"వద్దు వద్దు - జ్వరం అంటుకుంటుంది" అన్నాడు రామకృష్ణ మరింత ముడుచుకుపోతూ.
"ఇంతోటి జ్వరం అంటుకుంటే కొంప మునగదులెండి. మీ పక్కన నేను పడుకుంటాను" అంటూ రామకృష్ణ చేతిమీద చెయ్యివేసి - "అరె, చల్లగా వుంది" అంది.
"సీతా! ఇది పైత్య జ్వరం. అలాగే వుంటుంది. కాస్త వేడిగా ఏదన్నా తెచ్చిపెట్టు తల పగిలిపోతున్నది. తలనొప్పి మాత్ర వేసుకుంటాను."
రామకృష్ణ మాట పూర్తి చేయకముందే సీత వంటగదిలోకి పరుగెత్తింది.
సీత అటు వెళ్ళంగానే రామకృష్ణ గబుక్కున మంచం మీదనుంచి లేచి, ఒక్కంగలో అలమర దగ్గరకు వెళ్ళి, అలమరలో వున్న అమృతాంజనం సీసా తీసుకుని రెండో అంగలో మళ్ళి వచ్చి మంచం ఎక్కాడు. దుప్పటి నిండా బిగించి, అమృతాంజనం సీసా సగం ఖాళీ చేశాడు.
సీత గ్లాసునిండా వేడి వేడిగా హార్లిక్స్ కలుపుకు వచ్చేసరికి రామకృష్ణ పని పూర్తి అయింది.
రెండు డిస్ప్రిన్ మాత్రలు, హార్లిక్స్ యిస్తూ రామకృష్ణని లేపింది సీత.
రామకృష్ణ ఉహుహు అంటూనే కొద్దిగా దుప్పటి తొలగించి, కొద్దిగా పైకిలేచి హార్లిక్స్ అందుకున్నాడు.
అమృతాంజనం వాసన గుప్పున కొట్టింది సీతకి.
"మీరు..... మీరు..... అమృతాంజనం రాచుకున్నారా?" సీత ఎంతగా ఆశ్చర్యపోతూ అడిగింది.
అమృతాంజనం రాచుకోటం సీతకి ఎంత ఇష్టమో - రామకృష్ణకి అంత అయిష్టం. పొరపాటున కూడా ఆ సీసా ముట్టుకోడు.
అమృతాంజనం రాచుకున్నానన్నట్లు తలవూపి, మరోసారి "ఉహుహూ!" అన్నాడు రామకృష్ణ.
రామకృష్ణ అమృతాంజనం రాచుకోటం అన్నది సీతకి ఈ ప్రపంచంలో ఎనిమిదో వింత.
"నన్ను రాయమంటే నేను రాచేదాన్నిగా!" అంది సీత భర్త ముఖాన్ని పరీక్షగా చూస్తూ.
"ఉహుహూ!" అన్నాడు రామకృష్ణ.
అప్పుడు రామకృష్ణ ముఖం వాడిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా, కణ కణలాడే నిప్పుల్లా ఉన్నాయి. తలంతా చెదిరిపోయి వుంది. చెమటలు దిగజారుతున్నాయి.
"డాక్టర్ దగ్గరకు వెళదాం!" అంది సీత.
"మాత్ర వేసుకున్నాగా. అదే తగ్గుతుంది" అని ఖాళీ చేసిన గ్లాసుని సీతకిచ్చి, మళ్ళి దుప్పటి ముసుగుపెట్టాడు రామకృష్ణ
సీతకి ఏం చేయాలో అర్ధం కాలేదు.
సరిగా అయిదు నిమిషాలు.
రామకృష్ణ విసురుగా దుప్పటిని అవతలికినెట్టి, ఒక్కగంతులో మంచం మీదనుంచి లేచి నేలమీదకి దిగి, రెండంగల్లో బాత్ రూమ్ లో భోళ్ళున వాంతి చేసుకున్నాడు.
హార్లిక్స్ తో పాటు ఉదయం తిన్న భోజనం తాలూకా అరిగీ అరగని పదార్ధాలు బైటికి వచ్చాయి.
సీతని దగ్గరకు రావద్దన్నాడు రామకృష్ణ. అయినా సీత వినలేదు. బాత్ రూమ్ లో నీళ్ళుకొట్టి, రామకృష్ణకి నీళ్ళు అందించి వగైరా పనులు చేసింది.
"అమృతాంజనం పేరెత్తితేనే నీకు ఎలర్జీ. అలాంటిది అరసీసా ఖాళీ చేశావు వాంతి రాక ఏమవుతుందిలే!" అనుకున్నాడు రామకృష్ణ.
ఒకసారి వాంతి అయిన తర్వాత మళ్ళి మళ్ళి వాంతి వచ్చేటట్లు అనిపించింది. తిక్క, వికారం, తలనొప్పి, నీరసం- చాలా లక్షణాలు ఏర్పడ్డాయి. చెమట అయితే అదేపనిగా కారటమే.
సీత డాక్టర్ దగ్గరకు వెళదాం అంటుంది. నేను రాను అంటాడు రామకృష్ణ.
చివరికి -
ఓ గంట తర్వాత.
రామకృష్ణ నిద్రపోయాడు.
అప్పుడు పావు తక్కువ పదకొండు అయింది.
సీతకి ఏమీ తినబుద్ధి కాలేదు. కాసిని మజ్జిగ తాగి పడుకుంది.