నవ్వుతూ అంతా విన్న శశివదన - "పంపించండి! చూస్తాను" అంది.
అతన్ని చూసిన తర్వాత ఏం పని ఇవ్వాలా అని ఆలోచనలో పడింది శశి. అతని వాలకం చూస్తే అసలు ఏ పనీ సక్రమంగా చెయ్యగలిగేట్లు లేడు. చివరికి "కాంపౌండరు పని నేర్చుకుంటావా?" అంది. తలూపాడు శంకర్రావు. తలూపాడే కానీ, ఏడెనిమిదేళ్ళు గడిచినా అతనికి ఏది ఏ మందో సరిగ్గా తెలీదు. కొద్దిగా పరాగ్గా, మతి మరుపుగా వుంటాడు. తలక్రిందులుగా మాట్లాడుతూ క్లినిక్ లో ఒక పక్కగా నిలబడి వుంటాడు. అతనికి ఏ పనీ చెప్పదు శశి. అయితే, అతను బజారు పనులు మాత్రం హుషారుగా చెయ్యగలడు. ఏం కూరలు ఏ రోజు, ఎక్కడ చౌకగా దొరుకుతాయో ఇట్టే కనుక్కోగలడు. రోజూ పొద్దున్నే మార్కెట్టుకెళ్ళి శశివదన ఇంటికి కావాల్సిన కూరలన్నీ తనే కొంటాడు. "అలాగే నీక్కావలసినవి కూడా కొనేసుకుంటూ ఉండు." అంది శశివదన. మంచి ముగ్గు ఎక్కడ దొరుకుతుందో అతనికి తెలుసును. కత్తిపీటకి ఎవరు పదును పెడతారో అతనికి తెలుసు.
తనని నేర్చుకోమన్న కాంపౌండరు పని మినహా మిగతా పనులన్నీ చేస్తూనే వున్నాడు శంకర్రావు. నెంబరు వేసిన టోకెను పేషెంట్లకు ఇచ్చి వాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్లుగా లోపలికి పంపుతుంటాడు. అయినా, అతని ఉద్యోగం పేరు కాంపౌండరే!
ఇవాళా అలాగే నిలబడి వున్నాడు.
"ఆ టింక్చరు బాటిలు ఇలా ఇవ్వు" అన్నాడు సుధీర్.
కొద్దిగా అయోమయంగా అటూ ఇటూ చూసి టింక్చరు బాటిలు తెస్తూ దార్లో కుర్చీకి తట్టుకుని పడబోయి ఆగాడు శంకర్రావు.
బాటిలు వోపెనయి టింక్చరు సుధీర్ షర్టుమీద చిందింది.
అంతే!
"గుడ్డి వెధవలు నయం నీ కంటే! ఎందుకు నువ్వుంది? జీతం దండగ! ఒక్క పని సరిగ్గా చెయ్యడం చాతకాదు. వెధవగోల" అంటూ పెద్దగా కేకలు పెట్టి ఇంట్లోకెళ్ళి పోయాడు సుధీర్. ఆ రోజుకింక అతని మూడ్ అవుటయిపోయింది.
క్లినిక్ అంతా నిశ్శబ్దమయి పోయింది. డాక్టరమ్మ దగ్గర వున్న చనువు డాక్టరు బాబు దగ్గర లేదు పేషెంట్లకి. వాళ్ళు బిక్క చచ్చిపోయి చూస్తూ ఉండిపోయారు.
గోడకి బల్లిలా అతుక్కుపోయాడు శంకర్రావు. శశివదన సుధీర్ తో బాటు ఇంట్లోకి వెళ్ళింది. "ఏమయింది? టింక్చరు పడిందా! షర్టు నేనే ఉతికి పెడతాలెండి. లేకపోతే డ్రైక్లీనింగ్ కి వేస్తే మరక పోతుంది."
"ఆ! ఇంక నువ్వు షర్టులూ ఉతుకుదువుగానీ, అంట్లు తోముదువుగానీ. ఇంటినిండా అడ్డ గాడిదల్లా పడి వున్నారు జనం! ఒక్కడూ ఒక్కపని సరిగ్గా చేసి ఏడవడు!"
ఒళ్ళు మసిలిపోయేంత జ్వరంతో క్రింద కూర్చుని వున్నాడు పేషెంట్. రక్తం మరిగిపోయేంత వేడిగా ఉన్నాడు సుధీర్.
సుధీర్ వేడి తగ్గేదాకా అతనితో అనునయంగా మాట్లాడి, క్రిందికి వచ్చి, జ్వరంతో వున్న పేషెంటుకి పెన్సిలిన్ ఇచ్చింది శశి.
తలెత్తి చూస్తే శంకర్రావు బిక్క చచ్చిపోయి వున్నాడు.
"ఫర్వాలేదులే! అయ్యగారి కోపం ఎంతసేపుంటుంది? అయినా, కాస్త జాగ్రత్తగా ఉండొద్దూ?" అంది.
"నేను చూసుకోకుండా..." అని ఏదో చెప్పబోయాడు శంకర్రావు.
"ఫర్వాలేదులే! శారద ఎలా ఉంది? మళ్ళీ రాలేదేం?" అంది శశి, మాట మార్చేస్తూ, అతని బెదురు పోగొట్టడానికి.
శంకర్రావు మెలికలు తిరిగిపోయాడు.
'ఏమిటి?' అన్నట్లు నవ్వుతూ చూసింది అతని వైపు.
క్లినిక్ లో వున్న పేషెంట్లందరూ అతని వైపు వినోదంగా చూస్తున్నారు. పాత పేషెంట్లందరికీ అతడు గుర్తే. 'శంకరయ్య!' అని పిలుస్తుంటారు అతన్ని. 'తిక్క' అన్న పదాన్ని తొక్కిపట్టేస్తూ.
"ఏమిటి, శంకర్రావ్, శారదని తీసుకురాలేదేం మళ్ళీ?"
దగ్గరకొచ్చాడు శంకర్రావు. ఆమె టేబుల్ దగ్గర కూర్చుని ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తూంది. కొద్దిగా టేబుల్ మీదికి ఒంగి, "శారద నీళ్ళు పోసుకుందండీ!" అన్నాడు, నీళ్ళు పోసుకున్నది తనే అయినంత సిగ్గుపడుతూ.
రాస్తున్న చెయ్యి ఆగిపోయింది శశికి. కొట్టుకుంటున్న గుండె కూడా ఆగిపోయినట్లు అనిపించింది ఒక్కక్షణం!
శారద గర్భవతి అయిందా? వాళ్ళు పిల్లలకోసం అల్లాడిపోతుంటే తను ట్రీట్ మెంటు ఇవ్వడం నిజమే!
వాళ్ళిద్దర్లో కూడా శారీరకమైన లోపమేం లేదు. ఐదారేళ్ళవరకూ పిల్లలు పుట్టకపోవడం అంత అసహజమేమీ కాదు. అయినా, వాళ్ళ తృప్తి కోసం తను అప్పుడప్పుడూ కొన్ని మెడిసిన్స్ ఇచ్చింది.
కానీ, సరిగ్గా ఆ సమయంలోనే శారద నెల తప్పడం..
ఆమె నర్సింగ్ హోమ్ లో చేరడం, తను తిరిగి రాక ముందే వెళ్ళిపోవడం, వెంటనే ప్రెగ్నెన్సీ...
అన్ని ప్రశ్నలకీ సమాధానం ఒకటే తడుతోంది.
నమ్మకుండా ఎలా ఉండగలదు తను?