ఆ విషయం తెలుసు వీరభద్రానికి. ఆమె ఆలోచనల్లో దూరడానికి వాటికీ ఒక సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నాడు. ఆలోచనలు అనంతంగా వస్తున్నాయి. మబ్బుల్లా తెలిపోతున్నాయి. మరుక్షణానికి తానేమలోచించాడో గుర్తుండడంలేదు. సమాజం ఎంతలో మారిపోయింది. శతాబ్దాలుగా అణగి "దొరా బాంచన్" అన్న సమాజంలోనే ఒక చిచ్చు పుట్టింది. ఒక ఉద్యమం రగిలి రగిలి మహోద్యమం అయింది. జనం దోపిడిని గ్రహించారు. దోచుకునే వాళ్ళ మీద ఉప్పెనలా పడ్డారు. దొరలు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయారు. ఒక చైతన్యం పొంగింది. దాన్ని ఎదురించినవాడు చచ్చి ఊరుకున్నాడు. ఎమైందా చైతన్యం? ఏమైందా ఉద్రేకం? ఎమైందా వెల్లువ? కలచక్తం వెనక్కు తిరిగిందా లేక ఎదుటనే గోతులుండేనా?జనం మళ్ళీ దోపిడికీ లోంగారు. దొరను కాక రాముణ్ణి మరొక దొరను చేశారు. వాడు తన మీద అభాండం వేశాడు. జనాన్ని నమ్మేటట్లు చేశాడు. నమ్ముతున్నారా జనం? తన శీలాన్ని శంకిస్తున్నారా? తనను ఎన్నుకున్న జనమేనా ఇది? తనను దుష్టుని కింద లెక్క కట్టిందా? ఇప్పుడు తాను ఎవరిని నమ్మాలి? తాను నమ్మింది జనాన్ని, ప్రజలను. వారే తనకు దిక్కు అనుకున్నాడు. సర్వం త్యాగం చేశాడు. వారే తనను నమ్మటం లేదు. వారు సరే అసలు మంగమ్మ! అతనికో చిరునవ్వు వచ్చింది. సమాజాన్ని, సంఘాన్ని గురించి ఆలోచించే తాను ఒక వ్యక్తిని గురించి ఆలోచించాల్సి వచ్చింది. తనను గురించి తాను ఆలోచించుకోవాల్సి వచ్చింది. యెంత పతనం! అయినా ఏం చేస్తాడు? కాని ఎలా? ఇంతదాకా వచ్చి వదులుకుంటాడా? ఇప్పుడు మంగమ్మను వదిలివేయటం సాధ్యమా? మంగమ్మ చనిపోతేనే బావుండేది అనే ఆలోచన వచ్చింది లిప్తపాటు. తాను ఎంత నీరసించిపోయాడు అనుకున్నాడు. ఒక్క సంఘటనను ఎదుర్కోలేని వాడైపోయాడు. ఇంతకూ ఏం చేయాలిప్పుడు, మంగమ్మ ఏం కావాలి? తానెం కావాలి? మనసులో ముళ్ళపొదలు మొలిచాయి. గుండె రక్తం వరదలై పారింది. అందులో తడబడ్డాడు. సతమతం అయినాడు. వీరసించాడు. ఎక్కడో వేగుచుక్క వెలిగింది. వీరభద్రం మనసులో వెలుగురేఖ గోచరించింది. మంగమ్మను పెండ్లి చేసుకుంటే? తాను పెండ్లి , మంగమ్మకు పెండ్లి. మంగమ్మను పెండ్లి ఒక నిశ్చయానికి వచ్చేశాడు. పరిష్కారం లభించేవరకు తేలిక అయినాడు. ఏదో ఉత్సాహం పొంగింది. అమన్యంగా లేచి "మంగమ్మా!" అని పరిగెత్తాడు.
మంగమ్మ దిక్కున లేచి కూర్చుంది.
మంచం పక్కన నుంచున్న వీరభద్రం "మంగమ్మా నిన్ను నేను పెండ్లి చేసుకుంటా" అన్నాడు.
మంగమ్మ కళ్ళప్పగించి చూచింది. ఆమెలో ఉప్పెనలు లేచాయి. తుఫానులు చెలరేగాయి. జడివానలు కురిశాయి. పెనుగాలులు వీచాయి. ఆమె ఉక్కిరిబిక్కిరి అయింది. ఉబ్బి తబ్బిబ్బైంది. గొంతులోంచి ఒక మాట పెగల్లేదు. కన్నీటి చుక్కులు రెండు రాలేయి.
నిర్విన్నుడై చూచాడు వీరభద్రం. కన్నీటికి అర్ధం గ్రహించలేక పోయాడు. నిశ్చేష్టుడై నుంచున్నాడు.
ఒకరి ముందు ఒకరు. రెండు ప్రాణాలు .అయినా నిశ్శబ్దం. నిశ్శబ్దం. గుండెల చప్పుడు.
"అన్నయ్యా నువ్వు దేవతవు" అని కాళ్ళ మీద పడి పెద్దగా ఏడ్చేసింది మంగమ్మ.
వీరభద్రానికి ఆగలేదు. గుండె చెరువైంది. కళ్ళు చెమ్మగిల్లాయి. రెండు భాష్ప బిందువులు మంగమ్మ మీద రాలాయి.
మంగమ్మ తలెత్తి చూచింది.
రెండు భుజాలు పట్టుకొని అమాంతంగా లేవనెత్తాడు వీరభద్రం. "మంగమ్మా! అప్పటికి నువ్వు నాకు చెల్లెలునే నీకు నేను అన్ననే. రాక్షసుణ్ణి కాను. రాముణ్ణి కాను. మన పెండ్లి ఖాయం. వేరే గత్యంతరం లేదు. నన్ను అపార్ధం చేసుకోకు" అని మంగమ్మను మంచంలోకి నెట్టి చరచర బయటికి వచ్చేశాడు.
మంగమ్మ నిర్విన్నురాలై చూస్తూ ఉండిపోయింది.
తెల్లవారింది.
తెల్లవారడం ప్రకృతి ధర్మం. అంతటితో అందరికీ తెల్లవారుతుందని చెప్పలేం. బయట చీకట్లను సూర్యుడే కాదు ఒక్క దీపం చీల్చి చెండాడగలదు. లోపల చీకట్ల బ్రహ్మ సహితం పోరాద్రోలలేడు. కొందరు కావాలని చీకట్లు పెంచుకుంటారు. చీకట్లు లేకుంటే వారు బతకలేరు. చీకట్లు వ్యాపింపజేయడం వారి వృత్తి. ఆ వృత్తి మీదనే ఉన్నారు నిన్నటి నుంచి శేషయ్య, యాదగిరి. తెల్లవారడంతో పేకాట నుంచి బయటపడ్డ శేషయ్యకు మల్లయ్య కనిపించాడు.
"మంచి లీడర్ దొరికిండయా, తిన్నింటి వాసాలు లెక్కపెట్టేటోడు" అంటించాడు శేషయ్య.
"ముండ సొమ్ము తిని మంది కొంపలు ముంచుతాండు కదా" మల్లయ్య వెటకారంగా అన్నాడు.
"ఆవు, చెల్లెలు , చెల్లలనుకుంటనే కడుపు దింపిండు"
మండిపోయాడు మల్లయ్య. "చేసింది రామయ్య. మల్ల మా అయ్యమీద నూకిండు. ధరను ముండాలయ్య పైసుండగనే సరిప్పోయినాది!"
"అరె మల్లయ్య, ఏందిర మాట్లాడుతున్నావు? బద్రయ్యే చేసిండని లోకం కోడై కూస్తాంది . నువ్వేమో ఎనకేసుకోస్తవేమిర?"
"అస్స్ , ఊరుకోవే, ఇన్ని సారనీలు పోస్తే అందరంటరు"
"అయితే తాగుడు పోయించి అనిపిస్తాన్నమంటవు?"
"నేననేడిదేందుండి. ఊరంతా ఉడుకుతాంది."
"ఏమని ఉడుకుతాందిలే"
"రామయ్య తప్పు చేసి బద్రయ్య మీద నూకుతాండని"
"ఆ మాటంటే మూతిపళ్ళు ఇరకోడ్త. ఏమనుకున్నావో గాడ్ది కొడక. ఎవడ్రా అన్నది. ఒక్కణ్ణి పిల్చకరా నా ముంగలికి తోళ్ళు లుస్త లంజకొడుకుల్ని" అని మీదికి ఉరికాడు శేషయ్య.
శేషయ్య మీదికి రావడం చూచి ఒక్క తోపు తోశాడు మల్లయ్య.
అమాంతంగా కిందికి పడిపోయాడు శేషయ్య. అయినా లేచి మల్లయ్య మీదపడి బారుతుండగా మస్తాన్ వచ్చి శేషయ్యను నాలుగు అంటించుకున్నాడు. శేషయ్య వళ్ళంతా హూనం అయింది. జవ వచ్చింది. చేత కాలేదు. పెద్దగా ఏడ్చాడు. ఎక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడో యాదగిరి , మరికొందరు వచ్చి మల్లయ్య మీదా, మస్తాన్ మీద పడ్డారు. చితకబాది బజార్లో పడేసి వెళ్ళిపోయారు. కీళ్ళు కదిలి పోయాయి ఇద్దరివీ. అయినా ఒకరిని పట్టుకొని ఒకరు లేచారు. వీరభద్రం దగ్గరికి నడిచారు.
వీరభద్రం వారిని చూచాడు.