భరణికి కూడా ఇందుమతి రాదేమోనన్న అనుమానం బయల్దేరింది.
అతన్లో తన మాటలు ఎంతో కొంత రియాక్షన్ ను కలిగిస్తున్నాయని చిత్ర పసికట్టింది. అతన్ని కార్యోన్ముఖుడిగా చేయడానికి ఇదే మంచి సమయంగా తోచింది, అందుకే తిరిగి ప్రారంభించింది.
"ఓ అమ్మాయి ప్రేమను వదులుకున్నంత ఈజీగా శారీరక సంబంధాన్ని వదులుకోలేదు. ఈ కిటుకు చాలామంది అబ్బాయిలకు తెలియక పోవడంవల్లనే ప్రేమలో ఫెయిలవుతుంటారు.
ఆరాధన ఎక్కువ కావడంవల్లో, ఇంకాస్త ముందుకు ప్రొసీడ్ అయితే ప్రేమికురాలు ఏవగించుకుంటుందేమోనన్న భయంతోనో, శీలానికి అత్యధిక ప్రాముఖ్యతనిచ్చే అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేయాలో తెలియకో, నిజమైన ప్రేమ శరీరాన్ని ఆశించదన్న వ్యర్ధమైన సిద్ధాంతాలవల్లో అబ్బాయిలు తమ ప్రేయసితో పడకగదివరకు వెళ్ళరు.
ఓ అబ్బాయితో కళ్ళు కళ్ళు కలపడం, షికార్లు వెళ్ళి ఐస్ క్రీములు తినడం, సినిమాలో ఒకరి చేతులు ఒకరికి తగిలేటట్టు కూర్చోవడం వరకే సంతృప్తిపడతారు.
ఇంతలో ఈ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసిపోతుంది. ఆమెని ఇంట్లోవాళ్ళు మందలిస్తారు. ఏమీ కాలేదుగనుక, తను విలువైనది ఏదీ అతనికి ఇవ్వలేదు గనుక ఎందుకొచ్చిన గొడవలెమ్మని ఆ అబ్బాయితో తిరగడం మానేస్తుంది అమ్మాయి.
శారీరక సంబంధం లేకపోవడంతో ఆ అబ్బాయితో పెద్దగా కమిట్ అయినట్లుకూడా ఫీల్ కాదు. ఆ అమ్మాయి, అది నిజంకూడా. సినిమాలకి వెళ్ళడాన్ని, లవ్ లెటర్స్ రాసుకోవడాన్ని ఎన్నిరోజులు ఊహల్లో తిప్పుకుంటుంది!
అందులోనూ అవి గుర్తొచ్చినప్పుడు పెద్ద థ్రిల్ కూడా కలిగించవు. ఇలాంటి అనుభవాలను మరిచిపోవడం చాలా తేలిక.
పాపం ఈ సంగతి తెలియని ఆ అబ్బాయి అనవసరంగా అమ్మాయిని తిట్టుకుంటూ కొన్నిరోజులు గడిపేస్తాడు. ఆ తరువాత నెమ్మదిగా ఈ విషయం మరిచిపోతాడు. నాకు తెలిసి చాలా ప్రేమల ముగింపు ఇదే!"
తన తప్పు ఏమిటో తెలిసొచ్చింది భరణికి. ఇంతకాలం తనూ ఓ భావకుడిలాగా చిన్న చిన్న ఆనందాలతో సంతృప్తిపడిపోయాడు.
ఇప్పుడు చిత్ర చెబుతుంటే తనతో వచ్చిందంటే అది తన గొప్పతనమే అవుతుంది తప్ప తన పనితనం ఏమీకాదు. ఈ కారణం చూపించి చిత్ర తనకు ఏభైవేలు ఇవ్వకుండా ఎగ్గొట్టేసినా ఆశ్చర్యపోనఖ్కర్లేదు. అది తరువాతి విషయం.
ముందు ఇందుమతి తనతో వచ్చేసే 'కిక్' తనివ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి?
భరణికి మరికాస్త తలనొప్పి ఎక్కువైంది. అందుకే తన చేతకాని తనాన్ని దాచిపెట్టడానికన్నట్టు "కాఫీ" అని మరింత గట్టిగా అరిచాడు.
"నీలాంటివాడ్నే చూసి వెనకటికి ఒకామెకి చిర్రెత్తుకొచ్చి అందట చేతగాని మగాడు మంచానికి సరిపోయాడని" అంటూ చిత్ర కాఫీకప్పు తీసుకొచ్చి భరణి ముందుకు తోసింది.
"నీ పాయింట్ కరెక్టే. నేను ఒప్పుకుంటాను. నువ్వు చెప్పిన మంత్రం అందరి అమ్మాయిల దగ్గర పనికొస్తుందని నేననుకోను. ఇందుమతి చాలా సెన్సెటివ్ పిల్ల. బెదరగొట్టేశామంటే మొదటికే మోసం వస్తుందని ఊరుకున్నా. ఇప్పుడు నువ్వు చెప్పావుగదా. అటు నుంచి కూడా నరుక్కురావడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.
"సెన్సిటివ్ పిల్ల గనుకే ఆ మంత్రం బాగా పని చేస్తుందని అంటున్నాను" అంది చిత్ర తన సిద్ధాంతానికే ఎక్కువ విలువిస్తూ.
"సరేనన్నానా" భరణి అదే ఆలోచనతో అక్కడినించి లేచి బయటపడ్డాడు.
ఓ గంటసేపు అలా బయట తిరిగొచ్చి స్నానం ముగించి తయారయ్యేప్పటికి పది దాటింది.
నీరెండ వెచ్చటి రగ్గులా వుంది. గాలి ఏదో ఖుషీ మూడ్ లో వున్నట్టు చాలా హాయిగా తగుల్తోంది. పశువులు వీధుల్లో రేపిన దుమ్ము పైనుంచి బద్దకంగా కిందకి దిగుతోంది. ఊర్లోని జనాలందరూ పొలం పనులకి వెళ్ళడంవల్ల ఊరు ఖాళీచేసిన పెళ్ళివిడిదిలాగా ప్రశాంతంగా వుంది.
భరణి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ఇందుమతి ఇంటికి వెళ్ళాడు.
ఆ ఇంటికి పొలాలగుండా దొడ్డిదారుంది. శతరూప లేకుంటే ఇకవచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ముసలామెకు ఏ అవయవమూ సరిగా పని చేయదు.
అందుకే వీధిలో వెళుతూ శతరూప వున్న జాడలేమైనా వున్నాయో లేదోనని పరిశీలించాడు. ఏమీలేవు. దాంతో వీధిలో నేరుగా వెళ్ళి అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి దొడ్డిదారిగుండా వెళ్ళాడు.