Previous Page Next Page 
హిమసుందరి పేజి 24

    ఇలా సాగింది సీత రాసింది.

    తను రాసింది తనే చదివి - తన తలని తన చేత్తోనే పట్టుకుని ఓ నిట్టూర్పు విడిచింది సీత.

    తను రాసింది మరోసారి, మరోసారి చదివి చివరికి లెక్క తీస్తే- రాసింది తక్కువ, హంతకుడు - హత్యలు అన్నమాట పేరా పేరాకి దొర్లినట్లు తెలుసుకుంది. పైగా  క్రైం కధలో అనగా అనగా అభిరామపురం ఏమిటి?  క్రైం కధ రాయటం చాలా కష్టం.

    అనుకున్న సీత ప్రస్తుతానికి ఆ కధని పక్కకు పెట్టి రచయిత్రిగా తన పేరు ఏముండాలా అన్న ఆలోచనలో పడింది.

    శ్రీమతి సీత.

    సీతామనోహరి.

    ఉహూ! పేరు మామూలుగా వుంది. పోనీ తన పేరు చివర భర్త పేరు తగిలిస్తే! సీతారామకృష్ణ. ఉహూ, సీతామనొహరీరామకృష్ణ, ఉహూ, సీతారామ్. చీ..... మగాడి పేరైకూర్చుంది. అయినా భర్తపేరు తగిలించుకోటం ఏమిటి? ఓపక్క స్త్రీస్వాతంత్రం అని అఘోరిస్తూ! రచయితలు తమ పేరు చివర పెళ్ళాం పేరు తగిలించుకుంటున్నారా? రచయిత పేరు సుబ్బారావు, అతగాడి భార్య పేరు సర్వమంగళ. ఆ రచయిత ఆదర్శంగా తన భార్యపేరు చివర చేరుస్తూ సుబ్బారావు సర్వమంగళ అని రాసుకోవచ్చు కదా. మగాళ్ళు యిలాంటి పనులు చేయనప్పుడు ఆడాళ్ళు ఎందుకు చేయాలి? చేయకూడదు అనుకుంది సీతామనోహరి సీత! మరీ పూర్వం పేరు పెట్టారు. మనోహరి - యిది బాగుంది. కాని యిప్పటికే మనోహరి అన్న రచయిత్రి ఉంది. 'తన పేరు కలిసే పెన్ నేమ్ ఏదన్నా వుందా?' ఆలోచించింది.

    అగ్నిపుత్రి!

    మార్వలెస్! ఫెంటాస్టిక్! అమోఘం! అద్భుతం!

    అగ్నిపుత్రి అంటే సీత - సీత అంటే తనే! ఎంత మంచి పెన్ నేమ్ దొరికింది!

    సీతకి చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషం సమయంలో  క్రైం సాహిత్యాన్ని పక్కకు పెట్టి, సాంఘికం రాయటానికి ఆయత్తమైంది.

    ఈ తఫా ఆ రచన యిలా సాగింది.

    భాగ్యలక్ష్మి చాలా బీదది. వాళ్ళాయన బీదవాడు. భాగ్యలక్ష్మి పిల్లలూ అంతే - బీదవాళ్ళు. పిల్లలు కాన్ మెంటులో చదివేవాళ్ళు తతిమ్మా పిల్లలు మీ అమ్మ బీదది అంటూ ఎక్కిరించేవాళ్ళు. ఆ విషయం పిల్లలు వచ్చి తల్లితో చెప్పారు. భాగ్యలక్ష్మికి చాలా బాధ వేసింది. భాగ్యలక్ష్మి మరో పదియిళ్ళల్లో పాచిపనికి ఒప్పుకుని, రాత్రింబవళ్ళు పనిచేసి మూడునెలల్లో మూడువేలు సంపాదించింది. ఆ రాత్రి భాగ్యలక్ష్మి నిద్రపోతుంటే ఓ దొంగ ఆ యింటికి కన్నంవేసి లోపలికి వచ్చాడు. గాడ్రేజ్ బీరువాలో దాచిన మూడువేలూ దొంగిలించాడు. డబ్బు దొంగిలించిందే గాక - అదే బీరువాలో వున్న మూడు వెండి కంచాలు, పది శేవర్ల చంద్రహారం, రాళ్ళ గాజులు మొదలయినవి మూటగట్టుకుని వెళ్లాడు. వెళుతూ వెళుతూ, భాగ్యలక్ష్మి భర్త స్కూటర్ ని కూడా తీసుకెళ్ళాడు. భాగ్యలక్ష్మి తెల్లారి లేచి చూసుకుని గుండెలు బాదుకుంది. పోలీసులతో మొరపెట్టుకుంది. భాగ్యలక్ష్మి బీదది కావటంతో పోలీసులు ఆమె మొర ఆలకించలేదు. బీదరికం పాపమా! శాపమా! నేరమా!

    సీతకి చెయ్యి నేప్పిపుట్టటంతో రాయటం ఆపి - అంతవరకూ తను రాసింది చదివింది.

    "ఇది సాంఘికమూ కాదు, బిదరికమూ కాదు. అకటా వికటా హాస్యకథల పోటీ, ఏ దిక్కుమాలిన పత్రికయినా పోటీ పెడితే, ఈ కధ దానికి పంపిస్తే ఎడిటర్ నవ్వాపుకోలేక ప్రధమ బహుమతి యివ్వటం ఖాయం!" అనుకుంది సీతామనోహరి.

    కాదు కాదు - మహా రచయిత్రి అగ్నిపుత్రి.

    రాసే విధానం తెలియటం లేదుగాని, మొత్తానికి నేను రాయగలను. రేపటి నుంచీ జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. అనుకుంటూ ఆ పూటకి రచనలు చాలించి, కుర్చీలోంచి లేచింది.

    సాయంత్రం భర్త యింటికి రాంగానే, తను చేసిన ఘనకార్యం చెప్పాలనుకుంది సీతామనోహరి.

    కాని, ఆ సాయంత్రం సీత అనుకున్నది జరగలేదు.

    అనుకున్నది అనుకున్నట్లు జరిగితే చెప్పేదేముంది?
   


                                         11


    సమయం అయిదు నిమిషాలు తక్కువ అయిదు.

    సీత అందంగా తయారయింది.

    ఇంతందంగా తయారయిన సీతని రామకృష్ణ కనుక ఆ క్షణాన చూసి ఉంటే "నీవు సీతవి కాదు - రంభా, ఊర్వశి, తిలోత్తమలలో ఒకరివి. వాళ్ళ ముగ్గురూ కాకపోతే రతీదేవివి. అంతేగాని సీతవి మాత్రం కాదు. ఇది నిజం సీతా!" అనేవాడే.

 Previous Page Next Page