ఇలాంటి సంభాషణ వూహించి వుండడు. అందుకే అలా నేనన్నట్లు కంగారుగా తల అటూ ఇటూ ఊపి వీధంటా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
నేను ఇంటిలోకి వచ్చేశాను.
నెక్ట్సుడే హోలీ సందర్భంగా నా భర్త ఇంట్లో వుండిపోయాడు. నేను రెండు జడలు వేసుకున్నాను.
హోలీ పండుగను ఎప్పుడూ పట్టించుకోని నేను ఆరోజు ఎలాగైనా ఆనంద్ మీద రంగులు చల్లాలనుకున్నాను. రంగు పౌడర్లు ఎక్కడి నుంచి తేను? అలా ఆలోచిస్తుంటే కుంకుమ చల్లాలన్న ఐడియా తట్టింది. కానీ నా భర్త వుంటే అది సాధ్యం కాదు. కనుక ఏం చేయాలో తోచక దిగులు ప్రారంభమైంది.
నా అదృష్ట బావుంది. ఆయన సాయంకాలం నాలుగ్గంటలప్పుడు తిరుపతికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపిల్లలా ఇంట్లో గెంతాను. తొందర తొందరగా స్నానం ముగించి రెండు జడలూ విప్పి ఒక్క జడ వేసుకుని వరండాలోకి వచ్చి వీపును వీధిలోకి మళ్ళించి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాను.
నేను కోరుకున్నట్లు ఆనంద్ నా జడ విన్యాసాలు కనిపెట్టి అరుగుమీద కూర్చున్నాడు.
చీకటి పడగానే ప్రహరీ గోడ దగ్గర నిలబడి రామ్మన్నట్లు చేతులూపాను.
ఈసారి ధైర్యంగానే వచ్చాడు.
దగ్గరికి రాగానే ఎడమచేతి గుప్పెట్లో వున్న కుంకుమను కుడిచేతిలోకి మార్చుకుని గబుక్కున తలమీద చల్లాను.
ఏం జరిగిందో అతను తెలుసుకునే లోపునే కుంకుమ తలమీద నుంచి రాలిచుక్కలు చుక్కలుగా పడి అతుక్కుపోయింది.
"ఈరోజు హోలీ...... అందుకే ఈ రంగుల అభిషేకం."
అతను ఆ అభిమానానికి కదిలిపోతున్నట్లు నవ్వాడు.
అంతలో ఎవరో వీధిలో పరిగెత్తుకొస్తున్నట్లనిపించి భయం భయంగా వీధి మొదలులోకి చూశాను.
నా భర్త పరిగెత్తుకొస్తున్నాడు.
ఒక్కసారిగా నా రక్తమంతా నల్లరంగులోకి మారిపోయినట్లు నా ముఖంలోకి రంగులు మారాయనుకుంటాను. ఆనంద్ కూడా కంగారుగా అటూ ఇటూ చూశాడు.
వెళ్ళిపొమ్మని చెబుదామనుకుంటూ వుండగానే ఆలస్యమైపోయింది. నా భర్త కర్రతో అతడి తలమీద కొట్టడం, తల చిట్లి రక్తం పొంగడం ఆ మసక చీకటిలో నాకు కనిపించింది.
కెవ్వున కేక పెట్టాను.
అప్పటికే ఏదో జరుగుతూ వుందని జనం పరిగెత్తుకొచ్చారు. ఆనంద్ అమ్మా అంటూ కూలబడిపోయాడు.
జనం చుట్టూ ముగారు.
నా భర్త ఆవేశం, కోపం అప్పటికీ తగ్గలేదు. చెప్పుల కాళ్ళతో అతన్ని ఎక్కడపడితే అక్కడ తన్నాడు.
"వీడు లోఫర్ గాడు. నా పెళ్ళాన్నే చెరబట్టాలని చూస్తాడా? ఇలాంటిదేదో జరుగుతుందని పెళ్ళిపీటలమీద నుంచే నాకు అనుమానం. నా అంచన తప్పడానికి వీల్లేదు. అందుకే వీడి భాగోతం కనిపెడదామని తిరుపతికని చెప్పి అలా వీధి మొదట్లో చెరుకుతోటలో నక్కి చూస్తున్నాను. ఇంతలో వీడు నా పెళ్లాం దగ్గరికి రావడం చూసి పరిగెత్తుకొచ్చాను" అలా అంటూనే ఇంకా కసితీరక తంతున్నాడు అతన్ని.
నా పేగుల్ని రాక్షస ఎలుకలు కొరికేస్తున్నట్లు గిలగిల్లాడిపోయాను.
"ఆనంద్ ఇలాంటివాడిని అనుకోలేదే" ఇలాంటి అర్థం వచ్చేటట్లు అంటూ జనం తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు.
అంతలో ఎవరో ఆనంద్ ని లేవనెత్తారు. బాధ, నిస్సహాయత, అవమానం కోపం- రకరకాల భావనలు క్రుంగదీస్తుంటే అతను తల వంచుకుని ఇంట్లోకి దారి తీశాడు.
జనం వెళ్లగానే నా భర్త నన్ను లోపలికి ఈడ్చుకొచ్చి "గోడవరకే వచ్చిందా వ్యవహారం? గోడదూకేవరకు వచ్చిందా?" అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అడిగాడు.
నేను ఏమీ జవాబు చెప్పలేదు. మౌనంగా నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. అప్పుడే లేచివెళ్ళి ఆనందన్ ఓదార్చాలన్న బలమైన కోరికను అదుపులో పెట్టుకోవడానికి ఎంతగా ఏడ్చానో చెప్పలేను.
కొన్నిరోజులు గడిచాయి.
ఆనంద్ ను ఓదార్చాలన్న కోరిక నన్ను ప్రాపంచిక విషయాలకు అంధురాల్ని చేసింది అంత అవమానాన్నీ, బాధనూ భరించిన ఆనంద్ ను ఎలా ఓదార్చాలో తెలియక గింజుకుపోయాను.
మూడునెలలు గడిచిపోయాయి.
సరయిన సమయం కోసం చూస్తున్న నాకు నా భర్త ఆఫీసు పనిమీద గుంతకల్లు వెళ్ళడం కలిసొచ్చింది.
ఉదయం పదిగంటలకు ఆయన వెళ్ళగానే ఆనంద్ కోసం నా కల్లు గాలించాయి. అదృష్టం కొద్దీ ఆ రోజు సెలవు కావడంతో అతను ఇంటిదగ్గరే వున్నాడని తెలిసింది.
ఇక ఆగలేకపోయాను.
మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతాన బట్టలు ఉతికే మిషతో ఏటికి బయలుదేరాను.
తుఫానువల్ల సన్నటి చినుకులు ప్రారంభమయ్యాయి.
మేం కలుసుకోవడం ప్రపంచం చూడకూడదని దేవుడే మబ్బుల దుప్పటిని కప్పినట్లుంది. పగలే చీకటిగా తయారైంది.
తనతో మాట్లాడాలని వుందనీ, ఈ ఒక్కసారికీ ఏటిగట్టున కలుసుకోమనీ బ్రతిమలాడుతూ ఓ చిన్న ఉత్తరం రాసి ఆనంద్ కు పంపాను.
ఏవేవో ఆలోచనలు ఒకదానికొకటి సంఘర్షిస్తూ వుంటే ఏటి దగ్గరికి చేరుకున్నాను.
చినుకులు ఎక్కువయ్యాయి.
ఏటిగట్టున ఒకే చింతచెట్టుంది. దానికింద నిలబడి ఊరివైపు చూస్తున్నాను.
వర్షం ఆకులమీద పడి, చిట్టి జల్లుగా నా మీదకు తెరలు తెరలుగా పడుతోంది. ఆకాశంలో నల్లటి మబ్బులు పొగలా కమ్ముకుంటున్నాయి. గాలి వర్షాన్ని చేయి పట్టుకుని తీసుకెళుతున్నట్లు ఈడ్చి ఈడ్చి కొడుతోంది.
ఆనంద్ వస్తాడో రాడోనన్న సందిగ్ధం నన్ను వణికిస్తోంది. దిగులు దిగులుగా చూస్తున్న నాకు నా కోసమే వస్తున్న ఆనంద్ కనబడ్డాడు. అప్పుడు నేనేమైపోయానో ఇప్పుడు చెప్పమన్నా చెప్పలేను, భావోద్వేగానికి నేను బానిసై పోయాను.
నాకు పది అడుగుల దూరంలో నిలిచిపోయాడు.
వర్షంలో తడుస్తున్న అతను కొత్తగా, కొంగ్రొత్తగా పునీతమైన పురుషుడిలా అనిపించాడు.
అంతకుముందు సిగా చేసినట్లే తలపై చేయి ఆన్చి రమ్మన్నట్లు వేళ్ళను కదిపాను.