Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 24


    చిత్ర మధ్యాహ్న భోజనం చేయడంలో హడావుడిగా వుంది. ఓ మూలనున్న స్టూల్ మధ్యలోకి లాక్కుని కూర్చున్నాడు. "కాఫీ కావాలి అర్జెంట్"

    స్టూల్ లాగిన శబ్దంతోనే వంటగదిలోకి ఎవరొచ్చిందీ అర్ధమైంది ఆమెకి. కానీ అటువైపు చూడలేదు. తెల్లవారుజామున నాలుగ్గంటలకి చేతులూపుకుంటా వచ్చిన భరణని చూస్తూనే జరిగిందేమిటో అర్ధమైంది. కోపం నషాళానికి అంటుకుంది.

    కానీ ఏమనగలదు?

    ఓ అమ్మాయిని తీసుకుపోవడం అంటే చాలా కష్టమైన పనని తెలుసు, అలాగని చేతకానివాడిలా తిరిగొచ్చిన అతన్ని క్షమించలేక పోయింది. రావాల్సిన ఏభైవేలు వెనక్కి వెళ్ళిపోయి దురదృష్టం ముందుకొచ్చినట్లు అనిపించింది. ఆ కోపం ఇంకా పోలేదు.

    "కాఫీ" అతను మరోసారి అడిగాడు.

    "ఇస్తానుండయ్యా. ఏమిటాగావుకేకలు? చేతకానివాడికే నోరెక్కువ" అంటూ ఓసారి అతనివైపు చీదరించుకున్నట్టు చూసింది.

    ఆ కోపం ఎందుకో అతనికి తెలుసు.

    "వస్తానని ఖచ్చితంగా చెప్పింది. మరెందుకో రాలేదు." ఇందుమతి రాకపోవడానికి ఏదో బలమైన కారణమే వుండివుంటుందని అతని నమ్మకం.

    "రాదు"

    చిత్ర అలా అనడంతో అతను ఉలిక్కిపడ్డాడు.

    "అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?"

    "మీ ఇద్దరిమధ్యా శారీరక సంబంధంలేదు. అందువల్ల" ఇందుమతితో తనకి శారీరక సంబంధం లేదు. అంతమాత్రాన తను రాదా?

    "ప్రేమ వుంది చాలదూ" అన్నాడు తేరుకుని.

    "అది సరిపోదు, స్త్రీ ప్రేమను వదులుకో గలదు. దానికేం పెద్ద ఇంపార్టెన్స్ వుండదు. అదే శారీరక సంబంధం అయితే స్త్రీ అంత తేలికగా ఆ విషయాన్ని మరిచిపోదు దేనికీ ఇవ్వని విలువ శీలానికి ఇస్తుంది. తను శీలాన్ని సమర్పించినవాడే తన సర్వస్వం అనుకుంటుంది. మనసివ్వడం అనేది సెకండరీనే. ఇది తెలియని నీలాంటివాడికి ఏ ఆడపిల్లా దక్కదు.

    చిత్ర చేసిన ఆర్గ్యుమెంట్ కి కళ్ళు తిరిగిపోయినట్టుంది భరణికి.

    "నువ్వు చెబుతోంది నిజమా?" అనడిగాడు భరణి,

    "అక్షరాలా నిజం. తల్లిదండ్రుల్నీ, సంఘాన్నీ, తన బంధువుల్నీ ఎదిరించి ఓ అబ్బాయితో ఓ అమ్మాయి లేచిరావడమంటే ఆషా మాషీకాదు. నీపట్ల ఎంతో ఆకర్షణ వుంటేతప్ప అది జరగదు. మరి ఆ ఆకర్షణ నీమీద ఎలా పుడుతుందనుకుంటున్నావ్? ఊరకే నాలుగుసార్లు చూసుకుని, అయిదుసార్లు ప్రేమలేఖలు రాసుకుని, ఆరు సినిమాలు చూసినంత మాత్రాన ఏ ఆడపిల్లా ఓ అబ్బాయి వెనక పరిగెత్తదు" అన్నది చిత్ర.

    "మరి ఈ ప్రేమ, మనసంతా నిండిపోవడం"

    "అదంతా ట్రాష్ అని నేను చెప్పను. అయితే నీ వెంటపడి నిన్నే నమ్ముకుని రావడానికి అది చాలదనుకుంటా. ఓ అమ్మాయి ఓ అబ్బాయితో ప్రేమలో పడిందనుకో. ఏ ఆరునెలలో, సంవత్సరమో ఆ ప్రేమ వ్యవహారం నడిచిందనుకో. ఇంతలో ఇంట్లో తెలిసిపోతుంది. ఆ అమ్మాయిని బెదిరించో, బుజ్జగించో వేరేవాడికిచ్చి పెళ్ళిచేస్తారు.

    ఆ వచ్చేభర్త ఆమెకు శారీరకంగా సుఖపడటం అంటే ఏమిటో నేర్పిస్తాడు ఆ ఆకర్షణకి, ఆ సుఖానికి ఆ అమ్మాయి థ్రిల్ అయిపోతుంది. వెనకటి ప్రేమను మరిచిపోతుంది.

    తను తొందరపడి ప్రేమించిన అబ్బాయితో వెళ్ళకపోవడం ఎంత మంచిదైందోనని కూడా అనుకుంటుంది ఆ కారణంవల్లే చాలామంది స్త్రీలు పెళ్ళయ్యాక ప్రేమను చులకనచేసి మాట్లాడుతారు."

    భరణికికూడా చిత్ర చెబుతున్నదాంట్లో ఎంతో కొంత నిజముందని తోస్తోంది.

    చిత్ర మళ్ళీ చెప్పటం కొనసాగించింది. "ప్రేమ ఒకటి అనే అంకె అనుకో. సెక్స్ సున్నలాంటిది. ఒకటి తరువాత సున్న చేరిస్తే పదవుతుంది. అంటే ప్రేమ పదిరెట్లు పెరుగుతుందన్నమాట.

    ఇంతకీ ఫైనల్ గా నీకు నేను చెప్పేదేమిటంటే ఆ అమ్మాయి నీమాట విని నీతో రావాలంటే ఆ అమ్మాయిని నీవు లొంగదీసుకోవాలి. అది మీ ఇద్దరిమధ్యా లేదనుకో-పదిహేనురోజులు కాదుకదా పదిహేనేళ్ళు టైమిచ్చినా ఆ అమ్మాయి నీతోరాదు"

 Previous Page Next Page