Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 26


    "నేను ఇవ్వను."
    "పోనియ్ ఆ ఇరవై వేలు నేను ఇస్తాను" అన్నాడు విశ్వం.
    రవి విశ్వం ముఖంలోకి నమ్మలేనట్టుగా చూశాడు.
    "ఎప్పుడిస్తావ్?"
    "రెండు రోజుల్లో!"
    "అయితే ఇవ్వాళ నేను గుంటూరు వెళుతున్నాను. ఎల్లుండి వస్తాను" అన్నాడు గౌతమ్.
    "గది ఖాళీ చేస్తావా?"
    "చెయ్యను మళ్ళీ దొరక్కపోతే?"
    "ఇది కాకపోతే మరో హోటల్."
    "అది రిస్క్ తో కూడిన పని. హోటల్స్ మాటిమాటికి మార్చకూడదు" అన్నాడు గౌతమ్.
    "నిజమే!" అన్నాడు విశ్వం.
    "నిన్న నేను సినిమాకు వెళ్ళాను. ఆ సినిమాకే మీ అన్నయ్య ఆ పిల్లా వచ్చారు."
    "చచ్చాం పో! నిన్ను చూశారా!" విశ్వం గాబరాగా అడిగాడు.
    "లేదు. నా ఫ్రెండు చూశాడు. అంతే. లైట్లు తీసెయ్యగానే బయటికి వచ్చేశాను."
    "చాలా మంచి పని చేశావు." మెచ్చుకున్నాడు విశ్వం.
    "నువ్వు ఇందును పెళ్ళి చేసుకోవాలి."
    చివ్వున తల తిప్పి రవిని చూశాడు గౌతమ్.
    "మా అన్నయ్యను జైలుకు పంపడం, నువ్వు ఇందును పెళ్ళి చేసుకోవడం వెంట వెంటనే జరిగిపోవాలి."
    "నాన్సెన్స్!" దాదాపు అరిచినట్టే అన్నాడు గౌతమ్.
    "ఏం___ఇందు అందంగా లేదా?"
    "ఉంటే? అందంగా ఉన్నవాళ్ళందర్నీ పెళ్ళి చేసుకోగలమా?"
    "ఇందును నువ్వు చేసుకోవాలి."
    "ఈ విషయం ముందు నేను అంగీకరించలేదు."
    "నీకు అభ్యంతరం ఉంటుందనుకోలేదు."
    "ఎందుకని?"
    "ఏమో! అలా అనిపించింది. అయినా ఇందును చేసుకోవడానికి నీ అభ్యంతరం ఏమిటి?" విశ్వం అడిగాడు.
    "ఆమె మరొకర్ని ప్రేమిస్తున్నది. ఎవర్నో కాదు____నా తమ్ముడ్ని."
    "నీకూ ఇలాంటి సెంటిమెంట్సు ఉన్నాయా?"
    "ఏం? నేను మనిషిని కాదా?" అదోలా నవ్వాడు గౌతమ్.
    "నువ్వు పెళ్ళి చేసుకుంటావు. అంతే! ఆమెతో కాపరం చెయ్యక్కర్లేదు."
    గౌతమ్ రవి ముఖంలోకి విస్మయంగా చూశాడు.
    "నీ కభ్యంతరం ఉండదనుకుంటాను."
    గౌతమ్ పగలబడి నవ్వాడు.
    "ఒక అమ్మాయిని రేప్ చెయ్యాలి....."
    "కాదు.....నటించాలి" అన్నాడు విశ్వం.
    "ఆమె నాభార్య అనే విషయం మర్చిపోకు" అన్నాడు రవి.
    "గౌతమ్ రవి ముఖంలోకి సీరియస్ గా చూశాడు.
    "ఒకవేళ అంతవరకూ వచ్చాక నేను అది నటన అని మర్చిపోతే ఏం చేస్తావ్?" అన్నాడు గౌతమ్ గంభీరంగా.
    "చంపేస్తాను!" రవి కోపంగా అన్నాడు.
    "గుడ్! నువ్వు ఆ మాట అనకపోతే నిన్ను ఇప్పుడే చంపేసేవాడ్ని." అంతసీరియస్ గానూ అన్నాడు గౌతమ్.
    విశ్వం గౌతమ్ ను ప్రశంసాపూర్వకంగా చూశాడు.
    "సరే! ఆ తరవాత నువ్వు నీ భార్యను స్వీకరించాలి."
    "లేకపోతే?"
    "నిన్ను చంపి నేను జైలుకువెళ్తాను."
    రవి భయంగా చూశాడు విశ్వం వైపు.
    "సరదాగా అంటున్నాడులే" అన్నాడు విశ్వం.
    "సరదాగానా? కాదు. ఇలాంటి విషయాల్లో నేను సరదాగా మాట్లాడను."    
    "ఆ విషయం నీకు అనవసరం."
    "అనవసరమో, అవసరమో సమయం వచ్చినప్పుడు చూపిస్తాను."
    రవి ముఖం కోపంతో కందగడ్డ అయింది.
    "ఇందుమతిని వివాహం చేసుకోవాల్సివస్తే ఆమెను నువ్వూహించినట్టు వదిలెయ్యను."
    "అది నీ ఇష్టం!" అన్నాడు రవి.
    "సరే! దానికి ముహూర్తం పెట్టండి."
    "ముహూర్తమా? మా అన్నయ్య జైలుకు వెళ్ళాకే పెళ్ళి."
    "పెళ్ళి సంగతి ఎవరన్నారయ్యా నీ భార్యను...."
    "సమయం చూసి చెప్తాం. నువ్వు గుంటూరు నుంచి ఎప్పుడొస్తావ్?"
    "చెప్పాగా ఎల్లుండి వస్తానని."
    "సరే! మేమిక వెళ్తాం" అంటూ లేచాడు విశ్వం.
    రవి, విశ్వం బయటకు వెళుతుంటే చూస్తూ అదోలా నవ్వుకున్నాడు గౌతమ్.
    
                                                            8
    
    దాదాపు నాలుగు అవుతోన్న వాతావరణంలో వేడి తగ్గలేదు.
    సునంద ఇంటిముందు స్కూటర్ ఆగింది.
    ఆ రోజు ఇందుమతి స్నేహితులతో గండిపేట పిక్ నిక్ కు వెళ్ళింది. సునంద ఉదయం నుంచీ హోం సైన్సు కాలేజీలో "స్త్రీలు-ఉద్యోగాలు" అన్న విషయం మీద ఏర్పాటు చేసిన సెమినార్ కు వెళ్ళింది. ఆ సెమినార్ లో కీనోట్ ఎడ్రసు సునంద చేస్తున్నది.
    స్కూటర్ దిగిన వ్యక్తి గబగబ లోపలకు వచ్చాడు. అరుణ ముందు గదిలో కూర్చుని, తన అభిమాన రచయిత లేటెస్టు బుక్ చదువుతోంది.
    వెనక ఏదో చప్పుడై ఇంతెత్తున ఎగిరిపడింది. ఆమె చేతిలోని పుస్తకం అంత దూరంలో పడిపోయింది.
    "మీ....మీరా?"
    గౌతమ్ వంగి పుస్తకం చేతిలోకి తీసుకొన్నాడు.
    "ఓ____అదా కారణం? నేను రావడం, శ్మశానంలో పాతిపెట్టిన సీసామూత ఎవరో తియ్యడం ఒక్కసారే జరిగాయా?" పుస్తకం అందిస్తూ అని చిరునవ్వు నవ్వాడు.
    అరుణ సిగ్గుపడిపోయింది.
    గౌతమ్ ఆమెనే చూస్తున్నాడు.
    ఎంత అమాయకంగా ఉంది ఆ ముఖం? చక్కని రూపం. రవి ఎందుకు ఈ అమాయకురాలిని అంత బాధ పెడుతున్నాడు?
    బావగారు ఏమిటి తనను అలా చూస్తున్నారు?
    అరుణ తనలో తనే ముడుచుకుపోతున్నట్టుగా నిల్చుంది.
    "ఇందక్క లేదు."
    "ఏం ఇందు లేకపోతే? నువ్వు మాట్లాడకూడదా?" చిన్న పిల్లను ఉడికించే ధోరణిలో అన్నాడు.
    అరుణకు ఆశ్చర్యం వేసింది. తన బావగారు తనతో ఎప్పుడూ ఈ ధోరణిలో మాట్లాడలేదు.
    "అరుణా, నీతో మాట్లాడాలనే వచ్చాను."
    అరుణ ఆశ్చర్యంగా తలెత్తింది. గౌతమ్ చూపులు ఆమె చూపుల్తో కలిశాయి. అప్రయత్నంగానే ఆమె కనురెప్పలు వాలిపోయాయి. నేలచూపులు చూడసాగింది.
    "వంటమనిషి నిద్రపోతోంది. లేపుతాను." ఒక అడుగు ముందుకు వేసింది.
    "ఎందుకూ? నాతో మాట్లాడ్డానికి భయం వేస్తోందా?"
    "అబ్బే! కాదు. కాఫీ పెడుతుందనీ.....?"
    "ఇప్పుడు కాఫీ అక్కర్లేదు. నీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలని వచ్చాను."
    అరుణ శరీరంలోకి సన్నగా వణుకు వచ్చింది.

 Previous Page Next Page