Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 24


    గౌతమ్ కు అంతవరకూ తనలో గడ్డకట్టిన పదార్ధం ఏదో కరుగుతూన్నట్టూ, గుండె తేలిక పడుతున్నట్టూ అనిపించసాగింది.
    "అమ్మా!"
    అన్నపూర్ణమ్మ తలెత్తి మౌనంగా గౌతమ్ ముఖంలోకి చూసింది.
    "మరి నేను శంకర్రావుగారి కొడుకునే కదా? మీ రిద్దరూ నా గురించి ఎందుకంత మథనపడ్డారు? నేను శంకర్రావు ఆస్తికి హక్కుదారుడు కాదన్నావుగా?" తల్లి మాటల్ని నమ్మలేనట్టుగా అన్నాడు.
    "మేము రిజిస్టర్ మారేజీ చేసుకోకమునుపే__నువ్వు పుట్టావు. ఆ సంగతి కొందరికి తెలుసు. ఆ విషయం రవికి తెలిస్తే వాడికి ఎలాంటి బుద్ది పుడుతుందో అని మా భయం బాబూ!"
    ఎంతోకాలంగా గుండెను పిండేస్తున్న సందేహం తీరింది. గుండె తేలికయింది. గౌతమ్ హాయిగా నిట్టూర్చాడు.
    "అమ్మా!"
    "ఊఁ! ఇంకా ఏమైనా సందేహాలుంటే అడిగెయ్!"
    "సారీ! నిన్ను బాధించాను. ఇంకేమీ సందేహాలు లేవు. కేవలంఒక విషయం తెలుసుకుందామని....." నీళ్ళు నములుతున్నట్టుగా అన్నాడు.
    "అడుగు."
    "అన్నయ్య మీద ఉన్న ప్రేమ వల్లే కదూ నా పేరు గౌతమ్ అని పెట్టుకొన్నావు?"
    "అవును!" ఆమె కంఠం గరగర లాడింది.
    "నువ్వు పిచ్చాసుపత్రి నుంచి వచ్చాక అన్నయ్య దొరికితే పెంచుకొనేదానవు కదూ?"
    "అవును అప్పుడు నా జీవితం మరోలా ఉండి 'ఉండేది." గతంలో దేన్నో వెదుక్కుంటున్నట్టుగా అన్నది అన్నపూర్ణమ్మ.
    "మరి ఆ రోజు రాత్రి అతను వచ్చినప్పుడు మనసారా గుండెలకు హత్తుకున్నావా? జరిగిన విషయం చెప్పావా? నువ్వు కావాలని అతణ్ణి వదులుకోలేదని చెప్పానా?
    "లేదు. వాడు ఎదురుగా నిలబడితే నువ్వె అనుకొని ఏదో అడగడానికి తలెత్తాను. కాని ఆ చూపుల్లో ఎంతో తిరస్కారం, తీసి వదులుతున్న ఊపిరిలో నాగుపాముల బుస.....గౌతమ్! ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అని ఆదుర్దాగా అడిగాను." ఆమె కంఠం దుఃఖంతో పూడుకు పోయింది.
    "నువ్వూ నేననే భ్రమపడ్డావా అమ్మా! కన్నతల్లే గుర్తించలేని రూప సామ్యం మా ఇద్దరిలో  ఉండటం చాలా ఆఆఆఃఱాఆఆ ఉంది.
    "లేదు బాబూ గుర్తించలేదు. కారణం____అలాంటి క్షణాలు నా జీవితంలో వస్తాయని కలలో కూడా ఊహించని విషయం. అందుకే గుర్తించలేకపోయాను."
    "ఇప్పుడు గుర్తించగలవా?"
    "తప్పకుండా, కన్నబిడ్డల్నే గుర్తించలేనా బాబూ?"
    "ఆ తరవాత ఏం జరిగిందమ్మా?"
    "అవును! నేను గౌతమ్ నే. నువ్వు పేరు మార్చుకున్నావు. కాని నేను మార్చుకోలేదు. ఆ కంఠం నీది కాదు. ఆ స్వభావం నీది కాదు. నేను బిత్తరపోయాను ____ గుడ్లప్పగించి చూస్తూనే ఉండిపోయాను."
    "ఏటలా చూస్తావ్? ఎవడికో కని కుప్పతొట్టిలో పారేసిన నీ కొడుకు గౌతమ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? అని అన్నాడు. నాకేసి వాడు ఎంత జుగుప్సగా చూశాడనుకొన్నావ్? నేను మాట్లాడాలనుకున్నాను. నోరు కదల్లేదు. రెండు చేతులూ చాచి నా బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాను. కాని చేతులు కదల్లేదు. పరుగున వెళ్ళి నా బిడ్డను గుండెకు హత్తుకోవాలనుకున్నాను. కాని కాళ్ళు కదల్లేదు. కళ్ళారా చూడడానికి కళ్ళ నీళ్ళు అడ్డం పడ్డాయి. అంతలోకే కళ్ళ ముందు చీకటి తెరలు కమ్మాయి. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు" అని పైటకొంగు నోట్లో కుక్కుకొని పెల్లుబుకుతున్న దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నించింది.
    గౌతమ్ తల్లి ముఖంలోకి ఆప్యాయంగా చూశాడు.
    బాధ పడకమ్మా. మళ్ళీ నువ్వు అన్నయ్యను చూస్తావ్."
    చివ్వున తలెత్తింది.
    "ఎక్కడున్నాడు? నీకు తెలుసా?" ఏడుస్తూనే అడిగింది.
    "ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎలాగయినా తెలుసుకుంటాను. నీ దగ్గరకు తీసుకొస్తాను."
    అన్నపూర్ణమ్మ తుళ్ళిపడింది.
    "వద్దు బాబూ! వద్దు. నువ్వు కూడా కలుసుకోవద్దు." ఆ కంఠంలో భయం, దుఃఖం నేను ముందంటే నేను ముందంటూ పోటీ పడ్డాయి.
    గౌతమ్ తల్లి ముఖంలోకి చూశాడు.
    "నీకు మరోసారి తన కన్నతల్లిని చూడాలని వచ్చిన ఆ దురదృష్టవంతున్ని చూడాలని లేదా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఉంది బాబూ!"
    "మరి అయితే!"
    "ఏనాడో దూరం అయ్యాడు. వాణ్ణి నీలో చూసుకొని సంతృప్తి పడుతున్నాను. ఇంతకాలానికి వాడు వస్తే...."
    "వస్తే ఏమవుతుంది?"
    "వాణ్ణి ఎవరని అయినవాళ్ళకూ, స్నేహితులకూ, తెలిసినవాళ్ళకూ పరిచయం చెయ్యను? ముఖ్యంగా నీ తమ్ముడు రవికి ఏమని చెప్పమంటావ్? మళ్ళీ ఈ ప్రపంచంలో తలెత్తుకొని తిరగ్గలవా? వద్దు బాబూ! వాణ్ణి తీసుకురాకు."
    గౌతమ్ అంతరాంతరాల్లో ఎక్కడో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది.
    "అమ్మా! మీ ఆడవాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజం కోసం___సమాజంలో పరువు ప్రతిష్టలకోసం____ఎంత విలువైన వస్తువునైనా వదులు కుంటారు కదూ? కన్నబిడ్డనైనా వదులుకుంటారు. అందుకే ఆడవాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి." గౌతమ్ బాధగా అన్నాడు.
    "అవును బాబూ! ఆడవాళ్ళకు ఒక నీతీ, మగవాళ్ళ కొక నీతి చెలామణిలో ఉన్న ఈ సమాజంలో ఆడది ఇంతకంటే ఏం చెయ్యగలదు బాబూ?"
    "అ.....వు......నేమో!" తనకు తనే సమాధానపర్చుకుంటున్నట్టుగా అతి చిన్నగా అన్నాడు.
    "ఒకవేళ అన్నయ్య...."
    "బాబూ! నువ్వు అన్నయ్య అన్నప్పుడల్లా చిత్రమైన అనందానుభూతితో నా మనసు నిండిపోతుందిరా!" గాద్గాదికంగా అన్నది.
    "ఒకవేళ అన్నయ్యే మళ్ళీ వస్తే?"
    "రాడు!"
    "ఎలా చెప్పాగలవు?" ఆశ్చర్యంగా అన్నాడు.
    "నాకు తెలుసు బాబూ! వాడు నా బిడ్డ. వాడు నా గురించి ఏమేమి ఊహించుకుంటూ వచ్చాడో? న అభయం చూశాడు. నా పరిస్థితి అర్ధం చేసుకొనే ఉంటాడు. అందుకే రాడంటున్నాను."
    "ఒక వేళ వస్తే స్వీకరిస్తావా?"
    "ఆ క్షణంలో ఏం చేస్తానో ఇప్పుడెలా చెప్పగలను?" అన్నపూర్ణమ్మ బాధగా నిట్టూర్పు విడిచింది.
    గౌతమ్ ఆలోచిస్తూ నిల్చున్నాడు.
    అన్నపూర్ణమ్మ ఈ రోజు గౌతమ్ మద్రాసు నుంచి వచ్చిన రోజు ఉదయం వచ్చి టిఫెన్ చేసి వెళ్ళిన విషయం చెప్పలేదు. గౌతమ్ కు ఆ విషయం గుర్తున్న అడగలేదు.
    "గౌతమ్!"
    ఆమె పిలిచిన తీరులో ఏదో నిర్ణయం ఉన్నట్టు తోచి పరిశీలనగా తల్లిని చూశాడు.
    "గౌతమ్! ఇంకెప్పుడూ ఈ విషయాలు నా ముందు ఎత్తకు."
    "అమ్మా!"
    "ఇంకా ఏమైనా సందేహాలుంటే ఇప్పుడే అడుగు."
    "ఏం సందేహాలూ లేవమ్మా!"
    "అయితే ఇంకెప్పుడూ ఈ విషయాలు ఎత్తకు." ఖండితంగా అంది.

 Previous Page Next Page