Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 27


                                     స్వకీయపురాణం

ఏం చేస్తాడు పాపం
కెరటం మీద కెరటం మీద  కెరటం లాగ
కష్టం మీద కష్టం మీద కష్టం
కరుపు మీద మిరప్పొడి మీద
రోకటి పోటులాగ

వాటాల ప్రకారం గూటాయిస్తున్నప్పుడు
ఏం చేస్తాడు పాపం వాడు
ఎన్నింటికని ఏడుస్తాడు
ఇందిరమ్మ కొడుకు చనిపోయాడని
ఇన్ స్పెక్టర్ని నక్సలైటు చంపేశాడని
ఎక్కడో ఎప్పుడో ఎవడో
ఇస్పేటు జాకీలను చింపేశాడని
ఎక్కడో ఎప్పుడో ఎవడో
ఇస్పేటు జాకీలను చింపేశాడని
ఎంతసేపని ఏడుస్తాడు
కొడవటిగంటి1 గుండెలాగిపోయాయని
సూర్యుడు చెప్పకుండా చెయ్యకుండా
చప్పచప్పగా చల్లారి పోతున్నాడని
భావాల పరుగుల వేగం అందుకోవడానికి
భాషకి ఊపిరి చాలడం లేదని
ఎంత సేపని ఏడుస్తాడు
ఏం చేస్తాడు పాపం వాడు?
అంచేత ఆ దుఃఖంలో వాడో
ఆనపకాయలో దూరిపోయాడు
కాయని కొనుక్కున్న ఓ యిల్లాలు
దాన్ని మధ్యకి రెండుగా తరిగింది
ఇల్లాలు కత్తిపీటని తీసినప్పుడే
ప్రమాదాన్ని పసి కట్టి
నేర్పుగా వాడు తన సైజు తగ్గించుకుని
ముచ్చికలో దాక్కున్నాడు
కూర తరిగి ముచ్చికను ఇల్లాలు
పెంటకుప్ప మీద పారేసింది.
దాన్నో ఆవు మింగింది.
ఆవు ఆనప ముచ్చికను తింటుందా
అని అనుమానం అక్కర్లేదు
ఆకలేస్తే ఆంధ్రుల పత్రికలన్నింటినీ
అమాంతంగా తినేస్తుంది.
ఆవు ఆహారకోశాల్లో
నిరాఘాటంగా విహరిస్తున్నాడు
తన శరీరాన్ని రసాయనిక
ద్రవ్యాలలోనికి మార్చేసుకున్నాడు
ఆహా! ఆవు జీర్ణకోశాల్లో విహారం
అయిదు నక్షత్రాల హోటేల్లో చరిస్తున్నట్టుందతనికి!
ఇంతట్లోనే "ఇదేమిటి! ఇక్కడున్నా" ననుకున్నాడు
"నా మానవ లోకానికి నేను పోవా" లనుకున్నాడు
అనుకోవడమే తడువుగా ఆవు మూత్ర పురీషాల ద్వారా
బైటికి వచ్చేశాడు
మళ్ళీ మనుష్యుల్లో పడ్డాడు.
రసాయనాలను తిరగీ తన రూపానికి మార్చుకున్నాడు.
బంగాళాఖాతంలో ప్రవేశించి బాగా స్నానం చేశాడు.
కల్మషమంతా కడుక్కుపోయింది
నిటారుగా నిలుచున్నాడు.
గాలిలో చెయ్యి ఊపి కావలసిన
దుస్తులు తెప్పించుకున్నాడు
(ఆమాత్రం కసాయి బాబుల
గజకర్ణ గోకర్ణ విద్యలు వాడికి కూడా తెలుసు)
ప్రపంచాన్ని సవాలు చేస్తూ
"నువ్వు పెట్టే కష్టాలకి
నేను లొంగి పోన"న్నాడు
ఎవడువాడు? మరెవడో కాడు శ్రీశ్రీ


                                                                                రచన: 27-9-1980
                             ముద్రణ: మరో ఝంఝ విరసం కవితా- సంకలనం అక్టోబరు,1980
                                                 పునర్ముద్రణ: స్వాతి వారపత్రిక5సెప్టెంబర్, 1986


1.కొడవటిగంటి: కొడవటిగంటి కుటుంబరావు(1909-1980) సుప్రసిద్ధ తెలుగు కథ, నవలా రచయిత, విమర్శకుడు, మేధావి. ఆగస్టు17వ తేదీ చనిపోయారు.

  

 Previous Page Next Page