Previous Page Next Page 
హిమసుందరి పేజి 25

    నిజంగా సీత అందంగా తయారయింది.

    "సాయంత్రం సినిమాకి వెళదాము. రెడీగా వుండ"మని రామకృష్ణ ఆఫీసుకెళుతూ చెప్పాడు కనుక, సీత రామకృష్ణ వచ్చేలోపల రెడీ అయింది.

    సీతామనోహరి ఇంట్లో అన్ని పనులూ చేసుకుని, తయారయింది కాబట్టి యింక చేసే పనేం లేక- ఇంట్లోకి, బైటికి కాలుకాలిన పిల్లిలా తిరగటం మొదలుపెట్టింది. అలా కాసేపు తిరిగేసరికి విసుగు, కాళ్ళనొప్పులు రెండూ వచ్చాయి. వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంది. మనసు రచనలమీద పోయింది.

    అయిదు నిమిషాలు తక్కువ ఆరు.

    వీధిలైటు చమక్కున వెలిగింది.

    సీతామనోహరి ఉలిక్కిపడి, వాస్తవంలోకి వచ్చింది.

    నలువైపులా పరుచుకుంటున్న చీకట్లు.

    ఆ యింట్లో అణువణువునా ఆక్రమించుకున్న చీకటి

    సీత లేచి వరండాలో లైటు వేసింది. చేతికున్న వాచిలో టైము చూసుకుంది. ఆ తర్వాత యింట్లోకి వెళ్ళి ఆన్ని లైట్లూ వేసి వచ్చింది.

    చెప్పినా టైము కన్నా ముందే యింటికొచ్చేవారు. ఈరోజు ఏమయింది? ఇంతవరకూ యింటికి రాలేదు! ఆఫీసులో లేటు కావటం అన్నది యింతవరకూ జరగలేదు. తన్ని ఏడిపించటానికి తమాషా చేయటానికి గాని, కావాలని గాని ఆలస్యంగా రావటం లేదుకదా! అయినా యింత ఆలస్యమా?

    రామకృష్ణ ఆఫీసు నుంచి రావటానికి ఆలస్యం ఎందుకవుతుంది? ఏయే అడ్డంకులు వున్నాయి? అని మరో అరగంట ఆలోచించింది. ఎంత ఆలోచించినా సరి అయిన కారణం స్ఫురించలేదు. ఏడు దాటిపోవటంతో డ్రెస్ మార్చేసింది. రెండో ఆట సినిమాకి వెళ్లరు.

    ఎనిమిది దాటింది.

    సీతకి భయం పట్టుకుంది.

    సినిమాకెళదామనే తొందరలో - స్పీడ్ గా స్కూటర్ మీద యింటికి వస్తుంటే దారి మధ్యలో స్కూటర్ కి యాక్సిడెంట్ కాలేదు కదా!

    సీత గుండె ఝల్లుమంది.

    ఇరుగు పొరుగు కాక, ఆ వీధిలో ఈ మధ్య చాలా మందే పరిచయం అయారు. ఎవరింటికెళ్ళి ఈ విషయం చెప్పినా రామకృష్ణ ఆఫీసుదాకా వెళ్ళివస్తారు. నాలుగు వీధులూ తిరిగి వస్తారు. అవసరం అయితే పోలీసు రిపోర్ట్ ఇస్తారు. కాని ఇప్పుడు అంత అవసరమా? భర్త యింటికి రావటం కాస్త ఆలస్యం అయితే ఇంత కంగారా - అని వాళ్ళంతా నవ్వితే!

    ఏం చేయాలా తెలియక అలా కూర్చుండిపోయింది సీత.

    "ఎవరన్నా బలవంతాన సినిమాకి లాక్కెళ్ళారేమో! తప్పనిసరి పరిస్థితులల్లో వాళ్ళతో వెళ్ళారేమో! అంతేకావచ్చు కదా!"

    రాత్రి పది గంటలవరకూ చూసి, అప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనుకుంది సీత.

    కాని-

    ఈ లోపలే-

    తొమ్మిది అవుతూ ఉండగా -

    రామకృష్ణ స్కూటర్ మీద చక్కగా వచ్చాడు.

    సీతకి వెర్రి ఆనందం వేసింది. పిచ్చి సంతోషం కలిగింది.

    "ఏమండీ! ఏమిటి ఆలస్యం?" రామకృష్ణకి ఎదురు వెళుతూ సీత అడిగింది.

    రామకృష్ణ ముఖం బాగా దించుకుని "ఉహుహు! ఒంట్లో బాగుండలేదు" అన్నాడు. అలా అంటూనే వేగంగా బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

    సీత వీధి తలుపువేసి బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి - రామకృష్ణ డ్రస్ విప్పకుండానే మంచంమీద పడుకుని, నిండా దుప్పటి ముసుగు పెట్టేసుకున్నాడు. పైగా ముడుచుకుని అటు తిరిగి పడుకున్నాడు.

    "ఏమైందండీ?" సీత గాభరాగా అడిగింది, అతని పక్కనే కూర్చుంటూ.

    "తల పగిలిపోయేటంత తలనొప్పి. బాగా చలిగా వుంది. ఉహుహు!" అన్నాడు రామకృష్ణ.

    "చలి జ్వరమేమో! ఏది - చూడనివ్వండి" అంటూ దుప్పటిలోంచి చెయ్యి పెట్టింది సీత.

 Previous Page Next Page