"తల తిరిగినట్లు ఉండడం, శక్తి అంతా ఉడిగిపోయినట్లు ఉండడం, దేనిమీదా ఉత్సాహం లేకుండా ఉండడమూనమ్మా! నెల రోజుల నుంచీ ఇలాగే బాధపడుతున్నాను" అంటోంది ఎవరో పేషెంటు...
'సరిగ్గా నా స్థితీ అలాగే ఉంది' అనుకుంది శశి. తను కేరళనుంచి తిరిగి వచ్చినప్పటినుంచీ అలాగే వుంది మనసూ, ఒళ్ళూనూ. తన కెవరు ట్రీట్ మెంట్ ఇస్తారూ? అసలు మనోవ్యాధికి మందేముంది?
"అమ్మగారూ!" అన్నాడు శంకర్రావు ఆదుర్దాగా.
సర్దుకుంది శశివదన. మొహంలో చిరునవ్వు కనబడింది మళ్ళీ.
"అలాగయితే వచ్చి టెస్ట్ చేయించుకోలేదేం?" అంది.
"మొహమాటపడుతుందమ్మా!"
"ఎందుకూ?"
"పరీక్షా అదీ చెయ్యాలంటే మీకు శ్రమేమో అని!"
"పరీక్ష చెయ్యడం శ్రమా?" అంది శశి నవ్వుతూ.
'పరీక్ష చెయ్యడం శ్రమ కాదు. దేవుడు పరీక్షలని తట్టుకు నిలబడడం మాత్రం శ్రమే!" అనుకుంది. "ఒకసారి తీసుకురా! మొదటి కాన్పు జాగ్రత్తగా ఉండాలి."
"నే చెప్పానమ్మగారూ! వినడం లేదు."
"నేను చెప్పానని చెప్పు!"
"చెప్తానమ్మగారూ!"
'ఇంక నువ్వెళ్ళు' అన్నట్లు తల పంకించింది శశి. తర్వాత పెదిమ ఇంత లావున వాచిపోయి ఉన్న పిల్లాడ్ని చూసి 'ఏరా, బాబూ! ఏమయింది, చీమ కుట్టిందా?" అంది నవ్వుతూ. చేతిలో పెన్ టార్చిని వాడి పెదిమల మీదికి ఫోకస్ చేసి పొట్టనొక్కి చూసింది.
నిన్నటినుంచి వాచిపోయిందమ్మా పెదిమ" అంది పిల్లాడి తల్లి.
"ఇంజెక్షను తీసుకుంటావా? ఏడుస్తావా?" అంది శశి పిల్లాడితో.
పిల్లాడు భయంగా తల్లి కొంగు పట్టుకున్నాడు.
శశి పక్కన ఉన్న సీసాలు చూపించింది. ఒక దానిలో పెప్పరమింట్లు, ఇంకో దానిలో చాకొలెట్లు, మరో దానిలో బిస్కెట్లు, వేఫర్లు.
పిల్లవాడు ఆశగా చూశాడు.
"కావాలా?" అంది శశి.
పిల్లాడు తల వూపాడు.
"మరి పెదిమ అంత లావుగా ఉంటే ఎలా తింటావ్? ఇంజెక్షనిస్తే తగ్గిపోతుంది-సరేనా?"
పిల్లవాడి మొహంలో ఆలోచనా, భయం, ఆశా వంతులు వేసుకుని తొంగి చూశాయి.
శశి లేచి చీమ కుట్టినంత నొప్పికూడా కలగకుండా ఇంజెక్షనిచ్చింది. మొహం ఇంత పొడుగ్గా చేసి ఏడుపు ఆపుకున్నాడు కుర్రాడు.
మూడు సీసాల్లోంచి చాక్లెట్లూ, బిస్కెట్లూ, తీసి ఇచ్చింది శశి.
తర్వాత ఒకళ్ళ వెనక ఒకళ్లుగా వస్తున్న పేషెంట్ల బాధలు తెలుసుకోవడంలో తన బాధని మరిచిపోయింది.
మధ్యలో భోజనం, చీర మార్చుకోకుండానే అలాగే మంచంమీద వాలిపోయి, ఒక్క అరగంటసేపు మగత నిద్ర, తర్వాత మళ్ళీ పేషెంట్లు కష్టాలు, జబ్బులు, మందులు...
బిజీగా ఉంది శశి.
సాయంత్రం అయిదయిపోయింది. ఎప్పుడెప్పుడు ఐదవుతుందా అని ఎదురు చూస్తున్న సుధీర్ గట్టిగా నిట్టూర్చి, ఎదురుగా కూర్చున్న పేషెంటుకి డ్రెస్సింగ్ మార్చి కొత్త బాండేజి కట్టడం మొదలెట్టాడు.
అతను కట్టు విప్పడంలో, కొత్త కట్టు కట్టడంలో సున్నితం లేదు. ఎదుటి వాడి బాధ గురించిన ఆలోచనలేదు.
"అమ్మా...." అంటున్నాడు పేషెంటు నొప్పితో ప్రాణం జిలార్చుకు పోతుండగా.
సుధీర్ వాష్ బేసిన్ దగ్గర కెళ్ళి చేతులు ముందర డెట్టాల్ తో, తరవాత సబ్బుతో కడుక్కుని పక్కనే స్టాండుకి ఉన్న నేప్ కిన్ తో తుడుచుకున్నాడు.
గోడ గడియారం మృదువుగా వెండి గంటలు మోగినట్లు ఐదు కొట్టింది.
అతనా హాస్పిటల్లో జీతం తీసుకుని పనిచేస్తున్న వాడిలా డ్యూటీ చేస్తాడు. తను దానికి యజమాని ననుకోడు. అంతగా అనుకోవాల్సివస్తే, తను ఆ నర్సింగ్ హోమ్ యజమానికి భర్త అనుకుంటాడు.
శశికి ఎప్పుడూ కోపం రాదు. కానీ, వస్తుందేమో అనే భయం ఉంది సుధీర్ కి. అందుకే కనీసం పదినుంచి ఐదుదాకానన్నా అక్కడ పని చేస్తాడు. అదే శశిలో ప్రత్యేకత! కోపం తెచ్చుకోకుండా, తన మంచితనంతోనే ఎదుటి వాళ్ళని అదుపులో ఉంచి పని చేయించుకోగలదు.
'అమ్మగారికి కోపం వస్తుంది....బాబోయ్!' అని దడదడలాడుతూ పని చేస్తుంటారు అక్కడి పరిచారకులందరూ.
కాని అమ్మగారికి కోపం రావడం వాళ్ళెప్పుడూ చూడలేదు.
ఒక పేషెంటు బెడ్ దగ్గర కాస్తంత వంగి కేస్ చార్ట్ చూస్తున్న శశి, పక్కనే నిలబడ్డ సుధీర్ ని గమనించి తలెత్తింది.