"అంత ఒళ్ళు మండిపోతే ఎందుకొచ్చావ్" ఆమె చెంపలని చేత్తో సవరదీయబోయాడు.
అతని చేతిని విదిలించి కొట్టింది కైరవి.
"నీ మీద ప్రేమ కారిపోయిగానీ, నీతో ఒళ్ళు పట్టించుకోవడానికి గానీ రాలేదు స్వామీ! పోలీసులు సరిగా బాదారో లేదో చూసి, నేను కూడా నాలుగిచ్చిపోవాలని వచ్చాను" అంది కైరవి.
అభినయ్ మొహంలో చిరునవ్వు అలాగే వుంది. మెల్లగా ఒంటిమీదనించి దుప్పటిని తప్పించాడు.
"చూసుకో!" అన్నాడు.
అతని వీపుకేసి చూసిందామె.
లాఠీ దెబ్బలకి వాతలు తేలి నల్లగా కమిలిపోయి, చర్మం చీరుకుపోయి వుంది.
అంతే!
ఆమె రెండు చేతులతో మొహాన్ని కప్పేసుకుంది.
"కైరవీ!"
పిలిచాడు అభినయ్.
ఆ పిలుపులో నువ్వు తప్పితే నాకు ఎవరున్నారు కైరవీ! అని అంటున్నట్టుగా ధ్వనించింది.
కైరవి చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు అభినయ్.
ఆమె కళ్ళనించి కన్నీరు జల జలమని రాలుతోంది. ఆమె మొహాన్ని పక్కకు తిప్పేసుకుంది.
"కొడతానన్నావుగా! కొట్టవే?" అడిగాడు.
"అభీ! ఒక్కముద్దు పెట్టుకున్నందుకు ఇంత పెద్ద శిక్ష వేశారా నీకు!"
ఆమె గొంతు వణుకుతోంది. కళ్ళనించి కన్నీరు చెంపల మీదుగా జారుతోంది.
"నేను చేసిన దానికిది సరైన శిక్షగానే భావిస్తున్నాను కైరవీ!"
"ఆఫ్ట్రాల్! ఓ ముద్దు పెట్టుకుంటే ఇన్ని దెబ్బలు కొట్టిస్తుందా ఆ గీత ముండ. దాని పని పడతాను."
"తొందరపడకు. గీతే కనక పోలీస్ స్టేషన్ కొచ్చి నేను నిరపరాధినని అబద్దం చెప్పకపోతే బహుశా లాకప్ లో చనిపోయేవాడినేమో......!"
కైరవి అతని పెదవుల్ని మూసేసింది.
"ప్లీజ్! అలా అనకు. చెప్పు అభీ! అసలెందుకలా చేశావు?"
"ఏం చెప్పను? ముద్దు ఎలా పెట్టుకున్నదీ చెప్పమంటావా?"
"షటప్. అదికాదు, అసలెందుకు ఆ పని చేశావు అని అడుగుతున్నాను"
"నాకు డబ్బు కావాల్సి వచ్చింది. సిద్దార్ద పేరు తీసేశారు రోల్స్ నించి. అందుకని పూర్ణతో పందెం కట్టాను. గీతని అందరూ చూస్తుండగా ముద్దు పెట్టుకుంటే వెయ్యి రూపాయలిస్తానన్నాడు."
"అయ్యో! ఇప్పుడీ దెబ్బలు తగ్గించుకోడానికి రెండువేలు అయినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఏడిసినట్లే వుంది నీ పందెం.
ఆ పందెంలో ఏదో నన్ను ముద్దు పెట్టుకోడానికైతే బాగుండేది కదా!
అప్పుడీ గొడవంతా లేకపోను. పబ్లిగ్గా ఓ స్టేజీ కట్టి దానిమీదకెక్కి నువ్వడిగినన్నిసార్లు ముద్దు పెట్టుకోనిచ్చేదాన్ని కదా!"
అభినయ్ అందంగా నవ్వాడు. తనకోసం ఆమె ఏం చేయడానికైనా వెనుకాడదని అభినయ్ కి తెలుసు.
"కైరవీ! నీ పేరుకి అర్దం తెలుసా?" అని అడిగాడు.
"తెలీదు" ఏదో ఆలోచిస్తున్నట్టుగా అంది.
కైరవి అంటే వెన్నెల, వెన్నల ఆక్రమించుకున్నట్టు నువ్వు నా హృదయ సామ్రాజ్యాన్నే ఆక్రమించుకున్నావు.
"నువ్వెక్కడున్నావో తెలుసా? ఈ గుండెల్లో కైరవీ! నువ్వు నాకు కాబోయే దేవేరివి!"
కైరవి చిరుకోపంతో చూసిందతన్ని.
"నీవన్నీ ఒఠ్ఠిమాటలే బాబూ! మళ్లీ ఎటు కొంగు కనబడితే అటే పోతావు"
"నువ్వు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నానే కానీ అదంతా నీ కోసమే కదా!" అన్నాడు అభినయ్.
కైరవి విప్పారిత నేత్రాలతో అతన్ని ఆశ్చర్యంగా చూసింది.
"అదేమిటి? దేన్నో ముద్దు పెట్టుకుని, మరిదేన్నో కౌగిలించుకుని. ఇంకోదాన్ని అలా చేసి... ఛీ... ఛీ.... ఇవన్నీ నా కోసం ఎందుకవుతాయి ఒళ్ళు పొగరెక్కి నువ్వు తిరుగుతూ"
"నేనిప్పుడు సరసం నేర్చుకుంటేనే కదా రేపు నిన్ను సరసశృంగార రసాల్లో ముంచగలిగేది."
"ఆ ముంచేదేదో ఇప్పుడే మొదలుపెట్టు. అంతేకానీ నీ బోడి తెలివి తేటల్ని ప్రదర్శించకు."
ఆ నేర్చుకునేదేదో మనిద్దరం జాయింట్ గానే నేర్చుకుందాం!
దాని కోసం ప్రతి కొంగునీ పట్టుకుని పట్టులు, భంగిమలు నేర్చుకో నవసరం లేదు. అతని చెవిని మెలిపెడుతూ చెప్పింది కైరవి.
అభినయ్ పక్కకి తిరగబోయాడు ఒళ్ళు నొప్పులకి బాధతో.
"అబ్బా!" అన్నాడు.
"చూడు. చిన్న పనికి ఎన్ని అవస్థలో. ఆయింట్ మెంట్ రాయనా?" అడిగిందామె.
"ఊ" మూలిగాడు.
కైరవి ఆయింట్ మెంట్ చేతిలోకి తీసుకుంటుంటే అన్నాడు -
"నిజమే చిన్న సుఖానికి కూడా ఆడవాళ్లు ఎన్నో అవస్థలు పడతారు"
"ఏంటది?"
"నొప్పులు."
క్రీమ్ ని అతని వీపుకి రాస్తూ -
"ఆడవాళ్ల నొప్పుల గురించి మర్చిపోయి ఇప్పుడు నీ నొప్పుల గురించి చెప్పు" అంది మెడమీద గిల్లుతూ.
"నీరసంగా వుంది."
"మరి అమ్మాయిని ముద్దుపెటచ్టుకున్నప్పుడు....?" అతని పిర్రమీద గిచ్చింది.
" అబ్బ చంపకే రాక్షసీ....! పోలీసులు చంపారు. ఇప్పుడు నువ్వు తగులుకున్నావు."
"నేనింకా తగులుకోందే?" పిర్రమీద మళ్లీ గిచ్చింది కైరవి.
"అమ్మో!"
"అమ్మో!"
"అయ్యో పాపం! ఆఖరికి యిక్కడ కూడా వాయించేశారన్నమాట! మిగిలినచోట పరిస్థితి ఏమిటో?" పగలబడి నవ్వేసింది కైరవి.
"ఇదిగో! లేచానంటే నిన్ను వాయించేస్తాను తెలుసా?"
"వాయిస్తాడట వాయిస్తాడు. అద్దంలో చూసుకో మొహాన్ని ....! వాయించే మొహమో కాదో తెలుస్తుంది."
అతను నవ్వాడు.
"చూస్తావా రుచి?"
"ఏమిటి?"
"ఎలా వాయిస్తానో....."