Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 26

 

    "ఒకసారి మాట అన్నానంటే తిరుగు వుండదు "  అంది మీనాక్షి సీరియస్ గా.


    "హాపీ! హాపీ! ఇంకేం! పని కానియ్!" అన్నాడు సుందరం.


    డైస్ దగ్గరికి వచ్చి కాస్త వంగి చూసింది మీనాక్షి.


    అక్కడ కూర్చుని వున్న డైమండ్ రాజా కనబడ్డాడు. అతని పక్కనే ఒక మిలటరీ టైపు ఖడక్ మనిషి, ఆ పక్కనే ఒక యూరోపియన్.


    "డైమండ్ రాజా! హియర్ ఐ కమ్! కాచుకో!" అనుకుంది మీనాక్షి మనసులోనే.


    అదలా వుండగా -


    విదేశీ ఏజెంట్ అయిన క్లయివ్ స్పెన్సర్ , డైమండ్ రాజాతో సీరియస్ గా చెబుతున్నాడు.


    "రాజా విక్రమదేవరావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి ఒక ప్రపోజల్ పంపాడని చెప్పాను కదా - అదేమిటంటే -


    "ప్రభుత్వం కోట్లకి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా దేశాన్ని సక్రమంగా పరిపాలించలేకపోతోంది! అందుకని ప్రభుత్వం మిలటరీ, పొలిసు, విదేశాంగ వ్యవహారాల శాఖలూ, రిజర్వుబాంకూ మొదలైన కొన్నిటిని మాత్రం తన అధినంలో వుంచుకుని , మిగతా శాఖల నిర్వహణ అంతా మా "రాజా విక్రమ్" గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఇచ్చేయాలి. అలా గనక చేస్తే, మేము ప్రభుత్వ ఆదాయాన్ని ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చెయ్యడమే కాకుండా , ఖర్చు కూడా ఇప్పుడున్న దానిలో సగం తగ్గించగలం. లోటు బడ్జెట్ ప్రసక్తే వుండదు."


    అక్కడిదాకా విని అన్నాడు రాజా "మరి దానివల్ల విక్రమదేవరావుకి జరిగే లాభం ఏమిటి?"


    "విక్రమదేవరావు" లాభం లేకుండా ఏ పనైనా ఎందుకు చేస్తాడూ?" అన్నాడు క్లయివ్. "తమ దేశాన్ని ఇలా ప్రైవేట్ కంపెనిలా నడిపి, లాభాలు చూపించినందుకు బదులుగా ఆ లాభాలలో తనకి టెన్ పర్సెంట్ కమీషన్ కావాలని అడిగాడు"


    అప్పటిదాకా మౌనంగా వింటున్న జస్వంతరావు ఏదో గుర్తొచ్చినట్లు నవ్వాడు.


    ప్రశ్నార్ధకంగా అతనివేపు చూశాడు డైమండ్ రాజా.


    జస్వంతరావు గొంతు సవరించుకుని అన్నాడు.


    "విక్రమదేవరావు చేసిన ప్రతిపాదన ఇంతకుముందు ఎన్నడూ లేనట్టి అపుర్వమైన ప్రపోజల్ ఏమి కాదు! నిజం చెప్పాలంటే విక్రమదేవరావు పూర్వికులు - అంటే మీ పూర్వికులు కూడా కదా - రాజ్యం ఏలిన రోజుల్లో పద్దతి ఇలాగే ఉండేది. మీ పూర్వీకుడు మార్తాండసింహుడు బ్రిటీష్ రాజ్ లో రెంటర్ గా ఉండేవాడు అంటే కాంట్రాక్టు ప్రకారం తన రాజ్యంలో పన్నులు కరాఖండీగా వసూలు చేస్తూ, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బ్రిటీష్ వారికి పేష్ కష్ (కప్పం) చెల్లించేవాడు. విక్రమదేవరావు చేసిన ప్రతిపాదనలో లాగే విదేశాంగ వ్యవహారాలూ లాంటివి తప్ప మిగతా శాఖలన్ని తనే చూసుకుంటూ ఉండేవాడు."


    "చాలా కరెక్ట్!" అన్నాడు క్లయివ్. "తన ప్రతిపాదనలో అది కూడా మెన్షన్ చేశాడు విక్రమదేవరావు." ప్రభుత్వం గనక నా ప్రతిపాదనకి ఒప్పుకుంటే , నేను నా పూర్వీకుల లాగే ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని, అన్ని శాఖలనూ బిజినెస్ వైజ్ గా నడిపి, పన్నులు స్ట్రిక్ట్ గా వసూలు చేసి కప్పం కట్టే మంచి రెంటర్ గా ఉండగలనని విన్నవించుకుంటున్నాను.

 

                                                                                                         ఇట్లు,


                                                                                                         విధేయుడు


                                                                                                       విక్రమదేవరావు.


                                                                                            (ఎరస్ట్ వైల్ రాజా ఆఫ్ రాణీపూర్.)

 


    అని సంతకం పెట్టి ప్రతిపాదనని సీల్డు కవర్ లో వుంచి ప్రభుత్వానికి పంపాడు విక్రమదేవరావు." అని నవ్వాడు క్లయివ్.


    "అప్పుడేమయింది?" అన్నాడు రాజా.


    "చాలా సహజంగానే ప్రభుత్వం ఆ ప్రపోజల్ ని బుట్టదాఖలు చేసింది. కానీ ఆ ప్రపోజల్ గూడచారుల ద్వారా ఆ తర్వాత మాకు అందింది."


    "ఏవరా గూడచారులు?"


    "అది మీకు నిలకడమీద తెలుస్తుంది - కానీ మొత్తానికి మీ వాళ్ళే!"


    ఏదో అనబోయి , ఆగిపోయాడు రాజా.


    అతని మెడకి గులాబి ముళ్ళులాంటి చూపులు గుచ్చుకుంటున్నట్లు భావన కలిగింది.


    అప్రయత్నంగానే తిరిగి చూశాడు.


    అకక్డ నిలబడి వుంది ఆఠీన్ రాణీ - మీనాక్షి.


    ఆమె పక్కనే వున్నాడు మల్ హోత్రా.


    మీనాక్షి మల్ హోత్రాతో నవ్వుతూ మాట్లాడుతోంది. అవసరమైన దానికంటే పెద్దగా నవ్వుతోంది.


    అరక్షణంలో గ్రహించాడు రాజా - ఆమెలో వచ్చిన మార్పుని.


    ఇందాక అగ్గిబరాటాలా వుంది ఈ అమ్మాయి.


    ఇప్పుడు కూడా ఆమెలో ఇంకా కాస్త బింకం వుంది గాని, ఆ బింకం అంతా ఉత్తుత్తిదే అని తెలిసిపోతుంది.


     నవ్వుతూ మల్ హోత్రాతో మాటలడుతోంది మీనాక్షి.


    నవ్వినప్పుడల్లా తనవేపు తిరిగి చూస్తోంది - "ఈ నవ్వు నీకోసమే!" అన్నట్లు.


    అలా నవ్వుతూనే మల్ హోత్రాతో బాటు ముందుకు నడిచి, రాజాని దాటి వెళుతూ, ఒకసారి క్రీగంట అతనివేపు చూసింది ఆఠీన్ రాణీ మీనాక్షి.


    ఆ చూపు చూడగానే వెంటనే ఓ పాట గుర్తు వచ్చింది రాజాకి -


    "నజరోంకి తీర్ మారే ఖస్సు ఖస్సు ఖస్సు.


    ఏక్ నై దోనై


    అఠ్ నౌ దస్సు"


    తన కంటి చూపులే తూపులుగా వదిలింది కలకంఠి


    ఒకటికాదు


    రెండు కాదు

 

    అబ్బో! తొమ్మిదో, పదో.


    అనుకుంటి!


    డైమండ్ రాజా అలా ఆఠీన్ రాణీ మీనాక్షి ఆలోచనలో ఉండగానే -


    "మేం విక్రమదేవరావు ప్రపోజల్ లో చాలా పాసిబిలిటీస్ ఉన్నట్లు గ్రహించాం! అన్నాడు క్లయివ్. "ఇప్పుడు మా ప్రాజెక్టు ఏమిటంటే - మీ దేశాన్ని అల్లకల్లోలం చెయ్యడం - అప్పుడింక మీలో మీరు కొట్టుకుచస్తూ వుంటే దేశాన్ని మేం గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకోవడం - విక్రమదేవరావు చెప్పినట్టే విదేశాంగ శాఖ, డిఫెన్సు, పొలిసు వగైరా శాఖలు మాత్రం మా అధీనంలో వుంచుకుని మిగతా దేశాన్నంతా ఇష్టం వచ్చినట్లు దోచుకు తినమని నీకు కాంట్రాక్టుకి ఇచ్చేయ్యడం - నువ్వు మా రెంటర్ గా వుండి మాకు కప్పం కట్టడం, నీకు సొంతానికి కొంత మిగుల్చుకోవడం -- బ్రిలియంట్ అయిడియా! అవునా?" అన్నాడు.


    అది వినేసరికి రాజా మనసులో నుంచి మీనాక్షి ఆలోచనలో వెనుకబడిపోయాయి. అతని రక్తం బాయిలింగ్ పాయింట్ కి వచ్చినట్లు అయింది.


    "నీ పూర్వికులు ఒక చిన్న సంస్థానానికి రెంటార్ లు. నువ్వు హోల్ ఇండియాకే రెంటార్ వి అయిపోతావ్!" అంటున్నాడు క్లయివ్.


    "మరి ప్రజలు పిచ్చివాళ్ళా! చూస్తూ ఊరుకుంటారా? అన్నాడు రాజా, పళ్ళ బిగువున.


    నవ్వాడు క్లయివ్.


    "ప్రజలు కొట్టుకు చావడానికి ఇంతకంటే ముఖ్యమైన సమస్యలు సృష్టిస్తాం."


    "లైక్ వాట్?"


    "కులం - మతం- ప్రాంతం- భాష! - ఇప్పుడున్న కులాలూ, మతాల వాళ్ళే కొట్టుకు చస్తున్నారు కదా! మనం వాళ్ళను ఇంకా వెనక్కి తీసుకువెళ్తాం! వెనక్కి వెళ్ళిపోవాలనే కదా మీలో చాలా మందికి కోరిక!"


    "క్లియర్ గా చెప్పు"


    "చరిత్రలో వెనక్కి వెళ్ళే ముందు ఇండియాలో ఈ రోజుల్లో కులం ప్రభావం ఎలా ఉందొ మనం చెప్పుకుందాం! నేను ఫారినర్ ని అయినా ఈ విషయంలో నేను చాలా రీసెర్చ్ చేశానని చెప్పాను గదా!


    "చెప్పు!"


    "మొరటుగా మనం చెప్పుకోవలసింది బ్రాహ్మణుల గురించి!"


    "ఏమిటి?"


    "బ్రాహ్మణులు భారతదేశ జనాభాలో ఎంతమంది ఉంటారూ? మహా అయితే ఒక మూడు శాతం అనుకుందాం.


    కానీ - జనాభాలో ఈ మూడు శాతం వున్న బ్రాహ్మణులే తొంభై శాతం టాప్ మోస్ట్ పోజిషన్స్ లో ఉంటారని చెప్పినా తప్పలేదు!


    ఉదాహరణకి చేపుకోవాలంటే -


    మీ ప్రధాని బ్రాహ్మణుడు ! మీ రాష్ట్రపతి బ్రాహ్మణుడు! మీ సైన్యానికి అధిపతి బ్రాహ్మణుడు! మీ ఎలక్షన్ చీఫ్ బ్రాహ్మణుడు! ఏ పెద్ద పొజిషన్ చూడు ....అక్కడ ఒక భ్రాహ్మణుడు ఉంటాడు.


    జస్వంతరావు గొంతు సవరించుకున్నాడు. క్లయివ్ చెప్పేది నిజమే! అల్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అయిన మాధురీ దీక్షిత్ బ్రామిన్. మీనాక్షి శేషాద్రి బ్రామిన్. అంతకు ముందు డ్రీంగర్ల్ హేమమాలిని బ్రామిన్. వైజయంతిమాల కూడా బ్రామినే. " అన్నాడు జస్వంతరావు.


    "యూ ఆర్ వెరీ కరెక్ట్! అయితే ఇక్కడ , ఇంకో విశేషం కూడా ఉంది! అన్నాడు క్లయివ్.


    "ఏమిటది?" అన్నాడు.


    "భారతదేశ జనాభాలో అతి తక్కువ శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మణులు అత్యధిక సంఖ్యలో అత్యున్నత స్థానాలకి చేరుకుంటున్నారు నిజమే!

 Previous Page Next Page