"సరే ! చూసిరా! అయన సొంత తమ్ముడివేనా నువ్వు."
"అవును-"
పక్కనే నిలబడ్డ బాయ్ చేతికి ఇరవై రెండో నెంబర్ గది "కీ" ఇచ్చాడతను.
"ఈయన్నీ తీసుకెళ్ళి ఆ గది ఓసారి చూపించు! ఏమీ ముట్టుకోవద్దని చెప్పు."
"పదండి సార్" అన్నాడా కుర్రాడు.
అతని వెనుకే మేడ మెట్లేక్కాడు సృజన్. హోటల్ చాలా అసహ్యంగా మెయింటేన్ చేస్తున్నారన్న విషయం తెలిసిపోతుంది....అయితే ఒకప్పుడు చాలా మంచి హోటలే అనేందుకు చాలా ఋజువులు కనబడుతున్నాయ్. నేలమీద కాలిపోయి , చిరిగిపోయి చిల్లుపడిన తివాచీ, మరకలతో నిండిన గోడలు, ప్రతి రూమ్ లోనూ ఒకపోనూ, లోపల వెలసిపోయిన కిటికీ కర్టేన్లూ , రూమ్ లో మ్యూజిక్ ఛానెల్ ఇరవై రెండో నెంబరు గది తలుపుమీద "Not in use" అన్న బోర్డు వేలాడుతోంది. బాయ్ తలుపు తెరచి లోపలికెళ్ళాడు. అతని వెనుకే తనూ నడిచాడు సృజన్. అన్నీ గదుల్లాగానే గోడలకు మాసిపోయిన రంగులూ మంచం మీద దూది బయటికోస్తున్న పరుపూ కనబడుతున్నాయ్. పరుపు మీద దుప్పటి లేదు. గదిలో ఓ అల్మారా ఉందీ. గదంతా ఖాళీగా ఉంది. అల్మారా తెరచి చూశాడు సృజన్. అది కూడా ఖాళీ. తలుపు మూసేయబోతూ అల్మారా కింద అరవేపు చూశాడు మదతపెట్టిన న్యూస్ పేపర్ పడి ఉంది అక్కడ.
కిందకు వంగి ఆ పేపర్ తీసుకోబోయాడు సృజన్.
"తియ్యకండి సార్! మీరేమీ ముట్టుకోకుండాచూడమని చెప్పారు ప్రోప్రయిటరు గారు."
సృజన్ వెనక్కు తగ్గక తప్పలేదు.
గదంతా మరోసారి చుశాడత\ను........ఇంకేవస్తువూ కనిపించలేదతనికి.
"సామానంతా పోలీసులు తీసుకెళ్లారా?" అడిగాడా కుర్రాడిని.
'అవున్సార్- చాలా మంచాయన! వచ్చినరోజే నాకు స్వీట్స్ ఇచ్చారు తినమని.'
"స్వీట్సా?"
"అవును"
"ఎందుకు?"
"ఏమో సార్, చెప్పలేదు......"
సృజన్ మనసు పరి పరి విధాల పోతోంది.
అన్నయ్య సంగతి తనకు తెలుసు. .....ఏదయినా "శుభవార్త" చెప్పాల్సివచ్చినప్పుడల్లా ఇంటికి స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ స్వయంగా తినిపించేవాడు.
మందుల కంపెనీ ప్రారంభించినప్పుడు, సంవత్సరం తరువాత లాభాలు వచ్చాయన్న విషయం చెప్పెప్పుడూ, తర్వాత కొత్త టాబ్ లెట్స్ తయారు చేసినప్పుడూ - ఇలా ఎన్నోసార్లు ఎప్పుడూ స్వీట్స్ లేందే ఏ విషయమూ చెప్పావాడు కాదు. కానీ కంపెనీ నష్ట పోవటం ప్రారంభమైన దగ్గర్నుంచీ ఇంతవరకూ -- అంటే సుమారు సంవత్సరం దాటింది స్వీట్స్ ఇంటికి తెచ్చి ----అలాంటిది వైజాగ్ వచ్చిన మొదటిరోజే హోటల్ బాయ్ కి స్వీట్స్ ఎందుకు ఇచ్చినట్లు ? అంటే ఆ రోజు అన్నయ్యకు :శుభం" సూచించేదేదో జరిగింది. అది ఏమయి ఉంటుంది."
"ఇక వెళదామా సార్" అడిగాడు కుర్రాడు.
"పద" అంటూ బయటి కొచ్చాడు సృజన్........కుర్రాడు గది తలుపు మూసి తాళం వేసేశాడు.
"ఆ నాలుగయిదు రోజుల్లోనూ అన్నయ్య నీకీమీ చెప్పలేదా?"
"లేద్సార్! ఉదయమే ఎనిమిది గంటలకు వెళ్ళిపోయేవారు ---తిరిగి సాయంత్రం ఏడు, ఎనిమిది గంటలకు వచ్చేవారు. ఒకరోజు మాత్రం అన్నారు ......ఈ హోటల్ వాతావరణం ఏమీ బాగుండలేదని! త్వరలో ఖాళీ చేసి ఎక్కడయినా ఇల్లు చూసుకుంటానని చెప్పారు.'
బహుశా --- అన్నయ్యకు ముందే ఈ హోటల్ సంగతి తెలిసి ఉండదు. రూమ్ లు చౌకగా దొరుకుతాయని ఆశపడి వచ్చి ఉంటాడు. అందుకే ఖాళీ చేసేయాలనీ నిర్ణయించుకుని ఉంటాడు. ఇద్దరూ కౌంటర్ దగ్గరికొచ్చారు.
కౌంటర్ దగ్గిరున్న వ్యక్తీ చుట్టూ మరి కొంతమంది నిలబడి ఏదో హడావుడి గా మాట్లాడుతున్నారిప్పుడు.
"థాంక్యూ! గది చూశాను" అన్నాడు సృజన్. కానీ ఆ వ్యక్తీ సృజన్ వంక చూళ్ళేదు . అతని మాటలు వినిపించుకోలేదు.
సృజన్ హోటల్ బయటికొచ్చేశాడు. హోటల్ పైన గదిలో నుంచి ఒకమ్మాయ్ కెవ్వున కేకలు వేయడం మరికొన్ని అడ మగ గొంతులు బిగ్గరగా నవ్వటం అపశ్రుతిగా వినబడుతున్నాయ్!
ఆ రోజు ఉదయం చుసిన దానికంటే ఇప్పుడు మరింత హడావుడిగా తయారయింది. ప్రతి ఇంటిముందూ ఏదొక వ్యాపారకలాపాలు జరుగుతున్నాయ్. తెలుగు బాష విశాఖపట్నం తాలుకూ ప్రత్యెకరీతిలో అందంగా చెవులకింపుగా వినబడుతోంది.
ఓ పాకముండు రోడ్ మీద వేసి వున్న నాలుగు బెంచీల మీద జనం కొంతమంది కూర్చుని ఆ పాకలోని ముసలమ్మా చేసిచ్చే వేడివేడి ఇడ్లీలు తింటున్నారు.
తనూ వెళ్లి ఓ బెంచిమీద కూర్చున్నాడు సృజన్.
ముసలమ్మ అతనిని చూసి వినయంగా దగ్గిరకొచ్చింది.