ఉగాది స్వగతాలు
ఆభ్యుదయ కవిస్వగతం:
మాస్కోకు నమస్కారం
మస్కారాయుళ్లకు తిరస్కారం
తిరుగులేని పురోగాములు
సత్కవులకు లాల్ సలాములు
పెదవి మీద సామ్యవాద మంత్రం
హృదయంలో ధనికవాద తంత్రం
భావకవులతో నా పొత్తూ
విరసం పోకడ నా కొద్దూ
హింసకు విడాకులిస్తాను
కంసరాజ్యమే తెస్తాను
ధ్వంస కాండ నిరసిస్తాను
హంసగీతి1పల్లవిస్తాను
నిన్నటి కివాళ రేపయితే
రేపటి కివాళ నిన్న కదా
తండ్రికి జనకుడు తాతయితే
తాతకు తనయుడు తండ్రి సుమా
గతి తర్కంలో పసలేదు
తిరుగుబాటు కూటికిరాదు
ఈ ఉగాది శుభసమయాన
శ్రోతలకిదె నా నజరానా
గుమాస్తా స్వగతం.
నేను కోనేటి రావుని2
సహస్ర కోటి సర్కారు కార్ఖనాల్లో
అనంత కోటి గుమాస్తాలలో ఒకణ్ని
నేను కోనేటి రావుని మాత్రమే కాదు
సుబ్బారావుని సుభాన్ ని సులేమాన్ ని
ఏనోకు నేనే యాకోబు నేనే
నాకున్నన్ని పేర్లకన్న ఎక్కువ పేర్లు
ఏ హిందూ దేవుళ్లకో వున్నాయి
నేనూ సర్వాంతర్యామినే
కాని గంతవ్యం లేని నా గతి క్షంతవ్యం
ఓహో కొత్త ఉగాది వచ్చింది
కొత్తపన్నులు తెచ్చింది
కొత్తభాధలు గుచ్చింది
ఇంట్లో ఈ యేడాది లోగా
ఇంకో కొత్తబిడ్డ గ్యారంటీ
అంటుంది మా ఆవిడ
కుటుంబ నియంత్రణకు నేను సుముఖుడ్నే
కాని శస్త్రవైద్యానికి జడుస్తోంది
నా భార్యామణి
భూలోక స్వర్గం ఎక్కడుందో గాని
మా ఇల్లు ప్రత్యక్ష నరకం
తాకట్టు పెట్టిన నగలూ నట్రా
చెంబులూ తప్పేలాలూ
తాకట్టు పట్టిన వాడి ఇంట్లో
జలతరంగిణి మోగిస్తుంటే
అప్పులవాళ్లు మగతనిద్ర పోయే
నా కను రెప్పల కింద
రంగ రంగ వైభోగంగా
రాక్షస నాట్యం చేసున్నప్పుడు
చలిదన్నంలో రకరకాల పురుగులు
ఆకలి ఆకలి అనే అక్షరాలు రాస్తున్నప్పుడు
ఆహా ఉగాదిని తలచుకుంటేనే
ఒళ్లు జలదరిస్తోంది
అయినా ఫర్వాలేదు
ఒక్క యేడాదిపాటు ఓపిక పడితే
ఈ కొత్త సంవత్సరం పాతదయి పోతుంది
అయితే ఒక్కటే సమస్య
అంతదాకా మా దినాలు తెల్లారడమెలాగని
జోహుకుం కవి స్వగతం:
ఏడాది కొత్తదే ఐనా
పాడేది పాత పాటేనా
ఈ గతానుగతత్వమేనా ఎవరు చెప్పే తత్వమైనా
కొత్తమీదే నాకు మక్కువ
నవత మీదే మమత ఎక్కువ
పాతమంత్రులు పోతుంటారు
కొత్త సచివులు వస్తుంటారు
పాత రోతని వదిలేస్తాను
కొత్తవారినే పొగిడేస్తాను
ఈ వ్యవస్థని నేనూ తిడతా
కొత్త వ్యవస్థకి హారతి పడతా
కాని దీని పునాదులు కాస్తా
కదలకుండా కాపలా కాస్తా
ఆదర్శాలే వల్లిస్తాను - కవు
లందరి ఊహలు నొల్లేస్తాను
అస్తమానమూ ఇంటా బయటా
అహింసాగాన మాలాపిస్తా
దేవుడి దీపా లార్పెయ్యాలను
నాస్తికుల మీద కత్తులు దూస్తా
ఆస్తిహక్కులే ఆరాధిస్తూ
అన్ని హద్దులూ తుడిచేస్తా
ఎన్ని దిక్కులో ఆలోకిస్తూ
ఇహంతో పరం ముడివేస్తా
అడుగునపడి అలమటించు
బడుగుజనం బాధ పంచు
కొను కవితలు తెగ రచించు
తూ ధనవంతులు వసించు
అయిదంతస్తుల భవంతు
లందు తీసుకొని నా వంతు
కమలంలో వమనం చేస్తా
మేఘంలో స్నేహం చూస్తా
సామాన్యుని స్వగతం:
ఎన్ని ఉగాదులు రాలేదు ఇం
కెన్ని ఉగాదులు పోలేదు
ఎక్కడి దొంగలు అక్కడే
ఎక్కడి గొంగళి అక్కడే.
అతుకుల బ్రతుకే ఎంతో భారం
చావలేక జీవిస్తున్నాను
చావూ నవ్వుకు చాలా దూరం
నవ్వలేక ఏడుస్తున్నాను
అక్కరలేదని చీకటిలోనే
ఆత్మగౌరవం పారేశాను
నన్ను చూసుకుని నాపై నేనే
జాలి పొందటం మానేశాను
నెత్తీ నోరూ మొత్తుకొనీ
ఇది నా కర్మనీ ఒప్పుకొనీ
భారతమాతకు జై అంటాను
ఏ పనికైనా సై అంటాను
విప్లవ కవి స్వగతం:
అంతా వింటున్నాను - కళ్లు తెరచి నే
నంతా కంటున్నాను
తరతరాలుగా నరనరాలలో
గూడుకట్టిన మూఢ విశ్వాసాలు
కూలిపోవా లంటున్నాను
వీధి మానిసుల వీరావేశం
క్రోధ భయంకర హృదయోద్వేగం
విజృంభించి పొంగెత్తే సమయం
సమాజాన్ని ముంచెత్తే తరుణం
త్వరలో వస్తుందంటున్నాను అంతా వుంటున్నాను
యధాస్థితిని నిలబెట్టాలను
వృధా ప్రయత్నం తుదముట్టాలని
పాతకి గోరీ కట్టాలని
కొత్తకి భేరీ కొట్టాలని
చాటిస్తున్నాను - మరీమరీ ఉద్ఘాటిస్తున్నాను
ఎందరడ్డుకున్నా ఇంకెందరు వద్దన్నా
మార్పు వచ్చితీరుతుంది ఎందుకంటే
కాలం పరిణామశీలం
దాన్ని మన కునుకూలంగా మలచుకోవడమే ప్రధానం
అవినీతి గుండెల్లో బాకులు
అన్యాయపు డొక్కల్లో తుపాకులు
సామాజిక విప్లవ సమరం
చచ్చుపుచ్చు సంస్కృతి మరణం
ఇదే నేటి సత్యం
తూరుపునుంచి తమస్సును దూసుకొనివచ్చే
ఉషాస్సును మోసుకొని తెచ్చే
ఐరావతం లాగ శాంతి పారావతం లాగ
ఉదయిస్తుంది నవయుగాది
అదె మనకుగాది.
రచన:19-3-1979
రేడియో ప్రసారితం (పై స్వగతాలలో మొదటిది ప్రసారితం కాలేదు)
ముద్రణ: జ్యోతి మాసపత్రిక మే,1979.
పునర్ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ- మే, 1980
1. హంసగీతి: హంస చనిపోయేముందు గానం చేస్తుందంటారు. అన్యాయాలకు వ్యతిరేకంగా ఆఖరుగీతం పాడతానని శ్రీశ్రీ ఉద్దేశ్యం కావచ్చు.
2.ప్రభుత్వ కచేరీలో సాధారణ గుమస్తాగా పనిచేసేవాడిని పాత్రగా తీసుకుని శ్రీశ్రీ కోని కథలు రాశాడు. కోనేటి దినం. కోనేటి రాత్రి, కోనేటి జన్మ(1946 - 48)