Previous Page Next Page 

 

    మస్తాన్ పరిగెత్తి వచ్చి కలుసుకున్నాడు . "నా కెరకలే - నే నటుపోలె. ఇయాళ తేలిపోవాల్నుండి. ఏం మొనగాడైండా  దాముడు? వాని రక్తం కళ్ళ చుస్త. పొతే జేలుకు పోత. పొతే పాపం పోతది. పోరాటం చచ్చిన్ననుకుంట. అవ్వ! ఎంత బద్మాష్! తాను కడుపు చేస్తడు. మీ మీద పెడ్తాడు. లంజ కొడుకు.....ప్రజల సొమ్ముతిని బలుస్తాండు గాడ్ది కొడుకు .అమృతవాణి ఉండాల్సుండేనుండి తేల్చేడిది వీడి తడఖా. నేను అన్ని ఇన్న. మీరేం చెప్పొద్దు. సై అనండి. తెల్చేస్తం. అంత తయారున్నం" గుక్క తిప్పకుండా చదివేశాడు మస్తాన్.
    వీరభద్రం మస్తాన్ భుజం మీద చేయి వేసి చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ మర్రి క్రింద బండవరకూ మౌనంగా నడిచి కూర్చున్నారు.
    "మస్తాన్ నీకింకా పోరాటపు ఉద్రేకం తగ్గలేదు. మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. మనం వాళ్ళ అంతు చూడ్డం కష్టం మన అంతు వాళ్ళు చూడగలరు. ఉద్రేకంలో మంగమ్మ చేసిన తప్పటడుగుకు మనం ఇన్ని బాధలకు గురి అయినాం. మనలోని ఉద్రేకాన్ని పెంచి మనతో తప్పులు చేయించటం  వాళ్ళ లక్ష్యం. నువ్వు ఉద్రేకంలో పడి ఏమైనా చేస్తే వాళ్ళు గెలిచినట్టే గాని మనం గెలిచినట్టు కాదు. మనం రామయ్యను ఏమీ చేయలేం. మంగమ్మను రక్షించడాన్ని గురించి ఆలోచించాలే"
    ఉపన్యాసం చిన్నదైనా ఉక్కిరి బిక్కిరైనాడు మస్తాన్. తలవంచుకొని మౌనంగా ఆలోచించాడు. వీరభద్రం చెప్పిన ప్రతి అక్షరంలో అర్ధం ఉందని గ్రహించాడు. నిస్సహాయుడై వీరభద్రాన్ని ప్రశ్నార్ధకంగా చూశాడు.
    వీరభద్రం మర్రి ఆకుల ఈనెలు తీసుకున్నాడు. లేచి నుంచుని ఊరి వైపు అడుగు వేశాడు. అతడు గంభీరంగా ఉన్నాడు. ఆలోచనలలో మునిగి ఉన్నాడు. మస్తాన్ అతణ్ణి అనుసరించాడు.
    "ఏం చేద్దామంటరు?" మస్తాన్ ప్రశ్న.
    ప్రజాబలాన్ని గుర్తించినపుడు వారు చేసేది ఇదే. ఏమీ చేయలేనప్పుడు మనిషి శీలం మీద దెబ్బ కొడ్తారు. తద్వారా వ్యక్తీ మీద ఉండే గౌరవం పోగోడ్తారు. అది వారు ఉద్యమం మీద కొట్టే మొదటి దెబ్బ" నిరామయంగా చెప్పేశాడు నడుస్తూనే. తరవాత వీరభద్రం మాట్లాడలేదు.
    వీరభద్రాన్ని అనుసరించి సాగుతున్నాడు మస్తాన్. మస్తాన్ కేమీ అర్ధం కాలేదు. మదనపడ సాగాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. అతనికి అర్ధం అయింది ఒక్కటి - వీరభద్రాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు రామయ్య అని. గ్రామానికి అసలు విషయం తెలియపరచాలనుకున్నాడు. అందుకు కృతనిశ్చయుడైనాడు. మౌనంగా అనుసరించాడు వీరభద్రాన్ని.
    వారు నాగజముండ్లను చూడలేదు. మోదుగు పూలను గమనించలేదు. చెరువు కట్ట ఎక్కారు. దిగారు. కాలువ వెంట సాగిపోయారు. ఊళ్లోంచి పోతుంటే జనం వారిని వింతగా చూశారు. అది ఇరువురూ గమనించలేదు. మంగమ్మ ఇంటికి చేరారు. అది పాడుబడ్డ ఇంటిలా వుంది. ఇంటిముందు ఊడ్పు లేదు. కళ్ళాపి లేదు. భయంకరం అయిన నిశ్శబ్దం ఆవరించి వుంది. అడుగు లోన వేశాడు వీరభద్రం. మంచంలో మంగమ్మ కనిపించలేదు. గుండె డక్కుమంది. వేగంగా గది వేపు నడిచాడు. మంచంలో మూటలా పడి వుంది. మంగమ్మ తల ఎత్తి వీరభద్రాన్ని చూచింది. ముందు చిరునవ్వు నవ్వింది. తరవాత పెద్దగానే నవ్వేసింది. వీరభద్రం బయటికి వచ్చి మంచంలో కూలబడ్డాడు. మస్తాన్ నుంచున్నాడు.
    ఎవరూ మాట్లాడలేదు.
    కాలం కరిగిపోతుంది - కారిపోతుంది.
    మస్తాన్ వెళ్ళిపోయాడు - నిశ్సబ్దంగా.
    వెళ్తున్న మస్తాను వేపు అదోలా చూశాడు వీరభద్రం - అయినా మాట్లాడలేదు.
    ఆ రాత్రి సారాయి దుకాణంలో ప్రచారానికి ప్రారంభోత్సవం జరిగింది. అంటే అంతకుముందు జరగలేదని కాదు. ప్రచారం ఇరుపక్షాల నుంచి సాగింది. రామయ్య దుర్మార్గాన్ని గురించి మల్లయ్యా, మస్తాను అందరికీ చెప్పడానికి ప్రయత్నించారు. ఇటు యాదగిరి, శేషయ్య "ఎమ్మెల్యే గారు ఎంతపని చేసిండో చుసిన్రా !" అని ప్రారంభించారు. అయితే ముమ్మరమైన ప్రచారం సారాయి దుకాణంలో ప్రారంభం అయింది. రామయ్య మొదటి సంవత్సరం ఆ ఊరి సారాయి దుకాణం మాత్రమే పట్టాడు. అందులో బాగా లాభం రావటం అటుండగా ప్రజల్లో పలుకుబడి పెరిగింది. లాభం వచ్చిందంటే అచ్చం గవర్నమెంటు సారాయి మీదనే కాదు. పేరు గవర్నమెంటుది. సాగింది కాపు సారాయి వ్యాపారం. అందులో అతనికి అండదండలుగా నిలిచిన వీరులు యాదయ్య, శేషయ్య.
    చుట్టూ పట్ల ఉన్న ఊళ్లు కూడా పట్టాడు రామయ్య. కొన్ని ఊళ్ళల్లో అతనికి 'సారాయి దొర' అని పేరు కూడా వచ్చేసింది. శేషయ్య మాత్రం ఈ వ్యాపారంతో అట్టే ప్రమేయం పెట్టుకోలేదు. అతడు పేకాటలో ఘనుడైనాడు. పోలీసులు నేర్పిపోయారు. శేషయ్య వారినే తలతన్నాడు. మొత్తం మీద ఊళ్ళో పెత్తనం సారాయికీ, పెకాటకూ వచ్చేసింది. కాబట్టి ఆ రెంటింనీ మించిన ప్రచార కేంద్రాలు కనిపించలేదు. సారాయి దుకాణంలో యాదగిరి సాగించాడు.
    "ఔరా, మీరేమో ఒట్లిచ్చిన్రు గెలిపించిన్రు. ఎమ్మెల్యే గారేమో కడుపులు చేస్తాన్రు"
    "ఏమోనండి అందరంటాన్రు గాని నాకు నమ్మకం కుదుర్తలేదు. ఈరాభద్రం గారసుంటోడు కాడుండి" తాగడానికి వచ్చిన ఒకడు అన్నాడు.
    "అరె, అరె ఏందిర నువ్వనేడేది? వీరభద్రమంటే ఎనకటి మనిసనుకున్నావా? సారా గ్లాసు అందిస్తూ " అన్నాడు యాదగిరి. "మారిపోయిండుర ఎమ్మెల్యే అయిన కాణ్ణుంచి, పట్నపాయన చెప్పిండు పట్నంల ఊటంగా తాగుతాందట. సడక్ మీదనే పడిపోయిందట ఒకసారి."
    'అంటరుండి . అయన నిప్పుసువంటోడు'"
    "ఓరి గాడ్ది కొడక తాగుడు రామయ్య దొరది. పాడేది ఈరాబద్రం పాటర! అరె మంగమ్మింట్లో ఉన్నదేవర్ర? మీ వీరభద్రమేన? మల్ల కడుపెట్లయింది దానికి? గాలికైనాదిర గాడ్ది కొడక? మల్లమీది నించి రామయ్య దొరను బద్నాం చేస్తాండు."
    "ఏమోనండి లోకం ఇసిత్రం గున్నది నాకెందుకు గని ఇంకొక్క గ్లాసు ఇయ్యండి పోత."
    "పైకం తెచ్చినావుర గిలసు మీద గిలాసు తాగేటంద్కు"
    "గదేందుండి ఇయ్యాల కొత్త గడుగుతాన్రు. పంటల మీద కాదుండి పైకం తీసుకునేడిది"
    'ఆవు మేం పంటల మీద తీసుకుంటం . నువ్వేమో ముండల పాట పాడు. పైకమియ్యంది. ఈడ్నించి కదిలేడిది లేదు. గిలాసు మీద గిలాసు తాగుతాండు తీస్ మార్ఖా."
    "గదేందుండి గట్ల గుంజుతాన్రు? ఏం చెయ్యమంటారు మల్ల ఇప్పుడు?"
    "అవుర! మంగమ్మకు కడుపు చేసిందెవ్వర?"
    "ఈరబద్రంగారే ననిపిస్తాదుండి . బుద్దులు మారవానుండి మనుసులవి" మనసులో సంకోచం ఉన్నా బయటకు గట్టిగానే అనేశాడా మనిషి.
    అక్కడ చేరిన జనం అంతా గొల్లున నవ్వేశారు. 'యాదగిరన్నా ఇంకో గిలాసియ్యే తాగేటందుకు " అన్నాడోకడు . మరొక గ్లాసు అందించాడు యాదగిరి ఆ మనిషికి. గటగటా తాగి రుమాలుతో మూతి తుడుచుకుంటూ 'అప్పున పడ్డ మనిషి కుదువ పెడ్డట్టేనసే" అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. అతని వెనక వికటంగా నవ్వే నవ్వులు వినిపించాయి.

    ఆ రాత్రి ఊరు ఉదికిపోయింది. అంతకంటే ఉదయం అంటుకున్న చిచ్చు సారాయి దుకాణంలో భగ్గుమన్నది అంటే బాగుంటుంది. అది అన్ని ఇండ్లలోనూ అంటుకున్నది. అందరి గుండెలూ కుంపట్లయినాయి. కాని ఆ చిచ్చు కాల్చింది ఎక్కువ మంగమ్మ ఇంటినే. ఆ ఇంట్లో వంట లేదు. రెండు అగ్గికొండలు రగులుకుంటున్నాయి. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. రెండు ప్రాణాలూ మాట్లాడ్డం లేదు. చావకూడదని నిశ్చయించుకున్నాక మంగమ్మ మనసులో యాతన ప్రారంభం అయింది. కొన్నింటికి బహుశ మృత్యువే పరిష్కార మార్గమేమో! కాని మంగమ్మకు ఇప్పుడలా అనిపించడం లేదు. తనకొక బిడ్డ కలుగుతాడు. వాడేదో సాధిస్తాడు అనుకుంటుంది. వెంటనే వచ్చిన ఆలోచన - ఈ అపవాదుల భారంతో అసలు తానూ జీవించడం ఎలా? పైగా నిప్పులాంటి వీరభద్రం, తాను అన్నగా చూచుకుంటున్న వాని మీద నింద! ఇదెలా భరించడం? తనకోసం అతడెందుకు బద్నాం కావాలి? తాను అతనికి చేసిన మేలేమి? ఏమి జనం? ఏమి ఊరు? అతడు తుపాకి పట్టిన్నాడు అతనిని పూజించింది. అతడు పంచిన వస్తువులన్నీ అనుభవించింది. అతడు చెప్పిన తీర్పును ఔదల దాల్చింది.
    ఈరోజు రాముడు, రామిగాడు దొంగసోమ్ముతో దొర అయినాడు. అతనికి అర్చిస్తుంది ఊరు. వాడు చెప్పిన మాట నమ్మి వీరభద్రాన్ని దూషిస్తుంది? వీరభద్రం తనకేమి అవుతాడు? ఏమీ కాడు. ఎందుకు కాడు? తన ప్రాణం రక్షించాడు. పుట్టబోయే తన బిడ్డను కాపాడాడు. అతడు దేవుడు. తండ్రి, దాత. వెంటనే మరొక ఆలోచన వచ్చింది. అప్పటికి వీరభద్రం రాకుండా వుంటే ఏమయ్యేది? తానూ బావిలో పడి వుండేది. ఇప్పటికి తనను తగలేసి ఉండేవారు. తనకీ బాధలు ఉండేవి కావు. చావల్సింది. అయినా జనం ఏమనుకువాళ్ళు? కడుపు చేసుకుని చచ్చిందనేవాళ్ళు, మళ్ళీ వీరభద్రమే మీదనే అభాండం వేసేవాళ్ళేమో! అవును, అంతే జరిగేదేమో! అన్నిటికీ వీరభాద్రమే దొరికాడా? అందుకు అతడు చేసిన తప్పేమీ? ఎందుకు అతడు అన్నిటికి గురి అవుతున్నాడు? మంచివాడు కావడమే తప్పా? ఏమిటిది? ఇందుకు కారణం? పరిష్కారం? ఆమె ఆలోచనలకూ అంతులేదు. ఆ ప్రశ్నలు ఆకాశంలా అలముకున్నాయి. సమాధానానికి ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. దాంతో మళ్ళీ తన పాపను గురించి తనను గురించీ చిలవలు పలవలుగా ఆలోచనలు ముసిరాయి. వాటికి ఒక అంతులేదు. పొంతూ లేదు.

 Previous Page Next Page