Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 27

 
    
    నువ్వు పువ్వుల పున్నయ్యవని బహుశా  నీ ఫ్రెండ్స్ కి తెలీదనుకుంటాను."


    "నా తఢాఖా చూపించే రోజు రాకమానదు. అప్పుడు చెబుతాను."


    "నమస్కారం స్వామీ! నాకు అంత  ఓపిక లేదు. నేను వెళ్తున్నా!"


    "ఒళ్ళు నొప్పులుగా వుంది. వేడినీళ్ళతే కాపడం పెట్టకూడదూ?" అడిగాడు.

 
    "అబ్బొబ్బో పాపం" చేసుకున్న వారికి చేసుకున్నంత. తప్పుతుందా మరి! నేను వెళ్ళి మా పనిమనిషిని పంపిస్తాను."


    "పనిమనిషి దేనికి?"


    "నీకు కాపడం పెట్టడానికి"


    అభినయ్ నవ్వాడు.


    "మళ్లీ ఎప్పుడొస్తావ్?"


    "చెప్పావుగా! పెళ్ళయ్యాక......"


    "నీకా?"


    "కాదు నీకు" అంది కైరవి.


    "నో డార్లింగ్! మనకి అనాలి" అన్నాడు అతను.


    చిలిపిగా చూసింది అతనికేసి.


    అతని జుత్తు పట్టుకుని పీకి -


    "సిల్లీ బోయ్" అని బయటికి పరుగుదీసింది కైరవి.


    బాపినీడు బండపెదాల మధ్య సిగార్ పొగలు సెగలు కక్కుతోంది.


    కాలు కాలిన పిల్లిలా పచార్లు చేస్తూ ఆగిపోయాడు.


    ఎవరో అతనికి తీరని ద్రోహం చేస్తున్నట్టుగా మొహం కందగడ్డలా తయారయ్యింది.


    చుట్టూ సోఫాల్లో కూర్చుని వున్న  తన అనుయాయులకేసి చూశాడు.


    "అయితే రాఘవరావుకి మన పదవిమీద  కన్ను పడిందన్నమాట!"


     ఎంత సౌమ్యంగా పలకడానికి ప్రయత్నించినా కూడా బాపినీడు గొంతులో కరుకుదనం ధ్వనించింది.

 
    "రాఘవరావెంత? అతని లెవెలెంత? కన్ను పడినంత మాత్రాన ఛైర్మన్ లెవెల్లో వాడికి మీ పదవి ఎక్కడ దొరుకుతుందిలెండి!" చిదంబరం అన్నాడు బాపినీడుకి భరోసా కలిగించడానికి అన్నట్లుగా.


    "అంత తేలికగా కొట్టిపారేయడానికి వీలులేదు చిదంబరం.


    మన బాబుగారు ప్రతిపక్షం ఎమ్మెల్యే కానీ రాఘవరావు అధికార పార్టీకి చెందినవాడు" రామరాజు హెచ్చరికగా అన్నాడు.


    "అంతేకాదు ఆ రాఘవరావుకి స్టూడెంట్స్ సపోర్ట్ బోలెడుంది" బాపూజీ అన్నాడు.


    బాపినీడు సిగార్ ని చేత్తో పట్టుకుని "అలాగా!" అన్నాడు.


    బాపినీడు మొహంలో రంగులు మారుతున్నాయి. అది గమనించాడు చిదంబరం.


    "మీరేం కంగారు పడకండి బాబుగారు. వాళ్ళ మొహం! పిల్లొచ్చి గుడ్డునెక్కిరించినట్టు మీ ధాటికి రాఘవరావులు, బసవరావులు, సుబ్బారావులూ తట్టుకోవద్దూ? గోదావరి వరదలో కొట్టుకుపోయే మేకపిల్లల్లా కొట్టుకుపోతారు అని ధైర్యవచనాలు పలికాడు.


    అతని మాటలకి బాపినీడు నవ్వేడు. రోజ్ వుడ్ కుర్చీ బాక్ మీద చేతులు వేసి" అన్నాడు బాపినీడు.


    "అలాని చేతులు కట్టుకు కూర్చోకూడదు చిదంబరం.


    రాజకీయమంటే కత్తిమీద సాము చేయడం లాంటిది!


    "రాజకీయ చదరంగంలో చిన్న శత్రువుని కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలి.


    ఎప్పుడు ఏ మూలనుంచి ఏ పాము  కదులుతుందో చాలా నిశితంగా పరిశీలిస్తుండాలి. ఇరవయ్యేళ్ళ నా రాజకీయానుభవంలో నా నీతి ఒక్కటే!


    చిన్న పాముని కూడా పెద్ద  కర్రతో  కొట్టి దాన్ని కాల్చి బూడిద చేయాలి.


    లేకపోతే ఆ చిన్నపామే మరో సర్పమైపోయే ప్రమాదం వుంటుంది."


    "అంటే?" బాపూజీ అడిగాడు.


    బాపినీడి వికృతంగా నవ్వేడు.


    "సమయం రానీయండి, చెప్తాను. ఈలోగా మనం కాలేజీ పిల్లల్ని మనవేపు తిప్పుకోవాలి" అన్నాడు గంభీరంగా బాపినీడు.


    "మనం అందరి వెనకా పడనవసరంలేదు. ఒక్క అభినయ్ ని మన పక్షానికి తిప్పుకుంటే చాలు!" బాపూజీ చెప్పాడు.


    'అభినయ్?


    ఎవరా అభినయ్?"


    భృకుటి ముడివేస్తూ అడిగాడు   బాపినీడు.


                                       15


     "నేనే బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదేమో?" చాపమీద లేచి కూర్చున్నాడు. అభినయ్ మెల్లగా.


    "పర్వాలేదు లేవకు" అని ఠీవిగా నవ్వి చుట్టూ చూశాడు బాపినీడు.


    ఆ గదిలో ఒకే ఒక కుర్చీ వుంది.


    తన అనుయాయులకేసి చూసి నవ్వి "ఆసనాలకంటే కింద కూర్చోవడమే నా కిష్టం."


    అని అభినయ్ ఎదురుగా చాపమీద కూర్చున్నాడు బాపినీడు.


    చిదంబరం, బాపూజీ, రామరాజు అతని చుట్టూ కూర్చున్నారు.


    "నిన్ను నేను గుర్తుపట్టని మాట వాస్తవమే అభినయ్.


    ప్రజాసేవకి అంకితమైన నేను అశేష జనవాహినిని ప్రతిక్షణం కలిపే నేను ఒకటీ అరా మనుషుల్ని మరచిపోవడమో, లేక గుర్తుపట్టకపోవడమో జరగటం చాలా కాకతాళీయంగా అనుకోవచ్చు.


    అలాని నేను తెలిసిన వ్యక్తిగానీ, తెలీని వ్యక్తినిగానీ విస్మరించను.


    ఇంతకీ మనం ఇదివరలో ఎప్పుడయినా కలుసుకున్నామా?" అడిగాడు బాపినీడు.


    అభినయ్ పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తోంది.


    అభినయ్ మిత్రులు కమల్, దాసు, పూర్ణ, సిద్దార్ద గుమ్మం దగ్గర నుంచుని వాళ్ళమాటల్ని శ్రద్దగా వింటున్నారు.

 
    "అది తర్వాత చెప్తాను. కానీ మీరెందుకు వచ్చారో చెప్పండి. నా వల్ల మీకు కావాల్సిన పని ఏదన్నా వుందా?" అడిగాడు అభినయ్.


    బాపినీడు మీసాన్ని సరిచేసుకుంటూ హుందాగా నవ్వాడు.


    "పనేముంది అభినయ్. నిన్ను అకారణంగా పోలీసులు కొట్టారని విన్నాను. ఒక ముక్కుపచ్చలారని పసివాడిని, విద్యార్దిని అక్రమంగా పోలీసులు కొట్టడాన్ని వ్యతిరేకించడమే కాదు, నిజానికి నా గుండె తరుక్కుపోయింది. పోలీస్ జులుం ఎప్పటికి వస్తుందో నాకు తెలీడం లేదు. ప్రజాప్రతినిధిగా నేను నిన్ను పరామర్శించడానికి వచ్చాను"


    అభినయ్ తమాషాగా నవ్వాడు.


    "నేను అనామకుడ్ని, మీ అంతటి  గొప్పవాళ్లు పరామర్శించదగ్గ వ్యక్తిని కాను ఐనా మీరొచ్చారంటే మీది ఎంత జాలిగుండో అర్దమవుతోంది నాకు."


    "దానికేముందయ్యా! అది నా కనీస బాధ్యత కాదంటావా?"


    "నిజమే! అయిదేళ్లకోసారి ఓట్లసమరం అవగానే మోహమే చూపించని నాయకులు ఎందరో వుంటారు. కానీ ఏదో ఒకటి పోగొట్టుకున్నవాళ్లనీ, నష్టపోయినవాళ్లనీ పనికట్టుకు వెళ్ళి పరామర్శించగలిగే  మీ సహృదయతకి  నా జోహార్లు నిజంగా మీలాంటి నాయకులంటే  ఈ దేశానికి యింకేం కావాలి?"


    అభినయ్ మాటల్లోని వెటకారాన్ని బాపీనీడు గుర్తించలేదు.

 
    "అందుకే కదా ఈ పదవీ బాధ్యతని నా నెత్తిన వేసుకుంది. బతికి నన్నాళ్ళూ ఇలాగే ఈ పదవిలో వుంటూ ప్రజాసేవకి ఎప్పటికప్పుడు పునరంకితం కావడంకంటే నేనేం చేయగలను?" అన్నాడు బాపినీడు.


    అభినయ్ ఆయన మొహంలోకి చూశాడు. అదే క్షణంలో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది అతని మస్తిష్కంలో.


    "మీరు నన్ను చూడ్డానికి వచ్చారు. చాలా సంతోషం బాపినీడుగారు! కానీ నిజానికి నేనే మీ  దగ్గరికి వద్దామనుకుంటున్నాను" అన్నాడు.


    ఆ మాటతో బాపినీడు మీసం దువ్వుతూ తన అనుయాయులకేసి చూసి నవ్వి "నువ్వెప్పుడయినా రావచ్చు. ఏదయినా అడగవచ్చు. ఇంతకీ విషయం చెప్పలేదు."


    "గిరాలదిబ్బ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం గురించి మీకు తెలుసుకదూ" అడిగాడు అతను.

 Previous Page Next Page