"ఏమిటి?"
"ఐదయింది."
చిరుకోపం అభినయించింది.
"మీ డ్యూటీ ఐపోయిందిగా....వెళ్ళండి" అంది.
అతనికి ప్రాక్టీస్ మీద ఇంట్రెస్టు కలిగించడమెలాగో అర్ధం కావటం లేదామెకు.
"ఇవాళ మనకు ఇంకోచోట డ్యూటీ ఉంది" అన్నాడు సుధీర్.
'ఎక్కడ?" అంది శశి ఆశ్చర్యంగా.
"ఎక్సార్సిస్ట్ సినిమాకి టిక్కెట్లు బుక్ చేశాం. గుర్తు లేదా?"
నిజంగానే గుర్తు లేదు శశికి.
పేషెంటు బెదిరినట్లు చూస్తున్నాడు. వీళ్ళు ఇద్దరూ కలిసి తనని వదిలేసి, సినిమా కెళ్ళి పోతారేమోనని.
"ఇప్పుడెలా వెళ్తాం? చాలా బిజీగా ఉన్నాను. రేపెళ్దాం" అంది శశి.
"రేపు మన మెళ్ళేదేమిటి? సినిమానే వెళ్ళిపోతుంది. మంచి హారర్ పిక్చర్, శశీ! మిస్సయిపోతాం!"
"అయితే....మీరొక్కరూ వెళ్ళండి" అంది శశి. ఆమె చూపు అప్పటికే కేస్ ఛార్టు మీదికి మళ్ళిపోయింది.
తన చిరాకును చూపిస్తూ పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ లోపలికెళ్ళిపోయాడు సుధీర్. మొహం కడుక్కున్నాడు. గట్టిగా రుద్దేసరికి అసలే తెల్లగా ఉండే అతని మొహం ఎర్రగా అయిపోయింది. కప్ బోర్డులో శశి చీరలతో కబుర్లు చెబుతున్న తన కార్ డ్రాయ్ జీన్స్ తీసి వేసుకున్నాడు. బిగుతుగా ఉన్న లేత నీలంరంగు షర్టు తొడుక్కుని, పైన ముదురు నీలం రంగు పొడుగు చేతుల టర్టిల్ నెక్ స్వెటర్ వేసుకున్నాడు. యూడీకొలోన్ చేతినిండా ఒంపేసుకుని గెడ్డం కిందా, మెడ వెనకా పూసుకుని, మిగిలింది చేతులకి రాసేసుకున్నాడు. ఇస్త్రీ కర్చీఫ్ తీసి జేబులో పెట్టుకోబోతూ ఆగి, కప్ బోర్డులో తాళం వేసి వున్న ఇంకో అరతీసి దాన్లో చెయ్యిపెట్టి, ఏదో తీశాడు.
స్ప్రింగ్ నైఫ్!
యంగ్ వైఫ్ లా అందంగా, వాడిగా, వేడిగా వుంది.
బటన్ నొక్కితే బయటికి దూకే చాకు! లోపలికి గుచ్చుకు పోవడానికి తహతహలాడుతూ బయటికి దూకే పదునైన ఖరీదైన చాకు!
ఇది ఎందుకు కొన్నాడో తనకే తెలీదు! కాని ఆరిఫీ షాపులో బ్లేడ్లు కొనడానికి వెళ్ళినప్పుడు తన దృష్టిని అన్నిటికంటే అమితంగా ఆకర్షించింది ఆ చాకే!
అమితమైన ఖరీదు చెప్పాడు షాపతను-రెండొందల రూపాయలుట! హాంగ్ కాంగ్ లో తయారయిందట! కింగ్ కాంగ్ కుస్తీ నేర్చుకోకపోతే ఇలాంటి చాకే జేబులో పెట్టుకు తిరిగే వాడేమో అన్నాడు.
దాన్ని తాకితే ఒళ్ళు గగుర్పొడిచింది సుధీర్ కి. బటన్ నొక్కితే తోకతొక్కిన తాచులా పైకొచ్చింది చాకు. ముడిచేస్తే. తోక ముడిచిన తాచులా పడుకుంది. వెంటనే కొనేశాడు సుధీర్.
అదోలా నవ్వుతూ కర్చీఫ్ తో దాన్ని అపురూపంగా తుడిచి, హిప్ పాకెట్లో పెట్టుకున్నాడు. చిన్న పాము పిల్లని జేబులో పడేసుకున్నట్లనిపించింది.
"వెళ్తున్నాను" అని ముక్తసరిగా శశికి చెప్పాడు వెళ్ళేముందు.
చిరునవ్వుతో తల వూపింది శశి.
కారు స్టార్ట్ చేసి అతి స్పీడుగా, ప్రమాదకరమైనంత వేగంతో వెళ్ళిపోయాడు సుధీర్. కార్లు అతి రాష్ గా నడపడం సరదా అతనికి. శశి పక్కన ఉంటే తనని తను అదుపులో పెట్టుకుంటాడు. శశి పక్కన లేకపోతే లిమిట్ తప్పేస్తాడు.
సినిమా ఎగ్జయిటింగ్ గా ఉంది. భయానకంగా ఉంది. బాగా నచ్చింది.
సినిమా హాలులోంచి బయటికి వచ్చాక కారు స్టార్టు చేసి తిరిగి వస్తున్నాడు సుధీర్. మెయిన్ రోడ్డుమీద కొంత దూరం పోయి, తర్వాత మారేడ్ పల్లి వెళ్ళే మలుపు తిరగాగానే జనం పల్చబడ్డారు. అక్కడ రెండు స్ట్రీట్ లైట్లు ఆరిపోయి ఉన్నాయి. ఆ వందగజాల మేరా కాస్త చీకటిగా ఉంది. దూరంగా బీడీ కాలుస్తూ వెళుతున్న ఒక మనిషి తప్ప ఇంకో నర మానవుడు లేడు.
రోడ్డు వారగా పడుకుని ఉంది ఒక గజ్జి కుక్క. దానికి రోజులు-కాదు గంటలు దగ్గరపడ్డట్లున్నాయి. అనారోగ్యంగా, అసహ్యంగా కనబడుతోంది.
దాన్ని చూస్తేనే చిరాకు పుట్టింది సుధీర్ కి. 'కుక్కచావు చస్తుంది ఇది' అనుకున్నాడు.
కుక్క చావంటే ఏమిటి? దిక్కులేకుండా చావడమా? మక్కెలిరిగిపోయి చావడమా?
అతను హఠాత్తుగా కారాపాడు.
కుక్క చావు!
ఇదివరకు పిల్లిని చంపాడు తను!
ఎంత ఎగ్జయిట్ మెంటు!
ఇప్పుడీ కుక్కని, అతీ గతీ లేని కుక్కని చంపితే.....మొరుగు, తర్వాత మూలుగు, తర్వాత రక్తం!
అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
కుక్కకి తన చావు దగ్గర పడిందని తెలిసినట్లే ఉంది.
ప్రశాంతంగా మరణించటానికి ప్రయత్నిస్తూ ఒళ్ళు కట్టెలా బిగుస్తుండగా ఎగశ్వాసతో పడుకుని ఉంది. కాని, దాన్ని శాంతంగా చనిపోనీయకుండా కారుని రివర్సు చేసుకుంటూ, దానికి దగ్గరగా అతి దగ్గరగా పోనిచ్చాడు. ముందుగా వెనక చక్రాలు ఎక్కాయి దానిమీదికి. వెనకగా ముందు చక్రాలు ఎక్కాయి.