Previous Page Next Page 
జనపదం పేజి 26

 

    ప్రాణాలు పైపైనే ఎగిరిపోయాయి.
    నిశ్చేష్టుడైనాడు.
    లిప్తపాటు నోటమాట రాలేదు.
    వచ్చిన మొదటి మాట "ఏందీ ఘోరం? ఎవరు చేసిన్రు?' చేతనుండై తరవాత చేసిన మొదటి పని వారిని తీసికెళ్ళి మంచంలో కూర్చోబెట్టడం.
    "కావరం ఎక్కిందుండి. కావరం ' అని మస్తాన్ అనగా "మదముండి మదం పైన మదం" అన్నాడు మల్లయ్య.
    మంగమ్మ పరుగెత్తి వచ్చి చూచింది. కెవ్వున కేక పెట్టింది. అంతే', నుంచుండి పోయింది.
    "అరుస్తదేమిర? ఇది చెయ్యబట్టే అయిందిదంతా. బండ కట్టుకుని బాయిల పడక పోయినావు? బతికి ఎందుకు ఇంతమందిని ఎడిపిస్తవ్?" మల్లయ్య బడాబడా వాగేశాడు.
    మంగమ్మ కుప్పకూలిపోయింది. నేలకు తల కొట్టుకుని ఏడవసాగింది. వీరభద్రం వారిని వదిలి మంగమ్మను పట్టుకునే వరకే నొసలు చిట్లి రక్తం కారసాగింది.
    రక్తం చూసి వీరభద్రం రక్తం సలసల కాగింది. "ఏంది మల్లన్నా ఎట్లా బడితే అట్లంటవ్? ఇందుల మంగమ్మదేం తప్పున్నది. బొందల పడ్డ వానిమీద రాళ్ళేయ్యటం మనకు అలవాటా?" కాస్త గట్టిగానే అన్నాడు.
    "మీ అండ చూసుకొనే అదిట్ట ఎగురుతాంది." మస్తాన్ అన్నాడు. యిద్దరికీ మంగమ్మ మీద గొంతువరకూ వచ్చింది . తప్పేం? ఆవిడా మూలాన్నే వాళ్ళు వళ్ళు హూనం అయింది.
    మంగమ్మ ఏడుపు మాని కళ్ళప్పగించి చూడసాగింది.
    ఆమె గుండె ఏడ్వసాగింది.
    "జగ్గయ్య గుర్తున్నాడా?" అడిగాడు వీరభద్రం.
    ఆ పదం ఏదో గారడీ చేసింది అందరి మీదా.
    అంతా మౌనంగా ఏదో స్మృతులను కేలుక్కున్నారు.
    "జగ్గయ్య సమాధి కట్టి పూజలు చేస్తున్నాం. జగ్గయ్య పెళ్ళాన్ని పట్టుకొని తిడ్తున్నాం" బొంగురు పోయిన గొంతుతో అన్నాడు వీరభద్రం. ప్రతి పదంలోనూ వేదన వుంది. స్వరంలో వేదన నిండి వుంది.
    దెబ్బలు తిన్న వారిద్దరూ దెబ్బలు మరిచారు. ఏదో పూర్వ లోకంలోకి వెళ్ళి పోయారు. వారి ముఖాల్లో అపూర్వ వేదన కనిపించింది.
    ఒకప్పుడు పదాలు గారడీ చేస్తాయి.
    తాము ఏదో తప్పు చేసినట్లు చూశారు మంగమ్మను.
    "నేను మంగమ్మను పెండ్లి చేసుకుంటున్నా" స్థిర నిశ్చయంతో అన్నాడు వీరభద్రం.
    మల్లయ్య, మస్తాన్ ల మీద కొరడా దెబ్బ పడ్డట్లయింది.
    "ఏమంటూన్నరు?" ఏకంగా అడిగారిద్దరూ.
    మళ్ళీ అదే మాట చెప్పాడు వీరభద్రం.
    ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు మస్తాన్, మల్లయ్య.
    'అయితే రామయ్య చెప్పింది నిజం చెయ్యాలను కుంటున్నారా?"
    "కాదు మంగమ్మను కాపాడలనుకుంటున్న. జగ్గయ్య రుణం తీర్చుకోవాలను కుంటున్న.
    "ఏందిదంతా?" గర్జించి అడిగాడు మస్తాన్ మంగమ్మను.
    మంగమ్మ కన్నీరు జలజల రాల్చింది. అక్కడ నుంచి లేచిపోయి మంచంలో పడి కుమిలి కుమిలి ఏడ్వసాగింది.
    "ఏం చేస్తున్నారో నాకైతే ఇష్టం లేదుండి" అనేశాడు మల్లయ్య.
    బెరుకు బెరుకుగా చూశాడు మస్తాన్. మాట్లాడలేదు. కొరకొర చూశాడు మల్లయ్య. మస్తాను చూపు దించుకున్నాడు.
    ఈ సంగతేందో తేల్చుకోవాలె. మరీ మితిమీరి పోతున్నరు. అన్నదానికి వంతపాడకుంటే చావగోడ్తరా? అసలు ఊళ్ళో ఉండాల్న వద్దా? పదుండి పాదం దవాఖానకు , పోలీసుకు రిపోర్టిచ్చి ఈ విషయం ఏదో తేల్చుకుందాం? వీరభద్రం విషయం మార్చాడు.
    "చూద్దాం లేరి యిప్పుడు పోలీసుల్ల ఏం పడతాం' అని మస్తాన్ అనగా "వాళ్ళు కూడా రామయ్య మనుషులేనాయె ' అన్నాడు మల్లయ్య.
    వీరభద్రం చూస్తుండగానే ఇద్దరూ నిర్గామించారు.
    వీరభద్రం విలవిలలాడాడు.
    అతనిలోని రెండు ప్రాణాలు విడిపోతున్నట్లనిపించింది.
    గుమ్మం పట్టుకొని చూపందినంతవరకు చూశారు.
    "వారు వెళ్ళిపోయారు. అవును వెళ్ళిపోయారు ' అనుకుని వచ్చి మంచంలో కూలబడ్డారు.
    

                                                           *    *    *

    కాలం చిత్రమైంది. కాని వారిని కలుపుతుంది. అయిన వారిని విడగోడ్తుంది. ఒకరిని కరుస్తుంది. ఒకరిని బెదరిస్తుంది. ఒకరిని విరుస్తుంది. ఒకరిని పెంచుతుంది. ఒకరిని చంపుతుంది. ఒకణ్ణి మురిపిస్తుంది. ఒకణ్ణి మరిపిస్తుంది. మారిపించడం కాలపు ప్రధాన స్వభావంలా కనిపిస్తుంది. అది దేన్నైనా మరిపించగలదు. ఘోరాతి ఘోరాన్ని మరిపించగలదు. ఉత్తమోత్తములను మరిపించగలదు. మహాపురషులను మరిపించగలదు. దానికి మంగమ్మ వృత్తాంతం ఒక లెక్కా? ఎక్కడో కాలంలో కలిసి, వెలసి పోయిందా కధ. అది జరిగిందన్నది కూడా మరిచిపోయినట్లుంది ఊరు. కాల ప్రవాహానికి అది కరిగిపోతోంది. అరిగిపోతోంది. ఆ రాత్రి మంగమ్మకు అవస్థ వచ్చి వుండకపోతే ఆమెను మరచిపోతోంది జనం.
    అర్ధరాత్రి ఆమెకు బాధ మొదలైంది. అదృష్టవశాన వీరభద్రం ఉన్నాడు. మంతసాని దగ్గరికి ఉరికాడు. ముదివగ్గు ఆవూరి మంత్రసాని . ఆమె చేయి చల్లనిదని అందరి నమ్మకం. రానైతే వచ్చింది. కాని ఆమెకు ఏమీ అర్ధం కాలేదు. ఏదో పీడ పట్టుకుంది అన్నది. జగ్గయ్యే దయ్యం అయి పట్టాడన్నది. కోరికలు తీరకుండా చచ్చినవారు పరిసరాల్ను విడిచిపోరన్నది. బలి యివ్వలంది. వేప మండలు కట్టాలంది. సాంబ్రాణి పొగ వేసింది. ముడుపు కట్టింది. చేతులు వేల్లకింత లేసి బయట వచ్చి కూర్చుంది. భగవంతుడే రక్షించలంది. చిన్న ప్రాణం పోయినా పెద్ద ప్రాణం దక్కితే అదృష్టం అంది. ఆకాశం వేపు చూసి ఒక దండం పెట్టింది. అన్నీ అతనికే అర్పించింది. తలపట్టుకుని కూర్చుంది.
    మంగమ్మ బతికి బట్ట కడుతుందని ఎవరూ అనుకోలేదు. అదీ మంచితే ననుకున్నారు. చాలామంది.పాపం కలకాలం రాగదు. కట్టి కుదుపుతుంది అన్నారు. వృద్దులూ, మల్లయ్యకూ, మస్తాన్ కూ ఎందుకో సంతోషం అయింది. మంగమ్మ ఏమనుకుందో మనం చెప్పలేం కాని, వీరభద్రం విలవిల్లాడాడు. ప్రాణాలు కాపాడటానికి పల్లెలో అవకాశాలు తక్కువ. ప్రాణాలు తీయడానికి వీటిని మించినివి లేవు. మంగమ్మను పట్నం తీసుకెళ్ళడానికి నిశ్చయించాడు. బండి కట్టించాడు. కటిక చీకట్లో బండి సాగింది. మంగమ్మ మళ్ళీ రాదని నిశ్చయించుకుంది జనం. తండోపతండాలుగా బండివెంట సాగింది. ఊరు దాటే వరకు పదిమంది మిగిలారు. వాగు దగ్గరకు చేరేవరకు ముందు లాంతరు పట్టుకొని నడిచే మస్తాను, వెనుక వీరభాద్రంతో నడిచే మల్లయ్యా బండి మనిషి మాత్రం మిగిలారు.
    చీకటి , కీచురాళ్ళ రోద , అప్పుడప్పుడూ గుడ్లగూబ అరుపులు, బండి సాగిపోతుంది. మువ్వల చప్పుడు వినా ధ్వనిలేదు. అంతా మౌనంగా సాగిపోతున్నారు. వీరభద్రం గుండె దడదడలాడుతున్నది. అసలు ప్రాణంతో ఉందా మంగమ్మ? ఇది శవయాత్ర కాదు కదా! పలకరించాలని అనేకసార్లు అనుకున్నాడు. పలకదేమోనని భయం. ఆ తెలేదేదో తరవాతనే తెలనివ్వు అనుకున్నాడు. అయినా దగ్గరికి వెళ్లి పిలిచాడు. పలకలేదు. గుండె గుభేలుమంది. బండి ఆగింది. ఉన్న నలుగురూ కూడారు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. ఏడుపు గొంతుదాకా వచ్చేసింది. గట్టిగా కేకవేశాడు.
    మూలుగు వినిపించింది.
    ఒక్క ఉల్క రాలింది.
    వీరభద్రంలో వెలుగురేఖ వెలిగింది. మళ్ళీ పిలిచాడు. మూలుగు కాస్త గట్టిగా వినిపించింది.
    "బండి సాగనీ" అన్నాడు. బండి సాగింది. ముందు లాంతరు మస్తాన్, వెనక వీరభద్రం, మల్లయ్య బండి సాగింది.
    బండి రైలు స్టేషనుకు చేరింది.
    రైలెక్కించి బండి వెళ్ళిపోయింది. మస్తాన్, మల్లయ్య అందులోనే తిరిగి వెళ్ళారు.
    ఆస్పత్రిలో చేర్చేవరకు మంగమ్మ పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఎమ్మెల్యే గారిభార్యగా చికిత్స సత్వరంగా లభించింది. టెలిఫోన్లు మ్రోగాయి. డాక్టర్లు, స్పెషలిస్టులు వచ్చారు. రక్తం వచ్చింది. ఎక్కించారు. ఆస్పత్రిలో హడావుడి అంతకంతకూ ఎక్కువ అవుతుంది.
    "డెలివరీ కీ ఇంకా సమయం ఉంది" అని వీరభద్రానికి చెప్పి వెళ్ళిపోయింది నర్సు.
    వీరభద్రం సిగరెట్టూ మీద సిగరెట్లు కాలుస్తున్నాడు. పేషెంటును స్పెషల్ వార్డులోకి చేర్చామని కబురు విని అక్కడికి వెళ్ళాడు.
    మంగమ్మకు స్పృహ లేదు. పడి ఉంది.
    పక్కనే స్టూలు మీద కూర్చున్నాడు. వెంట్రుకలు ముఖం మీది నుంచి తొలగించాడు. ఆమె ఊపిరి పీలుస్తుంటే చూస్తూ కూర్చున్నాడు.
    "ఇంక భయం లేదండి. సరిగ్గా సమయానికి చేర్చారు. రక్తం అందుబాటులో ఉండడం అదృష్టం. పాపం ఎంత రక్తం పోగొట్టుకుంది. చిన్న ఆపరేషను అంతే బ్లీడింగ్ కట్టిపోయింది. ఇంక భయం లేదు లెండి. పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. అది మేం చూసుకుంటాంలెండి" అని వచ్చి లేడీ డాక్టరు కూర్చుంది.

 Previous Page Next Page