Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 25


    గౌతమ్ తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.
    "విన్నావా?" హెచ్చరికగా అన్నది.
    గౌతమ్ కు అన్నపూర్ణమ్మలో కొత్త రూపం కనిపించింది.
    "మాట్లాడవేం?"
    "అలాగేనమ్మా!" అయిష్టంగానే అన్నాడు.
    "మళ్ళీ నువ్వు ఈ విషయాలు నా ముందు ఎత్తిన క్షణం నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను."
    "అమ్మా!"
    "ఇక వెళ్ళు. నాకు విశ్రాంతి కావాలి."
    గౌతమ్ తల వంచుకొని బయటికి వెళ్ళిపోయాడు.
    
                                                                   7


    గౌతమ్ హోటల్ గదిలో పచార్లు చేస్తున్నాడు. ఏదో విషయం మీద ఒక నిర్ణయానికి రాలేక మధన పడుతున్నట్లుగా ఉన్నాడు.
    విశ్వం. రవీ____ఇద్దరూ ఆదుర్దాగా అతణ్ణి చూస్తున్నారు. ఆ గదిలో టైం బాంబు ఉన్నట్టుగా అందరూ టెన్షన్ లో ఉన్నారు.
    పచార్లు చేస్తున్న గౌతమ్ ఏదో నిర్ణయానికి వచ్చినట్టు చటుక్కున ఆగి, విశ్వం పక్కకు సోఫాలో కూర్చున్నాడు.
    "నా వల్ల కాదు. ఇలాంటి దారుణం నేను చెయ్యలేను" అంటూ సిగరెట్ పెట్టె తెరిచాడు.
    రవి విశ్వం ముఖంలోకి చూశాడు "కింకర్తవ్యం" అన్నట్టుగా.
    "అంతేనంటావా?"
    "అంతే! నేను కొన్ని దురాగతాలు చేశాను. కాని స్త్రీలను అవమానించలేదు. స్త్రీలను మోసగించలేదు. ఇంత దారుణం చెయ్యమంటారా?" సిగరెట్ పొగ ఊదాడు గౌతమ్.
    "ఏమిటయ్యా దారుణం?"
    "ఇది దారుణం కాదా? రేప్ చెయ్యడం...."
    "నిన్ను రేప్ చెయ్యమనలేదే?"
    "కేవలం నటించమన్నాం. పైగా ఆమె నా భార్య అన్నాడు రవి.
    గౌతమ్ చివ్వున తల తిప్పి రవి ముఖంలోకి చూశాడు.
    "రవీ! నిన్నేం చెయ్యాలని పిస్తూందో తెలుసా?"
    "చెప్పు అన్నాడు విశ్వం.
    "అమాంతంగా ఎత్తి కిందకు విసిరెయ్యాలనిపిస్తూంది. లేకపోతే నువ్వేం మగవాడివయ్యా? భార్యను రేప్ చెయ్యమని...."
    "అదుగో మళ్ళీ ఆ మాటే...." రవి ఏడుపు,ముఖం పెట్టాడు.
    "రవీ! నీ తల్లీ, నా తల్లీ ఒక్కరే అయినందుకు సిగ్గుపడుతున్నాను.
    రవి చివ్వున లేచి నిల్చున్నాడు.
    "కూర్చో గౌతమ్ చెయ్యి పట్టుకొని లాగి కూర్చోబెట్టాడు.
    రవి గత్యంతరం లేనట్టు కూర్చున్నాడు.
    "నువ్వు మంచివాడివే. ఈ లాయర్ బాబే మహా చెడ్దోడు. ఇతనే నిన్ను చెడగొట్టాడు."
    "గౌతమ్! నీ వాలకం మరీ మితిమీరుతోంది. నీకు ఇషయం అయితే చెయ్యి. లేదా వచ్చిన దారినే వెళ్ళు.
    "వచ్చినంత తేలిగ్గా వెళ్తానా?"
    "వెళ్ళకేం చేస్తావ్?"
    "మిమ్మల్నిద్దర్నీ జైల్లో కుక్కిస్తాను."
    "షటప్!" విశ్వం చివ్వున లేచాడు.
    "కూర్చోవయ్యా లాయరూ! ఇంత ఉద్రేకపడేవాళ్ళు అంతగా దుర్మార్గాలు ఎలా చేస్తారయ్యా?"
    "అదుగో మళ్ళీ!"
    "లేదులే! మీరు చాలా మంచివాళ్ళు. మంచి పనులు తప్ప చెయ్యరు. మంచి తప్ప మాట్లాడరు. మంచి తప్ప వినరు. గాంధీ గారి కోతులు.....పకపక నవ్వాడు గౌతమ్.
    "విశ్వం, రవి ముఖాలు గంటు పెట్టుకొని కూర్చున్నారు.
    "రవి కంటే రవి అన్నయ్య గౌతమ్ చాలా మంచివాడు."
    రవి తల తిప్పి గౌతమ్ ను చూశాడు కోపంగా.
    "అతన్ని మోసం చేస్తున్న ప్రతి నిముషం నన్ను నేనే మోసం చేసుకొంటున్నట్టు ఆత్మగ్లానితో కుతగి పోతున్నాను. అతడ్ని ఇలాంటి దారుణమైన కేసులో ఇరికించాలంటే నా అంతరాత్మ అంగీకరించడం లేదు." "గౌతమ్ కంఠం గంభీరంగా పలికింది.
    విశ్వం గౌతమ్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
    ఇతడిలో ఇంత మానవత్వం ఉందా? డబ్బు కోసం ఏదైనా చేస్తాడనుకొన్నాడు తను.
    "లాయర్ బాబూ ఏమిటి ఆలోచిస్తున్నారు? హేళనగా పలికింది గౌతమ్ కంఠం.
    "ఇదెక్కడి న్యూ సెన్సయ్యా. మొదట డబ్బుకు కక్కుర్తిపడి అన్నీ చేస్తానన్నావు. ఇప్పుడేమో ప్రతిసారీ అంతరాత్మ అంటున్నావు?" విసుగ్గా అన్నాడు విశ్వం.
    "కనీసం నాకు అప్పుడప్పుడూ అది ఉన్నానని హెచ్చరిస్తుంది. మీకు అదీ లేదుగా?"
    "ఏది లేదు?"
    "అంతరాత్మ."
    "సరేలే! అసలు సంగతి చెప్పు."
    "ఏమిటది? ఆ పని చాలా రిస్కుతో కూడుకున్నది." మరి ఎంత ఇస్తారు?"
    "మళ్ళీ మళ్ళీ ఇవ్వడం ఏమిటి? నువ్వె ఆ గౌతమ్ సగం ఆస్తికి....."
    "ఆస్తికి వారసున్నే అవుతానో, లేక జైలుపాలే అవుతానో ఎవరు చెప్పగలరు? అందుకు నేను చేసే ప్రతి రిస్కు కూ ముందు ముడుపు చెల్లించాలి."
    "ఆ మధ్య పెట్రోలు బంక్ నుంచి నలభై వేలు కొట్టేశావు. వర్క్ షాపు నుంచి ఇరవైవేలు బ్యాంకు నుంచి లక్ష___ఇంకా ఇవ్వాలా?" డీలా పడిపోతూ అన్నాడు రవి.
    "అవునయ్యా మరి! ముగ్గురం స్టార్ హోటల్లో ఉండాలంటే మాటలా?"
    "ఇంకా వాళ్ళిద్దరూ ఎందుకూ?"
    "వాళ్ళు లేకపోతే మీ అన్నయ్య మూవ్ మెంట్స్ నాకెలా తెలుస్తాయి?"
    "మేం చెప్పమా?"
    "ఏమిటి మీరు చెప్పేది? మీకా మాత్రం తెలివితేటలుంటే నాదాకా ఎందుకొస్తారు?"
    "రవీ! నువ్వూరుకో" అన్నాడు విశ్వం."
    "నీకేం నువ్వలాగే అంటావ్. నీ కొచ్చిన నష్టం ఏముంది?" అక్కసుగా అన్నాడు రవి.
    "ఇన్నిటికీ ఏమంటావ్?" విసుక్కున్నాడు విశ్వం.
    రవి మాట్లాడలేదు.
    "ఎంతివ్వమంటావ్?"
    "ఇరవై వేలు?"
    "ఇరవైవేలా ఈ చిన్న పనికి?" రవి కళ్ళు తేలేశాడు.
    "చిన్న పనా? రేప్ కేసులో పట్టుబడితే ఎన్నాళ్ళ శిక్షో తెలుసుగా!"
    "మళ్ళీ రేప్ అంటావ్!"
    "పిచ్చిబాబూ! అది కేవలంనటన అని నీకూ నాకూ మాత్రమే తెలుసు మీ అన్నయ్యను రేప్ కేసులో ఇరికించాలనేగా మీ ప్రయత్నం? ఒకవేళ నేనే చిక్కిపోతే ఆ శిక్ష నాకే పడుతుంది. కనీసం నన్ను పెంచిన తల్లికి పెద్ద తనంలో సెక్యూరిటీ కావాలా? నేను వెళ్ళి జైల్లో కూర్చుంటే ఆమెకు ఎలా గడుస్తుంది?"
    "ఇప్పుడు నువ్వు మహా సంపాదించి పెడుతున్నట్టు?"
    "ఇప్పుడు ఆ అవసరం లేదు. అవసరం అయిన రోజు కూలి చేసైనా న ఆతల్లిని నేను పోషిస్తాను." చురుగ్గా అన్నాడు గౌతమ్.
    ఆ గౌతమ్ గాడి లక్షణాలే అన్నీ! రవి మనసులోనే అనుకున్నాడు.
    "అలాగే ఇస్తాం. ఒప్పుకో రవీ!"

 Previous Page Next Page