Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 27

    అందర్లోకి వేదవతితో నేను క్లోజ్ గా వుంటాను. బహు సరదామనిషి, వేదవతికి కూడా పిల్లల్లేరు. అప్పటికి పెళ్ళయి అయిదేళ్ళయింది. " తెలియక తెలియక ఈయన్ని కట్టుకున్నాను. ఎప్పుడూ పొలంపనే- సాయంకాలం ఇంటికి రావడమే నిద్రను తలపాగాలాగా నెత్తిన చుట్టుకొస్తాడు. కంచం పని అయిపోగానే కళ్ళు నిద్రలో కూరుకుపోతాయి. ఇక అలాంటప్పుడు మంచం ఏం గుర్తుకొస్తుంది. ఏ ఉద్యోగస్తుడ్నో చేసుకుని టౌన్ లో కాపురం అయితే ఎంత బావుండు! నా తలరాతే పల్లెటూరున రాసి పెట్టుంది- ఏం చేద్దాం! " అనేది ఎవరైనా పిల్లలెందుకు పుట్టలేదని అంటే.

    అమె కాపురం చేసేది పల్లెటూర్లోనే అయినా కళ్ళు మాత్రం పట్నంలో వుండేవి పిల్లలు కలగలేదన్న కోపాన్ని ,విసుగునీ భర్తమీద చూపించేది. ఎంతమందున్నాసరే తన భర్తని ఏం అనడానికైనా జంకేది కాదు.

     "బ్రా చూడు- కొంత బయటికి కనిపిస్తోంది. లోపలికి తోసుకో " అన్నాడు శేఖర్ మేమంతా ఊరు దాటక. అతను చిన్నగానే చెప్పినా పక్కనే వస్తున్నాను గనుక నాకుమాత్రం వినపడింది.

     వేదవతి బ్రా పట్టీని లోపలికి తోసుకుంటూ-  " అక్కడంతా నా కళ్లు పడాల్సింది " రాత్రిపూట ఏకాంతంలో- అంతే తప్ప ఇలా వీధుల్లోకాదు.

    పెళ్ళయి ఐదేళ్ళయింది. బ్రాకు ఎలాస్టిక్ ఏ పక్క నుంటుందో తెలియదు. నువ్వు కూడా నన్ను అక్షేపించడమే " అంది భర్తవైపు చురచురా చూస్తూ.

    భార్యకి కోపం వచ్చిందని గ్రహించాడు. అందుకే ఏదో చెప్పి సర్ధబోయాడు అమె వినలేదు.

    అందరం బస్టాండ్ చేరుకున్నాం.

    కుసుమ అచ్చు వేదవతిలాగే తయారైంది. అమెది అనుకరించే మనస్తత్వం ఎక్కువనుకుంటా. మేం ఏదైనా కొత్త స్ఠయిల్లో బొట్టు పెట్టుకుంటే నెక్ట్స్ డే తను కూడా ఇదే బొట్టుతో తయార్, హేర్ స్టెయిల్, చీర, కట్టుకోవడం అంతా అనుకరించేది.

    బస్టాండ్ కి వెళ్ళడం తరువాయి బస్సు దొరికింది- అందరం నెల్లూరులో దిగాం.

    వీదుల వెంట నడుస్తూ వేదవతి పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. పేదపిల్ల మహారాణి వేషం వేసినట్టు వీధుల్లో గొప్ప హుందాగా నడిచింది.

    మొదట బట్టలకొట్టుకెళ్ళాం

    ఆ కొట్టు మల్లెపూల శెట్టిది- ఆయనకి ఊర్లో పొలాలున్నాయి. వాటిని గుత్తకిస్తూ వుంటాడు. గుత్తవసూలు కోసం అప్పుడప్పుడు ఊరికి వస్తుంటాడు. ఊర్లో ఎవరి పెళ్ళి జరిగినా బుట్టలు మల్లెపూల శెట్టి దగ్గరే  కొంటూ వుంటారు. అరువుకూడా పెట్టేవాడు.

    పెళ్ళికూతురికి పెట్టాల్సిన చీరలు కొన్నాక పెళ్ళికొడుకు బట్టల సెలక్షన్ జరుగుతోంది.

    పెళ్ళికాబట్టి వేదవతి కూడా తనకో చీర కొనుక్కుంది. శేఖర్ ని ప్యాంటు కొనుక్కోమంది.

     "నాకెందుకే- నాదంతా పంచేకదా " అన్నాడతను.

     "మొగుడు పట్నంవాడు కాకపోతే పోని కనీసం ఫ్యాంటయినా  వేసుకుంటాడని సంతృప్తి పడతాను. ముందు కోనుక్కో. అరువు బేరమే కదా. పంట డబ్బులొచ్చినప్పుడు తీర్చేద్దాంలే " అంది.

    శేఖర్ ఒప్పుకున్నాడు.

    నేనూ, వేదవతి ఫ్యాంటు బిట్లు వున్నవైపు వెళ్ళాం. సేల్స్ మాన్ రకరకాల ఫ్యాంట్ బిట్లను తీసి చూపిస్తున్నాడు. ఓ ఫ్యాంటు బిట్ అందరికి నచ్చింది.

     "ఎంత?  " ఇంకా దాని నాణ్యతను నిశితంగా పరిశీలిస్తూ అడిగింది వేదవతి.

     "నైన్ టీ  రూపీస్ "

     "అంత ధర చెబితే ఎట్లాగయ్యా! హండ్రడ్ కి ఇస్తేనే తీసుకంటా " అన్నాడు శేఖర్.

    అప్పుడు సేల్స్ మాన్ వేదవతిని చూసిన చూపు, తల కొట్టేసినంత లజ్జతో భర్తవైపు అమె చూపిన చూపూ ఇప్పటికి గుర్తే.

     "నీ చేతకాని తనమంతా పడకటింట్లోనే అనుకున్నాను. కాదని తేలిపోయింది " అని ఒక్క గదుము గదిమింది.

    అప్పటికి తన తప్పేమిటో తెలియక శేఖర్ బిక్క మొహం వేశాడు.

     "నీకు ఆ హండ్రడ్ అనే ముక్క తప్ప ఏం తెలియదని మాకు తెలుసు. నీ ముఖం చూస్తూనే ఎవరైనా ఆ మాట చెప్పేస్తారు. వాడు నైన్ టీ రూపీస్ అన్నాడు. అంటే తొంభై. మరి హండ్రడ్ కి ఇస్తే తీసుకంటానంటావా?

    ఛీ ఛీ.... ఆ సేల్స్ మాన్ చూసిన చూపుకి అర్థం ఏమిటో తెలుసా?  "ఇట్లాంటి వెదవను కట్టుకున్నావ్ ఏమిటమ్మా " అని వాడు చూసిన చూపు గునపంలా గుచ్చుకుంది " అని కొట్టు బయటికొచ్చాక మరింత దులిపేసింది వేదవతి.

 Previous Page Next Page