Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 26


    
    తర్వాత వీణాంబగారు రెండురోజులకన్నా ఎక్కువ బ్రతకలేదు.
    
    ఒకదాని తరువాత ఒకటి విషాద సంఘటనలు విరుచుకుపడి ఉక్కిరి బిక్కిరి చేసిపారేశాయి.
    
                                             11
    
    స్టేట్స్ లో వుంటూన్న కూతురు వచ్చి ఇక్కడ నెలరోజులపాటు వుండి వ్యవహారాలన్నీ చూసుకుంది.
    
    ఆమె ధైర్యం, వ్యవహారదక్షత చిన్మయిని ఆశ్చర్యపరిచింది.
    
    ఆ యిల్లు వేరొకరికి అద్దెకిచ్చి, ఆ అద్దె బ్యాంకులో జమకట్టటానికి ఏర్పాటు చేసింది.
    
    చిన్మయితో ఆమె చాలా కలుపుగోలుగా వుంది. ప్రతిదానికీ 'అలా చేద్దామా? ఇలా చేద్దామా?' అని సలహా అడుగుతూ వుండేది.
    
    నెలరోజులుండి ఎంతో చాకచక్యంతో పనులన్నీ చూసుకొని మళ్ళీ స్టేట్స్ కి వెళ్లిపోయింది.
    
    వెళ్ళేముందు చిన్మయి దగ్గర్నుంచి రాజీవ్ ఫోన్ నెంబరూ, ఎడ్రస్ తీసుకుంది. "టెక్సాస్ మాకు దగ్గరే. వీలుంటే కాంటాక్ట్ చేస్తాను" అంది.
    
                                                                  * * *
    
    రాజీవ్ లేకపోవటం, కొండంత తోడుగా వున్న వృద్ద దంపతులు మరణించటం, చిన్మయికి జీవితం దుస్సహమనిపించింది. ఒక్కక్షణంకూడా వంటరితనం భరించలేకపోతోంది. ఊరికినే గుండెల్లోంచి దుఃఖం పొర్లుకుని వస్తూ వుండేది. ప్రపంచంలో తనకెవరూ లేరు. ఏదో అన్యాయం జరిగిపోయింది అన్న బాధ తోలిచేత్శూ వుండేది. కిటికీ దగ్గర నిలబడి ఎదురింటివైపు చూస్తూ నిలబడితే గుండెలు వణికిపోయేవి. వెక్కి వెక్కి ఏడ్చేసేది.
    
    రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు. వంటరితనం, మనసంతా బరువు, చివరకు భరించలేక డాక్టరు దగ్గరకెళ్ళింది.
    
    ఆయన ఎగ్జామిన్ చేసి ఏమీలేదని చెప్పి అవసరమయితే వేసుకొమ్మని కాంపోజ్ టాబ్లెట్స్ రాసిచ్చాడు.
    
    చిన్మయి కాంపోజ్ వేసుకుని నిద్రపోవటానికి అలవాటు పడింది.
    
                                                                  * * *
    
    ఎప్పుడైనా గొంతు విప్పి పాడుదామనుకునేది.
    
    కాని గొంతుదాటి స్వరం బయటకు వచ్చేదికాదు. ఏమైపోయింది తన గళం? ఎందుకు పాడలేకపోతోంది? ఎందుకు తన గొంతు మూగపోయింది?
    
    వంటరితనంతోబాటు భయం, మామీవాళ్ళ కుటుంబంలో జరిగిన సంఘటనలు కళ్ళముందు తిరుగుతూ, వొళ్ళంతా జలదరిస్తూ వుండేది.
    
    ఓరోజు రాత్రి...
    
    పదిగంటలు దాటి వుంటుంది. చిన్మయి ప్రక్కమీద పడుకుని నిద్రపట్టక అటూ ఇటూ కదుల్తోంది. అంతకుముందు  రెండురోజుల్నించీ రాజీవ్ తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. అతను దొరకటంలేదు.
    
    మనకు కావాల్సినవారు నెలలతరబడి కనబడకుండా వుంటే... అసలిన్నాళ్ళూ కలిసివున్నామా, తమ ఇద్దరి మధ్యా వున్న బంధమంతా మిధ్యేనా, యీ దూరం ఎప్పటికైనా ద్గాగారకు జరుగుతుందా..... ఇలా రకరకాల అర్ధంలేని, రూపంలేని ఊహలు ఆక్రమిస్తూ వుంటాయి.
    
    ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో ఓ కంఠం వినిపించింది.
    
    చిన్మయి ఉలిక్కిపడినట్టయింది. ఎంత అద్భుతంగా వుంది ఆ గొంతు!
    
    ప్రక్కింట్లోంచి వినిపిస్తోంది. ఆ పాట అతి శ్రావ్యమైన పురుషకంఠం. లేచి కిటికీ దగ్గరకెళ్ళి నిలబడింది.
    
    ప్రక్కింట్లో కాపురమున్న వాళ్ళు ఖాళీచేసి వెళ్లిపోయారనీ, ఎవరో కొత్తగా దిగరనీ చిన్మయికి తెలుసు! అంతకుమించి ఏమీ పట్టించుకోలేదు.
    
    ముద్దుగారే యశోద ముంగిలి ముత్యము వీడు.
    
    దిద్దరాని మహిమల దేవకీసుతుడు.
    పల్లవి చాలా మనోహరంగా ఆలపించాడు.
    అంతనింత, గొల్లెతల, అరచేతి మాణెకము
    పంతమాడె కంసుని సాలి వజ్రము.
    కాంతుల మూడు లోకాల, గరుడవచ్చబూస
    చెంతల మాలో నున్న చిన్న కృష్ణుడు.
    
    ఇది చాలా ప్రాచుర్యం వున్న అన్నమాచార్యుల కీర్తన. తనకెంతో ఇష్టమైన కురంజరాగంలో పాడుతున్నాడు.
    
    రతికేళి రుక్మిణికి రంగుమోని పగడము
    మితి గోవర్ధనపు గోమేధకము
    సతమై శంఖచక్రాల వైఢూర్యము గతియై తమ్ముగాచె కమలాక్షుడు.
    
    చిన్మయి శరీరం పులకించినట్లయింది. కిటికీ గ్రిల్స్ మీద ఆనివున్న ఆమె చేతులు అనుకోకుండా తాళం వేస్తున్నాయి.
    
    కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
    యేలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము
    పాలజ నిధిలోన బాయని దివ్య రత్నము
    బాలునివలె తిరిగే పద్మనాభుడు
    
    ఈ కీర్తనలో స్వామిని నవరత్నాల అందాలతో పోల్చి వర్ణించాడు అన్నమాచార్యుడు.
    
    ఆ గానం వింటున్నంతసేపూ మనసులో ఆవరించైనా శూన్యమంతా తొలగి పోయినట్లు, విషాదమేఘాలు ప్రక్కకి తప్పుకొని వెన్నెలకు చోటిచ్చినట్లూ దివ్యమైన అనుభూతి.
    
    పాట ఆగిపోగానే మళ్ళీ శూన్యం ఆక్రమిస్తూన్నట్లు భావన.
    
    అంతవరకూ వెలుగుతోన్న దీపం ఆరిపోయింది.
    
    వెలుగుపోయి చీకటి ఆవరించింది.
        
    ఆ చీకట్లో కిటికీకానుకుని, గ్రిల్స్ మీద చేతులాన్చి చిన్మయి చాలాసేపలా నిలబడివుంది.

 Previous Page Next Page