"నువ్వెంత? నీ బ్రతుకెంత?"
"ఎంతో తెలియాలీ అంటే కొంతకాలం మీరు ఎదురుచూడాలి సవ్యసాచీ..."
"అవుట్" ఆవేశంగా చేయి చూపించాడు.
"థాంక్స్!"
వచ్చినప్పుడు మామూలు నిప్పురవ్వలా అనిపించినా ఆశ్రిత ఇప్పుడు ఓ బలమైన వ్యవస్థని మండించగల దావానలంలా కదిలింది.
* * *
"ఏమైంది?"
బంజారాహిల్సులోని ఖరీదైన భవంతిలోని ఓ బెడ్ రూంలో దిక్కులు చూస్తూ కూర్చున్న సూర్నారాయున్ని అడిగింది ఏకాంత...
సుమారు అరగంటసేపటి నుంచీ గమనిస్తూందామె.
వయసు ఉడిగినా శృంగారంలో గట్టిగానే హడావుడి చేసే సూర్నారాయణ అన్యమనస్కంగా వున్నాడు.
ఏకాంత లాలనగా అతడి భుజాలపై తలానించింది. ట్రాన్స్ పరెంట్ నైటీలోని ఆమె ఒంపులు అతడ్ని తాకుతున్నా చలనం లేదు.
"మిమ్మల్నే" రెట్టించింది.
ఆమె గొంతులోని ఆత్మీయత అతడికి చాలా రిలీఫ్ నిచ్చింది.
ఏకాంత అతడి జీవితంలో అడుగుపెట్టింది ఈ మధ్యనే అయినా అతడికి అద్భుతమైన ప్రేరణనందించే ఆయుధమైపోయింది.
ఉద్దరించగల ఉద్రిక్తత ఆమెది.
శృంగారంలో బాధని అభినయిస్తూ అతడ్ని ఆనందపరచగలదు. అతడి ఏకాంత మనోప్రాంగణంలో అడుగిడగల ఏకైక కాంతలా నగ్నదేహాన్ని అంతరిక్ష గవాక్షంలా తెరిచి అనంత దర్శనానికి, అనురక్తికీ కారణము కాగలదు.
అతడి ఆందోళనలకి స్వస్తి చెప్పగల దివ్యౌషధం ఆమె మాటల్తో మంత్రముగ్ధం చేస్తుంది... బోధనలతో బాధలనీ నివారిస్తుంది.
అందుకే ఆ రోజు ఈవెనింగ్ ఆడిషన్ లోని వార్తని ఆమెకు చెప్పకుండా వుండలేకపోయాడు. అది ఆశ్రిత ఇవ్వబోతున్న ఇంటర్వ్యూకి సంబంధించినది.
"దామోదరం అసాధ్యుడైన పత్రిక యజమాని ఏకాంతా" అన్నాడు ముందు.
"ఆ మధ్య చిన్న గొడవతో శ్వేతని అవమానించిన ఓ అబ్బాయిని గూండాలతో కొట్టిస్తే ఆ తర్వాత వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చాడు."
"దానికి మీరు బాధ్యులెలా అవుతారు?"
"అవును కదా... కానీ ఆ చచ్చినవాడి అక్క బాగా చదువుకున్న ఆడపిల్ల కావడంతో పత్రికలకెక్కి దామోదరం ద్వారా నన్ను దెబ్బతీయాలనుకుంటూంది" అసలు విషయానికి అప్పుడు వచ్చాడు.
"అయితే మాత్రం మీరెందుకు కంగారుపడాలి?"
రెండు క్షణాలపాటు ఆలోచనల్లో కూరుకుపోయిన సూర్నారాయణ నెమ్మదిగా అన్నాడు "నీకు తెలీదు ఏకాంతా! రాజకీయ నాయకుల జీవితం చీమలపుట్ట లాంటిది. ప్రజలు చీమల్లా కదిలి పుట్టని పేరిస్తే అందులోకి పాముల్లా మేం ఎంటరైపోతాం. అంతా సవ్యంగా వున్నంతకాలం ప్రజలు మాకు పాలుపోస్తూ పూజ చేస్తూనే వుంటారు. కాని మేం కాటేసే పాములమని పత్రికలు రచ్చకీడిస్తే ఛీ కొడతారు. పార్టీ నాయకుల్ని పదవీ భ్రష్టుల్ని చేస్తారు."
ఒక రాష్ట్రాన్ని శాంతిభద్రతల దృష్ట్యా శాసించగల హోం మినిస్టరిలా ఆందోళన పడడం ఆమెకు విభ్రమంగా వుంది. "కమీషనరు సవ్యసాచి మీకు కావాల్సిన వాడిగా?"
"కావాల్సినవాడేమిటి కాబోయే వియ్యంకుడు"
క్షణంపాటు ఏకాంత రక్తప్రసరణ స్తంభించినట్టయింది. "అలాగా" అంది సాలోచనగా.
"అలాంటివారు కూడా ఆందోళనపడుతున్నాడూ అంటే ఆశ్రిత సామాన్యురాలు కాదు. అప్పటికీ లేపించేద్దాం అన్నాను కాని ఆమె వెనుక పత్రికలు, స్టూడెంట్సు చాలామంది సపోర్టుగా వున్నారంటున్నాడు. అదే నిజమైతే నాకు త్వరలోనే ఉద్వాసన తప్పదు"
బడలికగా కళ్ళు మూసుకుంది.
ఒకనాడు తనూ సవ్యసాచి మూలంగా సమస్యలో ఇరుక్కుంది. కాని నిస్సహాయంగా బలైపోయింది. అలాంటిది ఇప్పుడు ఆశ్రితనే ఓ అమ్మాయి ఇంతమందిని వణికించగలుగుతూంది.
ఆమె వశిష్టకీ, శ్వేతకీ జరగబోయే పెళ్ళి గురించి ఆలోచించడం లేదు. అర్జెంటుగా సూర్నారాయణ్ణి కాపాడాలనుకుంటూంది.
అతడు పదవిలో కొనసాగితే తప్ప తను అనుకున్నది సాధించలేదు.
అందుకే ఆశ్రితలాంటి తెలివైన అమ్మాయిని ఎదుర్కోవాలనుకుంది.
సూర్నారాయణ కథలో ముఖ్యపాత్రగా మారి చాలా సాధించాలని ఎదురుచూస్తున్న ఏకాంత "ఆశ్రిత విషయం నాకు వదిలిపెట్టండి. ఆమె సంగతి నే చూస్తాను" ఓ ఛాలెంజ్ లా అంది నెమ్మదిగా నిట్టూర్చుతూ.
* * *
ఆకాశంలో సూర్యుడు వికృతపు రాతలు రాస్తున్నట్టు కిరణాలతో నేలని కాల్చుతున్న మిట్టమధ్యాహ్నం వేళ...
ఎవరో వచ్చిన అలికిడికి తలపైకెత్తి చూసింది ఆశ్రిత...
ఎదురుగా ఏకాంత నిలబడి వుంది అందంగా, హుందాగా....
ఇంటి బయట ఆగివున్న కారు ఏకాంత నేపథ్యానికి ఆమె అందించని సంగీతంలా మెరిసిపోతూంది.
"మీరు..."
అది ఆహ్వానం కాదు....ఆశ్రిత చూపుల్లో ఏకాంత ఎవరో తెలుసుకోవాలన్న ఉత్కంఠ.
"నా పేరు ఏకాంత"
అందమైన పేరనిపించింది ఆమెలానే.
"చెప్పండి" మృదువుగా అంది.
రెండు క్షణాలపాటు ఆశ్రితని తదేకంగా చూస్తూ వుండిపోయింది.
కలలుకనే కళ్ళే కాని ఆ కళ్ళ మాటున ఎర్రజీర సంధ్యలున్నాయి. విశ్వమే ఒదిగి బిందువైనంత వర్చస్సు మొహంలో కనిపిస్తూంది కాని హాలాహలం నిండిన హవేలీలా అనిపిస్తుందెందుకో... వెన్నెల రెక్కలు తొడుక్కున్నట్టున్న ఆకుపచ్చని యవ్వనం ఉద్వేగపు ఉచ్చ్వాసనిశ్వాసాల మధ్య నెత్తుటి నిశ్శబ్దతని తలపుకి తెస్తూంది.....అది గుండె నిబ్బరమో లేక ఎవరి అండా లేని విషాదమో ఆమె వాడీ వాడని పొగడదండలా వుంది. అయినా ఆమె చూపులు చంద్రకిరణ తంత్రుల కిన్నెరని శృతి చేసినట్టుకాక విచలిత విద్యుద్విహంగమై రణన్ని నాదాల్ని స్ఫురింపచేస్తున్నాయి.
"నేను ఎవర్నయినా కాని నీ మంచి కోరి వచ్చినదాన్ని" సాలోచనగా అంది ఏకాంత.
"అలాగా?" ఆశ్రితకి ఏం అర్ధమైందో వ్యంగ్యంగా అంది తను కూడా "సంతోషం".
"పత్రికలో మీరు ఇవ్వబోయే ఇంటర్వ్యూ గురించి అనౌన్స్ చేశారు"
ఆమె ఏ పని మీద వచ్చిందో పూర్తిగా బోధపడిపోయింది ఆశ్రితకి.