Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 27


 

      ఆనంద్ ది మా ఎదిరిల్లే పెళ్ళయ్యింది. భార్య ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తోంది. అతనికి యూనివర్శిటీ లైబ్రరీలో ఉద్యోగం. ఊరిలో తల్లితోపాటు వుండేవాడు. చూడడానికి చక్కగా వుండేవాడు. ముప్ఫై ఏళ్ళ వయసు.

 

    పెళ్ళయిన మొదట్లో సాయంకాలాలు అలా వీధి వరండాలో కూర్చునేదాన్ని. ఓ రోజు సాయంకాలం అలా కూర్చున్నప్పుడు ఆనంద్ ఆఫీసు నుంచి వచ్చాడు. అదే మొదలు అతన్ని చూడడం.

 

    వెనకే నా భర్త కూడా ఆఫీసు నుంచి వచ్చాడు. నేను ఆనంద్ ని చూశానని గ్రహించి ఇంట్లోకి కూడా వెళ్ళకుండా నా ఎదురుగ్గా కూర్చున్నాడు.

 

    "అతనిది మన ఎదురిల్లే. పేరు ఆనంద్. యూనివర్శిటీలో అతను లైబ్రరీలో గుమస్తా. అటెండర్ గుమస్తా కేటగిరికంటే తక్కువ కదా. అందువల్ల అలా నా భర్త చెప్పాడని నాకు తెలుసు.

 

    "..... ఒట్టి తిరుగుబోతు. ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ. ఎంతోమందిని ప్రేమించినట్లు ప్రేమించి మోసం చేశాడు. లవర్స్ చాలా మందే వున్నారు. వాళ్ళతో రొమాన్స్ జరపడం పెళ్ళాంకూ తెలుసు. కానీ ఏం చేస్తుంది? ఏకాక్దో ఉద్యోగం చేస్తూ మొగుడి అరాచికాలను భరిస్తోంది. అతనికి ఈ ఊరులోనే చాలామంది స్త్రీలతో స్నేహం వుంది."

 

    "నిజమా? మనిషి బావున్నాడు. ముఖం చూస్తే చాలా మంచివాడులా అనిపిస్తాడు. ఆడపిల్లలు పడతారంటే నాకేం ఆశ్చర్యం కలగడం లేదు" అన్నాను.

 

    నా భర్త ఉలిక్కిపడ్డాడు. ఇంతకాలం ఫలించిన తన పథకం బెడిసికొట్టినట్లు షాక్ తిన్నాడు. చాలామంది స్త్రీలతో స్నేహం వుందనడం చెడ్డగుణంగా అనుకుంటానని ఆయన భావించాడు. అయితే నేను అది సుగుణంగా చెప్పడం భరించలేకపోయాడు. కానీ తెలివైనవాడని ముందుగా చెప్పానుగదా...... ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేకుండా, దీన్నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు.

 

    ఏదో కొత్త ఐడియా తట్టినట్టు ముఖం వికసించింది. "మరీ మితిమీరి స్నేహాలు చేయడంవల్ల ఏవేవో జబ్బులు కూడా వచ్చాయి" అన్నాడు. ఈ అస్త్రంతోనైనా నన్ను పడెయ్యాలనుకున్నాడు.

 

    "కాని మనిషి అలా కనపడటం లేదే" అన్నాను. ఈసారి మరింత కుదేలు పడిపోయాడు నాభర్త. ఇక ఈ పూటకి వీలుకాదని అనుకున్నాడేమో ఇంట్లోకి వెళ్ళిపోయాడు" అంటూ గోపాలకృష్ణకు చెప్పడం కొనసాగించింది విలాసిని.

 

     "కానీ అనుమానపు మొగుడు అంతటితో వదలడుగదా. కొన్నిరోజుల తరువాత ఓరోజు డాబామీద వెన్నెల్లో కూర్చుని మాట్లాడుతుండగా 'అటువైపు చూడడం లేదు కదా' అని అడిగాడు.

 

    "లేదు"

 

    "వాడు చూస్తున్నాడా?"


    
    ఆయన  అజ్ఞానానికి నవ్వాలో ఏడ్వాలో తెలిసింది కాదు.

 

    "నేను చూస్తే కదా అతను చూస్తున్నది లేనిదీ తెలుస్తుంది."

 

    "దొంగచాటుగా అబ్జర్వ్ చెయ్ " అన్నాడు.

 

    అలా ఆనంద్ వైపు నేను దొంగచాటుగా చూడడం అలవాటైంది.

 

    ఈ అలవాటులోంచి నాకు తెలియకుండానే అతనంటే ఓ విధమైన క్యూరియాసిటీ బయల్దేరింది. అతనెప్పుడు బయటకొస్తాడా, ఎప్పుడు ఆఫీసు కెళతాడా? ఎప్పుడు ఇంటికి వస్తాడా? అని చూస్తుండేదాన్ని. ఇలా నా భర్త నాలో ఓ విషబీజాన్ని నాటాడు.

 

    నిజానికి ఆనంద్  ఎప్పుడూ మా ఇంటివైపు చూసేవాడు కాడు. తన పనేమిటో తను చూసుకునేవాడు. ఇలాంటివాడ్ని స్త్రీలోలుడని మా ఆయన చిత్రించడం వింతగా అనిపించింది. మావారి అనుమానపు లీలలు  అప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోయాను.

 

    ఆనంద్ మీద నిఘా వేయమని నా భర్త  పురమాయించాక ఓరోజు నేను  వరండాలో కూర్చుని తనవైపు తదేకంగా చూడడం అతని కంటపడింది. అలా  నేను చూడటం కొత్తగా అనిపించి కాబోలు అతను శిలాప్రతిమలా అయిపోయాడు. ఒకింత ఆశ్చర్యం అతని కళ్ళల్లో ఉబికింది.

 

    నేను ఠక్కున తల వంచుకున్నాను.

 

    ఇక అప్పట్నుంచీ అతను అప్పుడప్పుడూ నేను చూడడాన్ని గమనించేవాడు. నా భర్త చెప్పిందానికి కరెక్టుగా రివర్స్ అన్న మాట. ఈ విధంగా మా చూపులు కలవడాన్ని ఓసారి నా భర్త కనిపెట్టాడు. హడావుడిగా నన్ను డాబా మీదకు తీసుకెళ్ళి 'నేను చెప్పింది కరెక్టేకదా. వాడు మనింటివైపు తప్ప మరో దిక్కుకేసి చూడడం లేదు కదా' అని అడిగాడు.

 

    నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు.

 

    నాకు తెలుసు. నువ్వు జవాబు చెప్పలేవని. గౌరవప్రదమైన ఏ ఆడపిల్ల కూడా ఇలాంటివి నోరు విప్పి చెప్పుకోదు. ఇక వాడు చూపులతో ఆగడు. సైగలు ప్రారంభిస్తాడు చూడు. నా మాట తప్పుకాదని కావాలంటే  బెట్ కడతాను."

 

    ఆ మాటలు వింటుంటే నా ఒళ్ళు జల్లుమంది. అలా నెక్ట్సు స్టెప్ ఏమిటో  కూడా నా భర్త  చెప్పేశాడు. ఇక ఆ క్షణం నుంచీ ఆనంద్ సైగల కోసం నాకు తెలియకుండానే నేను ఎదురుచూడసాగాను.

 

    ఈ ఘట్టం జరిగాక మరీ  అనుమానం ఎక్కువైంది నా భర్తకు. పగలు పనికి వెళ్ళివచ్చినా  ఏదో మిషతోఅటకపైన. మంచంకింద, తలుపుల చాటున ఎవరైనా వున్నారేమోనని చూసేవాడు. నా ముఖంలో ఏమైనా గాట్లు కనబడతాయే మోనని వెదికేవాడు.

 

    అప్పటికి ఆయనేమిటో పూర్తిగా  అర్థమైంది. కానీ ఏమీ తెలియనట్లు నేనూ నటించసాగాను. ఆయనంటే రోజు రోజుకీ ఎలర్జీ పెరగసాగింది.

 

    ఆ తరువాత కూడా ఆనంద్ ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. అయితే నేను సహజంగానే ఆవైపు ఎక్కువగా చూస్తుండడంవల్ల తనూ చూడడం మొదలుపెట్టాడు.

 

    ఓరోజు నా భర్త అటు వెళ్ళగానే ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. నేను వీధి గుమ్మం దగ్గర మామిడాకు తోరణంలా నిలబడ్డాను.

 

    సాయంకాలమైంది.

 

    సంజె చీకట్లు ముసురుకుంటున్నాయి. తన ఇంటి పందిరిలోకి వచ్చిన ఆనంద్ ని చూసి సైగ చేయాలన్న చిలిపి కోరిక  నాలో  ప్రవేశించింది. తలను సవరించుకుంటున్నట్లు చేయి తలపై ఆనించి పిలుస్తున్నట్లు వేళ్ళు ఆడించాను.

 

    అతను ఒక్కసారి దిమ్మ తిరిగినట్లు చూసి ఏదో పని వున్నవాడిలా లోపలికెళ్లాడు. ఎక్కువసేపు లోపల ఉండలేడని తెలుసు. అందుకే ప్రహరీ గోడపై వుండే పాల బల్బులా అక్కడే  నిలబడిపోయాను.

 

    మరో అయిదు నిముషాలకే అతను బయటికి వచ్చాడు. ఈసారి మరింత స్పష్టంగా వేళ్ళు కదిపాను.

 

    అతను తటపటాయిస్తూనే వీధిలోకి వచ్చి అటూ ఇటూ చూసి నా దగ్గరికి వచ్చాడు.

 

    పిలిచాను  గానీ  ఏం మాట్లాడాలో తోచలేదు. ఏదో ఒకటి మాట్లాడమని మనసు తొందరపెడుతోంది.

 

    "గత రెండురోజులూ ఏమైపోయారు? కనబడనేలేదు. మా ఆయన వున్నారని బయటికే రానట్లున్నారే. నాకో ఐడియా వచ్చింది. మా ఆయన ఇంట్లో వుంటే ఇకనుంచీ రెండు జడలు వేసుకుంటాను. ఆఫీసుకెళితే నేను ఒంటరిగా వున్నాననడానికి గుర్తుగా ఒక జడే వేసుకుంటాను. అదన్న మాట కొండగుర్తు. ఒంటరి జడ వేసుకున్నప్పుడు కనిపిస్తూ వుండండి మహానుభావా' అన్నాను మెల్లగా.

 Previous Page Next Page