"దేముడి దయా శశివదన ఇచ్చిన ట్రీట్ మెంటూ! ఈ రెండింటి ఫలితమే నువ్వు నెల తప్పడం! అవునా?"
దేముడి దయా, శశివదన ట్రీట్ మెంటూనా!
కాదు, కాదు.
దేవుడి శాపం! శశివదన మొగుడి ఇల్ ట్రీట్ మెంటూ....ఇవీ కారణాలు!
ఈయనకి పిల్లలంటే ఎంత మోజో! పుట్టబోయేది తన బిడ్డ కాదని తెలిస్తే...
"వచ్చే సంవత్సరం మనమూ ఒక పాపాయిని ఎత్తుకుని అలా రావచ్చు!" అన్నాడు, చిన్న పాపని తప్పటడుగులు వేయిస్తూ, నడిపిస్తున్న ఒక జంటని చూపించి.
శారద దిగాలుపడి చూసింది. తిరిగి వెళ్ళేటప్పుడు రిక్షా మాట్లాడాడు శంకర్రావు.
"ఎందుకండీ ఇంత కాస్త దూరానికి రిక్షా?" అంది.
"నువ్వుత్త మనిషివా, ఏం- మైళ్ళకొద్దీ నడిపించడానికి?
"అబ్బబ్బ!" అంది చిరాగ్గా. "ఎప్పుడూ అదే గొడవా?"
శంకర్రావు తెల్లబోయాడు, ఉన్నట్లుండి ఆమెకి కలిగిన చిరాకుకి.
"నీకీ మధ్య చిరాకెక్కువైపోయింది శారదా! నువ్వు మామూలుగా ఉండట్లేదు". అంతలోనే తనని తాను అదుపులో పెట్టుకుంది శారద. "నేను మామూలు మనిషిని కాను కదా ఇప్పుడు" అంది బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ.
ఇంటికొచ్చాక, "రేపు డాక్టర్ గారి దగ్గరి కెళ్ళొద్దాం" అన్నాడు అతను.
శారదకి నెత్తిన పిడుగు పడినట్లయింది.
"ఏమిటీ?" అంది.
"రేపు ఒకసారి శశివదనగారికి చూపించుకో."
"వద్దు!" అంది ఖచ్చితంగా.
"అదేమిటి?"
"అదంతే!"
శంకర్రావుకి కోపం వచ్చింది. అతనిక్కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు. అది తాటాకుల మంటలాంటి కోపం. ఇంతెత్తున ఎగిరాడు.
"నువ్వు చాలా మొండిదానివి, శారదా! ఇంట్లో అన్నీ నీ ఇష్టప్రకారమే జరుగుతాయి. కాని, ఇది మాత్రం నాఇష్టం! నువ్వు రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీరాలి."
"ఆమె దగ్గరికి వద్దు! ఇంకో డాక్టర్ దగ్గరి కెళదాం"
"కాదు! ఆమె మన పాలిట దేవత! అయిదేళ్ళనుంచీ పిల్లల్లేరు మనకి. శశివదనది చల్లటి చెయ్యి. ఆమె హస్తవాసి మంచిది. ఆమె చలవ వల్లే పిల్లలు పుడుతున్నారు మనకి. పైగా, ఆమె అండన బ్రతుకుతున్న వాళ్ళం! మనం ఇంకో డాక్టరు దగ్గరి కెళితే ఏం బావుంటుంది? అసలు ఇంకో డాక్టరు దగ్గరి కెళ్ళడానికి మన దగ్గర డబ్బులేవీ?"
"అయితే మానేద్దాం. ఆమె దగ్గరికి మాత్రం వద్దు" అంది తల వూపుతూ.
"ఏం? ఎందుకు? చెప్పు?" అన్నాడు శంకర్రావు పిడికిలితో అరచేతిలో గుద్దుతూ.
శారద నిశ్చలంగా అతని వైపు చూసింది. 'లాభం లేదు. ఈయనతో గట్టిగానే ఉండాలి' అనుకుంది.
"ఎందుకా? మనం నెలనెలా నెలజీతం మీద బతికే మనుషులం! ప్రతిరోజూ కూరకి అర్ధరూపాయి ఎక్కన్నుంచి వస్తుందా అని వెతుక్కోవలసిన వాళ్ళం! గుట్టుచప్పుడు కాకుండా పచ్చడి మెతుకులు తిని సంసారం గడుపుకోవాల్సిన వాళ్ళం! వాళ్ళు లక్షాధికార్లు. రెండు కార్లున్నాయి వాళ్ళకి. వాళ్ళతో మనకి అతి చనువు వద్దు. శశివదన మీ అమ్మగారి తోటికోడలి పిన్నిగారి మరదలికి ఏదో బంధువు కాబట్టి దయతలచి మీకా ఉద్యోగం ఇచ్చింది. మనకి ట్రీట్ మెంటు ఇచ్చింది. అది అలుసుగా తీసుకుని పూటపూటా వాళ్ళని వేధించడం బావుండదు."
శంకర్రావు తగ్గిపోయాడు. "శశివదన చాలా మంచిది శారదా! ఏమీ అనుకోదు తను" అన్నాడు.
"ఆమె ఏమీ అనుకోకపోయినా సరే, మనం ఎంతలో వుండాలో అంతలో వుండాలి" అంది శారద.
శంకర్రావు ఇంక మాట్లాడలేదు.
5
శంకర్రావు పేరుకి మాత్రమే కాంపౌండరు.
ఆ కాంపౌండులో శశివదన ఆశ్రయించుకుని ఒక ఇరవైమంది బతుకుతున్నారు. అంతమంది పరిజనం నిజానికి ఆమెకి అక్కర్లేదు. కానీ, అడిగిన వాళ్ళకి లేదనకుండా ఏదో ఒక వ్యాపకం, బతుకు తెరువూ చూపిస్తుంటుంది తన సంస్థానంలో. ఒక వంటమనిషి, ఒక పనిమనిషి, ఒక తోటమాలి, ఒక ఘూర్కా, ఇద్దరు కాంపౌండర్లూ, ముగ్గురు నర్సులూ...ఇలా బోలెడంతమంది మనుషులు....బోలెడన్ని ఉద్యోగాలు.
బంధువుల్లో ఎవరో ఒకతను ఉద్యోగం పోగొట్టుకుని బాధల్లో వుండి, తన దగ్గరకొచ్చి అడిగితే ప్రిస్క్రిప్షన్లూ, మందులూ సరిచూసి ఫీజు వసూలు చేసే ఒక కాషియర్ ఉద్యోగం వెంటనే సృష్టించి అతన్ని చేర్చుకుంది.
బంధువుల్లో ఒకమ్మాయి చాలా పెద్ద డాక్టరయి ఉదారంగా అందరికీ వుద్యోగాలిస్తూందని తెలిసిన శంకర్రావు పిన తల్లి- హార్లిక్సు సీసానిండా మాగాయ వూరగాయ తెచ్చి శశివదనకి ఇచ్చి, పరామర్శ చేసి ఏడు తరాల చుట్టరికాలు తిరగేసి, ఎక్కడో బీరకాయపీచులా తమకి సంబంధం వుందని చెప్పి శంకర్రావుకి ఉద్యోగం వేయించమని వేడుకుంది.