"అందరివిషయం నీకెందుకు? నీ విషయం చెప్పు?"
రామయ్య కాపు అందరివంకా ఓసారి గుండ్రంగా చూసి, పెద్దపెట్టున నవ్వి 'నేనివ్వనయ్యా, ఏం చేస్తారు?' అన్నాడు.
ఈ వ్యక్తితో మాట్లాడటం అంత సులభంకాదని గ్రహించాడు శివనాథరావు. లేచినిలబడి నెత్తిన చెట్టుమీదనుంచి వ్రేలాడుతోన్న ఓ చింతకాయ కోసి తింటూ కూర్చున్నాడు.
"అదెందుకు బాబూ? కొబ్బరిబోండాం కొట్టిపెడతానుండండి" అంటూ సుబ్బిగా అని కేకేశాడు. లోపలినుంచి కుర్రాడొకడు వచ్చాడు. "కొబ్బరిబోండాలు పట్టుకురా అందరికీ' అన్నాడు.
"సరే! మా విషయం చెప్పవయ్యా?"
"నేనసలు ఎందుకివ్వాలో ముందు మీరు చెప్పండయ్యా?"
మల్లిఖార్జునం కోరచూపు చూశాడు. 'సహకారం మాట పూర్తిగా మరిచిపో యావన్నమాట. మా మాటకు ఈ పాటి విలువలేకుండా వుంటే అసలీ పంచాయితీ ఎందుకయ్యా, పంచాయితీ?' అన్నాడు.
"రూల్సెహే!" అన్నాడు రామయ్యకాపు. 'దరమం నాలుగు పాదాలా జరిగి పోతుండాది. సహకారం సహకారం అంటుండారేం. తస్సదియ్యా చెప్పండయ్యా? అని కర్ర నేలమీదికి ఒదిలేసి ఒక్కోపాయింటుకూ ఒక్కో వేలు ముడుస్తూ 'మీరేం చేస్తిరీ, ఎంతమందికి నీళ్ళిచ్చిరీ, ఎంతమంది కొంపల్దీసిరీ' అని భూమి కంపించేటట్లు పగలబడి నవ్వాడు.
మల్లిఖార్జునం కోపంతో మూర్జిల్లాడు. "ఓహో, పంటకాలవ?"
రామయ్యతాత ఒంగి కర్ర తీసుకున్నాడు. దాన్ని నేలమీద నిలువుగా నిలిపి, దానిమీద గడ్డం ఆనించి, ఏమిటీ పంటకాలవా? ఎక్కడుంది?"
మల్లిఖార్జునం జవాబుకోసం తడుముకుంటున్నాడు. కుర్రాడు లోపలినుంచి గంగాఫలాలు తెచ్చి కత్తితో కొట్టసాగాడు.
"పంటకాలవ వదలకపోతేనే యివన్నీ పండాయా?" చివరకు ధైర్యంచేసి అల్లంతదూరంలో వున్న ఓ నల్లటి యువకుడు అడిగాడు.
"పంటకాలవలు తగలేసిరి. మల్లిఖార్జునంగారు మరచిపోయినట్లున్నారే? ఆరోజుల్లో మేము కనిపిస్తామా? కాలవలోని నీళ్లన్నీ ఆరి నలభై ఎకరాల మాగాణీ తడపటానికే సరిపోయే. ఆరి పొలమంతా సమృద్దిగా తడిసి, నీరు యివతలకొచ్చేసరికి ఏడాది తిరుగుద్ది. ఇవతలాళ్ళ పొలాలన్నీ ఎండి ఎండి ఏమయిపోయినా ఫరవాలేదు. ఇక్కడంతా పెద్దలుండారు చెప్పమనండయ్యా ఆర్ని. పెమాణికం చెయ్యమనండి-ఒక్క చుక్కయినా వాడుకుంటానేమో?"
ఇంత గంభీరంగా మాట్లాడుతున్నా, అతని ముఖంలోని సహజమైన చిరునవ్వు మాయంకాలేదు. కొబ్బరినీళ్ళు తాగుతూ ఎవరూ బదులు చెప్పలా.
మళ్ళీ రామయ్య అందుకున్నాడు. 'నేనడుగుతుండాను. కోపం వద్దు ఏ మొహాలు పెట్టుకుని వచ్చారయ్యా అడగటానికి? నీళ్ళకోసం నా రెక్కలు ముక్కలు చేసుకున్నాను. ఆఁ వానెప్పుడు పడుద్దా అని వెయ్యికళ్ళతో ఎదురుచూశాను. దొరువుల్లోంచి నీళ్ళు మోసి నేనూ, నా బిడ్డ చెమట్లు ధారపోశాం. మా మానాన మేము బతుకుతుంటే దొరలు వొచ్చారూ తఫ్రీదు అడగటానికి?"
మల్లిఖార్జునం గొంతు సవరించుకుని 'తర్వాత నీళ్ళు వాడుకోమంటే నువ్వే వద్దన్నావు' అన్నాడు బలహీనంగా.
"నేలంతా యింకిపోయాక" అన్నాడు ఎగతాళిగా రామయ్య.
మోహన్ యిప్పటికి "రామయ్యా" అన్నాడు.
"అయ్యా!"
"అన్నీ తెలిసినవాడివి నువ్వే యిలాగంటే మిగతా రైతులకి పట్టపగ్గాలుంటాయా? జరిగిందేదో జరిగిపోయింది. వచ్చే యేటినుంచి యిలాంటి పొరపాట్లు జరగవని హామీ యిస్తాను. మనం పంచాయితీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఒకరికి అన్యాయం జరక్కుండా వుండాలనేగా! ఇలా తిరుగుబాటు చేస్తే మల్లిఖార్జునంగారికి మాత్రం పట్టిందా ఇదంతా చేయటానికి? ఈసారి మీరంతా కట్టకపోతిరి....గవర్నమెంటుకి కట్టడానికి ఆయనచేతిసొమ్ము నూటయాభయి దాకా వదిలింది. ఆయనకూడా విసిగిపోయి రాజీనామా ఇస్తానంటున్నాడు" అని మల్లిఖార్జునం వంక ఓరగా చూసి "ప్రయాణాలకు మనకు రోడ్డుసౌకర్యం లేదు. చుట్టుప్రక్కల ఎలక్ట్రిసిటీ వచ్చింది, మనకు రాలేదు. బుడమేరుపొంగి ఊరిని ముంచేయకుండా ఆ నీళ్ళని సద్వినియోగం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి చిన్నవిషయానికీ మనలో మనకు రాజీ కుదరకపోతే ఎవడూ ఇదంతా చేసేదీ?"
"ఓరి మోహన్" అని లోలోపల అభినందించకుండా వుండలేకపోయాడు శివనాథరావు.
రామయ్యతాత మౌనం వహించాడు. కొంచెం ఆగి మెల్లగా "నేను మాత్రం ఏమన్నానయ్యా? అన్నేయం జరిగింది కాబట్టి కోపం పట్టలేక అడిగేశాను....అల్లాగేలే అయ్యా ఎల్లుండి తవరి యింటికి తెచ్చి యిచ్చుకుంటా."
"నాకెందుకూ? మల్లిఖార్జునంగారికే యియ్యి."
"అదంతా నాకుతెలవదు. మీకే యిచ్చుకుంటాను. ఆ యవ్వారం తమరూ తమరూ చూసుకోండి."
"సరే" అన్నట్లు మోహన్ తలఊపాడు. అంతా లేచినిలబడ్డారు. మల్లిఖార్జునం ముఖంలో కత్తివాటుకు నెత్తురుచుక్క లేదు. శివనాథరావు సానుభూతితో నవ్వుకుని వాళ్ళతోబాటు కదుల్తున్నాడు. వెనకనుంచి రామయ్య అంటున్నాడు "ఎక్కడికి దొరా అటూ? చలమయ్యా, నారయ్యల దగ్గరకేనా?"
మోహన్ "అవు"నన్నాడు.
"అటు వెళ్తున్నారా? సరే కానివ్వండి.. కానీ....కర్రలు జాగ్రత్తగా పట్టుకోండి. ఆళ్ళసలే మొండోళ్ళంటారు."
"అంత రౌడీలా?" అన్నాడు మోహన్.
"నాకు తెలవదయ్యా నేనైతే మిమ్మల్నాకాడికి వెళ్ళమని సలహా యివ్వను."
మోహన్ తల పంకించి "కానియ్యి అదీ చూద్దాం" అన్నాడు.
"పదండి, ఆ తెంపరితనం అంతు తేల్చుకుంటా."
మనుషులు నీరసంగా కదిలారు. గట్టినెల అక్కడక్కడా మెత్తగా తెగుతోంది. ప్రక్కపొలంలో గుంజకు కట్టి వేయబడుతోన్న నల్లమేక మేమే అని అరుస్తోంది. తాకుముడి గట్టిగా బిగించి కర్ర భుజాల సందులో యిరికించిన తెల్లగడ్డం సాయిబు "అరే బేగి వచ్చేస్తా, ఏడవక వుండుబే" అంటూ దాని శరీరం ఓసారి ప్రేమగా నిమిరి సరదాగా వీళ్ళవెంట పడ్డాడు. ముత్తయిదువకు కుంకుమ చెరిగినట్లు-నిప్పు చింది మబ్బుల్లో తలదాచుకొనగా, కళావిహీనమైంది ఆకాశం. పడమటి దిక్కునుంచి వీస్తోన్న ఈదురుగాలి భూమిని వలయంలా చుట్టి పల్టీ కొట్టిన అర్భకుడి అస్థిపంజరంలా యీసురోమంటోంది. చేలు సమీపించారు.
"మీసాలున్న వ్యక్తీ, ముసిలాడూ, తలపాగా ప్రాచీనకాలంలో రాజ దురంధరునిలా చుట్టిన ఆజానుబాహువూ, నూనూగుమీసాల నునుపైన యువకుడూ, కండలు తెగబలిసి, కత్తికిసైతం ఎదురుతిరిగే కండలుగల అంబుదళ్యాముడూ, పమిట నడుముకు బిగించి సివంగిలా చిటచిటలాడుతోన్న కన్నెపడుచూ, కిరాయికి ఆశపడి గునపాల్తో వచ్చిన కూలీలూ...." ఇదీ దృశ్యమక్కడ.
ముసలాడు ముందుకొచ్చాడు. నూనుగుమీసాల నునుపైన యువకుడు వారించి విఫలుడయ్యాడు.
"లాభం లేదు."
మల్లిఖార్జునం గొంతు సవరించుకున్నాడు. పదిమంది పనిచేసిన మట్టిమీద నిలబడి మాట్లాడాలి నిజాలు.
"తఫ్రీదు కావాలి."
"లాభం లేదన్నాను."
"ఎందుకు?"
"ఈ యేడు మాకంతా నష్టమే, కష్టమే ఇయ్యమని కబురుచేశాం."
"అలాగా? అవేమిటి ఆ బస్తాలూ?" ధాన్యంతో బలిసిన బస్తాలు బరువుగా అటు పడివున్నాయి.
"అవా, అదే."
"ఎవరిచ్చారు?"
"దేముడు."
వారెవా! తాను ఏదో సినిమా చూడటంలేదు గదా అనుకున్నాడు శివనాథరావు. ఏదో ఓ పక్షానికి సానుభూతి అంధచేయటం కోసం ఆరాటపడుతోంది మనసు. రెండూ న్యాయాలే, రెండూ అన్యాయాలే. దయా, దయా యుద్ధం చేసుకుంటున్నాయి. కోపం, కోపం స్నేహం చేసుకుంటున్నాయి. మల్లిఖార్జునం ఏదో అరిచాడు.
"అబ్బా!" మరుక్షణం నెత్తుటితో తడిసిన తలతో నేలవ్రాలుతున్నాడు.