Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 26

    సమస్య పరిష్కరించబడ్డంతో నిద్రపట్టింది.
                                               14
    గంపనిండా తామరపూవులూ, అల్లిపూలూ తెచ్చి దింపా డొకడు. బుట్టనిండా చేమంతి పూలు తెచ్చి పెట్టాడొకడు.
    తంగేడు, పైడి తంగేడు, గునుగు, నువ్వు, రుద్రాక్ష, కట్టా గట్లు గొరిమిడి, కాకర, బీర, గన్నేరు, పొట్ల, కట్లాయి, గుమ్మడిపూలు బస్తాలో తెచ్చి గుమ్మరించాడొకడు.
    బంకుల్లో కూచున్న పాణి గుండె పూలను చూస్తే పొంగిపోయింది. ఒక తామర పూవును తీసి రెక్కలు విచ్చి చూచాడు. ఎంత చల్లగా ఉంది! వాసన చూచాడు. ఎంత లేత పరిమళం! ఎంత చల్లని పరిమళం! ఇంతలో వనజ వచ్చి, "ఈ ఏడాది దొరోరి బత్కమ్మను చూస్తే ఊళ్ళోల్లందరి కండ్లు మండాలే. మొదటివరుస తామరపూలు పెట్టి, రెండో వరస చేమంతి పూలు పెట్టి, ఆటేనక పోకబంతి, తెల్ల గునుగుపూలు పేర్చి, నెత్తిన తామరపూలు పెట్టి పేరిస్తే బాగుంటదన్న నేను. గట్ల కాదు. ముంగల తంగేడు పూలు పెట్టి, ఆటేనక తామరపూలు, చామంతిపూలు పేరు పెట్టిస్తనంటాంది చిందొరసాని. ఎట్లయితే బాగుంటుందో చెప్పు" అన్నది. పాణి కాస్త తికమక పడ్డాడు. వనజ చెప్పిన క్రమమే బాగుంది. తంగేడుపూల మీద తామరపూలు నిలవ్వు. కానీ, ఆ మాటంటే మంజరి చిన్నబుచ్చుకుంటుందని, నెత్తిన తామరపూలు కాక అల్లీపూలు పెడ్తే బాగుంటుందని చెప్పాడు. చేమంతిపూలతో, పోకబంతిపూలతో మంజరి పేరు వచ్చేట్లు పెర్చమని చెప్పి 'మంజరి' అనే ఇంగ్లీషు అక్షరాలు వ్రాసి యిచ్చాడు. తన పేరుకూడా రాసివ్వమంది, తన బతకమ్మ కోసరం వనజ. పేరు వ్రాసి ఇస్తూండగానే కరణం యింటినుంచి పిలుపొచ్చింది పాణికి.
    కరణం ఇంటికివెళ్తే ఇంటి ముందు కరణం లేడు, పచ్చపచ్చగా తంగేడు పూవు పడివుంది, అరుగులమీద. పాలేరువచ్చి తాయారు రమ్మంటూందని పిలిచాడు. లోపలికి వెళ్ళాడు పాణి.
    తలంటి పోసుకొని ముస్తాబయి కూచుని ఉంది తాయారు.
    "ఎప్పుడొచ్చావు తాయారు?"
    "రాత్రి వచ్చిన, పండుగని."
    "కరణంగారు రాలేదా?"
    "లేదు. కచీర్ల పనులున్నయట. నన్నుగూడుండమన్నడు, నా మనసు ఈడనే ఉన్నది. పోతనంటే కచ్చడం కట్టి తోలిండు."
    "ఫిడేలు తెప్పించరాదూ?"
    "ఎప్పుడూ సంగీతమే?" విసుగ్గా అంది.
    "ఇంకేం పనుంది నాకిక్కడ?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "అంతేనంటారా?"
    పాణి తాయారు ముఖంలోకి చూచాడు. కళ్ళు తళతళ మెరుస్తూన్నాయి. జవాబు ఏం చెప్పాలో తోచలేదతనికి.
    "నే నంటే ఇష్టం లేదా?" తాయారడిగింది సూటిగా ముఖంలోకి చూస్తూ.
    సంభాషణ వక్రగతి పడుతూందని గ్రహించాడు పాణి. ఇంట్లో కరణం సైతం లేడు. అంత ఇంట్లోను తాసూ, తాయారేనూ. ఏదో అవాంతరం రానునదనుకున్నాడు పాణి.
    "అదేం ప్రశ్న తాయారూ?"
    "నీకోసమే రెక్కలు కట్టుక వాలిన. చూడు కండ్లెట్ల ఎర్రపడ్డాయో నిద్రలేక" అని రెప్పలు చీల్చి చూపింది కళ్ళను.
    వాస్తవంగానే ఎర్రగా ఉన్నాయి కళ్ళు. పెద్దగా గూడా కనిపించాయి. చలించాడు క్షణం పాణి మగవాడు కదా!
    "నువ్వంటే నాకెంత మనసనుకున్నవ్? చూడు, గుండె ఎట్లకొట్టుకుంటున్నదో?" పాణి చెయ్యి పట్టుకొని గుండెమీద పెట్టి చూపబోయింది.
    పాణి రక్తం విధ్యుద్వేగంతో ప్రవహించింది. "ఇచ్చోట భవన్నఖాంకురము సోకె" అన్న వరూధిని గుర్తుకు వచ్చింది. లిప్తలో సంబాళించుకొని చెయ్యిలాక్కున్నాడు. తాయారు తనను ప్రేమిస్తూంది. తనువు అర్పిస్తానంటూంది. అలాంటి తాయారు తన నెందుకు ఆకర్షించడం లేదో అర్ధం కాలేదు.
    అందని దానికి అర్రులు చాచటం మానవ స్వభావం.
    "నేనంటే ఇష్టంలేదా?" మళ్ళీ అదే ప్రశ్న. దుఃఖం గొంతుదాకా వచ్చిందని స్వరం చెపుతూంది. "ఇంట్లో ఎవరూ లేరు" అన్నది.
    తప్పుకునే ఉపాయంకోసం తడుముకున్నాడు. చటుక్కుమని స్పురించింది.
    "కరణంగారేమంటారు?"
    "నాన్న కెరికె. నా ఇష్టానికి ఎతిరేకం చెయ్యడు."
    ఆశ మొలకెత్తింది తాయారు హృదయంలో.
    పాణి ఒళ్ళు మండింది. ఈ నాటకం చాలా కాలంనుంచి జరుగుతుందని గ్రహించాడు. తననేదో ఇరకాటంలో పెట్టడానికి, అడకత్తెరలో ఇరికించడానికి ఇది కరణం పన్నుతున్న ఉచ్చులా కనిపించిందతనికి. "తాయారు! నువ్వెక్కడ, నేనెక్కడ? నీకూ, నాకూ భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం వుంది."
    "మా నాయ్నకు నేడొక్కతెనే బిడ్డను. ఈ ఆస్తి, కరణీకం అంత నీదే అయితది. నాయ్నే చెప్పిండు" అన్నది ఈ తడవ తలవంచి గోళ్ళు చూచుకుంటూ.
    "ఆస్తికోసం గడ్డితినమంటావా..." కాస్త కురుకుగానే అడిగాడు. 'కాదు నాకోసరం. చూడు ఎంత వెతపడుతున్నానో' అని ముందుకు జరిగి మీద పడింది, పాణికి ఆలోచించే ఆవకాశం కూడా ఇవ్వకుండా.
    పాణికి అసహ్యం అనిపించింది. వెనక్కుత్రోసి లేచినుంచున్నాడు.
    తాయారు అహం దెబ్బతిన్నది. తోకతొక్కిన పాములా "కస్సు" మంది.
    "కోరివస్తే తోసేస్తవులే. చూస్త ఈ ఊళ్లేట్లుంటవో? దాసీదాంతోటెల్ల కులుకుతవో? నువ్వొచ్చి నా కాళ్ళమీద పడేటట్లు చెయ్యకుంటే కరణం బిడ్డనే కాను..." అని జలజల కన్నీరు కారేసింది.
    ఉగ్రుడై బాణంలా దూసుకొని వెళ్ళిపోయాడు పాణి.
    గడీగేట్లో ప్రవేశించగానే బంకుల్లో ఒంటిగా కూర్చున్న రామిరెడ్డి గారు కనిపించారు. తన రౌద్రం రెడ్డిగారికి కనిపించనీయరాదని రెడ్డిగారిని గమనించనట్లు నటించి మెట్లవైపు సాగిపోయాడు. "పంతులూ" అని పిలిచారు రెడ్డిగారు. ముఖంలో భావం వ్యక్తీకరించకుండేందుకు ప్రయత్నించి అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి రెడ్డిగారికి నమస్కరించాడు.
    "చూళ్ళేదండీ! క్షమించండి."
    "సరే, నేనైతే చూసినగద. ఏంది కత?"
    "ఏమీ లేదండీ!" తలవంచుకొని జవాబు చెప్పాడు.
    'కారణం ఇంటినుంచే వస్తున్నావా?'
    'అవునండీ!' -  'గ్రహించాడా ఏం! ఘటికుడు' అన్నట్లుగా ముఖంలోకి చూచాడు.
    చిరునవ్వు నవ్వాడు రెడ్డిగారు.
    "కరణం వచ్చిండా?"
    "రాలేదండీ!"
    'కుంటి దొక్కతే ఉన్నదా ఇంట్ల?' ధ్వనిలో కరుకుదనం కనిపించింది.
    'అవునండీ!'
    'ఎందుకు పోయినవ్, అది ఒంటరిగున్నపుడు?' గద్దించినట్లుగా అడిగారు రెడ్డిగారు. కథ అడ్డం తిరిగేట్లుంధనుకున్నాడు.
    'కారణం పిలిపించాడంటే.....' అణుకువుగా జవాబు చెప్పాడు.
    'ఐతే, అదే పిలిపించిందంటవ్? ఏమైందాడ?' ఉరిమారు.
    పాణి వెనక్కు తిరిగి చూస్తే ఉత్సాహంగా వింటున్న ఎంకటి కనిపించాడు. వాడుండంమూలాన సంకోచిస్తున్నాడని గ్రహించారు రెడ్డిగారు.
    'ఈడేమన్న బోగమోల్లాడ్తాన్రనుకున్నావా? పో - పనిచూసుకో!' ఉరిమారు రెడ్డిగారు ఎంకటిని ఉద్దేశించి.
    ఉత్సాహమంతా చచ్చిపోగా సుమారు ఉరికినట్లు నడిచివెళ్ళాడు ఎంకటి.
    'దొరవారూ! మీరు కూర్చోండి, నన్ను అపార్ధం చేసుకోకండి!' అన్నాడు బ్రతిమాలాడుతున్నట్లుగా పాణి.
    'హు! ఆడ ఏమైందో చెప్పు! ఉన్నదున్నట్లు చెప్పాలే. లేకుంటే నెత్తి గొరిగించి, సున్నబ్బొట్లు పెట్టించి, గాడ్దిమీద ఊరేగించి ఎళ్ళగొడ్త ఊళ్ళ నుంచి - ఎరికేనా?' అదీ గర్జనే కాని, స్వరంలో కొంత సౌమ్యత ఏర్పడింది.
    'కారణం ఇంటికి వెళ్ళా.....' అని జరిగిన సంగతి సాంతం పూసగుచ్చినట్లు చెప్పాడు.
    'హు'! ఊళ్ళ ఉండనియ్యదులే! చూస్త. కరణానికి కాలం దగ్గర పడ్డది' అని మీసం మెలేసి, రేపటినుంచి పాఠానీకి పోకు' అంటూ లేచిపోయారు - పంతులు మంచివాడే అని మనసులో అనుకుంటూ.
    పిడుగు పడుతుందనుకున్న ఉరుము చినుకుల్తో పోయినందుకు సంతోషించాడు పాణి.
                                                                    x    x    x
    మూడు బతకమ్మల్ను పేర్చారు గడీలో. వాటిని నోము గదిలో పీటలపై ఉంచారు. పసుపుకుంకుమల్తో పడతులంతా బతకమ్మను - గౌరమ్మను అర్పించారు. పెసర, గోధుమ, బియ్యము, కొబ్బరి, నువ్వులతో చేయబడిన చద్దులు గౌరమ్మకు నైవేద్యం పెట్టారు మధ్యాహ్నం.
    మధ్యాహ్నపు భోజనాలైనాయి.
    సాయంకాలం అవుతూంది. ఊరంతా పండుగ రంగులు అద్దుకొంది. కొత్త పరికిణీలు, కొత్త రవికెలు తొడుక్కొని, కురుల్లోపూలు తురుముకున్న బాలికలు, వెదురు లేక దుసేరు తీగల్తో అల్లిన సిబ్బుల్లో బతకమ్మలు పట్టుకొని నుంచున్నారు. కొత్తబట్టలు కట్టుకొని వీధిలో ఉరికే బాలురు పెట్లుగొట్టాలు కొడుతూ బాలికల్ని సతాయిస్తున్నారు.

 Previous Page Next Page