తాను ఎవరైనా పాడుతూన్నప్పుడు ఆలకించటం జైర్గితే ఎందుకింత సాదాగా పాడుతున్నారు? ఇన్ని కోట్లమందిలో శాస్త్రీయ సంగీతమైతే బాలమురళీ, నేదుకూరి, నూకల మహా అయితే ఇంకో ఇద్దరు ముగ్గురు, మామూలు సంగీతమైతే సినిమాల్లో పాడే ఆ ముగ్గురు, నలుగురు వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరా? వుంటే బయటకు ఎందుకు రారు? గుప్తంగా ఎందుకుండి పోతారు? దేశం ఇంత గొడ్డుపోయిందేమిటి అనిపించేది.
మిగతా ప్రక్రియల జోలికి వెళ్ళినా ఒక్క వీణ చిట్టిబాబు, ఒక్క మాండలిన్ శ్రీనివాస్ ఎప్పుడో ఒక్కసారి తళుక్కుమని మెరవటం తప్ప... మిగతా కళాప్రియులూ, కళాసాధకులూ... చాలా ఏవరేజ్ గా మిగిలిపోతున్నారు.
ఇన్నాళ్ళకు... ఇప్పుడు... ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత తెలిసినట్లు ఓ మధుర గళం... అమృత గానం.
మామూలుగా కనిపించే వాళ్ళలో యింత బాగా పాడగల వారుంటారని ఇంతకుముందు తెలీదు.
తన పాటవిని రాజీవ్ అలాగే రియాక్ట్ అయ్యాడు. ఏదో జంత్రధ్వని తంబూరా శృతి ఇవన్నీ మేళవించినట్లు వుందనేవాడు.
ఇప్పుడూ తనకూ అదే అనుభూతి కలుగుతోంది. ఎన్నో నదాలు కలబోసి వున్నట్లు...
బెడ్ మీదకు వచ్చి పడుకుంది. మనసంతా ప్రశాంతంగా, హాయిగా వుంది. ఎవరో సేద తీర్చినట్లు, ఓదార్చినట్లు, అలసిసొలసిన శరీరానికి విశ్రాంతి లభించినట్లు చాలారోజుల తర్వాత ఆదమరచి నిద్రపోయింది.
* * *
మరునాటి ఉదయం కిరణ్మయిని బస్ ఎక్కించటానికి గేటుదాటి బయటకు వచ్చినప్పుడు అప్రయత్నంగా ప్రక్కింటివైపు చూసింది. కిటికీ తలుపులు వేసి వున్నాయి.
లోపలకు వస్తూ మళ్ళీ తనని తానే నిందించుకుంది.
అతనెవరో పరాయి మనిషి అతన్ని చూడటానికి తాను ఉబలాటపడ్డమేమిటి?
తప్పు తనలో ఇలాంటి ఆలోచనలు రాకూడదు.
మళ్ళీ తనని తానే సమర్ధించుకుంది. అవతలి వ్యక్తిలో ఓ ప్రత్యేకత వున్నప్పుడు చోదోఅలనుకోవటం తప్పేమిటి? ఓ క్రికెట్ క్రీడాకారున్ని, టెన్నిస్ ఛాంపియన్ ని, గొప్ప నటుణ్ణి, లేక నటిని, ఓ మహా రచయితను చూడాలని అభిమానులు అనుకోరా? అందులో అపస్వరమేముంటుంది?
తన సమర్ధత ఆమెకు నచ్చింది. తన తాపత్రయం చాలా సహజమైనదిగా అనిపించింది.
బెడ్ రూంలో కిటికీదగ్గరకు వచ్చినప్పుడూ, పనిమీద బయటకు వచ్చి నప్పుడూ అప్రయత్నంగా ఆ యింటికేసి చూసేది. ఎవరూ కనిపించేవారు కాదు.
రాత్రి...
పది దాటింది. కిరణ్మయి తల్లి గుండెమీద చెయ్యివేసి నిద్రపోతోంది.
చిన్మయి కళ్ళు తెరుచుకుని బెడ్ లైట్ వెలుతురులో రూఫ్ ని చూస్తూ పడుకుని వుంది.
ఒక్కొక్క నిముషం గడుస్తోంది.
ఎందుకో అసహనంగా వుంది.
ఇంతలో ఒక్కసారి గుండె చిక్కపట్టినట్లయింది.
ప్రక్కింట్లోంచి మెల్లగా మొదలయింది పాట.
ఈసారి శాస్త్రీయ సంగీతం కాదు. లలిత సంగీతం.
కనులలోని కాంతి నీవే కలలోని రూపు నీవే.
వెన్నెల సెలయేరులలో జాలువారు వెలుగు నీవే.
తేనెలసోనలు చిలికే తొలి తెమ్మెర నీవేలే.
ఏమిటీ గొంతు? ఏ శబ్దాన్నయినా, ఏ భావాన్నయినా అద్భుతంగా పలకగలుగుతోంది? గళంలోంచి రంగు రంగుల చిరునాదాలు విరజిమ్ముతున్నాయి.
నీ తియ్యని పాటకై రాతిరి ఒంటిగా వచ్చితిని
నా మనసు తనువు నా మనసే నీదికాదా?
ఆకాశాన మబ్బులన్నీ చీకటయితే మూగెననీ
నే నెరుంగనైతిని నీ తలపే వెలుగాయే
ఆ సంగీతం ప్రవహించే క్షణాలలో....
జీవితం స్తంభించినట్లయింది.
గత జీవితమంతా మిధ్య అనిపించింది.
నిజమైన శాశ్వతమైన విలువ ఇప్పుడే దర్శనమిచ్చినట్లయింది.
ఆ గానం జోలపాటలా పసిపిల్లలను నిద్రపుచ్చినట్లు ఆమెను నిద్రపుచ్చింది.
* * *
అయిదారు రోజులు గడిచిపోయాయి. అతని పాటకోసం ఎదురుతెన్నులు చూస్తూ పడుకోవటం, ఆలకిస్తూ ఏదో ఓదార్పు పొందినట్లు అనుభూతి. తర్వాత హాయిగా నిద్ర.
ఈ వంటరితనంలో, మానసిక సంక్షోభంలో యీ ఊరట కొంత తృప్తిగానే వుంది.
ప్రతి స్త్రీకి పెళ్ళవగానే ఆ తొలిరోజుల్లో జీవితాన్ని సాధించినంత తృప్తి ఒకింత గర్వం, ఇతరులకన్నా పైకెదిగానన్న భావన, యివన్నీ కలిసి ఓ నిండు తనం కలిగిస్తాయి. అయిదారేళ్ళు పోయాక ఏదో తెలియని అశాంతి, పొందవలసింది పొందలేకపోయామన్న అసంతృప్తి, తెలీని నిజం ఇంకా ఎక్కడో వుందన్న అసమర్ధతతో కూడిన అన్వేషణ యివన్నీ మొదలవుతాయి. కొందరిలో యివి గుప్తంగా వుండిపోయి, రాజీపడి అణగద్రొక్కేస్తారు. కొందరు రాజీ పడలేక, తమకి తాము అర్ధంగాక ఓ రకం డిప్రెషన్ కు లోనయిపోతూ వుంటారు.
* * *