తనదాకా వచ్చేసరికి అందోళన పడ్డారేమో ఆప్యాయంగా విస్సు తల నిమురుతూ "థ్యాంక్స్" అన్నారు.
"బుద్దిబలమే కాక భుజ బలమూ కలవాడినని నిరూపించుకున్నావు"
బడలికగా చూశాడు విస్సు. "నేనొక్కడిని పోయినంత మాత్రాన ఈ దేశానికి జరిగే నష్టం ఏమీ లేదు. కొన్ని వేల మందికి ఉపాధి నివ్వగల మీలాంటి వారు క్షేమంగా వుండాలి."
ఉపాధ్యాయ మరింత ఉద్విగ్నతకు లోనయ్యాడు విస్సు మాటలువింటూ - "నువ్వు విదేశాలలో స్థిరపడాల్సిన ఆగత్యం లేదు విశ్వనాథ్ నాకు బాడీ గార్డ్ లా నా ఇంట్లో నాతోనే వుంటావు. నా ఫ్యాక్టరీ స్ కి సంబంధించిన వ్యవహారాల్ని చూస్తుంటావ్ - నీకు కావాల్సినంత జీతం యిస్తాను" ఓ ఆదేశంలా అన్నారాయన. ఓ కోటీశ్వరుడి దృష్టికి వెళ్ళిన వ్యక్తి జీవితంలో హఠాత్తుగా ఏర్పడే అసాధారణమై మార్పులెలా వుండేదీ యిప్పుడే తెలిసినట్టు అక్కడ సన్నివేశాన్ని చూసిన వ్యక్తులు ఆలోచిస్తుండగానే బయటికి నడిచారు ఉపాధ్యాయ.
రాష్ట్ర డైరెక్టర్ జనరలాఫ్ పోలీస్ చెప్పాడు ఉపాధ్యాయ గారితో. "నేరస్తుల గురించి గాలింపు ఉధృతం చేశాం సర్...ఇప్పటికి అందించిన సమాచారాన్ని బట్టి రేన్సమ్ కోసం మిమ్మల్ని కిడ్నాప్ చేయబోయారని అర్ధమౌతూంది...."
బయట కారిడార్ లో నిలబడ్డ కృషితోబాటు ఇంటికి తిరిగి వచ్చిన ఉపాధ్యాయ ఆ రోజు ప్రతి నిముషమూ జరిగిన సంఘటన గురించే మాట్లాడారు.
పూర్తిగా కోలుకున్న విస్సుని ఇంటికి రప్పించాక కృషిని పరిచయం చేశారాయన. "ఇక నుంచి మనకి రక్షణగా విశ్వనాథ్ ఇక్కడే వుండబోతున్నాడు"
కృషి అర్ధం కానట్టు చూసింది....ఓ సెమినార్ లో కలిసిన విస్సు కాకతాళీయంగా ఉపాధ్యాయగారికి దగ్గర కావటాన్ని ఆమె అంగీకరించినా అతడ్ని బాడీ గార్డ్ లా ఆలోచించడం నచ్చలేదు. "అంత కావాలనుకుంటే పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయొచ్చు గ్రాండ్ పా"
"నాకు కావల్సింది జీతం కోసం డ్యూటీ చేసే పోలీసుల రక్షణ కాదు. ఏ స్వార్ధం లేకుండా ప్రాణాలు సైతం పెట్టుబడి పెట్టగలిగే విశ్వనాథ్ లాంటి యువకుడు"
ఒక నిర్ణయం తీసుకున్న గ్రాండ్ పాని ఒప్పించడం గాని మార్చడం గాని సాధ్యంకాని పని.
ఓ శాసనంలా అనేసి తన గదికేసి వెళ్ళిపోయిన గ్రాండ్ పాని చూస్తూ నౌకరు శరభయ్యతో చెప్పింది విశ్వనాథ్ కి ఓ గది ఏర్పాటు చేయమని...
అసలిదంతా ఆమెకు విచిత్రంగా వుంది...
తనతో పోరాటానికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి యిప్పుడు తన కళ్ళ ముందు తన ఇంటిలోనే వుండబోతున్నాడు.
హుందాగా చిరునవ్వుతో సోఫాలో కూర్చున్న విస్సు మీద పూర్వం అభిప్రాయం ఏదయినాగాని అతడు తీసుకున్న రిస్క్ కి కృతజ్ఞతలు తెలపాలనుకుంది. "థేంక్స్ విస్సు"
"దేనికి"
"ప్రాణాలకి తెగించి తాతయ్యని కాపాడినందుకు" నవ్వాడు.
"దేనికి నవ్వుతున్నావు" అడిగింది కృషి.
"కాపాడడం అనే ప్రసక్తి రావాల్సింది నిజంగా అక్కడికి టెర్రరిస్టులంటూ వచ్చినప్పుడు"
"మరి" విస్మయంగా చూసింది.
"ఇదంతా నా పథకం కృషి అసలు నేను ఆ సంఘటన సృష్టించింది కేవలం మీ తాతయ్య పరిచయం కోసం మాత్రమే. కాని ఇప్పుడు కోటలో పాగావేసే అవకాశాన్ని కలిగించాడు మీ గ్రాండ్ పా"
షాక్ తిన్నట్టుగా వుండిపోయింది కృషి.
"నేను నమ్మను"
కంగారు పుట్టించే ఆ స్థితిలో సైతం నిమ్మలంగా అంది కృషి.
ఇప్పుడు విస్సు షాక్ తిన్నాడు "అదేం"
"ఇదంతా నువ్వు చేయించిందే అయితే గాయాలు ఎలా అయ్యాయి"
మృదువుగా నవ్వాడు తేరుకుంటూ "అందమైన అమ్మాయిని కలుసుకోవాలని గోడ దూకి వెళ్ళే అబ్బాయిలకి ఒక్కోమారు గాయాలవుతుంటాయి కృషి ఇదీ అలాంటిదే - నీకు దగ్గర కావాలీ అంటే ముందు నీ తాత పరిచయం కావాలి.... అది కూడా చాలా పకడ్బందీగా జరగాలి....దానికోసం నేనే గాయం చేసుకున్నాను. అయినా ఆడపిల్లల కోసం హత్యలు సైతం చేయడం ఆనవాయితీ అయినప్పుడు ఈ మాత్రం రిస్క్ తీసుకుంటేనేం?"
"నువ్వు ఒట్టి శాడిస్టువే అనుకున్నాను."
"ఇప్పుడు మెసోచిస్ట్ వి కూడా అని తెలిసిపోయిందా" ఎదుటి వ్యక్తి మీద కసి తీర్చుకోలేని ఉన్మాదంలో ఒక్కోమారు తనను తాను గాయపరుచుకునే మెసోచిజం గురించి వివరిస్తున్నత్తుగా అన్నాడు "నేనేమిటీ అన్నది ఇప్పటికైనా నీకు అర్ధమైనందుకు సంతోషంగా వుంది."
"ఇప్పుడు నేనేమిటో కూడా నీకు తెలియచెప్పబోతున్నాను విస్సూ..." అవహేళనగా నవ్వింది కృషి.
"అంటే నేను ఓ పథకం ప్రకారం ఈ లోగిలిలో అడుగుపెట్టానని మీ తాతయ్యకి చెప్పడం కోసం ప్రయత్నిస్తావేమో కదూ....కష్టం కృషీ" నిర్లక్ష్యంగా చూశాడు విస్సూ. "ఎందుకంటే నిన్ను నేను రేప్ చేస్తానని మీ తాతయ్యకి నువ్వు చెప్పినా నమ్మడు. అలా కోపంగా చూడకు. అంత కాన్ఫిడెన్స్ తో వున్నారాయన. ఒకవేళ నీ మీద నేను అఘాయిత్యం చేసానని నువ్వన్నా నిజమో కాదో నిరూపించడానికి మెడికల్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటాడే తప్ప..."
"మిస్టర్ విశ్వనాథ్" క్రోధారుణ నేత్రాలతో చూసింది కృషి. విస్సు దేనికైనా సిద్దపడగలడని ఎప్పుడో ఊహించింది కాని ఇలాంటి ప్రమాదకరమైన మూర్ఖత్వాన్ని సైతం ప్రదర్శించగలడని ఇప్పుడు అర్ధం చేసుకుంది "ఏం సాధించాలని ఇలాంటి వలయంలో అడుగుపెట్టావో నాకు బోధపడటం లేదు."
చిన్మయానందంగా నవ్వేడు "ఒక్కటే కృషి నీతో అనుభవం అనే ఆలోచనలు అంటించిన అగ్నికి మండే సమిధనయిన నేను అవసరమైతే ఆ సుఖం కోసం కాలిపోతాను. కాలుతూ సైతం రగులుతున్న నీ నిమ్మోన్నతాల నగరాన్ని తలుచుకుంటూ నా వేలి కొనల స్పర్శతో నీ ఒంటిని విద్యుద్వీణగా మార్చుతాను. నీ యవ్వనం ఆవలి తెలి నురుగుల హోరుతో తడిసిపోతాను. నా అదిరే పెదవుల నిశ్శబ్దం కోలాహలాన్ని కుంచెగా మార్చి కోర్కెల సిత పత్రంపై ఊపిరి లిపిని రాసి నువ్వు కసిగా గొంతులో దాచుకున్న హాలాహలంగా నయినా మిగిలిపోతాను.....ఆ తర్వాత నీ మనసు ఎన్ని కవచాల్ని అడ్డం పెట్టుకుంటేనేం - నొక్కి పెట్టిన నీ నవ్వులోనూ కనులలోనూ - ఎక్కుపెట్టిన నీ గుండెల్లోనూ దాగుంటాను.... నీ కళ్ళలో కాంక్షల్లోనే కాక ఆదమరిచి నిదరోయే నీ చెక్కిలిపై తారాడే కలల నీడల్లోనూ నేను కనిపిస్తూనే వుంటాను-
"షటప్"
"ఏం ఆడపిల్లవి నువ్వు...ఇంత అద్భుతమైన భావుకతతో మాట్లాడానే....కొద్దిగా నైనా రియాక్టు కావేం?"
విస్సులో నిర్భీతి ఆమెకు భరింపశక్యంగా లేదు. "గుడిలో దేవుడి ఆభరణాల్ని దొంగిలించాలని వచ్చిన వాడు దేవుడ్ని స్తుతిస్తే అది భక్తి అనిపించుకోదు విస్సు....నీ మాటలకి స్పందించే సగటు ఆడపిల్లని కాను నేను....వెళ్లి ఒక్క రాత్రయినా ప్రశాంతంగా నిద్రపో."
రేపు నువ్వీ భవంతిలో ఎలాగూ వుండవని చెప్పడం ఆమె ఉద్దేశ్యం.
"అయితే నడు"
"ఎక్కడికి"
"ఒక్క రాత్రి ప్రశాంతంగా నీ బెడ్ రూంలో గడపటానికి"
ఏమిటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అసలు గ్రాండ్ పా అయినా అంత సులభంగా ఇతడ్ని ఎలా నమ్మగలిగాడు?!
"ఏమిటి కృషీ ఇంకా ఆలోచిస్తున్నావేం" ఆమెను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
"ఒకనాడు నాతో పందెంలో నువ్వోడితే నువ్వు నా ఇంటి వాచ్ మెన్ గా వుండాలని అడిగాను గుర్తుందా విస్సూ" నిశ్చలంగా అంది ఆమె. "ఇప్పుడు ఈ ఇంట్లో బాడీ గార్డులా అడుగుపెట్టినా నువ్వు వుండేది ఆ స్థాయిలోనే....అది జ్ఞాపకం పెట్టుకొని మేం దయదలిచి యిచ్చిన గదిలో సెటిల్ కా. కనీసం ఒక్క రాత్రి" మరోసారి 'ఒక్కరాత్రి' అన్న పదాన్ని ఒత్తి పలికి తన గదివేపు నడిచింది.
అరనిమిషం తర్వాత నౌకరు శరభయ్య ఏర్పాటు చేసిన గెస్ట్ రూంలో అడుగు పెట్టిన విస్సు ప్రశాంతంగా వుండలేకపోయాడు.
కృషి పట్టుదలేమిటో అప్పటికే అతడికి అర్ధమైపోయింది. కనీసం కొన్ని రోజులపాటు కృషి నుంచి తనను తానూ కాపాడుకోవాలి...
అతడు ఆలోచన తప్పుకానట్టుగా ఆ రాత్రి పది గంటలకి కృషి ఫోన్ చేసిందెక్కడికో...
ప్రొడిక్టివిటీ కౌన్సిల్ సెమినార్ లో జరిగిన సంఘటనకి కారణం బయటనుంచి వచ్చినవాళ్ళా లేక హాల్లోని వ్యక్తులెవరయినా అలాంటి ఏర్పాటు చేసారా అన్న విషయాన్ని తెలుసుకోమని ఆమెకు పరిచయమున్న ఏ.సి.పి. మాధుర్ ని హింట్ చేసింది-
ఆ సందర్భంగా విశ్వనాథ్ మీద తనకున్న అనుమానాన్ని వ్యక్తం చేయటానికి వెనుకాడలేదు. * * *
ఉదయం ఎనిమిది గంటల సమయం..
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఉపాధ్యాయ సమక్షంలో నౌకర్లందరూ క్రమశిక్షణగల సైనికుల్లా బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నారు అది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ నౌకర్లని పనివాళ్ళుగానే భావించే ఉపాధ్యాయగారు వాళ్ళ ముందు మనసారా నవ్వటాన్ని సైతం ఇష్టపడరు అందుకే ఆయన ఇంట్లో వున్నంతసేపూ యంత్రాల్లా పని చేసుకు పోతుంటారంతా.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
ఆయనకి సమీపంలో కూర్చున్న కృషి బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుండా ఏదో అడగాలని సంశయిస్తున్నట్టు అర్దమైంది - నిజానికి కృషికి నిన్న రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు.....విస్సు గురించి ఓ పక్క వివరాలు సేకరించమని పోలీసుల సహాయాన్ని అర్ధించినా ఒక సువిశాల సామ్రాజ్యాధినేతలా బ్రతికే గ్రాండ్ పా విస్సు మీద ఉన్నట్టుండి అంత అభిమానాన్ని ప్రదర్సించడం ఆమెకు నచ్చడం లేదు. ఆ విషయాన్నే చర్చించాలను కుంటూంది.
ఏ రోజూ కృషితో సైతం ఆత్మీయంగా మాట్లాడే అలవాటు లేని ఉపాధ్యాయ బ్రేక్ ఫాస్ట్ చేయబోతూ హఠాత్తుగా గుర్తుకొచ్చినట్టు "విశ్వనాథ్ ఏడీ" అన్నారు.
కృషి జవాబుని ఆశించనట్టు అతడ్ని పిలవమని నౌకరుని పురమాయించారు- మరో అర నిముషంలో వచ్చాడు విస్సు అక్కడికి - ఆ ఉదయమే ఆశ్రమం నుంచి సూట్ కేస్ తెప్పించుకుని విస్సు అప్పటికే కాలకృత్యాలు ముగించుకుని డ్రెస్ చేసుకొని వున్నాడు.
అదికాదు కృషిని ఆశ్చర్య పరిచింది. నుదుట బొట్టుతో ఇప్పుడే పూజా కార్యక్రమాలు ముగించుకొని వచ్చిన భక్తుడిలా అనిపిస్తున్నాడు.
"బ్రేక్ ఫాస్ట్ చెయ్" అధికారం ఆత్మీయతల్ని కలిపి ఆదేశంలా అన్నారు ఉపాధ్యాయ... వెంటనే టేబుల్ దగ్గర కూర్చోలేదు విస్సు.
"క్షమించండి - మీ పక్కన కూర్చునే స్థాయి కాదు నాది "అవసరానికి మించిన బిడియాన్ని, భయాన్ని నటిస్తున్న విస్సు ఆ క్షణంలో ఉపాధ్యయని ఎంత ఆకట్టుకున్నదీ ఆమె గమనిస్తూనే వుంది.
"మీరు మరీ తప్పదంటే మీరు లేచాక కూర్చుంటాను."
గొంతులో సైతం అసాధరణమైన వినమ్రతని, అణకువని అభినయిస్తున్నాడు.
ఇక రెట్టించలేదు ఉపాధ్యాయ....ఏ వ్యక్తయినా తన ముందు అలా ప్రవర్తించడమే ఇష్టమైనట్టు మృదువుగా నవ్వారు. వెంటనే "నీకు ప్రతిరోజూ పూజ చేయడం అలవాటనుకుంటాను."
"నేను దేవుడ్ని నమ్ముతాను సర్....ఎందుకంటే" కళ్ళల్లో టన్నుల కొద్దీ భక్తి పారవశ్యాన్ని నింపుకుని మాట్లాడుతుంటే మంటగా చూసిందే తప్ప అతడ్ని నిలదీయ లేకపోయింది ఆమె. "అసలు ఆ దేవుడి దయ లేకపోతే మీ స్థాయి వ్యక్తికి నేను దగ్గరయ్యేవాడ్ని కాదు కాబట్టి...నిజానికి ఇప్పటికీ జరిగింది నేను నమ్మలేకపోతున్నాను - ఇది ఏ పూర్వజన్మ సుకృతమో కాకపోతే గుడిసెలో వుండాల్సిన నేను ఈ గుడిలో అడుగు పెట్టడమేమిటి?"
"రేర్ చైల్డ్" అభినందనగా చూసారు ఉపాధ్యాయ "అసలు ఈ కాలంలో ఇలాంటి యువకుడు తారసపడడం ఏమంటావ్ కృషి"