Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 25

 

    అదే హోటల్లో ని గ్రీన్ రూంలో -


    ఆఠీన్ రాణీ మీనాక్షి సుందరంతో అన్నది.

    
    "నేను నిరాకరించలేని ప్రపోజలా? ఏమిటిది? నవ్వాడు సుందరం.

    
    "చాలా సింపుల్! నువ్వు డైమండ్ రాజాతో ప్రేమ నటించాలి!"


    మీనాక్షి కనుబొమ్మలు ముడిపడ్డాయ్. నుదురు చిట్లిస్తూ అంది.


    "ఎందుకు?"


    "ఎందుకు - డైమండ్ రాజా ఇప్పటికే నీతో పీకల దాకా ప్రేమలో పడిపోయాడు! లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకో!"


    "దటీజ్ హిజ్ ఫ్యునరల్!"


    "కావచ్చు! కానీ అతని అంత్యక్రియలకి నువ్వు కూడా కాస్త దోహదం చెయ్యాలి."


    "అంటే?"


    "ప్రేమ నటించాలి - దట్సాల్!"


    "అతనేవరితోనో ప్రేమ నటించవలసిన అవసరం నాకేమిటి?"


    "నటిస్తే నీకు ఐదు లక్షలోస్తాయ్! దానంగా కాదు - నువ్వు పడ్డ శ్రమకి ఫలితంగా?" అన్నాడు సుందరం.


    "ఎవరిస్తారు?"


    "నేనే"


    "అయిదు లక్షలా?" అంది మీనాక్షి.


    'అక్షరాలా అయిదు లక్షలు -


    అదీ అడ్వాన్సు మాత్రమే! హార్డ్ క్యాష్! ఇది పెద్ద వ్యవహారం! పని పూర్తయితే ఒక కోటి ఇస్తాను! మీ అమ్మ ట్రీట్ మెంట్ గురించి ఇంక నువ్వు తడుముకోనక్కర్లేదు! నువ్వు ఆమెని అమెరికా తీసుకెళ్ళవచ్చు!"


    తల్లి ప్రస్తావన రాగానే, ఆఠీన్ రాణి మొహంలోని కాటిన్యం ఒక్కసారిగా తగ్గిపోయి, దాని స్థానంలో బేలతనం చోటు చేసుకుంది.


    "నిజంగా అయిదు లక్షలు ఇస్తారా?" అంది. ఆశా, అపనమ్మకము కలిసిన గొంతుతో.


    "నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే - బయట కార్లో వుంది క్యాష్!"


    "నేనేం చెయ్యాలి ఇంతకీ?"

    
    "చెప్పానుగా - అతనితో ప్రేమ నటించాలి!"


    "అతనంటే నాకు అలర్జీ!"

 

    "కానీ నువ్వు ప్రదర్శించేది కేవలం నటనే!"


    "ఎందుకు?"


    "నువ్వు అతన్ని పూర్తిగా ప్రేమలోకి దించాలి. అతను నీకోసం ఏమైనా చేసేసే స్థితికి రావాలి! నిన్ను ఎట్టి పరిస్థితులలో నైనా సరే పెళ్ళి చేసుకోవడానికి రెడీ కావలి! అంతవరకూ తెస్తే చాలు!


    "అప్పుడేం జరుగుతుంది?"


    "అప్పుడు డైమండ్ రాజా మళ్ళీ బికారి అయిపోతాడు."


    ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి.


    "నాతొ ప్రేమలో పడితే బికారి అయిపోతాడా? ఎందుకని?"


    విషపు నురగ లాంటి నవ్వు నవ్వాడు సుందరం.


    "ఎందుకంటె - రాజా విక్రమదేవరావు ఒక వీలునామా రాసి పెట్టాడు గనుక?"


    "ఏముంది ఆ వీలునమాలో?" అంది మీనాక్షి.


    "రాజా విక్రమదేవరావుకీ భూమీ ఆకాశం పట్టనంత భేషజం ఉండేది! ఆయనకి అహంభావం ఎక్కువ! బంధుప్రీతి మరీ ఎక్కువ! తనూ తను వంశస్తులు తప్ప ఈ లోకంలో మిగతా వాళ్ళంతా మనుషులు కారనీ, పెంటలో పురుగుల్లాంటి వాళ్ళని ఆయనకు దురభిప్రాయం ఉండేది! ఆ అభిజాత్యానికి తగినట్లే రాశాడు అ వీలునామా కూడా - దాని ప్రకారం - తన తదనంతరం తన వారసులు ఎవరయినా కూడా, మంచి ఉన్నత వంశం నుంచి వచ్చిన సంభందాన్నే చేసుకోవాలి! అలాకాకుండా , కామనర్ ని- అంటే సామన్యుడినో , సామాన్యురాలినో పెళ్ళి చేసుకుంటే, తన పదివేల కోట్ల రూపాయల ఆస్తి ఆ వారసులకి చెందదు- ఆస్తి మొత్తం ట్రస్టు పరమైపోతుంది! అర్ధమయిందా? నువ్వు కామనర్ వి. సామాన్యురాలివి. డైమండ్ రాజా గనక నిన్ను పెళ్ళి చేసుకోదలుచుకుంటే ఆ తర్వాత అతనికి ఆస్తి దక్కదు. "నాకు ఆస్తి అక్కర్లేదు - ఈ అమ్మాయే నాకు కావాలి !" అనే స్థితికి రాజాని తీసుకురావాలి నువ్వు ! అందుకుగాను అడ్వాన్సు అయిదు లక్షలు!" అన్నాడు సుందరం ఊరిస్తున్నట్లు.

 

                                                * * *


    గ్రాండ్ హోటల్లో ఒక వేపున డైమండ్ రాజా క్లయివ్ స్పెన్సర్ తోనూ, ఇంకోవేపున ఆఠీన్ రాణి  మీనాక్షి , ట్రస్టీ సుందరంతోను, చాలా సీరియస్ ప్రపోజల్స్ గురించి అలా మాట్లాడుతూ ఉండగా -


    రాణీపూర్ పాలెస్ లో -


    ఇంకో తమాషా జరుగుతోంది.


    ట్రస్టీ సుందరం కొడుకు అయిన సామంత్ తన చేతిలో వున్న లిస్టు వేపు ఒకసారి నిశితంగా చూసుకుని, ఆ తర్వాత లిస్టులో ఒక్కొక్క ఐటమ్ సరిచూసి, టిక్కు పెట్టడం మొదలెట్టాడు.


    బనీను

 

    డ్రాయరు

 

    ప్యాంటు....


    మళ్ళీ ఒక్కసారి తన ఒంటివేపు చూసుకుని, ప్యాంటు వున్నదని నిశ్చయించుకుని టిక్కు పెట్టాడు సామంత్.


    పాంటు

 

    షర్టు

 

    టై

 

    కోటు

 

    సాక్సు


    బూట్లు

 

    బెల్టు

 

    కర్చీఫ్.


    అలా అన్ని టిక్ పెట్టి, "అమ్మయ్య' అని తృప్తిగా నిట్టూర్చాడు సామంత్. ఈసారి తను ఏదీ మర్చిపోలేదు!


    అప్పుడింక తాపీగా, తన తండ్రి అయిన ట్రస్టీ సుందరం చెప్పిన విషయం గుర్తుంచుకున్నాడు సామంత్.


    "ఒరేయ్ వెంగళాయ్! ఇవాళ్టినుంచి నీ పని - ఆ అయేషా వుందే -సద్గుణం గాడి కూతురు - దానివెనక పడడమే! గుర్తుందా! దాన్ని ఏదన్నా ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్ళి లవ్ డైలాగులు కొట్టు - ఎవ్వరూ ఉండని నిర్జనమైన ప్లేసు చూసుకో - తోటలోని ఆ నందివర్ధనం చెట్టు వుందే - అది బాగా గుబురుగా వుంటుంది. అక్కడికెవరూ రారు కూడా! ఆ పిల్లని అక్కడికి తీసుకెళ్ళి , నువ్వే నా ప్రాణం!" మార్కు డైలాగులు కొట్టు! అర్ధమయి చచ్చిందా!" అన్నాడు.


    తండ్రి చెప్పినది ఇప్పుడు తను ఆచరణలో పెట్టాలి!


    అయేషాని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి -


    అమర ప్రేమ డైలాగులు కొట్టాలి!


    వారేవా!


    ఇంతకీ-


    ఎక్కడుంది అయేషా?


    అయేషా కోసం అన్నిచోట్లా వెదకడం మొదలెట్టాడు సామంత్.

    
    ఆ పాలెస్ లో మూడొందల గదులు ఉన్నాయ్.


    వెదికి వెదికి అతని ప్రాణం సొమ్మసిల్లిపోయినట్లయింది.


    అయినా అయేషా ఎక్కడా కనబడలేదు!


    అప్పుడు అతనికి వినబడింది.


    ఎక్కడినుంచో వస్తున్నట్లు సన్నటి శబ్దం!


    "మ్యావ్.....మ్యావ్.....మ్యావ్"


    తలెత్తి చూశాడు సామంత్.


    ఆ పాలెస్ కి నాలుగు వేపులా నాలుగు బురుజులు ఉన్నాయి. వాచ్ టవర్స్.


    పూర్వకాలంలో సైనికులు ఆ బురుజులమీద పహారా వుండి శతృవుల రాకని గమనిస్తూ వుండేవారు.


    ఇప్పుడవి ఉపయోగంలో లేవు.


    బురుజులకి వెళ్ళే తలుపులు కూడా మూసి , గొళ్ళెం పెట్టి ఉంటాయి ఎప్పుడూ.


    వాచ్ టవర్ లో నుంచి వినబడుతోంది పిల్లి అరుపు.


    పిల్లితో బాటు వాచ్ టవర్ లోనే కనబడింది అయేషా కూడా.


    "ఒహూ! ఇక్కడున్నావా?" అనుకుని, తను కూడా కష్టపడి బురుజుమీదికి వెళ్ళాడు సామంత్.


    స్ప్రింగులాగా గుండ్రంగా ఉన్న రాతి మెట్లు. కటిక చీకటి -గబ్బిలాల వాసన!


    పైకి వెళ్లేసరికి అయేషా కనబడింది.


    "ఈ గబ్బిలాల కంపులో ఇక్కడున్నవెం?" అన్నాడు.


    "నా పెంపుడు పిల్లి పిల్ల క్వీనీ బురుజుమీద కేక్కేసి, కిందికి రాలేక పోతోంది. దానికోసం వచ్చాను" అంది అయేషా ఆయాసపడుతూ. ఆమె గొంతు చాలా మెల్లిగా వస్తోంది.


    అయేషానే చూస్తున్నాడు సామంత్.


    తన తండ్రి సుందరం ఏం చెప్పాడు?


    ఏకాంతంలో అయేషాతో ప్రేమ డైలాగులు కొట్టమని - అవునా?


    అంటే -


    తోటలో నందివర్ధనం చెట్టు వెనక అయేషాతో లవ్ డైలాగులు చెప్పలన్నమాట.


    "అయేషా!" అన్నాడు సామంత్ ఆబగా.


    "ఏమిటి?" అంది అయేషా.


    "నువ్వొక్కసారి అర్జెంటుగా తోటలో నందివర్ధనం చెట్టు దగ్గరికి రావాలి" అన్నాడు సామంత్.


    "ఎందుకూ?" అంది అయేషా.

 

    "అక్కడికి వస్తే చెప్తా!"


    సామంత్ వేపు ఎగాదిగా చూసి, "ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పరాదు?" అంది విసుగ్గా.

    
    "అమ్మో! నందివర్ధనం చెట్టుదగ్గరే చెప్పాలి!" అన్నాడు సామంత్ తన తండ్రి మాటలు గుర్తు తెచ్చుకుంటూ.


    "నేను రాను" అంది అయేషా.


    ఆమె వేపు సూటిగా చూశాడు సామంత్. తర్వాత మనసులో అనుకున్నాడు.


    "ఏనాటికయినా నిన్ను ఇంప్రెస్ చేసి, నందివర్ధనం చెట్టు దగ్గరికి రప్పించకపోతే నా పేరు నటరాజ్ కాదు అనుకున్నాడు సామంత్. తను అనుకున్నదానిలో ఏదో తప్పు ఉందని అతనికి అనిపిస్తూనే వుంది. ఏమిటా ఆ తప్పు అని సీరియస్ గా ఆలోచిస్తూ మెట్లు దిగడం మొదలెట్టాడు. ఆలోచిస్తూనే, అప్రయత్నంగా, తలుపు గడియ పెట్టేశాడు.


    అయేషా పైనే వుండిపోయింది.


    "అయేషా! నువ్వు ఏనాటికైనా నందివర్ధనం చెట్టు దగ్గరికి వచ్చి నాతొ ఏకాంతంగా మాట్లాడక తప్పదు" అనుకున్నాడు సామంత్.

 

                                                                 * * *


    అక్కడ -


    గ్రాండ్ హోటల్లో -


    ట్రస్టీ సుందరం న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన పది అయిదువందల రూపాయల నోట్ల కట్టలు ఆఠీన్ రాణీ  మీనాక్షికి అందించాడు.


    "మనిద్దరికి మధ్య ఇదే అగ్రిమెంటు! డైమండ్ రాజా నీ వెనక కుక్కలా తిరిగేతట్లు చేసుకోవాలి ! అయిదు లక్షలు తీసుకున్నాక అతి తెలివి చుపిద్దామనుకుంటున్నావేమో - అంతు చూస్తాను - జగ్రత్త!" అన్నాడు.

 Previous Page Next Page