Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 28

 

          మోహన్ ముందుకు వస్తున్నాడు. "నన్ను కొట్టు" అన్నాడు. ఆవేశంగా "ఛండాలుడా! ఎవరిమీద చేయి చేసుకున్నావో తెలుసా? ఎంత ధైర్యం నీకు? అలా చూస్తావేం? కొట్టు నన్ను, నా తల పగలకొట్టు."
   
    నల్లనివాడు తలవంచాడు.
   
    ఎడాపెడా అతని చెంపలు మ్రోగిపోయాయి. నలుపురంగు సూర్యరశ్మిలో కష్టంమీద కొణిమాన్ని పెగిల్చింది. శివనాథరావు భయపడ్డాడు. పగముందు మోహన్ ఎంత?
   
    "క్షమించు బాబూ" అని మోహనరావు కాళ్ళమీద ముసిలాడు పడిపోయాడు.
   
    మోహన్ అరిచెయ్యి చూసుకున్నాడు "చెలమయ్యా" అన్నాడు.
   
    "బాబూ!"
   
    "తప్పేనా జరిగింది?"
   
    "తప్పేదొరా తప్పే" అంటూ చెంపలు వేసుకున్నాడు. సిగ్గుతో అతని మనుషులు తలలు వంచుకున్నారు. మల్లిఖార్జునాన్ని నలుగురు అవతలకు తీసుకుపోయి పరిచర్య చేస్తున్నారు. కన్నెపడుచు భ్రమ ఎగిరిపోగా బిందెతో నీళ్ళు ఎత్తి పోస్తున్న స్త్రీ యిక్కడే వుంది.
   
    "రేపు మాపటికల్లా తెచ్చి యిచ్చుకుంటాం దొరా."
   
    శివనాథరావు హృదయం ఇదివరకే విరిగిపోయింది. స్నేహితుడి దగ్గరకు వెళ్ళి "నాకేం బాగాలేదు, ఇంటికి పోతాను" అన్నాడు.
   
    "దారి తెలుస్తుందా"
   
    "ఆఁ"
   
    "సరే, నువ్వెళ్ళు, నేనింకా కొన్నిచోట్లకు పోయివస్తాను. మల్లిఖార్జునాన్ని డాక్టరు దగ్గరకు తీసుకుపోవాలి."
   
    శివనాథరావు బయల్దేరి గబగబా నడవసాగాడు. అతనికి విసుగ్గా వుంది. "అబ్బ! ఏమిటీ వాతావరణం?" అనుకున్నాడు.
   
    పాకలు సమీపించాయి. అదిగో పోస్ట్ మాష్టర్ గారి పెంకుటిల్లు, మెల్లిగా చీకటి అవరిస్తోంది....యిల్లు వచ్చింది. బయట ఎవరూలేరు. నిర్జనంగా వున్న సందు. ఒక అడుగు లోపలకువేసి ఆగిపోయాడు. అదే మూలుగు- సంజ చికాకు పడినట్లు...
   
    "బాబో!" అన్న పెద్దకేక ప్రపంచంలో ప్రతిధ్వనించింది. నడుస్తోన్న మానవుడు తూలి, తృళ్ళాడు. తప్త హృదయం వేయి గొంతుకలతో క్షోభిల్లిందేమో లోపలికి పరిగెత్తాడు.
   
    ఆ దృశ్యం వర్ణనాతీతంగా వుంది. భయమూ, సిగ్గూ రెండూలేని ఉన్మాదిని లా భూమిమీద పొర్లాడుతోంది. యవ్వనం సిగ్గువిడిచింది. తల్లి మరింత పిచ్చిదై అరుస్తోంది. రెండడుగుల దూరంలో నాగరాజు బుసలుకొడుతూ నిలుచున్నాడు.
   
    తల్లి మోకాళ్ళమీద ఆని ప్రార్ధిస్తోంది దయతలచమని.
   
    ఉన్మాదిని అలాగే కొట్టుకుంటోంది.
   
    అమాయకురాలిపై విషనాగు విరుచుకుపడబోతోంది.
   
    వ్యవధిలేదు. అతనిచేతిలో కర్ర అలానే వుంది. గాలిలోకిలేచింది. చూపులు చెదురుతున్నాయి, గురి చెలిస్తోంది. "ధన్"మని కర్ర పైశాచిక బలంతో నేల వ్రాలింది. నిలువునా ఒణికి గోడకు ఒదిగిపోయాడు. గురి తప్పిపోయింది. నాగుపాము నిలువుఎత్తున లేచాడు. విషం క్రక్కుతున్నాడు.
   
    శివనాథరావు ఇహ లాభంలేదని తెలుసుకున్నాడు. తనకి కాలం సమీపించింది. ఇది ఆఖరిక్షణం పోతాడు, తనతోకూడా ఓ మహత్తరమైన ప్రేమను తీసుకుపోతాడు ఆ లోకానికి. ఒకేఒక క్షణం గడువుంది. "రా" అన్నాడు. అంతే ఒళ్ళు తెలియలేదు. చేతిలోని కర్ర గాలిలోకి లేచింది. అదే క్షణంలో నిలువెత్తుణ లేచిన నాగు భరించలేని వేగంతో ముందుకు ఎగిరింది. అతని కర్ర ఏంచేసిందో గుర్తులేదు. స్మృతి తప్పి పడిపోయాడు.
   
                              *    *    *
   
    తెలివి వచ్చేసరికి చుట్టూ పదిమంది మనుషులు గుమిగూడి వున్నారు. మోహన్ ప్రక్కనే కూర్చుని విసురుతున్నాడు. ముఖమంతా తడితడిగా వుంది. నీళ్ళుపోసి వుంటారు. రెండుమూడు నిముషాలదాకా అతనికేం జరిగిందో అర్ధంకాలేదు. మోహన్ అతని భుజం తట్టాడు. "భయం లేదురా" అన్నాడు.
   
    మోహన్ తల్లి సుదూరంలో నిలుచుని కన్నీళ్ళు విడుస్తుంది. "ఎంత పనిచేశావు నాయనా మాకోసం?" అంది గాద్గదికంగా.
   
    "ఏం జరిగింది?" అని అడిగాడు శివనాథరావు ప్రయత్నంమీద.
   
    "కాటు వేసిందా?"
   
    "లేదు, చంపేశావుగా" అన్నాడు మోహన్ చాలా విచారంగా నవ్వి.
   
    శివనాథరావు ఉత్సాహం తెచ్చుకుంటూ "నిజంగానా" అన్నాడు.
   
    "నీ ఋణం తీర్చుకోలేనురా మా చెల్లెలికి ప్రాణం ప్రసాదించావు. నీ ధైర్యం ఎంత ప్రశంసించినా తనివితీరదు" అన్నాడు మోహన్. ఆ మాటలో శివనాథరావుకేదో వేదన పొడగట్టింది. నిట్టూర్చి తల ప్రక్కకివాల్చి పడుకున్నాడు.
   
    అతన్ని చూడటానికి ఊళ్ళో జనం చాలామంది వచ్చి అభినందించారు. బస్తీనుంచి వచ్చిన కుర్రాడు భయంకరమైన త్రాచుపాముని చంపివేశాడన్న వార్త అప్పుడే ఊరంతా పొక్కిపోయింది.
   
                             9
   
    మోహనరావూ, అతని బావగారూ, శివనాథరావు వీధి అరుగుమీద కూర్చున్నారు మరునాడు సాయంత్రం.
   
    శివనాథరావు హఠాత్తుగా "నాకేం తోచటంలేదు, వెళ్ళిపోతాను" అన్నాడు.
   
    మోహన్ తెల్లబోవటం స్పష్టంగా కనిపించింది "అదేమిటి" అన్నాడు. అతని బావగారు చుట్టపొగ వదిలి, "పెళ్ళిచూపులు కాకుండానా?" అన్నాడు.
   
    "ఎవరికి?" అన్నాడు శివనాథరావు ఆశ్చర్యంగా.
   
    "మోహనరావు అనే ఓ యువకుడికి."
   
    "ఏ ఊళ్ళో?"
   
    ఆయన చెప్పాడు.
   
    శివనాథరావు అదిరిపడ్డాడు. వెనువెంటనే అతని ముఖం పాలిపోవడం ఎవరూ గమనించలేదు.
   
    "మనమంతా కలిసి రేపు కొండపల్లి నుంచి రైల్లో వెడదాం."
   
    శివనాథరావు ఆలోచనలో పడ్డాడు "ఎట్లా చేసుకుంటాడు వీడు పెళ్ళి? వీడి ప్రేమ విలువ యింతేనా" అనుకున్నాడు.
   
    "క్షమించండి, నేను రాలేను."
   
    "ఏం?"
   
    "కారణం అడిగితే చెప్పలేను. నన్ను ఒదిలెయ్యండి" అన్నాడు ప్రాధేయపడుతూ.
   
    ఎవరూ మాట్లాడలేదు.
   
    "నేను రేపు వెళ్ళిపోదామనుకుంటున్నానే."
   
    "ఏకంగా పెళ్ళిచూపులు అయ్యాక వెళ్ళవచ్చు. మీ సలహాకూడా మోహన్ కి కావాలి. మీరిలా అర్దాంతరంగా పేచీపెడితే ఒప్పుకోం."
   
    "ఈ ఊళ్ళో రెండురోజులు సరదాగా గడపటానికి కృష్ణకీ, చంద్రానికీ కూడా రమ్మని రాశాను. వాళ్ళంతా ఎల్లుండి వస్తారు. నీకింకా సెలవులు నాలుగయిదు రోజులున్నాయిగా ఏకంగా అంతాకలిసి వెళ్ళవచ్చు" అన్నాడు మోహనరావు.
   
    శివనాథరావు జవాబు యివ్వకుండా లేచి నిలబడి "అలా షికారుకు పోయి వద్దాం వస్తావా?" అన్నాడు. సరేనని మోహన్ లేచాడు. ఇద్దరూ మండపం వైపుగా బయల్దేరారు. వేణుగోపాలస్వామి దేవాలయం దగ్గరకు రాగానే ఎందుకో శివనాథరావులో భక్తి పొంగింది. ఆగి నమస్కరించాడు. ఆచారిగారు తన తోటలో కమతగాళ్ళచేత పని చేయిస్తున్నాడు. "ఎక్కడిదాకా?" అని కేకేశాడు ఎరు సమీపించింది. ఇద్దరూ ఇసుకలో నడవసాగారు. ఒకరిద్దరు ఉన్నత కుటుంబాల్లో స్త్రీలు చలమల్లో నీళ్ళు ముంచుకుంటూన్న వాళ్ళల్లా, వీళ్ళని చూసి దూరంగా తొలిగిపోయారు.
   
    "ఎందుకు రానన్నావు?" అనడిగాడు మోహన్ తాపీగా.
   
    "మనసులో...." అన్నాడు, మాట పెగల్లేదు. మోహన్ విచిత్రంగా చూశాడు.
   
    "మనసులో" అన్నాడు మళ్ళా తిరిగి అపజయం. చప్పున ఇసుకలో క్రింద కూర్చుని, ఇసుకలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగాడు.
   
    "శివా, ఏమిటిది?" అంటూ మోహన్ కూడా క్రిందకూర్చుని బలవంతంగా స్నేహితుడి ముఖం తనవైపుకు త్రిప్పుకున్నాడు. "ఛీ" చేత్తో కన్నీరు తుడిచాడు. ఇసుకరేణువులు అతనిచేతికి అంటుకున్నాయి.
   
    "ఏమీలేదు" అన్నాడు శివనాథరావు పడుకునే.
   
    "ఏం కావాలి నీకు? ఎందుకు తటపటాయిస్తున్నావు? ఏమిటి నీ బాధ? ఎందుకిలా మారిపోయావు. నాకు చెప్పవూ?"

 Previous Page Next Page