Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 26

    అరనిముషం వ్యవధిలో తన ముందు నగ్నంగా నిలబడ్డ దేవిని చూడటానికి కళ్ళు చాల్లేదు చౌదరికి. ప్రతిసారీ ఇంతే. ఆమెను ఎన్నిసార్లు అనుభవించినా తనివితీరదు.....నిజానికి ఆమెది అందం కాదు ఇక ఎప్పటికీ వెనక్కి రాకూడదనిపించే అంతరిక్ష గవాక్షం. షూట్ ఎట్ సైట్ వారెంటులా వెంటనే చంపాలనో, చావాలనో అనిపించే కోరికలతో మండుతున్న చితాగ్నిగుండం....   
    "భక్తా.....రా.....నాలో ఐక్యం కా" అంది విల్లులా వంగిపోతూ. అనుభవాన్ని ఐక్యం కావడంగా అభివర్ణించే దేవిని బెడ్ మీదకి నడిపించబోయాడు ఉద్రేకంగా. "ఈ రోజు ఏకాదశి....మేం నేలమీదనే శృంగార క్రీడని ఇష్టపడతాం"    
    ఆదేశంలా ఆమెను సమీపించి నేల మీదకి నెట్టబోతుంటే "విద్దకమునకు సిద్దపడు" అంది.    
    "ఆ పనిలోనే వున్నాను" అన్నాడు ఆమె పైకి రాబోతూ.    
    "విద్దకము అనగా వాత్సాయనుడి కామశాస్త్ర రీత్యా ఒకరి నొకరు బలంగా బంధించుకోవడం. నువ్వు చెయ్యాలనుకునే యుద్ధం కాదు" అణువంత కోపాన్ని అభినయించింది....ఆమె భాషతో ప్రతిసారీ కంగారుపడే చౌదరి ఆమె చెప్పినట్టు విద్దకం పూర్తిచేసి ఆమెను ఆక్రమించాడు.    
    ఆ గదిలో గాలి వేడి సెగలుగా మారుతూంది.    
    వృద్దాప్యం మూలంగా చౌదరి ఇబ్బంది పడటాన్ని గమనిస్తూ "తస్మాత్ సర్వేషు కాలేషు మూమనుస్మర యధ్యచ.... నన్ను తలచుకుంటూ యుద్దాన్ని కొనసాగించు" కళ్ళను అరమోడ్పులుగా మార్చి ఉత్సాహ పరిచింది "నీ సమస్యను వివరించు."  
    కొద్దిగా ఆగేడు. "నా మిత్రుడొకడికి మేషిన్ టూల్ ఫ్యాక్టరీ వుంది - ఈ సారి డిఫెన్స్ టెండర్ వాడికి రావాలి....మాకు ముఖ్యమైన పోటీ కృషి మెషిన్ టూల్స్ యజమాని ఉపాధ్యాయ. ఇంతవరకూ ఉపాధ్యాయ ప్రతిసారీ సాధిస్తున్న ఆ టెండర్ మేం సంపాదించాలి"   
    మృదువుగా నవ్వింది... "ఉపాధ్యాయ" మననం చేసుకుంటూ అంది "నీ చిరకాల ప్రత్యర్ధి కదూ....సరే...ఉపాధ్యాయ నాలో ఐక్యం కావటానికి అవకాశం లేకపోయినా నీ కోరిక నెరవేస్తాను...."    
    "థ్యాంక్స్" లేచాడు యజ్ఞం పూర్తిచేసినట్టుగా అయిదు నిముషాలలో బాత్ రూంలో నుంచి బయటికి వచ్చాడు.    
    "నీ ఆయుధం ఎలా వుంది" అంది దేవి వున్నట్టుండి ఉలిక్కిపడ్డాడు. "నేను అడుగుతున్నది నువ్వి ఉపాధ్యాయపై సంధించిన విశ్వనాథ్ అనబడే ఆయుధం గురించి" సూర్యం ఆమెతో చర్చించి వుండటంతో నిజాయితీగా చెప్పాడు "మీ ఆశీస్సుల మూలంగా ఉపాధ్యాయ ఇంట్లో అడుగు పెట్టాడు. మహా మేధావి కాబట్టి ఇక దూసుకుపోతాడు...."అర నిముషం పాటు కళ్ళు మూసుకుంది ఏ దివ్యలోకాల్నో దర్శిస్తున్న తపస్వినిలా ఆ తర్వాత మృదువుగా నవ్వింది.    
    "ఘటికుడే" అంది పారవశ్యంగా "అతడ్ని ఓ మారు పంపండి ఐక్యం చేసుకోవాలనుంది."    
    ఉలిక్కిపడ్డాడు చౌదరి.... దేవి అడిగిందంటే ఇక తిరుగులేదు. అసలు ఇలా అడగుతుందని చౌదరి ఏనాడూ ఊహించలేదు...    
    "నువ్వు కోరింది జరగాలీ అంటే అలాంటి సమర్ధుడైన యువకుడితో మేం ఓమారు ఐక్యం కావాలి చౌదరీ.... రేపు రాత్రికి అతడ్ని పంపించు" ఆమె అడిగింది అర్ధరాత్రి ప్రత్యేక దర్శనానికి అని బోధపడిపోయింది. భక్తులతో కాక విడిగా రావచ్చు...    
    "అలా పంపితే నీ టెండర్ సమస్యని రేపు రాత్రిలోగా మేం పరిష్కరిస్తాం"    
    ఓ ఆదేశంలా చెప్పి ఆమె లోపలికి వెళ్లిపోయింది.    
    ఇక మళ్ళీ దర్శనం వుండదు.....మాట్లాడే అవకాశం లేదు. అదంతే.....తప్పించుకోటానికి ఈ ఒక్కసారితో తీరే పనికాదు. దేవి మూలంగా చాలా పనుల్ని సాధించాడు... ఇప్పుడు అడిగే టెండర్ వ్యవహారమూ సామాన్యమైంది కాదు. అది సాధించగలిగితే తనకి కనీసం యాభై లక్షల కమీషన్ దక్కుతుంది.    
    విస్సుని పంపటానికే తీర్మానించుకున్నాడు చౌదరి.    
    అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటల రెండు నిముషాలు...    
                                 *    *    *    *
    "కేవలం మిమ్మల్ని టెర్రరైజ్ చేయటానికి ఎవరో చేసిన ప్రయత్నం అది" ఎసిపి మాధుర్ కంక్లూడ్ చేశాడు విస్సుపై నుంచి దృష్టి మరల్చకుండా....    
    ఉపాధ్యాయకి బోధపడలేదు మాధుర్ చెబుతున్నదేమిటో.    
    విషయం మరింత స్పష్టంగా అర్ధమయ్యేట్టు చేసే ప్రయత్నంలా కృషి మాదుర్ని అడిగింది "అలాంటి ప్రయత్నం వలన ఎవరికీ ఉపయోగం?"    
    "మీకు, నాకు లేకపోవచ్చు మిస్ కృషి. ఉపాధ్యాయగార్ని కాపాడగలిగామనే క్రెడిల్ కోసం ఎవరో ఏ పని చేసి వుండొచ్చుగా"   
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    ఉపాధ్యాయగారి మొహంలో రంగులు మారాయి.    
    విస్సుని యిరికించగలిగిన సంతృప్తితో కృషి తాతగారి కేసి చూస్తుండగానే ఫోన్ రింగయింది.    
    రిసీవర్ని సాలోచనగా అందుకున్న ఉపాధ్యాయగారు "ఎస్ స్పీకింగ్" అన్నాడు ముందు. ఆ తర్వాత అర నిముషం పాటు రిలీఫ్ గా విని ఫోన్ క్రెడిల్ చేశాడు.    
    "సరైన ఆధారాలు లేకుండా మాట్లాడ్డం అవివేకం మిస్టర్ మాధుర్..." చెప్పారు ఉపాధ్యాయగారు నిట్టూర్చుతూ. "ఇప్పుడే మీ కమీషనర్ ఫోన్ చేసి చెప్పాడు...... కాచిగూడా పోలీసులకి కాన్ ఫరెన్స్ హాల్లో స్మోక్ బాంబ్ పెట్టిన నేరస్థుడు పట్టుబడ్డాడు"    
    "వ్వాట్" నిశ్చేష్టుడిలా అడిగాడు మాధుర్.    
    "అంతే కాదు... నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నంలో అడ్డం వచ్చిన విస్సుని గాయపరిచినట్టుగా దాన్ని కూడా అంగీకరించాడట" ఉపాధ్యాయగారు చెప్పిందంతా విన్న మాధుర్ ఇక అక్కడ నిలబడలేదు. తన పై అధికారి చెప్పిందాన్ని కాంట్రాడిక్టు చేయలేనట్టుగా శలవు తీసుకుని కాదు - క్షమార్పణలు చెప్పి మరీ వెళ్ళాడు.    
    కృషి తెల్లబోయి చూస్తూంది విస్సునే...అతడి మొహంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు...అసలు చేసింది విస్సు అయితే మరెవరో నేరాన్ని అంగీకరించడమేమిటి...    
    తలవంచుకుని నిలబడ్డ విస్సుతో అన్నారు ఉపాధ్యాయగారు "జరిగిందానికి బాధ పడుతున్నావా"    
    విస్సు నిర్వేదంగా నవ్వాడో అలా అభినయించాడో కృషికి అర్ధం కాలేదు. "నేను బాధపడుతున్నది జరిగిందానికి కాదు ఉపాధ్యాయగారూ ఇక ముందు జరగబోయేదాని గురించి.... మీ అభిమానాన్ని పొందగలిగిన ఒక అనాధ యువకుడిపై కక్షతో పోరాటం ప్రారంభించిన వాళ్ళు రేపు మరేం చేస్తారో అన్నది వూహించలేక పోతున్నాను."    
    లాలనగా విస్సుని పేట్ చేశారు ఉపాధ్యాయ... విస్సు చెప్పిన దాంట్లో తనో అనాధ అన్న పదం ఎక్కువగా ఆయన్ని కదిలించినట్టుగా "నేనుండగా నువ్వు అనాధవి కావు విస్సు" అన్నారు గంభీరంగా.    
    అది విస్సు నటనలో గొప్పతనమో లేక నిజాన్ని గుర్తించలేని తాతయ్య అమాయకత్వమో కృషికి తోచడం లేదు. కాని విస్సు చాలా అమోఘంగా ఆకట్టుకుంటున్నాడు.    
    ఆ తర్వాత ఫ్యాక్టరీకి బయలుదేరుతున్న ఉపాధ్యాయని వారించబోయాడు విస్సు "ఈ వయసులో సైతం మీ దీక్ష, దక్షత కొనియాడ తగినవే! కాని మీ ఆదేశాల్ని పాటించడానికి నాలాంటి వాళ్ళుండగా మీరింకా శ్రమపడటం నాకు సమంజసంగా అనిపించడం లేదు"    
    మృదువుగా నవ్వారాయన... "నా శరీరంలో శక్తి ఇంకా ఉడిగిపోలేదు విశ్వనాథ్" అంతకుమించి మాట్లాడకుండా డాక్టర్ మహంతితో బాటు బయటికి వెళ్ళిపోయారు.    
    విస్సు నిజాయితీపైనా సమర్ధతపైనా అసాధారణమైన నమ్మకం ఏర్పడిపోయిన ఉపాధ్యాయ కారెక్కుతూ డాక్టర్ మహంతితో ఏం చెప్పిందీ కృషికి తెలీదు.    
    కాని ఉపాధ్యాయని పూర్తిగా నమ్మించగలిగిన విస్సుతో అంది ఉక్రోషంగా "అభినందిస్తున్నాను విస్సూ....నీ నటనా కౌశల్యానికి ఆశ్చర్యపోతున్నాను"
    "అప్పుడే ఏం చూసేవు కృషి ఇది ప్రారంభం మాత్రమే"    
    "నన్ను కూడా తక్కువగా అంచనా వేయకు"    
    "అలా చేసేవాడ్ని అయితే అక్కడ పోలీస్ స్టేషన్ లో చౌదరి మనిషి సర్రెండర్ అయ్యేట్టు ఆర్గనైజ్ చేసేవాడ్ని కాదు కృషి"    
    అదిరిపడింది కృషి "వాట్"    
    "ఎస్ మిస్ కృషి" విజయగర్వంతో నవ్వాడు విస్సు. "నాకు తెలుసు నువ్విలాంటి పరిశోధన ప్రారంభిస్తావని...అందుకే చౌదరితో మాట్లాడాను. ఓ మనిషిని ఏర్పాటు చేశాను...పాపం....ఏసిపి మాధుర్ వచ్చేసరికి చెస్ లో నాకు చెక్ చెప్పేసినట్టు తెగ సంబరపడిపోయావు కదూ...కాని....పదివేలు మొహాన పడేస్తే నేరం ఒప్పుకుని జైల్లో కూర్చునే వ్యక్తులు ఈ దేశంలో చాలా మంది వుంటారని తెలుసుకోలేకపోయావు..."    
    కృషికి ముచ్చెమటలు పోసాయి...ప్రతి యెత్తుకి పై యెత్తు వేసి చాల అలజడి సృష్టిస్తున్నాడు విస్సు.    
    "దేనికోసం ఇదంతా"    
   "నీ మీద గెలుపుకోసం"    
    "అంటే.. ..."    
    "నువ్వెంత వున్నదానివైనా నాకింద వుండాల్సిన దానివే అని నీకు నిరూపించడం కోసం"    
    "అదంత సులభం కాదు విస్సు....."    
    "సులభమే అయితే యిన్ని పథకాలెందుకు కృషి ఎప్పుడో కానిచ్చేసేవాడ్నిగా" క్షణం ఆగి అన్నాడు "అంచెలంచెలుగా ఎదిగిపోతున్న నన్ను చూస్తుంటే ఇప్పుడేమని పిస్తూంది"    
    "నువ్వు వచ్చింది కేవలం నాకోసం మాత్రమే కాదని అర్దమైపోయింది విస్సూ... ఇప్పుడు అసలు పరిశోధన ప్రారంభించాలని వుంది"    
    ఎగతాళిగా నవ్వేడు విస్సు...    
    "ఒకనాడు నేను నీ తల్లిని కిడ్నాప్ చేయించావన్నావుగా..."    
    "అయితే"    
    "ఇప్పుడు ఆవిడ్ని నిజంగా కలుసుకోబోతున్నాను..."    
    "నువ్వో అనాధవని యిందాక మా గ్రాండ్ ఫాదర్ తో అన్నావుగా"    
    విస్సు మొహంలో రంగులు మారాయి.    
    "నువ్వు చెప్పింది నిజం కాదని మా తాతయ్యకి త్వరలోనే తెలియచెప్పబోతున్నాను. నిన్నీ యింటి నుంచి బయటికి సాగనంపబోతున్నాను"    
    కృషి వెంటనే ఆ పనిలో నిమగ్నమయ్యేదే కాని ఫ్యాక్టరీ నుంచి అర్జెంటుగా రమ్మని ఉపాధ్యాయగారు ఫోన్ చేశారు....ఇప్పుడిప్పుడే కొన్ని కీలకమైన నిర్ణయాలలో కృషిని ఇన్వాల్వ్ చేస్తున్న ఉపాధ్యాయ గారు పిలిచింది తన ఛాంబర్ లో జరిగే ఓ ముఖ్యమైన సమావేశంలో పార్టిసిపేట్ చేయమని...    
    అది ఉపాధ్యాయ తన మెషిన్ టూల్ ఫ్యాక్టరీకి సంబంధించి పంపబోయే టెండర్ గురించి.    
    చౌదరి నిన్న దేవిని ఏకాంత సేవలో అడిగింది ఆ టెండర్ గురించే...            
    కృషి రోజంతా ఆ పనిలోనే బిజీగా వుంది.  
                                       *    *    *    *        
    రాత్రి పది గంటలు కావస్తుండగా జూబిలీ హిల్స్ లోని గీతాదేవి బిల్డింగ్ లో అడుగుపెట్టాడు విస్సు.    
    నిజానికి వెళ్ళడం ఇష్టం లేదు కాని ఓ ముఖ్య సమాచారం తెలుసుకోవాల్సి వుంది కాబట్టి వెళ్ళక తప్పదన్నాడు చౌదరి.    
    ఖరీదైన భవంతిలోని హాల్లో అడుగు పెట్టగానే ఓ స్వాగతంలా పది మంది అమ్మాయిలు ఎదురొచ్చారు...లోలోన చాలా కంగారుపడ్డాడు. అక్కడ జరిగే కార్యక్రమం గురించి చౌదరి కొద్దిగా హింట్ చేశాడు. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కొత్తల్లుడు తొలిసారిగా అత్తగారింట అడుగుపెట్టినప్పటి ఏర్పాట్లలా అనిపించింది.    
    "అమ్మగారు మందిరాన్ని పావనం చేయమని ఆదేశించాడు" ఓ కాషాయ వస్త్రం దారిని తెలియజేసింది. ఆమె వెనుకగా మెట్లెక్కి ఓ గది దాకా వచ్చాడు...ఆ తర్వాత లోపలికి వెళ్ళమన్నట్టు సంజ్ఞ చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.

 Previous Page Next Page