"లేకపోతే మరేంటే? పోస్టు బాక్సులో పడేయాల్సింది బ్లౌజులో దాచేసుకుంటే మా అన్నకి నీవేదన ఎలా తెలిసేను."
ఫకాలున నవ్వింది ప్రీతి.
"నవ్వులా అవి .... కావు, నవపారిజాతాలు....రవ్వంత సడిలేని గువ్వల కిలకిలలు...."
"నీకూ కవిత్వం వచ్చేస్తోంది" కాలేజీకి తయారవుతూ అంది ప్రీతి.
"ఏం చేయను? ప్రేమలో ప్రాక్టికల్ అనుభవం లేకపోయినా, నీ విరహం చూస్తే క్రౌంచపక్షుల వియోగాన్ని చూసి బోయవాడయిన వాల్మీకిలా...."
"చాలు, ఆపు" అంటూ అమాంతం నమ్రత నోరు నొక్కేసింది.
"ఇదే మా అన్నయ్య అయితే పెదవుల్ని చేతుల్తో మూసేదానివా? ఎంతయినా...."
"చాలు, మహంకాళీ, విజృంభించకు. బయలుదేరు" అంటూ బుక్స్ అందుకుని బయటకు నడిచింది.
హల్లో ప్రీతి తండ్రి రంగనాథరావు __ "ఇవాళ ఆలస్యమయిందమ్మా!" అన్నాడు. అతడలా అన్నది కాలేజికని కాదు.
"సారీ డాడీ! పెనాల్టీ ఇచ్చుకుంటాగా!" అంటూ అతని చెంపలపై నెమ్మదిగా పసిపిల్లలా రెండుసార్లు ముద్దు పెట్టుకుని, "వెళ్ళొస్తా, డాడీ" అంటూ బయలుదేరింది. నమ్రత కూడా రంగనాథరావుగారి దగ్గర సెలవు తీసుకుని ద్వారం దాటి పోర్టికోలోకి వచ్చేసరికి ఎదురయ్యాడు ఫణీంద్ర_ప్రీతికి స్వయానా బావ.
"హల్లో ...." అమాయకంగా విష్ చేశాడు ఇద్దర్ని.
లోపలికి వెళుతున్న ఫణీంద్రని చూస్తూ, "మరీ ఆడపిల్లలా అలా మెలికలు తిరిగిపోతాడేమే, మీ బావ?" అంది నమ్రత.
"వట్టి సాధుజంతువు" అంటూ ప్రీతి కారులో కూర్చుంది నమ్రతతోపాటు.
* * *
హఠాత్తుగా అంతవేగంలోనూ గ్రహించాడు చైతన్య. మరికొన్ని సెకండ్ల వ్యవధిలో జీప్ లోయలోకి జారిపోతుందని.
అంతే! ఇంజన్ జీప్ ను ఏటవాలుగా వున్న ఎత్తయిన గట్టుపైకి మళ్ళించాడు. అది ఆ క్షణంలో అతడు చాలా సమయస్పూర్తితో తీసుకున్న నిర్ణయం.
ముళ్ళకంచెల పైనుంచి ఏభై అడుగుల ఎత్తులోకి ప్రయాణం చేసిన జీప్ ఇక శక్తిలేనట్టు ఆగి, మళ్ళీ బాటపైకి మరలేటట్టు జాగ్రత్త పడ్డాడు. స్టీరింగ్ ను కంట్రోలుచేస్తూ మళ్ళీ బాటుపైకి మరలేటట్టు జాగ్రత్తపడ్డాడు. అదే సమయంలో మొదటి గేర్ లోకి మార్చేసరికి జీపు పూనకం వచ్చినట్టు ఊగింది పెద్దశబ్దం చేస్తూ.
ఇంకా అదుపుకాని వేగాన్ని దృష్టిలో ఉంచుకుని జీప్ ను గట్టుపైకి మళ్ళించాడు.
ఉయ్యాల్లో నాలుగుసార్లు ఏటవాలుగా వున్న గుట్టమీదకి, రోడ్డుపైకి కదిలిన జీప్ పూర్తిగా వేగాన్ని కోల్పోయి నీరసంగా గుట్ట అంచున ఆగి పోయింది.
ఆ సమయంలో చైతన్యకు రాళ్ళూ రప్పలూ ప్రతిబంధకంగా లేని గుట్ట అంచు అక్కడ కనిపించడంతో ఎంత మేలు జరిగిందంటే అతడు జీప్ మళ్ళించిన వేగానికి ఒకవేళ బండల్లాంటివే అడ్డంగా ఉంటే అతని గుండె నుగ్గయ్యేది.
కర్మేంద్రియాలన్నీ చచ్చుబడినట్లు గగుర్పాటుతో స్టీరింగ్ పై తలానించిఅలాగే కూర్చుండిపోయాడు చాలా సేపటి వరకూ.
ప్రత్యర్ధులు అతణ్ణి అంతం చేయాలని చేసిన రెండో హత్యాప్రయత్నమది. అదీ అతి స్వల్పకాలంలో!
అతనికి తెలీదు_రాత్రి అతడు జీప్ వదిలినప్పుడే బ్రేక్ డ్రమ్ ను గట్టిగా ప్రెస్ చేయాల్సిన బ్రేక్ మాస్ నట్సును వేరుచేశారని.
నెమ్మదిగా తేరుకుని తల పైకెత్తి చూసేసరికి అక్కడ_అంటే గుట్ట పైభాగంలో నిలబడి ఉన్నాడు తవిటయ్య.
"అడ్డ తోవలో యెలిపొచ్చానండి."
'ఎందుకు? ఇదంతా నీకు ముందే తెలుసా?' అని అరవాలనిపించింది. తమాయించుకున్నాడు బిగుసుతున్న పిడికిళ్ళతో. అనుమానంతో తవిటయ్యని చూస్తూ, "మాడుగుల వెళ్ళి రేంజర్ తో చెప్పి రిపేరుకు కావలసిన ఏర్పాట్లు చూడమను" అనేసి ఆవేశంగా బయలుదేరాడు.
* * *
గ్రామ పరిసరాలలో అడుగు పెట్టగానే గ్రహించాడు చైతన్య. అది కాస్త అభివృద్ధి చెందిన గ్రామమని, తక్కిన పల్లెలంతగా వెనుకబడి లేదని.
బగతాలు కొండజాతి ప్రజల్లో కాస్త వున్నవాళ్ళుగా చలామణి అయ్యేజాతి. ఊళ్ళో వున్న రెండు పెంకుటిళ్లూ బగతావంశస్థులకు చెందినవే.
చిత్రంగా తనవేపే చూస్తున్న గ్రామస్థుల్ని అడిగి ఆరాతీసి చిన్నబగతా ఇంటికి వెళ్ళాడు ముందుగా.
ఖడ్గమృగంలా చాలా భారీగా వున్న విగ్రహం చినబగతది. జరీ కండువాతో ఓ జింకతోలుపై కూర్చుని వున్న ఆకారాన్ని చూసి అతడే చినబగతా నరసింహ పడాలుగా గుర్తించిన చైతన్య__"నేను కొత్తగా వచ్చిన ఫారెస్టాఫీసర్ని" అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు.
"అయితే?" చాలా నిర్లక్ష్యంగా వినిపించింది ఆయన కంఠం.
కొడుకు పోయిన దుఃఖం మూలానో, లేక తాగి ఉన్నాడో నిప్పుల్లా మండుతున్న నరసింహ పడాలు కళ్ళు చూస్తుంటే చైతన్య కాస్త జంకేడు.
"మీ అబ్బాయి...."
"చచ్చేడు."
అది వ్యంగ్యమో, నిర్వేదమో అర్ధంకాని చైతన్య క్షణంపాటు మౌనంగా నిలబడిపోయాడు, మనిషేకాదు, మాటలూ సంస్కారరహితంగా అనిపించాయి.
"మీ అబ్బాయిని మేనీటర్ ఏ ప్రాంతంలో...." చైతన్య ఇంకా పూర్తిచేయనేలేదు.
"సాలించు మారాజా! నీకాశ్రమ ఇయ్యకూడదని శవం మాయం కాకముందే ఈడ్చుకురమ్మని మా మడుసుల్నంపేను" చుట్ట వెలిగించుకుంటూ జావాబిచ్చాడు.
"శవం మాయం కావడమేమిటి?" బయటికే గొణిగాడు ఆశ్చర్యంగా మేనీటర్ అన్నది శవాన్ని దాస్తుంది కాని, మాయం చేయదు.
"నువ్వు కొత్తోడివి మారాజా! నీకు తెల్దు. సచ్చిన నా ముగ్గురు కొడుకుల శవాలు ఒక్క ఎముకన్నా మిగలకుండా మాయమైనాయి" చాలా స్వాభావికంగా జవాబిచ్చాడు నరసింహ పడాలు.
"కాని...." చైతన్య ఏదో చెప్పబోతుంటే, చేయి పైకెత్తి ఆగమన్నట్టు సౌంజ్ఞచేసిన చినబగతా__ "సెప్పేది నీకే!" తీవ్రస్వరంతో హుంకరించాడు.
ఆ పరిస్థితుల్లో వాగ్యుద్దానికి దిగడం సమంజసంకాదు. పైగా అధికారంతో శవాల్ని ఆపడం సాధ్యం కాని పని."
"ఈ చుట్టుపక్కల పల్లెప్రజల విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు మీరు. మీరే సహకరించకపోతే అమాయకులయిన వాళ్ళెలా సహాయపడతారు?" నిజాయితీగా ఆర్ధిస్తున్నట్టు అడిగాడు.
కొద్దిగా మెత్తబడ్డాడేమో, "నువ్వెల్లీ వరకూ శవం ఎముకల్నీ మిగల్నివ్వదు పెద్దపులి" అన్నాడు కోపాన్ని నిగ్రహించుకుంటూ.
అసంభవం! ఆకలిమీదున్న మేనీటరయినా, చంపిన వెంటనే ఉన్నపాటున పాతికనుంచి ముప్పై కిలోల మాంసాన్ని తింటుందే తప్ప ఎముకలతో సహా స్వాహా చేయదు.
"నాకో అవకాశ మివ్వండి" చైతన్య నచ్చచెప్పే ధోరణి, అడిగిన తీరు ఆకట్టుకుందేమో_"సరే!" అన్న నరసింహపడాలు_"శవాన్ని తీసుకురావద్దని నా మడుసులకిజెపుతాను" అన్నాడు మీసాలు సవరించుకుంటూ.