Previous Page Next Page 
షా పేజి 27

 

    "ఏం కావాలి బాబూ" అడిగిందామె.
    "ఇడ్లీ ఇవ్వు"
    వెంటనే లోపలికెళ్ళి చూసేట్లుగా ప్లేట్ ని రెండు సార్లు కడిగి రెండు ఇడ్లి పెట్టుకుని, చట్నీలు రెండు వేసి తీసుకొచ్చి అతని చేతికిచ్చింది.
    ఆకలి విపరీతంగా ఉండటం వల్ల త్వరత్వరగా ఇడ్లీలు తినేశాడు సృజన్.
    "ఇంకో రెండు తీసుకురానా బాబూ?"
    "తీసుకురామ్మా"
    మరో రెండు ఇడ్లీలు కూడా తిన్నాక గానీ అతనికి ఆకలి తీరినట్లనిపించలేదు. అక్కడే కాఫీ కూడా తాగి మళ్ళీ బయల్దేరాడతను.
    బస్ లో పోలీస్ స్టేషన్ చేరుకునే సరికి టైం తోమ్మిదయిపోయింది. ఇన్ స్పెక్టర్ రాహి చాలా బిజీగా ఉండటం చూసి కాసేపు బయటే కూర్చున్నాడు సృజన్.
    పదిగంటలకు అతనిని లోపలకు పిలిచాడు రాహి.
    "మీ ఊరేప్పుడు వెళ్ళిపోతున్నారు?" అడిగాడతను.
    "ఇంకా నిర్ణయించుకోలేదండి.........మా అన్నయ్యను ఎవరు చంపారో తేలుస్తుందేమోనని......."
    "ఇంత త్వరగానా? అయినా దానికోసం నువ్విక్కడ ఉండాల్సిన అవసరమేముంది? మీ ఊరు వెళ్ళిపొండి....... పరిశోధనలో ఏదయినా ఆచూకీ దొరికి ఎవర్నయినే పట్టుకోగలిగితే ఎలాగూ మీకు తెలియజేస్తాం......."
    సృజన్ కేం మాట్లాడాలో తోచటం లేదు........వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా కేస్ ని నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతుంది.
    పై అధికారులెవరైనా స్పష్టంగా ఆదేశాలు పంపితే తప్ప ఎంత పెద్ద మర్డర్ కేవయినా ఇలా మందకొడిగానే సాగుతుందన్న విషయం తనకు బాగా తెలుసు ..........అందుకే ఈ ఊరు వదలటం తన కిష్టం లేదు. తను వెంటపడితేనయినా రాహి కొంత శ్రద్ధ చూపుతాడేమో నన్న ఆశ!
    "ఇంతవరకూ మీకు అన్నయ్య ను చంపిన వారెవరో ఎలాంటి ఆచూకి దొరకలేదా సార్?"
    "లేదయ్యా! చెపుతుంటే వినవేం! అయినా ఇలా రోజూ కేస్ వివరాలు మమ్మల్ని అడక్కూడదు.....ఒకవేళ ఏమయినా ఇన్ ఫర్మేషన్ మాకు దొరికినా మేము ఎవరికీ చెప్పటం సాధ్యం కాదు.........." కొంచెం కఠినంగామాట్లాడాడతను.
    సృజన్ కి కోపం వచ్చింది గానీ తమాయించుకున్నాడు.
    "ఆయామ్ వెరీ సారీ టూ డిస్ ప్యూట్ యువర్ స్టేట్ మెంట్ సార్! మా అన్నయ్య హత్య ఎందుకు జరిగింది ......? ఎవరిని అనుమానిస్తున్నారు? మీకింత వరకూ లభించిన సాక్ష్యాదారాలు ఏమిటి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు మాకుంది" పౌరుషంగా అన్నాడతను.
    "లీగల్ గా మీకెలాంటి హక్కు లేదు! నౌ యూ కెన్ గెటౌట్?" కోపంగా అరిచాడు రాహి.
    "పోనీలే గదాని మర్యాదగా మాట్లాడితే నా కొడుకులు యిలాగే నెత్తికెక్కుతారు ! పో బయటకు!"
    సృజన్ కి షాక్ తగిలినట్లయింది ఇన్ స్పెక్టర్ ప్రవర్తన.
    "కొంచెం మర్యాదగా మాట్లాడు. లేకపోతే నువ్వే సరిగ్గా మాట్లాడరా నా కొడకా అనాల్సివస్తుంది" అన్నాడు రోషంగా.
    ఇన్ స్పెక్టర్ కళ్ళల్లో నిప్పులు కురిసినాయ్. సీట్లో నుంచి లేచి సృజన్ దగ్గర కొచ్చి మెడ మీద చేయి వేసి విసురుగా గడప వేపుకు నెట్టాడు. అతని బలానికి తూలి గడప కొట్టుకుని కింద పడబోయి నిలదొక్కుకున్నాడు సృజన్.
    "బాస్టర్డ్! నా మీద చేయి చేసుకుంటారా! ఇప్పుడే నీ అంతు తేలుస్తాను - కలెక్టర్ దగ్గర కెళ్ళి రిపోర్టు చేస్తాను" అన్నాడు ఆవేశం అణచుకుంటూ.
    "నీకు దిక్కున్న చోట చెప్పుకో పో - వెళ్ళరా లంజా కొడకా! ఫో బాంచాత్" యింకా ఆవేశంగా దగ్గరకు వచ్చి మళ్ళీ బయటకు గెంటబోయాడు.
    అతని చేయి తన మెడ మీద పడుతుందని ముందే ఊహించిన సృజన్ చటుక్కున తలవంచి అతని చేతిని తన చేతుల్లోకి చిక్కించుకుని బలంగా పక్కకు లాగాడు. ఈ సడెన్ కదలికకు ఊహించని రాహి గోడకు కొట్టుకుని కిందకి జారగిలబడిపోయాడు.
    అతని కళ్ళల్లో ఎర్రని జీర కనిపించింది. అతని సర్వీసులో మొట్టమొదటిసారి ఇది. ఎవరయినా తన పోలీస్ స్టేషన్ కొచ్చి తనమీదే ఇలా ప్రవర్తించటం. పెద్ద పెద్ద రౌడీలు కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేయలేదు. రౌద్రంతో వణికిపోతూ లేచి నిలబడ్డాడు. అతని మొరటు శారీరక బలం ముందు తనుఏమీ చేయలేడన్న విషయం సృజన్ కి తెలుసు. అతను మీద కొచ్చేస్తున్నాడు. అతనితోపాటు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా తుపాకులు వెనక్కి తిప్పి తనవేపు ప్రమాద కరంగా వస్తున్నారు. ఇప్పుడిక తను చేయగలిగింది ఒక్కటే. వాళ్ళకు లొంగిపోవటమో, లేక ఎదురుతిరిగి , తనలో శక్తి వున్నంతవరకూ ప్రతిఘటించి వాళ్ళు పెట్టె హింసలు భరించటమో, ఏదొక నిర్ణయం తీసుకోటానికి కేవలం కొద్ది సెకన్ల టైమ్ మాత్రం వుంది. చకచక ఆలోచించాడతను తనున్న పరిస్థితుల్లో. ఊరు కాని ఊళ్ళో పోలీసులతో విరోధం తెచ్చుకోవడం మంచి విషయంగా అనిపించలేదతనికీ . సరిగ్గా అప్పుడే రాహి పిడికిలి అతని ముఖం మీద అమితమయిన వేగంతో , బలంతో తగిలింది. ఆ మొరటు శక్తికి సృజన్ బంతిలా గోడకు కొట్టుకోవటం, తల పగిలినంత నొప్పితో , కళ్ళు చీకట్లు కమ్మి కిందకు కూలిపోవటం క్షణాల్లో జరిగిపోయింది.

 Previous Page Next Page