తలుపు తోశాడుగానీ రాలేదు. మెల్లగా శబ్దం అయ్యేటట్లు చేతులతో తలుపు మీద తట్టాడు.
ఆ సమయంలో అన్నం వండుతున్న ఇందుమతి ఆ శబ్దాలు వినే వచ్చింది ఎవరో పసిగట్టింది.
గుండె ఒక్కసారిగా కడుపులోకి జారిపోయినట్లనిపించింది. అంతవరకు బుద్ధిగా ప్రవహిస్తున్న రక్తం పరుగులు ప్రారంభించింది. కళ్ళు పావురాయిరెక్కల్లా కొట్టుకున్నాయి. భయంలాంటిదేదో శరీరంలో కలిసిపోయింది. వస్తానని చెప్పి వెళ్ళలేకపోయానన్న బాధ కళ్ళను బరువెక్కిస్తోంది.
పైటచెంగును గట్టిగా దోపుకుని తలుపుతీసింది భరణి అదోవిధంగా వున్నాడు. అది అలకో, కోపమో, బాధో తెలియడంలేదు.
అమ్మమ్మ కోసం చూసింది. దగ్గు వినపడింది తప్ప మనిషి కనపడలేదు.
"లోపలికి రావచ్చా!" ముఖంలో ఏ ఎక్స్ ప్రెషన్ లేకుండా అడిగాడు భరణి.
ఒక్కక్షణం తటపటాయిస్తూ అటూ ఇటూ చూసి దారికి అడ్డం తొలగింది.
అతను లోపలికొచ్చాడు.
చిత్ర మాటలన్నీ గుర్తుకొచ్చాయి. అయినా చిత్ర చెప్పినంత ఈజీగా ఓ ఆడపిల్లను లొంగదీసుకోవడం కుదరదని తెలుసు. అందులోనూ ఇందుమతిలాంటి అమ్మాయి అయితే మరీ కష్టం. చిన్నప్పట్నుంచీ జీవితమే ఆమెకి అన్ని జాగ్రత్తలు నేర్పించింది.
"రాత్రంతా నీకోసం వెయిట్ చేశాను. వెన్నెలంతా నా ఒక్కడిపైనే జారిపోతున్నట్లుండే అంకాళమ్మ గుడిదగ్గర సుదీర్ఘ నిరీక్షణ. ఒకరికోసం కాచుకూర్చోవడమంత బాధ మరెక్కడా లేదని రాత్రే తెలుసుకున్నాను" అతను పొయ్యికి దగ్గరగా ఓ స్టూల్ లాక్కుని కూర్చుంటూ అన్నాడు.
"ఏం చేయను. వీలుకాలేదు. అమ్మ ఏదో మాటలు పెట్టుకుంది" అంది సింపుల్ గా.
అమ్మ తన కథను చెబుతోందిగానీ, తాను ఓ వేళప్పుడు బయల్దేరితే ఏటికవతల ఓ నల్లటి ఆకారం కనపడిందని చెప్పలేదు. అవన్నీ కుంటిసాకులుగా అతను కొట్టిపారేయవచ్చు.
"నిన్ను చూడకుండా నేనుండలేకపోతున్నాను ఇందూ" అని జాకెట్ నోరు తెరిచినట్టున్న వీపుపైభాగం మీద చేయి వేస్తూ అన్నాడు.
"ప్లీజ్-అలాంటి చేష్టలొద్దు. అమ్మమ్మ వుంది" అంది ఆమె అర్ధింపుగా ముఖంపెట్టి.
దాంతో అతను వెనుకంజ వేశాడు.
ఆమె అతనిదగ్గరికొచ్చి "ఇంకెంత? కొన్నిగంటలు. ఈ రాత్రికి డెఫనిట్ గా వచ్చేస్తాను. ఏ గుళ్ళోనో మనం పెళ్ళిచేసుకుందాం. ఆ తరువాత అంతా నీ ఇష్టం" అంది గోముగా.
ఇక తను అక్కడా వుండడంకన్నా వచ్చేస్తేనే ఆ ఎఫెక్ట్ అలా కొనసాగుతుందని అర్ధం చేసుకున్నాడు.
"నో-పదికాగానే గంటకొట్టినట్లు నీ దగ్గరుంటాను"
అతను వెళ్ళిపోయాడు.
తను ఇంకాస్త కఠినంగా వుండి లొంగదీసుకోవడానికి ప్రయత్నించవచ్చుగానీ ఇందుమతి దాన్ని సీరియస్ గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని భయం. మంచివాడుగానే పని సాధించాలి.
మూడు ముళ్ళూపడి మూడురాత్రులైపోయాక ఇక తన నిజస్వరూపం తెలిసినా వచ్చే నష్టం ఏమీ వుండదని అతనికి బాగా తెలుసు.
శతరూపం అంతకుముందురోజులాగే ఇసుకలో వీపు వాల్చి తన కథను తిరిగి చెప్పడం ప్రారంభించింది.
అమ్మ కథ చెప్పడం ఆపగానే భరణి దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఇందుమతి విసుగ్గా ముఖంపెట్టి వింటోంది.
"సురేష్ పెళ్ళి అనగానే నేను చిన్నపిల్లనైపోయాను. కుశాల అంటారే అది నన్ను బొమ్మలాగా గిరగిరా తిప్పేస్తోంది. నేను వయసుకు వచ్చాక మొదట జరుగుతున్న పెళ్ళి. స్కూల్లో నాతోపాటు చదువుతున్న వాళ్ళు, వాహనాల డ్రైవర్లు, కుర్రమాష్టార్లు- అందరూ కలిసి నన్ను ఓ పెద్ద అందగత్తెనన్న భ్రమను కల్పించారు కాబట్టి పెళ్ళిలో అందరికంటే చాలా అందంగా కనిపించాలన్న ఆరాటం ఎక్కువైంది నాకు.
అందుకే వయసుకు మించిన ఆటలు ఆడకూడదనేది. సరిసమాన వయస్కులతోనే స్నేహం చెయ్యాలన్నది కూడా అందుకే అనుకుంట.
లేకుంటే పదోతరగతి చదివే అమ్మాయి అందచందాల గురించి ఆలోచించకూడదు. అందర్లోకి అందంగా కన్పించాలన్న దుగ్ధ బయల్దేరకూడదు. చదువు తప్ప మరేదీ పరమావధి కాకూడదు.
అందుకే నేను గాడి తప్పాను. అయితే ఆ విషయంలో నా తప్పుని ఎవరూ పసిగట్టి సరిదిద్దలేకపోయారు. అమ్మానాన్నకి నేనొక్కదాన్నే కూతురు కావడంవల్ల అదంతా చిన్నపిల్ల చేష్టలాగా భావించారు. నీకిప్పుడు నేను చెబుతున్నట్లు మా అమ్మ తన అనుభవాలను, తను చూసిన లోకం గురించి చెప్పలేదు.
అందుకే నా తప్పు నేను తెలుసుకోలేకపోయాను.
"అమ్మా-అమ్మా- సురేష్ పెళ్ళి కదా, జుమికీలు కొనుక్కుంటానే" అని మనసులోవున్న కోరికను బయటపెట్టాను. ఆ రోజు ఎలా తయారుకావాలో ముందే ఊహించుకున్నాను. సాయంకాలం రిసెప్షన్ సమయంలో బూర్లాంగు మైసూర్ సిల్క్ చీర, జుమికీలతో కనపడదలుచుకున్నాను. ఇక ఉదయం పెళ్ళప్పుడు రోజ్ కలర్ పట్టుచీరమీద మామిడిపిందెల ఛైన్ వేసుకోవాలనుకున్నాను. అన్నీ వున్నాయిగానీ జుమికీలే లేవు.
"అంత డబ్బా!" అని అమ్మ నోరు తెరిచింది.
"తప్పదే"
"సరేలే"
అమ్మ ఒప్పుకుంది. ఆ రాత్రి నులకమంచంమీద ఆరుబయట పడుకుంటే చంద్రవంక ఆకాశానికి వేలాడుతున్న వెండి జుమికీలా వుంది.
మరుసటిరోజు సురేష్ పెళ్ళిబట్టలుకొనడానికి అందరూ నెల్లూరుకి బయల్దేరారు. జుమికీలు కోసం నేనూ వాళ్ళతో బయల్దేరాను.
శేఖర్ భార్య వేదవతి, సురేష్ తల్లి అపర్ణ, రామ్మూర్తి భార్య కుసుమకుమారి, నేనూ స్త్రీలం, సురేష్, మగవాళ్ళు మొత్తం ఆరుగురం అన్నమాట.