ఆమెమాటల్లో ఓదార్పు వుంది. గుండెల్ని తరిచే జీవితసత్యంకూడా వున్నది.
రాజీవ్ అమెరికా వెళ్లిపోయాడు. చిన్మయి కిరణ్మయితో కూడా ఎయిరో డ్రోమ్ కు వెళ్లి - ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా ఇంటికి తిరిగి వచ్చింది.
గుండె రాపిడి భరించలేనిదిగా వుంది.
10
నెలరోజులు గడిచిపోతున్నాయి. మనిషికి ఓ వ్యాపకం అనేది ఎంత అవసరమో తెలిసివచ్చింది చిన్మయికి.
మనిషి తీరిక కోసం విశ్రాంతికోసం ఎంత వాచిపోతాడో అది మితిమీరి దొరికితే వాటిలోని బరువు భరించలేక తల్లడిల్లిపోతాడు.
ఊపిరాడనంత పనివుండాలి. మనసును ఎప్పుడూ సోమరిగా వుంచకూడదు.
ఏకాంతంలో వుండటంతో పొయిటిక్ థ్రిల్ వుంటే వుండవచ్చు. కాని అందులో గుండెల్ని చీల్చే విషాదంకూడా వుంటుంది.
కిరణ్మయిని ప్రొద్దుటే స్కూల్ బస్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది.
ఇంట్లో ఒక్కతి పనిమనిషి వున్న కాస్తంత పంసిహేసి వెళ్లిపోయేది.
ఇల్లు సర్దుకోవటం, వంట వగైరాలు ఎంత తీరిగ్గా చేసుకున్నా ఓ గంటలో తెమలిపోయేవి.
అంతకుముందు కూడా అతనాఫీసుకు వెళ్ళినప్పుడు యీ వంటరితనమే వున్నా రాజీవ్ సాయంత్రానికల్లా తిరిగివస్తారనే ఓ నిరీక్షణ మనసులో వెల్తి లేకుండా చేసేది.
అలా ఎదురు చూడటం ఓ అందమైన అనుభూతి.
కాని ఉదయమూ ఒకలాగే వుంటుంది. మధ్యాహ్నం అలాగే సాయంత్రం అంతే రాత్రికూడా నిర్దాక్షిణ్యంగా గడిచిపోతుంది.
రోజురోజుకూ మార్పులేనప్పుడు అది భరించటం ఎంత కష్టం?
ఉండలేకపోయినప్పుడల్లా మామీ దగ్గరకెళ్ళి కూర్చునేది. వాళ్ళతో మాట్లాడుతుంటే గంటలు బాగానే గడిచిపోయేవి.
కాని తరుచు అలా వెళ్ళటంవల్ల వాళ్ళ రొటీన్ కు అడ్డం వస్తున్నాననే భావన మళ్ళీ బాధపెడుతూ వుండేది. వాళ్ళకో ప్రత్యేకమైన జీవనవిధానం వుంది. ఓ నిర్ణీతమైన పద్దతి వుంది.
అడుగడుక్కి ఆ రొటీన్ కు అంతరాయం కల్గించటానికి ఆమె సంస్కారం అడ్డువచ్చేది.
ఈ అయిదేళ్ళ కాలపరిమితిలో ప్రజాపతిరావు దంపతుల్లో కూడా శారీరకంగా మార్పువచ్చింది. ఆయనలో మునుపటికన్నా దారుఢ్యం తగ్గి పోయింది. ఎంతో అవసరమైనా కూడా బయటకు వెళ్ళాలంటే శక్తి చాలటం లేదు. ప్రతిపనికీ తనవాళ్ళమీద ఆధారపడాల్సి వస్తోంది.
ఇద్దరూ కలిసి వున్నా ఒకరకంగా వంటరిగా వున్నట్లే.
* * *
అమెరికానుంచి రాజీవ్ పదిహేను రోజులకొకసారి ఫోన్ చేస్తూనే వున్నాడు. అతనక్కడ టెక్సాస్ లో వుంటూ మొదటిసారిగా ఫోన్ చేసినప్పుడు అన్నివేల మైళ్ళనుండి అతని గొంతు వింటూంటే ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది.
"చిన్మయీ! బాగున్నావా?"
"మీరు లేకుండా ఎలా బాగుంటాను?"
"సారీ! నీకు చాలా పనిష్ మెంట్ ఇచ్చాను."
"మీరెలా వున్నారు?"
"నువ్వు లేకుండా..."
"ఆ అన్నీ అబద్దాలు" ఆమెకేడ్పు వస్తోంది.
"ఏమేమి చూశారు?" అంది మళ్ళీ తనే.
"ఇంకా ఎక్కువ ఏమీ చూడలేదు. వచ్చినప్పట్నుంచీ ట్రైనింగ్ తోనే సరిపోతోంది. అమెరికాలో ముఖ్యమైనవన్నీ చూసే కార్యక్రమం ఇక్కడ్నుంచి వచ్చేముందు పెట్టుకుంటాను. ఇప్పుడంతా డ్యూటీయే. మొన్నమాత్రం నెబ్రెస్కాతలో ఓ ఫ్రెండ్ వుంటే.... అంటే ఇక్కడికి కొన్ని వందలమైళ్ళ దూరం వెళ్ళి వచ్చాను."
"భోజనమదీ..."
"అక్కడిలా నీ చేతివంటమాదిరి భోజనం, ఆవకాయ వగైరాలు కావాలంటే కుదరదు. ఏదిపడితే అది తినెయ్యటం నేర్చుకున్నాను."
ఆమెకళ్ళలో నీళ్ళునిండాయి.
"ఆరోగ్యం జాగ్రత్త" అని హెచ్చరించింది వణికే గొంతుతో.
* * *
మరోసారి ఫోన్ చేసినప్పుడు "కిరణ్ తో మాట్లాడాలని వుంది" అన్నాడు.
అప్పుడు ఉదయం ఎనిమిదయింది. అంటే ఇండియా కాలమాన ప్రకారం.
కిరణ్మయి అప్పుడే స్కూల్ కి వెళ్ళదానికి సిద్దమౌతోంది. ఆత్రంగా ఫోన్ దగ్గరకి పరిగెత్తుకొచ్చింది.
"డాడీ..."
"కిరణ్..."
"ఎప్పుడొస్తావ్ డాడీ..."
"వస్తానమ్మా... ఇక్కడ ట్రైనింగ్ అది పూర్తి అయ్యాక."
"త్వరగా వచ్చేయ్ డాడీ."
"అలాగేనమ్మా కిరణ్! అమ్మని జాగ్రత్తగా చూసుకో."
"అమ్మకేం భయంలేదు డాడీ... నేనున్నాను."
"గుడ్ అమ్మకివ్వు ఫోన్."
కిరణ్మయి రిసీవర్ తల్లికి అందించింది.
"చిన్మయీ! ఎక్కడికన్నా వెళ్ళాలంటే కారులో వెళుతూ వుండు. మా ఆఫీసు వాళ్ళకి ఫోన్ చేస్తే డ్రైవర్ ని పంపిస్తారు."