"తీసుకెళ్ళి బయట పారేయండి న కొడుకుని! ఇంకోసారి లోపలకు రానీయకండి!" దురుసుగా అంటున్నాడు రాహి.
సృజన్ కి తెలుస్తూనే వుంది. కానిస్టేబుల్స్ తనను ఈడ్చుకెళ్ళి బయట ఓ మూలగా పడేయటం, ఎవరో తన ముఖం మీద నీళ్ళు జల్లటం. నెమ్మదిగా కళ్ళు విప్పి లేచి కూర్చున్నాడు.
"త్వరగా దొబ్బెయ్ రా ఇక్కడనుంచి - లేకపోతే ఇంకా తన్నులు తింటావ్?" అన్నాడు కానిస్టేబుల్. సృజన్ కి ఆవేశం ముంచుకొచ్చింది. తనకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకూ ఎవరూ రా' అని పిలవలేదు -- తన ప్రాణ మిత్రులు తప్ప. ముక్కు మొహం తెలీనివాడు -- అందులోనూ పోలీస్ కానిస్టేబుల్స్ తనను 'రా' అనటంతో అవమానంతో రక్తం మరిగిపోయింది. ఒక్క వుదుటున లేచి ఆ కానిస్టేబుల్ మీదకు దూకాడు. అది ఏమాత్రం ఊహించని ఆ కానిస్టేబుల్ వెనక్కి పడిపోయాడు వెల్లకిల్లా. మరుక్షణం అతని మీదపడి గొంతు పట్టుకున్నాడు సృజన్. "ఏమిట్రా నన్ను 'రా' అంటావా? దిక్కు లేక మీ పోలీస్ స్టేషన్ కొచ్చినంత మాత్రానే బానిసలనుకుంటున్నార్రా?" కానిస్టేబుల్ గొంతు బిగుసుకుపోతోంది. అతను కళ్ళు తేలవస్తున్నాడు. ఈ లోగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి సృజన్ ని పట్టుకుని పక్కకు లాగాసాగారు. సృజన్ వాళ్ళ బలంముందు తట్టుకోలేక ఆ కానిస్టేబుల్ మెడ వదిలేశాడు. ఆ తరువాత నలుగురు కానిస్టేబుల్స్ కలిసి అతనిని వళ్ళు హూనమయేలా బూటు కాళ్ళతో తన్ని ఈడ్చి కెళ్ళి లాకప్ లో పడేశారు. క్రమేపీ స్పృహ తప్పిందతనికి.
తిరిగి స్పృహలో కొచ్చేసరికి టైమ్ సాయింత్రం ఆరయింది. లేచి కూర్చున్నాడు లాకప్ లో. తనతోబాటు మరో నలుగురున్నారు లోపల. లావుగా బలిష్టంగా ఉన్న వ్యక్తీ తనను చూసి జాలి పడ్డాడు.
"ఏంట్రా ఏం చేశావ్ నువ్వు?" అడిగాడు అధికార స్వరంతో. "రా' అన్న సంభోధన వింటూనే సృజన్ కి మళ్ళీ రక్తం వేడెక్కిపోయింది.
"ఇంకోసారి 'రా' అన్నావంటే రక్తం కళ్ళజూస్తాను జాగ్రత్త" అన్నాడు ఆవేశంగా. ఆతడు అలాంటి ప్రతిఘటనను వూహించలేకపోవటం వల్ల కొద్ది క్షణాలు నిర్ఘాంతపోయి చూస్తూండిపోయాడు. అంతలోనే కోపం తెచ్చుకుని సృజన్ దగ్గరగా నడిచి చొక్కా కాలర్ పట్టుకున్నాడు.
"ఏంట్రా- నీయమ్మ - పెద్ద పోటుగాడిలా ఫోజులు కొడతన్నావ్" అతని మాట ఇంకా పూర్తీ కాకుండానే సృజన్ తన శక్తి నంతా కూడదీసుకుని అతని ముఖం మీద బలంగా కొట్టాడు. అది అనుకోకుండా కంటి మీద తగలటంతో "అబ్బా" అంటూ కన్ను పట్టుకుని కింద కూర్చుండిపోయాడు. ఆ గొడవంతా చూస్తున్న కానిస్టేబుల్ చప్పున తలుపు తెరచి లోపలికొచ్చాడు, "ఏయ్ పద నువ్ బయటకు" అంటూ ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్ బయటకు తోశాడు సృజన్ ని. సృజన్ కింద పడబోయి నిలదొక్కుకున్నాడు. తను ఇప్పుడింక ఎలాంటి సాహసానికి దిగకూడదు. అందువల్ల మళ్ళీ లాకప్ కి వెళ్ళటం తప్ప మరో ఉపయోగం వుండదు. ముందా యిన్ స్పెక్టర్ మీద కలెక్టర్ కి రిపోర్టు చేయాలి. ఎస్పీకి కూడా చేయవచ్చు గానీ తనకు పోలీస్ డిపార్టుమెంటు మీదే నమ్మకం పోయింది. ఖాళీగా వున్న ఓ అటో దగ్గరకు నడిచాడతను.
"ఎక్కడికెళ్ళాలి సార్?" ఉత్సాహంగా అడిగాడు డ్రైవర్.
"కలెక్టర్ బంగాళా ఎక్కడో నీకు తెలుసా?"
"తెలుస్సార్?"
'అక్కడికి వెళ్ళాలి" అంటూ ఆటోలో కూర్చున్నాడు సృజన్.
అటో కొద్ది నిమిషాల తర్వాత కలెక్టర్ బంగాళాకు చేరుకుంది. బయట నిలబడి వున్న కానిస్టేబుల్ అతనిని ఆపాడు.
"ఏం కావాలి?"
"అర్జంటుగా కలెక్టరు గారిని చూడాలి"
"ఎందుకు?"
చెప్పబోయి, అందువల్ల ఈ కానిస్టేబుల్ తోనే చిక్కులు మొదలవుతాయేమోనని భయపడ్డాడతను.
"వ్యక్తిగతమైన విషయం......"
"అయితే రేపు ఆఫీస్ కెళ్ళి కలుసుకో......."
"అంతవరకూ ఆగటం కష్టం! యిప్పటికే చాలా ఆలస్యం అయింది-------"
అతడు ఓ క్షణం ఆలోచించాడు.
"అల్ రైట్, వెళ్ళు------"
సృజన్ బంగాళాలోని విజిటర్స్ రూమ్ లోకి నడిచాడు . అతనిని చూసి ఫ్యూన్ ఎదురు వచ్చాడు.
"ఏం కావాలి?" అడిగాడతను.
"కలెక్టర్ గారితో అర్జంటుగా మాట్లాడాలి."
"ఆఫీస్ విషయాలా?"
"కాదు, వేరే విషయం."
"ఏమిటది?"
"ఆయనతోనే చెప్తాను."
"ఈ టైమ్ లో దొరగారెవరినీ చూడరు. రేపు ఆఫీసుకి వెళ్ళండి!"
"కానీ ఇప్పుడే మాట్లాడటం చాలా అవసరం--" మొండిగా అన్నాడు సృజన్.
"ఇప్పుడు వీలుండదండీ-"
"ఆ విషయం ఆయనే చెప్తే వెళ్ళిపోతాను--"