Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 24

 

    ఇలాంటి అల్లర్లు ఏ బ్రిటీష్ పార్లమెంటులోనో, అమెరికన్ సెనేట్ లోనో జరుగుతాయంటావా? నెవర్! నెవర్! ఈ ఒక్క విషయం చాలు - మిమ్మల్ని మీకు పరిపాలించుకునే అర్హత మీకు లేదని చెప్పడానికి!


    ఇంక మీ ప్రజలో,


    మీ నాయకులకు తగినవాళ్ళే మీ ప్రజలు కూడా!


    యదారాజా, తదా ప్రజా!


    ఇక్కడ నిజమైన నాయకులు ఉండరు.


    ఉన్నాకూడా, ప్రజలు వాళ్ళని గుర్తించరు. ఇక్కడి ప్రజలకి తమకి మంచిచేసే నాయకులు అక్కర్లేదు - సర్కసులో ఫీట్సు చేసే టైపు వ్యక్తులు కావాలి. మాటల గారడీలు చేసేవాళ్ళు కావాలి. ఇంద్రజాలం, మహేంద్రజాల విద్యలతో జనాలని సమ్మోహితులు చేసేవాళ్ళు కావలి. చివరికి సర్కస్ లో బఫూన్ లాగా వెకిలి చేష్టలతో వినోదం కలిగించేవాడైనా ఇక్కడ నాయకుడిగా చెలామణి అవుతాడు గాని, నిజమైన నాయకుడు చిల్లిగవ్వ విలువ కూడా చెయ్యడు. ఎవరు ఎంత ఎక్కువగా తమని మోసం చెయ్యగలిగితే వాడికి బ్రహ్మరధం పడతారు ప్రజలు.


    సింపుల్ గా చెప్పాలంటే -


    కట్ అవుట్ల కాళ్ళు నాకడాల సంస్కృతీ మీది-


    దాన్నే ఇంకోవిధంగా చెప్పాలంటే -


    స్వాతంత్ర్యం వచ్చినా కుడా బానిసలుగా బతుకుతున్నారు మీ జనం!


    అప్పట్లో తెల్లదొరలకి- ఇప్పుడు మీ ఒన్ నల్ల దొరలకి! అంతే తేడా!


    మధ్యయుగాల మనస్తత్వం మీది! అందుకే ఇరవయ్యో శతాబ్దం ముగిసిపోతున్నా, మీది డెమోక్రసీ అని మీరు చెప్పుకుంటున్నా కూడా -


    జరుగుతుంది ఏమిటి?


    ఇక్కడ అధికారం వంశపారపర్యం!


    ఇక్కడి పార్టీలలో కుటుంబపాలన


    మొన్న ఒక నాయకురాలి బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఒక పార్టీ మనిషి రెండు కోట్ల రూపాయల ఖర్చుతో నియోన్ కట్ అవుట్లు పెట్టించాడు. ఒక సీనియర్ లేడీ ఆఫీసర్ ఆ నాయకురాలికి శక్తి ప్రసాదించమని ప్రార్ధిస్తూ బట్టలు విప్పి, వంటికి వేపమండలు తగిలించుకుని ఇంకో నలబై మంది స్త్రీలతో కలిసి ఎగిరింది. పార్టీ సభ్యులు ఆ మహానగరంలో పొర్లుదండాలు పెట్టి అంగప్రదక్షణలు చేశారు. తమ నాయకురాలి శ్రేయస్సు కోసం!


    ప్రజలు అధికారానికి తల వోగ్గాలి! నిజమే! కానీ "కాస్త వంగు" అంటే సాగిలబడి, నేలమీద పాకే మనుషులు మీరు! మీరు యూరోపియన్ కంట్రీస్ లెవల్ కి రావాలంటే ఇంకో యుగం పడుతుంది!" అన్నాడు క్లయివు నిర్లక్ష్యంగా.


    నిర్భీతిగా, తన జాతినే కించపరుస్తూ మాట్లాడుతున్న క్లయివు వైపు నిశితంగా చూస్తూ ఉండిపోయాడు రాజా. అతను చెబుతున్నదానిలో సత్యాలు కొన్ని ఉన్నాయి. అర్ధసత్యాలు కొన్ని ఉన్నాయి. అయినా అతను ఇదంతా దేశక్షేమంకోరి చెప్పట్లేదు గదా!


    మళ్ళీ మొదలెట్టాడు క్లయివు.


    "రాజా! ఇండియా ఈజ్ నౌ రెడీ ఫర్ బ్రేక్ డవున్! మీ దేశం మరింత త్వరితంగా చిన్నాభిన్నం అయిపోయేలా చూడడానికే మా సిండికేట్ ఏర్పడింది."


    కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకుని నిదానంగా అన్నాడు రాజా. "ఒకే! అలాగే అనుకుందాం! బట్ వై మీ? నేనే ఎందుకు?"


    "నిన్నే ఎందుకు ఎన్నుకున్నాం అంటావా? మేము ఎంతో ఆలోచించిన తర్వాత, నువ్వే ఈ పని చెయ్యడానికి ఫిట్టెస్ట్ పర్సన్ అనే నిర్ణయానికి వచ్చాము. ఎందుకంటె - వెరీ సింపుల్! నీలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయ్. నువ్వు పుట్టింది ఎక్కడయినా కూడా , పెరిగింది మాత్రం పుట్ పాత్ ల మీదే! యూ ఆర్ స్ట్రీట్ స్మార్ట్! డక్కా మొక్కీలు తట్టుకోగలవు! నౌ యూ ఆర్ వెరీ రిచ్, కానీ అందరూ రిచ్ బగర్స్ లాగా యూ ఆర్ నాట్ సాఫ్ట్ - ఫిజికల్ గా - మెంటల్ గా కూడా! అది ఫస్ట్ రీజన్!


    "రెండో కారణం ఏమిటి?" అన్నాడు రాజా.


    "యా! మేము ఈ ఆఫర్ నీకే ఇవ్వడానికి ఇంకో అతి ముఖ్యమైన కారణం ఉంది."


    "చెప్పు!"


    "నిజానికి ఈ ప్రతిపాదనకి మూలకారణం రాజా విక్రమదేవరావే!"


    "అంటే?"


    "రాజా విక్రమదేవరావు కొంతకాలం క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రతిపాదన పంపాడు."


    ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడు రాజా.


    క్లయివు చెప్పాడు. వినడానికి చాలా పెద్ద జోక్ లాగా ఉండవచ్చును ఆ ప్రతిపాదన! బహుశా విక్ర్రమదేవరావు కడుపు మంటకొద్దీ ఆ ప్రపోజల్ పంపి వుంటాడు కానీ ఆ ఇన్ ఫర్ మేషన్ గూడాచారుల ద్వారా మాకు అందాక పరిశీలిస్తే తేలింది - ఆ ప్రతిపాదనలో ఆలోచించదగ్గ విషయాలు చాలానే ఉన్నాయని.


    "ఏమిటవి?"


    ఇంకో గుక్క విస్కీ తాగాడు క్లయివు. తర్వాత చెప్పడం మొదలెట్టాడు.


    "సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ సంవత్సరానికి లక్ష కోట్లు అనుకుందాం! అందులో సగానికి సగం ఓవర్ హెడ్స్ అయిపోతాయి. - అంటే - ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, గవర్నమెంటు ఆఫీసు బిల్డింగుల అద్దెలు, ప్రభుత్వ వాహనాల ఖర్చు, మంత్రి పుంగవుల టెలిఫోన్లు, ఎయిర్ కండిషనర్లు, విదేశీయాత్రలు, ఎట్ సెట్ రా.........ఎట్ సెట్ రా! మిగతా సగంలో సగమేమో ఉద్యోగులు, రాజకేయవేత్తలు, దళారులు, కాంట్రాక్టర్లు కలిసి పంచుకు తినడానికి సరిపోతుంది. కాస్తో కూస్తో మిగిలితే అది మిస్ మేనేజ్ మెంట్ వల్లా అసమర్ధతవల్లా హరించుకుపోతుంది.


    ఇకపోతే -


    ప్రజలకోసం నిజంగా ఖర్చు పెట్టేది -


    చాలా అయిష్టంగానే అనుకో - తప్పనిసరి తద్దేనం లాంటిదన్నమాట. ప్రజల కోసం ఖర్చు పెట్టడం అంటే! ఒక పదివేల కోట్లు అని అనుకుందాం!


    ఆ పదివేల కోట్లూ గవర్నమంటూ దగ్గర మిగలవు! అందుకని దాన్ని లోటు బడ్జెట్ లో చూపిస్తారు.


    మరి ఆ లోటుని పూడ్చడానికి ఊరికే కరేన్చీ నోట్లు అచ్చు కొట్టేస్తారు - ఆ విధంగా మార్కెట్ లోకి కరెన్సీ కట్టలు వస్తాయి - కానీ అందుకు సరిపడా మార్కెట్లో వస్తువులు తక్కువ ఉంటాయి కాబట్టి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇన్ ఫ్లేషన్ పెరుగుతుంది - ప్రజలు నానా బాధలు పడతారు -


    ప్రభుత్వం ఎక్కడ చెయ్యి పడితే అక్కడ మసి! భస్మాసుర హస్తం లాంటిదే ప్రభుత్వ జోక్యం కూడా!


    ఎందుకని?


    ఎందుకని అంటే -


    ప్రభుత్వం అనగానే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్ధత - ఇవి తప్ప ఇంకేమీ ఉండవు!


    కానీ..........


    ఇదే సమయంలో-


    ప్రెవైట్ రంగంలో ఉన్న సంస్థలు మాత్రం విపరీతమైన లాభాలు అర్జిస్తున్నాయి.


    ఉదాహరణకి చెప్పుకోవాలంటే

    
    టాటా కంపెనిలు , బిర్లా కంపెనీలు, గాద్రెజి కంపెనీలు, అంబానీ కంపెనీలు - సో మెనీ!


    మరి ప్రభుత్వం వారితో సమానంగా, అంత సమర్ధవంతంగా ఎందుకని నిర్వహించలేకపోతోంది?


    బ్రహ్మాండమైన బిజినెస్ ఎంపైర్ కి చీఫ్ అయిన విక్రమదేవరావు ఇదంతా చూసి భరించలేకపోయాడు.


    అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికీ ఒక సీక్రెట్ లెటర్ రాశాడు అతను, దాని సారాంశం ఇలా ఉంది.


    "ఘనత వహించిన ప్రభుత్వం వారికి.


    తన ప్రభుత్వం తనకి అన్ని విధాలుగా , ఎంత ఆదాయం వస్తున్నా కూడా దానితో దేశ నిర్వహణ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలేక పోతోందన్నది నగ్నసత్యం! కోట్లకి కోట్లు ఆదాయం వస్తున్నా కూడా ప్రజల కనీసావసరాలు కూడా తీర్చలేకపోతోంది ప్రభుత్వం! మంచినీళ్ళు, మంచిరోడ్లు, లాంటివి కూడా ప్రజలకి గగనకుసుమాలయి పోయాయి! ప్రజలు ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్నా కూడా, ప్రభుత్వం దగ్గర ఉండే రెడీమేడ్ ఆన్సరు ఒకటే!


    నిధులు లేవు! నిధులు లేవు! నిధులు లేవు!!"


    ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే వరస!


    మరి వస్తున్న లక్షల కోట్ల ఆదాయం అంతా ఎవరి జేబుల్లోకి పోతోంది? ఏ స్విస్ బాంక్ అకౌంట్ల లో చేరుతుంది?


    గవర్నమెంటు పరిస్థితి ఇలా దిక్కూ దివాణం లేకుండా ఉంటే, నేను మాత్రం అసంఖ్యాకంగా ఉన్న నా కంపెనీలు అన్నిటిని కూడా అత్యంత లాభసాటిగా నడపగలుగుతున్నాను.


    నేను నడుం విరిగేలా ఉన్న టాక్సులు కడుతూ, ఉపిరాడని కంట్రోళ్ళని, రెడ్ టేపునీ ఎదుర్కొంటూనే లాభాలు గడిస్తున్నాను. ఇది ప్రభుత్వం ముఖ్యంగా గమనించాలి!


    అందుకని, అనేకమైన సంస్థలని లాభసాటిగా నడుపుతున్న నేను, నా అనుభవంతో ప్రభుత్వానికి సవినయంగా ఒక ప్రపోజల్ చేయదలుచుకున్నాను."

    అని, అక్కడ డ్రమెటిక్ గా ఆగాడు క్లయివ్.


    "చెప్పు! ఏమిటా ప్రపోజల్?" అన్నాడు రాజా.


    "చెప్తా!" అని ఊరిస్తున్నట్లు విస్కీ గ్లాసు ఎత్తి, మిగిలిన మద్యాన్ని ఎత్తి గొంతులో పోసుకుని, గటగట తాగేశాడు క్లయివ్.


    ఆ తర్వాత చెప్పడం మొదలెట్టాడు.


    రాజా విక్రమదేవరావు చేసిన ప్రపోజల్ ఏమిటో -


        
                                                                       * * *

 Previous Page Next Page