Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 27

 

    "వచ్చింది ఆపమని చెప్పటానికి మాత్రమే కాదు"
    
    "మరి?"
    
    "ఆపకపోతే వచ్చే అనర్ధం గురించి తెలియచెప్పటానిక్కూడా"
    
    "వచ్చింది అందుకే అయితే నువ్విక వెళ్ళొచ్చు"
    
    ఏకాంత మొహం వివర్ణమైంది "చదువుకున్నదానివి"
    
    "తెలివయినదాన్ని కూడా"
    
    "తెలివే వుంటే ఒంటరి ఆడదానివని గుర్తుంచుకునేదానివి"
    
    ఆమెని చూస్తూ అంది ఆశ్రిత "నువ్వూ చదువుకున్నదానిలానే వున్నావు."
    
    "అనుమానమా?"
    
    "కాదు... ఇలాంటి హితబోధ చేస్తున్నందుకు అవమానంగా వుంది"
    
    "ఆశ్రితా! నువ్వు ఎదురు నిలబడింది మామూలు వ్యక్తులకి కాదు"
    
    "అలా అని నేను కొన్ని క్షణాల క్రితందాకా అనుకున్నాను"
    
    "ఇప్పుడేమైంది?"
    
    "నిన్ను పంపినవాళ్ళు నేను ఊహించినంత శక్తికలవారు కారని బోధపడిపోయింది"
    
    "నువ్వు కేవలం పుస్తకాలనే చదువుకున్నావ్ ఆశ్రితా!"
    
    "నువ్వో?"
    
    "ప్రపంచాన్నే చదివాను"
    
    ఫకాలున నవ్వింది ఆశ్రిత "నిజమా....ఆలాంటప్పుడు ఆ ప్రపంచంలో దుర్మార్గానికి ఎదురు నిలబడ్డ శక్తిగల వ్యక్తుల్నీ నువ్వు చూసి వుండాలే"
    
    "నాకెదురు కాలేదు"
    
    "అది నీ అనుభవం కావొచ్చు"
    
    ఉలికిపడటమే కాదు ఆశ్రిత తన బ్రతుకునే ఎద్దేవా చేసినట్టనిపించిందామెకి.
    
    కనురెప్పల మీద ఏ విషాద ఛాయలో అలుముకుని గుండెల్ని మండిస్తుంటే కర్కశంగా అంది ఏకాంత "నా మాట విను"
    
    "ఎవరు నువ్వు?" ఉక్రోషంగా అరిచింది ఆశ్రిత. "నీ మాట వినటానికి నువ్వు నాకేమౌతావని?"
    
    తనకు తానే సమిధలా....అవసరమైతే ఆలోచనల ఆజ్యంలో తనకు తానుగా మండి ఆ మంటల అగ్నికీలలతో అణువంతయినా ప్రత్యర్ధుల్ని గాయపరిచి తీరాలని మొండిగా నిర్ణయించుకున్న ఆశ్రిత ఇప్పుడు పగిలిన స్వప్నాల అస్తికల్ని తను సృష్టించబోయే ఉప్పెనలో కలిపితే తప్ప విశ్రమించనన్నట్టుగా చూసింది. "వెళ్ళు ఏకాంతా! నిన్ను పంపిన ఆ పెద్దమనుషులకి చెప్పు.....పోరాటాన్ని ఊపిరిగా మార్చుకున్న నేను ప్రాణాలకి భయపడడం లేదని నా మాటగా చెప్పు."
    
    ఎందుకో ఏకాంత క్షణంపాటు తాను వచ్చిన పని మరిచిపోయింది. "నేను చెబుతున్నది ఒక గాయపడిన ఆడదానిగా."
    
    "కాని నేను గాయాన్ని జీవితంగా మార్చుకుని బ్రతకని ఆడదాన్ని"
    
    ఏకాంతకు చెళ్ మనిపించిందా వాక్యం.
    
    "కాబట్టి నిన్ను నాలో చూసుకోకు" వ్యంగ్యంగా అంది ఆశ్రిత.
    
    "నన్ను నీలో చూసుకోవటంలేదు. నిన్ను నాలా కావద్దంటున్నాను."
    
    "అలా అయ్యేదాన్నే అయితే నీలా రాజీపడి బ్రతికేదాన్ని"
    
    అంతా తెలిసినట్టు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుందేం "నా గురించి నీకేం తెలుసు?" ఉద్విగ్నంగా అడిగిందామె.
    
    "నిజానికి ఏమీ తెలీదు ఏకాంతా! కానీ నీ ఆలోచనలు నువ్వేమిటో నాకు తెలియచెప్పాయి. నువ్వెలాంటి దుస్థితిలో బ్రతుకుతూ ఇలా ఒక వ్యవస్థకి ప్రతినిధివై వచ్చావో అర్ధమౌతోంది."
    
    "ఆశ్రితా!"
    
    "అరవకు....వెళ్ళిపో!"
    
    నిభాయించుకున్న ఏకాంత చివరిగా అంది "ఒంటరి పడవ మీద ప్రత్యర్ధుల ఒడ్డుకు వచ్చిన నువ్వు ఒంటరిగానే పోరాడగలననుకుంటున్నావా?"
    
    "పోరాడితీరాలనే వచ్చిన పడవని సైతం తగలబెట్టాను ఏకాంతా! నా చావు ఆలోచించకు నీవాళ్ళకి తగలబోయే చావుదెబ్బ గురించి ఆలోచించు. ప్లీజ్... గెటవుట్!"
    
    బుజ్జగించో లేక బెదిరించో ఆశ్రితని వారించాలనుకున్న ఏకాంత ఇక అక్కడ నిలబడలేదు.
    
    ఓడిన ఉక్రోషంతోనో లేక ఓడించి తీరాలన్న ఆలోచనలతోనో ఆవేశంగా వెళ్ళిపోయింది.
    
    ద్వారందాకా నడిచివచ్చిన ఆశ్రిత వెళుతున్న కారు వేపు క్షణం చూసింది వెంటనే ఏదో జ్ఞప్తికి వచ్చినట్లు సమీపంలో ఓ ఆటోని పిలవబోయింది.
    
    "అవసరంలేదు ఆశ్రితా"
    
    ఉలికిపాటుగా చూసింది.
    
    సమీపంలో ఓ వృద్దుడు నిలబడి వున్నాడు.
    
    మాసిన బట్టలు, పెరిగిన గెడ్డం, తాగినట్లు బడలికగా వాలిపోతున్న కళ్ళతో నిలబడ్డ ఆ వ్యక్తిని విస్మయంగా చూస్తుంటే-
    
    "ఇప్పుడు వచ్చిందెవరో, ఎక్కడ వుంటుందో తెలుసుకోవటానికి నువ్వు వెంటపడి వెళ్ళాల్సిన అవసరం లేదు" అన్నాడు నిషాగా.
    
    ఎవరీ వృద్దుడు?
    
    ఎప్పుడూ తనకు పరిచితుడిలా అనిపించకపోయినా తనను పేరు పెట్టి ఎలా పిలిచాడు?
    
    అది కాదు...
    
    తను ఏకాంత వుండేదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఎలా గ్రహించగలిగాడు?
    
    భ్రాంతికీ, దిగ్భ్రాంతికీ మధ్య నిలబడిన ఆమెతో అన్నాడు నెమ్మదిగా-
    
    "నేనో తాగుబోతునమ్మా! నేనెవరా అని ఆలోచించకు పరిచయాల కోసం ఇలా పొంచి చూస్తుంటాను, రెండుమాటలు చెబుతుంటాను. నిషాలోకి జారటానికి నాలుగు డబ్బులు తీసుకెళుతుంటాను"
    
    అతడిలో తనకేదో ఆత్మీయత వినిపిస్తోంది ఎందుకోగాని..... తదేకంగా చూస్తుంటే తాగుబోతు అయినాగాని, అతడిలో అస్పష్టమయిన రుష్యత్వము కనిపిస్తోంది. శరీరం చిక్కి శల్యమైనాగాని అతడి చూపుల్లో ఇంకా చావని జీవకళ నిన్నటి ఏ విషాదపు అశ్రు పుష్పాలతోనో ఇప్పటి వర్తమానానికి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టుగా వుంది.
    
    "భయపడకు పిచ్చి తల్లీ..." అతడి కనురెప్పలు బడలికగా వాలిపోతున్నాయి. "చిన్న కర్రవైనాగాని పెద్ద పాముల్నే బెదిరించావు. అడుగడుగునా జాగ్రత్త పాటించు"
    
    "ఎవరు మీరు?" తన గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతుంటే ఉత్సుకతని ఆపుకోలేకపోయింది.
    
    "నేను మీకు ఎలా తెలుసు?"
    
    పిచ్చివాడిలా నవ్వాడు.
    
    తూలిపడబోయి గోడకి జారగిలపడ్డాడు.
    
    "కాలం గురించి చాలా, జ్ఞాపకం గురించి కొంత తెలిసిన వృద్దుడ్నే తప్ప, నేను కాలజ్ఞానం తెలిసిన ఋషిని కాదమ్మా! నేనెవరినైతే నీకేం... నీ గురించి తెలిసిన నేను నిన్ను చూడాలని వచ్చాను. ఓ పాతిక నువ్విస్తే మందుకొట్టి హాయిగా పడుకుంటాను మరేం..."

 Previous Page Next Page