గొంతు దిగినట్టు పొలమారింది కృషికి - ఏం జరుగుతూంది....విస్సు ఇంతింతై వటుడింతై అన్నట్టు గ్రాండ్ పా దృష్టిలో అలా ఎదిగిపోతున్నాడేం..."యస్ గ్రాండ్ పా"... ఓరకంట విస్సుని చూసింది. "నిజమే ఈ కాలంలో ఇలాంటి యువకుడుండటం చాలా అరుదైన విషయం".
"మీ అభిమానం కాని..." ఆధ్యాత్మికంగా నవ్వేడు విస్సు. "ఇదంతా మీ మనసుల్లోని నిర్మలత్వమేగా - అవును మేడమ్. ప్రపంచం కనిపించేది చూసే కళ్ళను బట్టి అన్నది నా నమ్మకం. నమ్మకమేమిటి నిజం కూడా...మీరు నన్ను ద్వేషిస్తే ఇప్పటి నా ప్రవర్తన నటనలా వుంటుంది. అభిమానిస్తే వినమ్రతగా కనిపిస్తుంది"
ప్రశాంతంగా నవ్వేరు ఉపాధ్యాయగారు. ఎప్పుడూ వ్యాపారానికి చెందిన ఫైల్స్ తో లాభనష్టాల చిట్టాలతో కొత్త ప్రోజక్టుల గురించి చేసే ఆలోచనలతో సతమతమయ్యే తనకి విస్సుతో చర్చ చాలా రిలీఫ్ గా వుంది. అదొక్కటే కాదు - నిన్న వేదికపై వ్యాపారానికి చెందిన ప్రాక్టికల్ ఫిలాసఫీ మాట్లాడిన విస్సు ఇప్పుడు ఇంకో డైమన్షన్ లో కనిపిస్తున్నాడు. చాలా చదివితే తప్ప ఆ వయసులో యింతడి విజ్ఞానాన్ని సంపాదించడం కష్టమైన పని. "చాలా చదివాననుకుంటాను" అడిగారు ఉపాధ్యాయగారు.
తల వంచుకున్నాడు విస్సు బిడియంగా.
"నిజమే గ్రాండ్ పా" ఉక్రోషాన్ని అదిమి పెట్టుకుంటూ అంది కృషి. "చాలా చదివిన వాడిలా కనిపిస్తున్నాడు...చెప్పండి విశ్వనాథ్ గారూ...ఇంతవరకూ ఏమేం చదివారు...సిగ్గుపడకుండా చెప్పండి."
క్షణంపాటు కృషి కళ్ళలోకి చూసి దృష్టిని మరల్చుకున్నాడు. లోలోన కృషి ఎంత మండిపోతూందో అర్ధమౌతూనే వుంది. "ఎంత చదివినా ఇంకా చదవాల్సింది చాలా వుందన్న సత్యాన్ని మాత్రమే తెలుసుకున్న నేను ఏం చదివానని చెప్పమంటారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియచెప్పే అద్వైత్వాన్ని, ఏకత్వంలో భిన్నత్వం గురించి వివరించే ద్వైతాన్నీ చదివాను. వేదాలు, ఉపనిషత్తులతో బాటు రామాయణ భారతాల వంటి కావ్యాలు, యుస్కెఫీ ప్రచురణలూ చదువుతుంటాను."
విభ్రమంగా అడిగింది "యస్కెఫీ ప్రచురణలంటే"
"సమాజంలో విషబీజాలను నాటే సెక్సు గురించి, నేరాల గురించి, సంఘ విద్రోహక చర్యల గురించి రాయబడుతూ పసిపిల్లల మనసుల్ని ఛిన్నాభిన్నం చేసే చెత్త సాహిత్యానికి కలతచెంది ఓ ధర్మసంస్థ విడుదల చేస్తున్న ప్రచురణలవి..."
"నేను అడిగింది యుస్కెఫీ అంటే ఏమిటి అని."
"యునైటెడ్ సోషల్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (USCEFU). తెలుగులో అయితే భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక విద్యా ధర్మ సంస్థ" విస్సు అంతటితో ఆగిపోలేదు. చాలా ఆవేశంగా తన బాధని ప్రకటించాడు. "బాధ్యత లేనటువంటి ప్రచార సాహిత్యం మూలంగా జంతు ప్రాయంగా మారుతున్న పిల్లల్ని, నేటి యువతని కాపాడాలీ అంటే మన ప్రాచీన విజ్ఞానం గురించి, దేశ భక్తి గురించి, మంచి నడత గురించి తెలియచెప్పే మరెన్నో గ్రంథాల్ని యుస్కెఫీ ప్రచురించాలని కోరుకుంటున్నాను."
ఇంకా మాట్లాడేసేవాడే...చప్పట్లు వినిపించాయి...వెనక్కి తిరిగిన విస్సు అప్పుడు చూసాడు డాక్టర్ మహంతిని.
"అభినందనలు మిస్టర్ విశ్వనాథ్..." విస్సుకి నిన్ననే పరిచయం అయ్యాడు డాక్టర్ మహంతి. "అసలు చెప్పడమే కాని వినే అలవాటు లేని మా ఉపాధ్యాయని శ్రోతగా మార్చేసావూ అంటే నువ్వు సామాన్యుడివి కాదు.... ఇక నో ప్రాబ్లమ్....ఉపాధ్యాయగారినిక ఏ అనారోగ్యమూ ఇబ్బంది పెట్టదు. నూరేళ్ళు బ్రతికేస్తారాయన."
ఈ స్టేట్ మెంట్ కీ జవాబు చెప్పకుండా వుండలేకపోయాడు విస్సు. "అనారోగ్యంతో వున్న మనిషి ఆయుష్షుని పెంచేది డాక్టర్లు కాదని తేలిపోయింది మహంతిగారూ. ఈ మధ్యనే అమెరికాకి చెందిన సోషియాలజిస్ట్ 'ఎల్లెన్ బడ్లర్' హంగేరియాకి చెందిన ఎసిడిమాలజిస్ట్ 'స్లాన్ స్మవ్ కాసి' సైంటిఫిక్ గా నిరూపించారు"
ఉత్సుకతగా చూసారు ఉపాధ్యాయ...అది తన మేధస్సుని మరింతగా ఎరుకపరచాలని విస్సు చేస్తున్న ప్రయత్నంగా బోధపడిన కృషి సైతం అబ్బురంగా చూసింది. ఎంత కోటీశ్వరుడికైనా బ్రతుకు మీద ఆసక్తి చావదని తెలిసిన విస్సు ఇక్కడ తెలివిగా అవకాశాన్ని తీసుకుంటున్నాడు.
"అరవై అయిదు సంవత్సరాలు దాటిన సుమారు ఇరవైమూడు వేల మంది పేషెంట్సుని వాళ్ళ ఆరోగ్యం గురించి మూడే మూడు ప్రశ్నలు అడిగారట. ఒకటి నీ ఆరోగ్యం చాలా బాగుందా. రెండు నీ ఆరోగ్యం బాగుందా అని మూడు నీ ఆరోగ్యం క్షీణించిపోయిందా అని. కొందరు చాలా బాగుంది అన్నారు. మరికొందరు బాగుంది అన్నారు. ఇంకొంతమంది బాగా క్షీణించిపోయింది అన్నారు. ఇందులో బాగా క్షీణించింది అన్నవారు బాగుంది, చాలా బాగుంది అన్న వ్యక్తుల కన్నా ముందుగా అంటే నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే ప్రాణాలను కోల్పోయారు. దీన్ని బట్టి ఈ సర్వేలో ఎక్స్ పర్టులు తేల్చిన విషయం ఏమిటంటే జబ్బుపడినా ఆయుష్షుని కాపాడేది జబ్బు విషయంలో ఆయా పేషంట్సుకున్న ససెప్టిబిలిటీ ...ఆ ససెప్టిబిలిటీకి దోహదం చేసేది ఆ వ్యక్తులకి చెందిన కుటుంబాల్లోని పూర్వీకులు రోగాల చరిత్ర కూడా. మొత్తానికి పేషంట్సుని అమితంగా ప్రభావితం చేసేది బ్రతకాలనే ఆశ, బ్రతుకుతాననే ఆశావాదం అన్నది నిపుణులంతా తెలుసుకున్న సత్యం." చెప్పాల్సిందంతా చెప్పిన విస్సు క్షణం ఆగి ఉపాధ్యాయగారికేసి చూసాడు. "ఇపుడు ఉపాధ్యాయగారు కూడా నూరేళ్ళు బ్రతుకుతారన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే ఆశావాదిగానే ఆయన ఇంత సుస్థిరమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు కాబట్టి. వేల మందికి అన్నం పెట్టగలుగుతున్నానన్న సంతృప్తితో బ్రతకడంతో బాటు వేల కుటుంబాల ప్రార్ధనలే నిన్న ప్రమాదం నుంచి ఆయన్ని కాపాడాయన్నది మనమంతా అంగీకరించాల్సిన నిజం"
కృషికి మతిపోతోంది విస్సు చాతుర్యం చూస్తుంటే....మొన్నెప్పుడో ఓ మామూలు వీధి దొంగగా పరిచయమైనవాడు ఆ తర్వాత క్విజ్ పోటీలో మేధావి కూడా అనిపించినా మనిషి చివర నీచంగా ఆలోచించగల హీనుడు కూడా అనుకుంటే ఇదేమిటి ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు.
ఇంత లోతుగా చొచ్చుకుపోతున్న ఈ వ్యక్తి ఏం ఆశించి ఇంత విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అసలు దేన్నీ ఓ పట్టాన అంగీకరించని తాతయ్య సైతం మత్తులో కూరుకుపోతున్నాడేం...
ఆమె ఆలోచనల నుంచి ఇంకా తేరుకోనే లేదు.
ఇంటి లోపలికి దూసుకువస్తున్నాడు మాధుర్.....అసిస్టెంట్ కమీషనరాఫ్ పోలీస్....వస్తూనే అందర్నీ గ్రీట్ చేసాడు. ప్రత్యేకించి ఉపాధ్యాయగారితో చెప్పాడు "నిన్న కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సంఘటనలకి కారణం తెలుసుకోగలిగాం ఉపాధ్యాయగారూ....అది జరిగింది టెర్రరిస్టుల మూలంగానో లేక మిమ్మల్ని అపహరించాలనో కాదు."
ఎసిపి మాధుర్ విస్సు కేసి చూశాడు...
తను అనుకున్న నిజాన్ని సాధించిన సంతృప్తితో కృషి తేలుకుట్టిన దొంగలా రెడ్ హేండెడ్ గా దొరికిన డెకాయిట్ లా కనిపిస్తున్న విస్సుని గమనించింది ఏకాగ్రతగా.
నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటున్నాడు విస్సు దిక్కులు చూస్తూ. అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు.
* * * *
"అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ప్రవచ...." గంభీరంగా ఓ శ్లోకాన్ని వల్లించి ఆగింది గీతాదేవి....అప్పటిదాకా మూసుకున్న కనురెప్పల్ని తెరిచి తనకు అభిముఖంగా కూర్చున్న భక్తులందరినీ ఓమారు పారవస్యంగా చూసింది. "ప్రాణుల మొదలు మధ్య చివర నేనే...జనన జీనవ మరణాలన్నీ నేనే...నువ్వు పుట్టింది నాలోనే....నాకే - నువ్వు బ్రతికేది నాతోనే...నువ్వు చివర ఐక్యమయ్యేది నాలోనే...ఇది గీతా సారాంశం."
వయసులో వున్న అమ్మాయిలు నలుగురు కాషాయ వస్త్రధారిణులైన ఆమెకు వింజామరలు వీస్తుంటే మళ్ళీ కళ్ళు మూసుకుంది దేవి. పాతికేళ్ళ వయసు దాటని దేవి ప్రతి ఉదయమూ ఇలా భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఒక్కోమారు అత్యవసర దర్సనాలనీ అందించి భక్తుల్ని తరింపచేస్తుంది. ఆ విషయం నగరంలో వున్న ఖరీదైన వ్యక్తులకు మాత్రమే తెలుసు.
సుమారు మూడు సంవత్సరాల క్రితం జూబిలీ హిల్సులోని ఓ ఖరీదైన భవంతిని అద్దెకు తీసుకున్న దేవి ఆధ్యాత్మికమైన ఉపన్యాసాల్ని అందిస్తూ ప్రముఖుల్ని ఆకర్షించి క్రమంగా ఆ ఇంటిని సొంతం చేసుకుంది.
దానిక్కారణం ఆమె అసాధారణ సౌందర్యమే కాక అద్భుతమైన వాక్చాతుర్యం కూడా....ఆమె ఎక్కడినుంచి వచ్చిందో, అసలు జీవితాన్ని ఎలా ప్రారంభీంచిందో తెలీదు కాని వేదాల్ని, ఉపనిషత్తుల్ని బాగా చదివిందని ఆదిలోనే అందరికీ అర్ధమైంది....అలాగే భావించారు. ఆ భవంతిని అద్దెకిచ్చిన ఓ ఐ ఏ యస్ ఆఫీసరూ, అతడి ఇద్దరి కొడుకులు కూడా పైకెగురుతున్న కొద్దీ చాదస్తం కూడా అదే నిష్పత్తిలో పెరగడం ఆనవాయితీ కావడంతో ముందు ఐయ్యేయస్ ఆఫీసరు ఆమె భక్తిలో మునిగాడు. ఆనక వయసులో వున్న కొడుకులూ పనులు మానుకుని ఆమెను కొలవడం ప్రారంభించారు. ఈ కొలవడమన్నది ఒకరికొకరికి తెలియకుండా కొనసాగించడంతో ఆనక భక్తి కాస్త రక్తి దాకా అన్నది నుంచి కొట్టుకుని విడిపోవడం దాకా కంటిన్యూ అయ్యింది. అప్పుడు ముగ్గుర్నీ ఒకేసారి బెడ్ రూంలో కలుసుకున్నది దేవి "అహంకార విమూఢాత్మ కర్తాయతి మాన్యతే" అంది.....ఆ వాక్యానికి అర్ధమేమిటో తెలీని ముగ్గురితో "అహంకార వ్యామోహంలో చిక్కుకున్నవాడు కర్తని నేనే, కర్మ క్రియల్ని నేనే అని భావిస్తాడు తప్ప జరిగిందంతా మన 'ఖర్మ' అని సరిపెట్టుకోడు అన్న జ్ఞానోదయాన్ని గావించి ఇంటి నుంచి బయటికి నెట్టింది.
ఆ తర్వాత ఈ రకం ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా చాలా మంది ప్రముఖుల్ని ఆకర్షించి తన వ్యాపారాన్ని పటిష్టం చేసుకుంది. ఇప్పుడు ఆమె భక్తుల్లో రాజకీయ నాయకులున్నారు...బ్యూరోక్రాట్స్, ఆఫీసర్లూ, వ్యాపారవేత్తలూ వున్నారు....ఆమె ఆశీస్సులతో చాలామంది చాలా సాధించగలుగుతున్నా ఏ రోజూ ఆమె బయటికి వెళ్ళదు....ఓ రాజకీయ నాయకుడి పదివిని కాపాడాలి అంటే తనకున్న అందమైన పెదవిని అందించడం గాని. ఓ ఇండస్ట్రియలిస్టుకి కావాల్సిన టెండర్ని సాధించడంలో బెడ్ మీద 'థండర్'లా కదలడం గాని అంతా ఆమె పడక గదిలోనే జరిగిపోతుంది....కాకపోతే ప్రతిదానికీ ఓ రేటు వుంటుంది. అలా సంపాదించేది కూడా లోక కళ్యాణార్ధమే అన్నది ఆమె అభిప్రాయం.
అసలు ఆమె ఏమిటీ అన్నది చాలామంది ప్రముఖులకు తెలిసినా ఏ రోజూ ముక్కులమీద వేళ్ళేసుకోలేదు. అసలు ఆమె ఏకాంత సన్నిధి ఓ అరుదయిన పెన్నిధి అనే అభిప్రాయం చాలామందికి ఏర్పడిపోయింది. అందుకే అక్కడికి రాగానే ఓ భావాతీత ధ్యానంలోకి జారిపోయినట్టు పులకించిపోతూ ఆమె ఎవర్ని పిలుస్తుందా అనే ధ్యానంతో కళ్ళు మూసుకుంటారు. అంతకు ముందే నిర్ణయించబడిన షెడ్యూల్ ప్రకారం భక్తుల్లో ఎవరో ఒకరికే ఏకాంతసేవకి అవకాశం ఇస్తుంది దేవి...
"భక్తా" రెండు నిముషాల ధ్యానం తర్వాత ఆమెకు అభిముఖంగా ముందు వరుసలో కూర్చున్న రామనాథచౌదరికి సంజ్ఞ చేసింది. "మీ సమస్యని వినాలని ఉత్సాహ పడుతున్నాం"
అంతే....ఉదయం పూజలో ఇంకెవరికీ అవకాశం ఉండదన్నట్టుగా మిగతా వ్యక్తులు లేచి వెళ్ళిపోగా గంభీరంగా నడుచుకువెళుతున్న దేవి వెనుక ఏకాంత మందిరంలో అడుగుపెట్టాడు చౌదరి.
మరో ఐదు సెకండ్లలో ద్వారం మూసుకుంది.
ఆమె నేలమీద ఆసీనురాలైంది ముందు....ఐదు నిముషాలలో అటాచ్డ్ బాత్ రూంలో స్నానం చేసి వచ్చాడు చౌదరి.....అది ఆచారం ఆమె అనుమతి కోసం అన్నట్టుగా చౌదరి ఎదురు చూస్తుంటే నెమ్మదిగా పైకి లేచింది..... "మృత్యు: సర్వహరశ్చహమ్..." అన్ని సమస్యల్ని కడతేర్చే మృత్యువుని నేను అనే భావాన్ని ధ్వనింపచేస్తూ ఓరగా చూసింది అప్పటికే పేకెట్టుని బెడ్ పై ఓ మూల ఉంచాడు. అందులో వున్న కరెన్సీ ఎంతని అడగలేదు. అడగదు - చౌదరి స్తహాయి తెలుసు కాబట్టే అంతకు పూర్వంలాగే ఈ రోజూ నిశ్శబ్దంగా వివస్త్రగా మారింది.