"ఇహ ఎప్పుడూ అంతేనా?"
"కాదు."
"అదేం?"
"అది యింకా ఎన్నో రోజులు బ్రతకదు."
8
ఒకరోజు మధ్యాహ్నం మూడుగంటలవేళ కాఫీలు త్రాగి మోహనరావూ, శివనాథరావూ పులిజూదమాడుతున్నారు. ఇంతలో "దణ్ణం దొరా" అంటూ చొక్కా లేకుండా, పంచె గోచీపెట్టి బిగించిన ఓ నడివయసు మనిషి అక్కడకు వచ్చాడు.
"రైతులెవరూ తఫ్రీదు యివ్వటల్లేదండీ. కర్రలుచ్చుకుని తన్నటానికి కూడా సిద్దపడుతున్నారు. మీరు రావాలి దొరా."
నేనెందుకు? మల్లిఖార్జునంగారూ మొదలైన పంచాయితీబోర్డు మెంబర్లంతా వున్నారుగా!
"ఆళ్ళమాట ఎవరికీ లెక్కబాబూ? మీరు రావాల. ఆళ్ళు తల ఒగ్గాల."
"అన్నయ్యగారిని తీసుకువెళ్ళు."
"కాదు దొరా. మీరే రావాల. చదువుకున్నోరు, నాకుగుమాటలు గడగడ లాడిస్తే ఆళ్ళే లొంగిపోతారు."
మోహన్ కొంచెం ఆలోచించి "ఓహో! కర్రలు పుచ్చుకున్నారేం?" అన్నాడు కోపంగా.
"నేనూ తీసుకొస్తున్నాను దొరా మావాళ్ళను."
"సరే పద" అంటూ మోహన్ లేచి నిలబడ్డాడు. స్నేహితుడివంక తిరిగి "నువ్వూ వస్తావా?" అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"ఒక్కడ్నే కూర్చుని ఏం చేస్తాను. పద" అన్నాడు శివనాథరావు.
"చాలాదూరం నడవాలి."
"ఫర్వాలేదు."
ఇద్దరూ లేచి నడక సాగించారు. ముందు ఆ మనిషి పోతున్నాడు.
"ఎవరెవర్రా ఇవ్వనంది?" అనడిగాడు మోహన్ దారిలో.
"రామయ్య కాపూ, రెడ్డిగోరూ, గోవిందయ్యా-ఆడి కొడుకూనూ" మహా మొండోళ్ళు.
మరో వందగజాల దూరం పోయేసరికి జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఏదయినా దొమ్మీ జరుగుతుందేమోననుకున్నారు. స్త్రీలు పురుషులూ మమేకం అయిపోయి వాళ్ళలో వాళ్ళు అరుచుకుంటున్నారు. మోహనరావును చూసి యిద్దరుముగ్గురు మనుషులు గుంపులోంచి యివతలకు వచ్చి "దణ్ణం దొరా" అన్నారు.
"ఏమిటిదంతా?"
న్యాయం మీరే సెప్పాల. ఇదిగో యిటు సూడండి బాబూ యీ ప్రక్క...అక్కడ రెల్లుగడ్డితో, చెత్తా చెదారంతో నిండివున్నా ప్రదేశంలోకి తీసుకుపోయాడు. మోహన్ కు ఏదో చెప్పనారంభించాడు. మధ్య మధ్య మరో మనిషి ఉద్రేకంలో ఖండిస్తున్నాడు. శివనాథరావుకు వాళ్ళధోరణి సరిగా అర్ధం కాలేదు. అది సరిహద్దుకు సంబంధించిన తగాదా సర్వేరాయిని చూపించి చెబుతున్నారు. రాత్రిపూట అవతలివాడు వచ్చి ప్రక్కకు జరిపేశాడట. వాళ్ళిద్దరు చెప్పిందీ ఆలకించి మోహన్ వాళ్ళకు ఏదో విశదీకరించడం దూరంగా నిల్చున్న శివనాథరావుకు గోచరించింది. అందులో ఒకడు అడ్డు చెప్పబోయాడు. మోహన్ గదమాయించాడు. వాడు కిక్కురుమనకుండా ఊరుకున్నాడు.
స్నేహితుడి పలుకుబడి శివనాథరావుకు ఆనందం కలిగించింది.
తరువాత మళ్ళీ బయల్దేరారు. ఊరుబయటకు చేరేసరికి అక్కడ పంచాయితీ బోర్డుమెంబర్లూ, మరికొంతమంది కూలీలూ ఎదురుచూస్తున్నారు. "చాలా ఆలస్యం అయిందే!" అన్నాడు ఓ తెల్లని వ్యక్తి ముందుకువచ్చి ఆయన మల్లి కార్జునంగారని మోహన్ పరిచయం చేశాడు. అందరూ కలసికట్టుగా నడవసాగరు. శివనాథరావు ప్రక్కనున్న ఓ కూలీ చేతిలోంచి సరదాకి కర్రతీసుకుని రాళ్ళని లేవగొడుతూ నడుస్తున్నాడు. వాళ్ళలో కొంతమందితో అతనికి బాగా పరిచయమయ్యింది. వాళ్ళంతా రైతుల దౌర్జన్యాన్నిగురించి మాట్లాడుకుంటున్నారు. ఇదేమిటి - వీళ్ళు యిలా అంటున్నారనుకున్నాడు శివనాథరావు, ప్రపంచమంతా వారిపట్ల అంత సానుభూతి చూపిస్తోంటే.
పొలాల గట్లవెంబడి నడుస్తున్నారు. దూరంగా యిద్దరు పడుచుపిల్లలు చేస్తోన్నపని ఆపి వాళ్ళవంక నవ్వుతూ తిలకించసాగారు. శివనాథరావు కొంచెం వెనకబడేసరికి ఆ అమ్మాయిలతన్ని చేయెత్తి పిలిచారు. "నన్నా?" అన్నట్లు నవ్వుతూ సౌంజ్ఞ చేశాడు. "నిన్నే" అన్నట్లు వాళ్ళు మళ్ళీ పిలిచారు. అతను నవ్వుకుంటూ ముందుకు నడిచాడు.
కొంతదూరం పోయాక అంతా ఆగారు. ప్రక్కనే ఓ రైతుయువకుడు గొయ్యి తవ్వుకున్నాడు. వీళ్ళంతా చుట్టూ ఈగల్లా ముసిరినా అతను లక్ష్యం చేయకుండా తనపని తాను చేసుకుంటున్నాడు.
"కోటయ్యా!" అన్నాడు మల్లిఖార్జునం ముందుకుపోయి.
కోటయ్య తలెత్తి "ఏం?" అన్నాడు.
మల్లిఖార్జునం బింకంగా "ఈ యేడు తఫ్రీదు యివ్వనంటున్నావుట, ఏమిటి కథ?"
"నాదెంతయ్యా? అర ఎకరం. ఇంత పట్టింపు దేనికి?"
"అందుకని నువ్వే ముందు ఇవ్వాలి. ఇదంతా మాకోసం కాదుగా మేమూ గవర్నమెంటుకి కట్టాలి. లేకపోతే మా చేతిది పెట్టుకోమంటావా ఏమిటి?"
"ఈ ఏడు నేనివ్వలేనండయ్యా."
"కారణం?"
"అదంతా నాకేం తెలవదు. రోజూ అన్నయ్యా నేనూ కొట్టుకుసస్తన్నాం. పొలం పంచుకున్నతరువాత ఆడికీ, నాకూ బొత్తిగా చెడిపోయింది. మా గొడవల్లో మేం వుంటే ఈ గలాటాలన్నీ పెట్టబోకండయ్యా."
"ఆ సంగతి ముందే చెబితే అప్పుడే ఏదో కట్టుదిట్టం చేసేవాళ్ళముగా. పంటకాలువలో నీళ్లన్నీ శుభ్రంగా వాడుకొంటివి" అన్నాడు మల్లిఖార్జునంగారు.
"అందులో ఒకరి దయలేదు గందా? మీ చేలన్నీ తడిశాకే మాకు ఒదిలిపెడితిరి. మీరు సేసిన ఉపకారం ఏందయ్యా?"
మల్లిఖార్జునం ముఖం మాడిపోయింది. మిగతా సభ్యులెవరూ కల్పించుకుని మాట్లాడకపోవటం శివనాథరావుకు ఆశ్చర్యకరంగా వుంది. మల్లిఖార్జునం మోహన రావువంక అసహాయంగా చూశాడు.
మోహన్ ముందుకొచ్చాడు "కోటయ్యా" అన్నాడు.
"దొరా."
"పెద్దాడివి అయిపోయావే?"
"లేద్దొరా, చేతిలో దమ్మిడీ ఆడక గిజగిజలాడ్తన్నాం."
"అయితే అదేనా మాట్లాడాల్సిన విధానం?"
కోటయ్య తలవంచుకున్నాడు.
"తెలివికి సంతోషించాం కాని, రెండుమూడు రోజుల్లో డబ్బుతెచ్చి కట్టెయ్యి తెలిసిందా?"
"చిత్తం దొరా" అన్నాడు కోటయ్య మాట్లాడలేక.
పదండి అన్నాడు మోహన్ అంతా కదిలారు. శివనాథరావు మెల్లగా స్నేహితుడి ప్రక్కన నడుస్తున్నాడు. 'వీడు ఎంతటివాడు యిక్కడ? అక్కడ వీడిని చూసి చీమయినా దడుచుకోదే?' అని ఆశ్చర్యాన్వితుడౌతున్నాడు. మోహనరావు పెదాలపై అధికారంతో కూడిన ఓ చిరునవ్వు ప్రదర్శితమౌతోంది.
ఒక తోటలోపలికి ప్రవేశించారు. లోపల ఆకాశం కనపడటం లేదు. చెట్లు ఒకదానినొకటి కౌగలించుకుని, సూర్యరశ్మిని అరికడుతున్నాయి. మల్లిఖార్జునం 'రామయ్యా' అని గట్టిగా కేకేశాడు. లోపల ఎక్కడనుంచో 'ఓయ్' అని వినబడింది. వెళ్ళినవాళ్ళంతా వగరుస్తూపచ్చికబయళ్ళ మీద కూలబడ్డారు. చిరాగ్గా వున్నారు. మల్లిఖార్జునం నేలమీద పడివున్న ఓ పుల్లనితీసి నముల్తున్నాడు.
ఇంతలో క్రమక్రమంగా వాళ్ళముందుకు ఆజానుబాహుడైన ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. నీరుకావి పంచె ఎగద్రోసి కట్టాడు. ఒంటిమీద చొక్కాలేదు. నల్లగా వున్నాడు. తెల్లనిమీసాలు గాంభీర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
"ఏం యిలా వచ్చారు పెద్దమనుషులంతా?" అన్నాడతను వెక్కిరింపుగా.
"పనిమీద" అన్నాడు మల్లిఖార్జునం.
"ఎంత దయ?"
"ఈ సంవత్సరం తఫ్రీదు తీఉస్కుపోదామని వచ్చాం."
"తఫ్రీదా, ఎందుకు?"
"ఎందుకా, పొలం ఉన్నందుకు!"
"ఓహో! అంతా చెల్లించారా"