Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 26


                                        బాలల వత్సరం
    

అభ్యుదయం చూపే డైరెక్షన్ లో
ఆల్ ఇండియా  రేడియో సమక్షంలో
అందరినీ మించి రాయని పక్షంలో
ఇరికిస్తారు నన్నో క్రిమినల్ సెక్షన్లో

తెలుగునాటి దేదీప్యమాన కవిసేన
ఇక్కడే ఒక్కుమ్మడిగా కలిసేనా?
అలాగైతే ప్రగతి విరోధుల కవసాన
దశ ప్రాప్తించినట్లే ఈ దివసాన

ఇది బాలల వత్సరం
జరిపిద్దాం ఉత్సవం
మరిచిపోయి మత్సరం
వివరిద్దాం వాస్తవం

ఆహార మపుష్టికరం
భావి  అసంతుష్టికరం
శిశు సంతతి నష్టకరం
సర్వత్రా భ్రష్టజనం

ఉన్నారు ఊరిలో రాకాసు
లెందరో వారికో లూకాసు1
వార్త వినిపించాలి కామోసు
లేదా వెదకాలి గ్లూకోసు

మనదేమో నంబర్ వన్ డెమోక్రసీ
టు బి ష్యూర్, ఇది స్వర్గాదపి గరీయసి
మనకున్నది ఉక్కు చట్రపు బ్యూరోక్రసీ
మన మనసులు వదలని మసి హిపోక్రసీ

అంకెలతో గారడీ
అనుభవాల ప్యారడీ
అటువంటిది కోరడీ
రచయిత పగవాడికీ

రాయవచ్చును మహా ప్రగ్ధరలు
రసమాధురీ సుధా నిర్ఘరులు
అపరిమితానందవర్ధనులు
అటువంటి వెవ్వరూ వద్దనరు

అయితే మరెందుకీ కసరత్తులు?
రుచిలేని పచిలేని బిసకత్తులు
అని కొందరడ్డుగా అడగొస్తురు
అనుమాన పెనుభూత వశవర్తులు

చెడ్డ పిల్లలకి తొడపాశం
పెట్టడమనేది కడుఘోరం
పెంపకమందే పరిణామం
కలిగించాలి మనకోసం

బాలలే విజ్ఞాన కేతువులు
నేడు రేపుల మధ్య సేతువులు
చంద్ర బంధుర సుధా శీతువులు
మానవత్వ వికాస హేతువులు

If there is anything like కవిత్వం
That could wake us out of శవత్వం
And restore our pristine రవిత్వం
It can't be anything other thanమానవత్వం

ఇది బాలల హాయనం
మంచికీ వాతాయనం
ఆనంద రసాయనం
ఇదే నా ఉపాయనం

అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా విజయవాడ కేంద్రం
ఏర్పాటు చేసినకవిసమ్మేళనంలో చదివిన కవిత.


    
                                                ముద్రణ: వాణి పక్షపత్రిక 7-7-1979 (కొన్ని భాగాలు)
                                                         పునర్ముద్రణ:స్వాతి మాసపత్రిక -ఆగస్టు 1979


1. లూకాసువార్త: బైబిలులో ప్రసిద్ధమైన ఆధ్యాయం.

 Previous Page Next Page