"అలాగేలెండి. నేను రోజూ మూడు నిముషాలు ఇంజన్ ఆన్ చేసి రైజ్ చేసి వుంచుతున్నాను చెడిపోకుండా."
"గుడ్ చిన్మయీ! ఇక్కడ్నుంచి వచ్చేముందు ఏమి కావాలి?"
"ఇప్పుడు అదంతా ఎందుకు? వచ్చేముందు చెబుతానులెండి."
"అలాకాదు. ఇప్పటినుంచే కొంచెం కొంచెం కొని వుంచుతాను."
ఆమెకు ఎలక్ట్రానిక్స్, చీరెలు, నగలు వీటిమీద మోజులేదు.
"చెప్పనా?"
"ఊ"
"మీరు."
అతను జన్మ ధన్యమైనట్టుగా ఫీలయ్యాడు. ఫోన్ లో ఆమెని కిస్ చేశాడు.
వారం పదిరోజులలోగా ఓ పరిణామం జరిగింది.
ఇరాన్ లో వున్న వీణాంబగారి కొడుకు కోడలు పిల్లల్తో సహా ఇండియా వస్తున్నట్లు రాశారు. వారం పదిరోజులలోపు వచ్చేస్తారు. వీణాంబగారు ప్రజాపతిరావుగారు చాలా సంతోషంగా వున్నారు.
"ఈ మధ్య ఎన్నిసార్లు రాసినా ఇదిగో వస్తాం, ఇదిగో వస్తాం అంటూ కాలక్షేపం చేస్తున్నారుగాని రావటంలేదు. ఇన్నాళ్ళకు మా అబ్బాయిని చూడగలుగుతున్నాం."
ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతోంది.
ప్రజాపతిరావు గారిలో ఓ విశేషముంది. ఎంత వార్ధక్యంలో వున్నా ఏమైనా పని తలపెడితే నిముషాలమీద చేయించేస్తారు. ఆయనదగ్గర పనివాళ్ళు చక్కగా చేస్తారుకూడా.
గబగబా నాలుగైదు రోజుల్లో ఇల్లంతా బూజులు దులిపించేశారు. చకచక రంగులు వేయించేశారు.
కొత్త ఇల్లులా తయారుచేశారు.
కొడుకు, కోడలూ పిల్లలతోసహా వస్తున్నారు. తమతోబాటు రెండు మూడు నెలలు కలిసి వుంటారు.
వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా వుంది.
చివరకు...
"మావాళ్ళు రేపు వచ్చేస్తున్నారు. ఓ టాక్సీకూడా మాట్లాడివుంచాను. ఏరో డ్రోమ్ కు వెళ్ళి తీసుకురావాలి. ఈ రెండు మూడు నెలల్లోకూడా టాక్సీ నా క్రిందే వుంచుదామనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళుంటే చెప్పి వుంచాను" అన్నారు ప్రజాపతిరావుగారు.
"మీకు మళ్ళీ ప్రత్యేకంగా టాక్సీ ఎందుకండీ? మా కారు ఖాళీగానే వుంది. డ్రైవర్ ని పెట్టుకొని కావల్సినన్నాళ్ళు వాడుకోండి" అంది చిన్మయి.
అయన ఆమెవంక కృతజ్ఞతగా చూశారు. "కారు, ఫోన్ ఇలాంటివి మనకి ఆఫర్ చేశారుకదా అని ఇతరులవి దౌర్జన్యంగా వాడుకోకూడదమ్మా వాటి ఓనర్ హృదయం ఎంత బాధపడుతూ వుంటుందో మనమెంత ఎక్స్ ప్లాయింట్ చేస్తున్నామో నేను అర్ధం చేసుకోగలను. ఎందుకమ్మా? డబ్బు ఖర్చుపెట్టుకోలేని స్థితిలో వుంటేగా? అవసరానికి ఉపయోగించకుండా ఈ డబ్బు మనతోపాటు తీసుకెళతామా ఏమిటి?" అన్నాడు.
ఆ వయసులో కూడా ఆయన ప్రదర్శించే ఉన్నతభావాలు చూస్తే ఆమెకి ముచ్చటేసింది.
తెల్లవారుఝామున నాలుగింటికి పెద్దపెట్టున రోదనలు హృదయవిదారక మైన ఏడుపు వినిపిస్తే చిన్మయి ఉలికిపడి లేచింది.
గుండె దడదడమని కొట్టుకున్నది.
ఇలాంటి దుఃఖపూరితమైన శబ్దాలు అందులో ఇంత ఆకస్మికంగా వింటే గుండెలవిసి పోయినట్లుగా వుంటాయి.
ఎక్కడ్నించి ఆ రోదనలు!
గభాల్న లేచి కిటికీ దగ్గరకు వెళ్లి చూసింది. చీకట్లో సరిగ్గా తెలియటంలేదు. కానీ వీణాంబగారింట్లోంచే వస్తున్నట్లుగా అనిపించింది. ఒక్కక్షణంకూడా ఆలస్యం చేయలేదు. కిరణ్మయి ఇంట్లో ఒక్కతే వుందని ఆలోచించలేదు. గబగబా తలుపు తీసుకొని బయటకు పరుగెత్తింది.
బయటంతా చీకటిగా వుంది. వీణాంబగారింట్లో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. అక్కడ్నించే రోదనలు.
చిన్మయి ముందు వెనుక ఆలోచించలేదు. తమ ఇంటితలుపులు తీసి వున్నాయని కూడా చూసుకోలేదు. ఆ చీకట్లో నడుచుకుంటూ ఎదురింట్లోకి వెళ్ళిపోయింది.
తలుపులు తీసే వున్నాయి.
వీణాంబగారు, ప్రజాపతిరావుగారు నేలమీద కూలబడిపోయి వున్నారు. చుట్టూ ముగ్గురు నలుగురు మనుషులు చేరి వున్నారు.
ఎప్పుడూ సంస్కారపు హద్దులు దాటి మాట్లాడని వీణాంబగారు గుండెలు పగిలేలా ఏడ్చేస్తూ మధ్య మధ్య తల బాదేసుకుంటోంది.
చిన్మయికి అర్దమయింది.
వాళ్ళ కొడుకూ, కోడలు వస్తున్న ప్లేన్ దారిలో భయంకరమైన శబ్దంతో పేలిపోయింది. ప్లేనులో వున్న ప్రయాణీకుల్లో ఒక్కరూ బ్రతికి బయటపడలేదు.
ఆ షాక్ లోంచి వృద్ద దంపతులిద్దరూ కోలుకోలేకపోయారు.
భార్య గుండెలు పగిలేలా ఏడుస్తున్నా, బయటకు గంభీరంగా వున్నట్లు కూర్చున్న ప్రజాపతిరావుగారి గుండె లోలోపల అణగద్రొక్కిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది.
హార్ట్ ఎటాక్ వచ్చింది.
డాక్టరుకి కబురుచేస్తే వచ్చేదాకా కూడా టైం లేకపోయింది. ఆయనలోంచి ప్రాణం ఎగిరిపోయింది.
ఈభాయంకరమైన సంఘటన తట్టుకోలేక వీణాంబగారు కూర్చున్నది కూర్చున్నట్లు విరుచుకుపడిపోయింది.
డాక్టర్ ఎగ్జామిన్ చేసి సెరిబ్రల్ హెమరేజ్ అన్నారు.
చిన్మయికేమి చేయాలో తోచలేదు. మెల్లగా ధైర్యం తెచ్చుకొని భర్త పనిచేసే ఆఫీసుకి ఫోన్ చేసి డ్రైవర్ని పిలిపించింది. డ్రైవర్ వచ్చాక తానే యిరుగు పొరుగు సాయంతో ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించింది.