డౌటయ్యా."
"చెప్పండి సార్."
"ఆడపిల్లలకు తండ్రి అంటేనూ, మగ పిల్లలకు తల్లి అంటేనూ ఎక్కువ ఇష్టముంటుంది. ఎందుకంటావ్?"
అందరూ క్యూరియాసిటీతో వింటున్నారు.
"దాన్నే ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనంటారు."
"అంటే" లక్ష్మి ప్రశ్నించింది.
"అమ్మ మీద కొడుక్కి, తండ్రిమీద కూతురికి ఓ విధమైన ఆకర్షణ వుంటుంది. ఫ్రాయిడ్ మాటల్లో చెప్పాలంటే సెక్స్ ఆకర్షణ. అలా అని అది మనం అనుకునే బూతుకాదు. చాలా వైడ్ రేంజ్ లో అర్ధం చేసుకోవాలి."
"చూసారా సార్, వాడి థీరీలు. తల్లికీ బిడ్డకీ మధ్య కూడా సెక్స్ వుందంటున్నాడు వాడు. ఇలాటి వాళ్ళను ఇళ్ళలోకి కూడా రానివ్వకూడదు సార్. వాడి నాలుకను కోసేసినా పాపం అంటదు సార్" మహాలింగం ఆంజనేయులతో చిన్నగా చెప్పినా అందులో ఎంతో కసి వుంది.